హిందూ దేవుళ్ల ప్రస్తావనే ఎందుకు...?

హిందూ సాంస్కృతిక విలువలపై, హిందువుల ఆచార సాంప్రదాయాలపై, హిందూ దేవుళ్లు, దేవతలపై పనిగట్టుకుని, అవాకులు చవాకులు పేలడం

Update: 2024-07-07 01:00 GMT

హిందూ సాంస్కృతిక విలువలపై, హిందువుల ఆచార సాంప్రదాయాలపై, హిందూ దేవుళ్లు, దేవతలపై పనిగట్టుకుని, అవాకులు చవాకులు పేలడం దేశంలో ఇటీవల కాలంలో ఎక్కువైంది. తాజాగా కాంగ్రెస్ రాకుమారుడు, లోక్‌సభలో ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ సంయమనం కోల్పోయి, రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానం సందర్భంగా హిందూ దేవుళ్ల ప్రస్తావన చర్చకు తీసుకొచ్చి దేశ ప్రజలను సంభ్రమాశ్చర్యాలకు గురి చేశారు..

స్వాతంత్య్రానికి పూర్వం, స్వాతంత్రం తర్వాత కాంగ్రెసులోని చాలామంది నాయకులకు హిందువుల ఆచారాలు, సంప్రదాయాల పట్ల, హిందువుల ఆధ్యాత్మికత పట్ల నిర్లక్ష్య భావన ఉంది. దేశంలోని ప్రతి సమస్యకు హిందువుల ఆచార సంప్రదాయాలను కారణంగా చూపడం పరిపాటి అయిపోయింది. అందుకు కారణం లేకపోలేదు.

వారి ఓట్ల కోసం..

ఈ దేశంలో మెజార్టీ ప్రజలైన హిందువుల ఆచార సంప్రదాయాలు ప్రధాన మైనారిటీ మతాలైన ఇస్లాం, క్రైస్తవ భావజాలానికి భిన్నంగా ఉంటాయి. అందుకే ముస్లింలను, క్రైస్తవులను వెనుకేసుకొచ్చి హిందువుల ఆచారాలను దూషించడం కానీ, ద్వేషించడం కానీ చేస్తే ముస్లింల, క్రైస్తవుల ఓట్లు గుండుగుత్తగా తమ పార్టీకి పడతాయని బీజేపీయేతర అన్ని పార్టీల నాయకులు తలపోయడం అలవాటుగా మారిందనేది అక్షర సత్యం.

ఇండియా కూటమిలో భాగస్వామ్య పార్టీ అయిన డీఎంకే నాయకుడు, రాష్ట్ర మంత్రి ఉదయనిధి స్టాలిన్ సనాతన ధర్మాన్ని అనుసరించే హిందువులను నీచ నికృష్టంగా తిట్టిపోశారు. ఆయన తాత కరుణానిధి ఏకంగా మర్యాదా పురుషోత్తముడైన శ్రీరామచంద్రున్ని నోటికొచ్చినట్లు మాట్లాడి, హిందువులపై తనకు ఉండే ద్వేషాన్ని వెళ్లగక్కారు. ఇక కాంగ్రెస్ పార్టీ చరిత్ర తిరగేస్తే రామాయణం ఒక కట్టు కథని, సుప్రీంకోర్టుకే అఫిడవిట్ దాఖలు చేసి, తన హిందూ వ్యతిరేక పైత్యాన్ని బయట పెట్టుకున్నది. ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ ఇందుకు భిన్నంగా ఉంటారని ఎందుకు అనుకోవాలి?

నిజమే, వీరేలా హిందువులు అవుతారు..?

బీజేపీ , ఆర్ఎస్ఎస్ వాళ్లకు హిందూ సంస్కృతికి సంబంధించిన విషయాలు తెలియవని, వారు నిజమైన హిందువులు కాదని రాహుల్ గాంధీ తరచుగా మాట్లాడుతుంటారు. ఈ దేశాన్ని వ్యతిరేకించే వారి దృష్టిలో ఆర్ఎస్ఎస్, బీజేపీ వాళ్లు మంచివాళ్లు కాదేమో! ఎందుకంటే దేశ భద్రతకు, సమగ్రతకు ప్రమాదం వచ్చినప్పుడు గట్టిగా నిలబడేది వాళ్లే. కశ్మీర్ విలీనీకరణకు కశ్మీర్ రాజు హరి సింగ్‌ను ఒప్పించడం, శ్రీనగర్లో మన యుద్ధ విమానాలు దిగడానికి మంచు గడ్డలు తొలగించడం, శ్రీనగర్ లాల్ చౌక్‌లో పాకిస్తాన్ జెండాను తొలగించి, జాతీయ జెండాను ఎగరవేయడం , పోర్చుగీసు చెర నుండి గోవాను విముక్తి చేయించడంలో సైన్యానికి సహకరించడం, యుద్ధ సమయాల్లో సైన్యానికి ఫోర్టర్లుగా పనిచేయడం వంటి పనులు చేసే వాళ్లు నిజమైన హిందువులు ఎలా అవుతారు? పైగా కాశ్మీర్ లోయలో హిందువుల నరమేధాన్ని లౌకికవాద ముసుగు చేసుకున్న ఏ హిందూ రాజకీయ నాయకుడు ప్రశ్నించకున్నా బీజేపీ, ఆర్ఎస్ఎస్ వాళ్లు నిలదీశారు కదా! 500 సంవత్సరాలుగా రావణకాష్టంగా మండిన అయోధ్య సమస్యను సులభంగా పరిష్కరించారు కదా! ఇలాంటి పనులు చేసిన వారు నిజమైన హిందువులు అవుతారా? ఈ విషయం భవిష్యత్తు చరిత్ర నిర్ణయించాలి.

ప్రజలకు అర్థమయిపోయింది!

రాహుల్ గాంధీ హిందూ దేవుళ్లపైన చేసిన ప్రస్తావనను క్షుణ్ణంగా పరిశీలిస్తే దేశంలోని హిందువులు హింసావాదులనీ, విద్వేష కారకులనే అర్థం స్ఫురించక మానదు. ఈ విషయంలో ఆయన మాట మార్చి, బీజేపీ, ఆర్ఎస్ఎస్ వాళ్లను ఉద్దేశించి, ఈ మాటలు అన్నానని ఎంత బుకాయించినా-హిందూ సమాజానికి ఆ మాటల అర్థం చేరిపోయింది. ఇక చివరగా హిందువులను మతపరంగా సంఘటితం చేసే పనిని ఎవరు చేసినా వారికి ఈ దేశంలో దూషణలు తప్పవు. ఈ పరిస్థితి భవిష్యత్తులో తీవ్రంగా ఉంటుంది.

ఉల్లి బాల రంగయ్య,

రాజకీయ విశ్లేషకులు

94417 37877

Tags:    

Similar News