ఇజ్జెత్ కియ్యాలె...ఇడుపు కాయితం
కాలం యెప్పుడొక్కతీరుంటదా! కాలం కల్శి రాకుంటె బండ్లు ఓడలైతయి, ఓడలు బండ్లు అయితయి.ఇజ్జతున్నోడు కాలంకోసం జూసుకుంటుంటడు.
కాలం యెప్పుడొక్కతీరుంటదా! కాలం కల్శి రాకుంటె బండ్లు ఓడలైతయి, ఓడలు బండ్లు అయితయి.ఇజ్జతున్నోడు కాలంకోసం జూసుకుంటుంటడు. అది లేనోడు గోడలు బట్టుక దుంకుతడు. ఇజ్జత్ తక్కువ బతుకులెందుకో సమజైతలేదు. పేరు కోసం పదవుల కోసం ఇజ్జత్ సంపుకోని బతుకుడు సుత బతుకేనానుల్లా! పాత శెప్పులిడిశి కొత్త యేసుకున్నంత జెప్పున జెండ మారబట్టె! మూడు నాలుగు పార్టీలు మారుతాంటే ఇజ్జత్ అనిపిత్తలేదా యేంది?
ఎవలు యే పార్టీలుంటాండ్లో యే పార్టీలకు దూంకు తాండ్లో యెరుకైతలేదు. భుజాల మీది కండువా ఓట్ల ముందోటి, ఓట్లు ఐనంక యింకోటి రంగులు మారుతాండె! యే పార్టీల యెవలు యెంతేశి కాలముంటరనేది యెవలి కెరుకైతలేదు! మనిషన్నంక కడుపుకింత బువ్వ తింటరు, కాలం గాకుంటె గడ్డి తింటారుల్లా! గులాబి రంగోల్ల శాత్రం గట్నే కానత్తాంది. ఒకలెనుక ఒకలు తొవ్వ బట్టిండ్లు. నెత్తిన గుడ్డేసుకొని శీకట్ల గోడ దుంకుడు కాదుల్లా! అవ్వల్ దర్జాగా పట్టపగటీలే మొకం మీద నవ్వులు పూసుకొని పార్టీలు మారబట్టిండ్లు. అమ్మనా బూతులు తిట్టినోళ్లనే బాయి బాయి అనబట్టిండ్లు. అలాయి బలాయి తీస్కోని "మేం బొడ్డు గోసుకున్నదీ ఈ పార్టీలనే! ఇది మా అవ్వ గారిల్లా సొంటిదని" జెప్పబట్టిరి. గిట్లుంటయి ఇజ్జత్ లేని బతుకుల కతలు. గులాబీ తోట్ల పదిమంది ఓ పక్కపొంటి జమైండ్లు. గా ఇజ్జత్ తక్కువోళ్ల ముచ్చట్లు ఇంటె మీకే యెరుకైతది.
ఇజ్జత్ యేమన్న కంటికి కానచ్చేదా?
" సర్కార్ ల యే పార్టుంటె అదే మన పార్టని అనుకోవాలె! పాత కండువతీశి, కొత్తకండువ బుజానేసుకోవాలె! గద్దె మీదున్న పార్టీల కిందికో మీదికో పడి జరంత సందు జేసుకోవాలె! ఇజ్జత్ ఇంటి కాడిశి పెట్టి రావాలె! పెద్ద లీడర్ల కాళ్లమీద పడుడు నేర్వాలె! కుక్కకు సుత ఓ దినముంటది. గీ ముచ్చట యాదుంచుకోవాలె! నిన్న మొన్నటిదాంక తీరొక్క బూతులు దిట్టిన లీడర్లనే "అన్నా! నువు తోపు" అని గ్యాస్ కొట్టాలె! మంత్రి పదవి దొర్కక పోదనే ఆశ తోనుండాలె! కాకా బట్టాలె! కాళ్లు బట్టాలె! మంత్రి కుర్సీ దొర్కినట్టే దొరికి ఈడ్శి తంతది. కోపమనేది బొడ్డుదాటకుంట మలిశి లోపట్నే దాసుకోవాలె! లోపల యెటమట మనిపిచ్చినా సరె పైకి మూతి మీద నవ్వులు రువ్వాలె! గిసొంటి ఇజ్జెత్ యిడిశిబెట్టిన బతుకులే గొప్ప లీడర్లయి పైకత్తరు. గీ ఇకమత్ లు తెల్వనోళ్ళు నీతి, నాయం లాంటి కతలు బడెటోళ్లు మాగుంటరు.
అద్దంల మొకం తీర్గ ఇజ్జత్ యేమన్న కంటికి కానచ్చేదా! తొవ్వపొంటి యెదురువడి పల్కరిచ్చేదా తీ! ఇజ్జెతనేది తుడుసుకుంటె బోతది. ఇజ్జత్, మానం ఆనిగిట్ల నారాజు పడ్డమనుకో! అది యెటు తిరిగి, యెట్ల జేశి మనలనేస్కపోతది. ఎటుగూడి దాని జోలికి పోకుంట పైలంగుండాలె."థూ"! అని బజాట్న యెవలన్న మొకం మీద ఊంచిండ్లనుకో! అటిటు జూశి అంగి లేవట్టి తుడుసుకుంటె కతం! అదేమన్న యెంబడచ్చేటిదా! తీ! అన్ని కతలువడుడే, గని, యేం లేదనుకుంటె ఒక్క శిత్తం!ఎవలికి యెరుకైత లేదుగని ఇజ్జత్ తోని బతుకుతనంటె సింగిల్ చాయి సుత దొర్కదుల్లా! దునియాల ఇజ్జత్తోని బతికెటోనికి బజాట్నింత వుప్పు సుత బుట్టదంటరు. నీయత్ గ ఏ దందా జేశిన దివాల్ దీశి నెత్తిన గుడ్డేసుకునుడే, గని పైకి లేసుడుంటదా! కల్తీ లేకుంట ఏ దందానన్న నుడుసుడైతదా? ముత్తెంతన్న మోసం జేయకుంట ముల్లెలు గట్టినోన్ని ఒక్కల్ని జూపెట్టుండ్లి!? ఇజ్జెత్‌తోని ఇడుపుకాయితం జేసుకుంటెనే అవ్వల్ దర్జా బతుకుంటది.
ఓట్ల పండుగప్పుడు యాదుంచుకోవాలె!
ఎన్ని దిక్కుమెల్ల యేశాలేత్తె, యెంత మంది కొంపలు ముంచితె, యెన్ని కబ్జాలు శేత్తె గిట్ల రాజకీయాలల్ల పైకచ్చి మంత్రులైతాండ్లు! గెలుపు రుచి దొరికిందంటె సాలుపో! ఇగ తోపే! మొన్నటిదాంక నువు సైకిల్ మీద తిరిగి పాలమ్మినవా! మూల మీది మార్కిట్ల ఆలుగడ్డమ్మినవా! యేడేడ యెసొంటి లంగ దందాలు ఎంతగనం జేశినవనేది యెవలడుగుతరుల్లా! "ఎమ్మెల్లే సాబ్!నమత్తే!"అని సలాం గొట్టెటోళ్ళు మస్తుమంది. మబ్బుల్నే యింటి గల్మకాడ దండం బెట్టెటందుకు జమయితాంటరు. నాలుగు కాంటాక్టులు
బట్టుకోని కాయితాలమీద కతమనిపిత్తె సంపుడు పుంజెం బుట్టినట్నేనయె! సర్కార్ బూములేడున్నయో యెరుకైతె జాలు, అవి మన పాలయైనట్నేనాయే! ఎంతల పని! ఇజ్జెతనుకుంటె గివన్నయితయా! పరాశికాలనుకునేరుల్లా! యెర్కున్న ముచ్చట్లే జెప్పబట్టిన! ఇజ్జెత్ తోని సావంటె గిదేనుల్లా! లచ్చతీర్ల దుమ్ముమన్ను పోశెటోళ్ళుంటరు. గిసొంటియి గిట్లిని గట్ల ఇడిశిపెట్టాలె కోర్టులు, కాయితాలు గిట్లుంటె సూర్ల జెక్కాలె! మన పెద్దోళ్ళను జూశి గిసొంటియె మంచిగ నేర్సుకోవాలె! గాళ్ళకు పొద్దుకు పదిమల్కల దండం బెట్టాలె!" థూ..శెప్పెటోనికి శెవిటయితె ఇనెటోనికి ఇజ్జతుండద్దా! గిట్లుంటది..గీల్ల బతుకు కతలు. కండువలు మార్చెటోళ్ళకులేని ఇజ్జెత్ మనకెందుకని! అన్ని మరిశి అసొంటోళ్ళను ఎలచ్చన్ల బుజాలెక్కిచ్చుకొని ఓట్లేశి గెలిపిచ్చినోళ్ళకు సుత ఇజ్జెత్ లేదాయె! ఒక్కటి గాదుల్లా! లచ్చ మాటలు జెప్పి ఒక్కటి సుత జేయకుంట ఎగ్గొట్టి మొకం మాడిశి నోళ్ళను ఓట్ల పండుగప్పుడు యాదుంచుకోవాలె! గిసొంటి ఇజ్జెత్ తక్కువ బతుకులను జూశినంక సుత గీల్లకు ఇజ్జెతియాల్నా! అనిపిత్తలేదా!ఇ జ్జెత్ లేని బతుకులే మంచిగున్నయికదా!.ఇజ్జత్ బడేటి బతుకులే బతుకలేకున్నయి.ఏం జేద్దాం! ఇజ్జెత్ తక్కువ బతుకులు! థూ!
- ఎలమంద
99516 24126