పాలకుల్లో అంతఃకరణ శుద్ధి ఉందా?

ప్రముఖ హీరో మహేష్‌ బాబు భరత్‌ అనే నేను సినిమాలో ‘శాసనం ద్వారా నిర్మితమైన భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసము, విధేయత చూపుతానని భారతదేశ

Update: 2024-07-06 01:15 GMT

ప్రముఖ హీరో మహేష్‌ బాబు భరత్‌ అనే నేను సినిమాలో ‘శాసనం ద్వారా నిర్మితమైన భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసము, విధేయత చూపుతానని భారతదేశ సార్వబౌమాధికారాన్ని, సమగ్రతను కాపాడుతానని, నేను రాష్ట్ర ముఖ్యమంత్రిగా నా కర్తవ్యాలను శ్రద్ధతో, అంత:కరణ శుద్ధితో నిర్వహిస్తానని, భయంగాని, పక్షపాతంగాని, రాగద్వేషాలు గాని లేకుండా రాజ్యాంగాన్ని , శాసనాలను అనుసరించి ప్రజలందరికీ న్యాయం చేకూరుస్తానని దైవసాక్షిగా ప్రమాణం చేస్తున్నాను’ అని ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేస్తాడు. ఆ సినిమా అంతా కూడా ఈ ప్రమాణానికి అనుగుణంగా పాలన చేయాలనే తపనతో చివరివరకు పోరాటం చేస్తూనే ఉంటాడు. మనమందరం ఈ సినిమా చూసినంత సేపు, చూసిన తరువాత హీరో చేసే పనికి సపోర్ట్‌ చేస్తాము. మనదేశంలో మంత్రులుగా, ముఖ్యమంత్రులుగా పదవీ ప్రమాణ స్వీకారం చేసేటప్పుడు కూడా ఈ ప్రమాణాన్ని తమ రాష్ట్రంలో గవర్నర్‌ ఎదుట లేదా కేంద్రంలో రాష్ట్రపతి ఎదుట చేయడం గత 75 సంవత్సరాల నుండి చూస్తూనే ఉన్నాము. ఈ ప్రమాణాన్ని ఎంతమంది రాష్ట్ర, కేంద్ర మంత్రులు గుర్తుంచుకొని పాలన చేస్తున్నారు?

భారతదేశమును సార్వభౌమ, సామ్యవాద, లౌకిక, ప్రజాస్వామ్య, గణతంత్ర రాజ్యాంగంగా నిర్మించుకోవడానికి ఈ పౌరులందరికీ సాంఘిక, ఆర్థిక రాజకీయ న్యాయాన్ని, ఆలోచన, భావప్రకటన, విశ్వాసం, ధర్మం ఆరాధనలలో స్వాతంత్య్రాన్ని అంతస్తుల్లోను, అవకాశాల్లోను సమానత్వాన్ని చేకూర్చుటకు వారందరిలో వ్యక్తి గౌరవాన్ని జాతీయ సమైక్యతను సంరక్షిస్తూ సౌభ్రాతృత్వాన్ని పెంపొందించడానికి 1949 నవంబర్‌ 26వ తేదిన మన రాజ్యాంగ పరిషత్‌లో ఎంపిక చేసుకొని శాసనంగా రూపొందించుకున్న ఈ రాజ్యాంగాన్ని మాకు మేమే ఇచ్చుకున్నాం అని మన రాజ్యాంగ పీఠికలో చెప్పుకున్నాము. 1949 నవంబర్‌ 26 వతేదిన రాజ్యాంగాన్ని భారత అసెంబ్లీ ఆమోదిస్తే, 1950 జనవరి 26న మన రాజ్యాంగం అమల్లోకి వచ్చింది. ప్రజలు పాలకులు రాజ్యాంగానికి లోబడే నడుచుకోవాల్సి ఉంటుందని తీర్మానించింది. మరి ఎంతమంది ఎమ్మెల్యేలు, ఎంపీలు మంత్రులు ఈ పీఠిక గురించి తెలుసుకొని పాలిస్తున్నారు.

ప్రజలకు ఉచిత వైద్యం అందించినప్పుడే..

మనదేశంలో చాలా ప్రభుత్వ హాస్పిటల్స్‌ను కష్టపడి కొత్తగా నిర్మించుకుంటున్నాము. కానీ దాని నిర్వహణలో జాప్యం చేస్తున్నారు. ఆర్థికశాఖ సానుకూల దృక్పథం లేక నిధులు రిలీజ్‌ చేయరు. ఒక నిరుపేద అనారోగ్యంతో ప్రభుత్వ దవాఖానకు వెళ్లినప్పుడు అతనికి ఉచితంగా వైద్యం అందాలి. పూర్తి ఆరోగ్యంతో అతను తిరిగి వెళితే అతనిలో ప్రభుత్వంపై నమ్మకం పెరుగుతుంది. కానీ ఈరోజు ప్రభుత్వ ఆసుపత్రులు ఎంత ఘోరంగా ఉంటున్నాయో మనకు తెలుసు. ఒక మంచి నాయకుడు కనుక వైద్య శాఖ మంత్రిగా ఉంటే చక్కటి ఆరోగ్యం ప్రజలకు ఇవ్వవచ్చు. ఏటా ప్రభుత్వం కన్నా తక్కువ ఖర్చు పెడుతున్న ప్రైవేటు ఆసుపత్రుల ద్వారా చక్కటి వైద్యం అందుతున్న విషయం మనం గమనించాలి. ఒప్పుకోవాలి. మనం సిగ్గుపడాలి. అందుకే అనుభవం, నిజాయితీ గల ఒక డాక్టర్‌ను వైద్య శాఖామంత్రిగా నియమించాలి. నిధులు కేటాయించాలి. నిజమైన నిరుపేదలకే వైద్యం ప్రభుత్వ ఆసుపత్రిలో అందాలి. ఆర్థిక స్థోమత కలవారు ప్రైవేటు ఆసుపత్రికి వెళ్లాలి. మీరు ప్రభుత్వ ఆసుపత్రికి వెళితే పేదవాడికి అన్యాయం జరుగుతుంది.

గత నెల శ్రీ యం. పద్మనాభరెడ్డి, అధ్యక్షులు, ఫోరం ఫర్‌ గుడ్‌ గవర్నెన్స్‌ ఆధ్వర్యంలో గాంధీ హాస్పిటల్‌కు వెళ్ళడం జరిగింది. అక్కడ ప్రైవేట్‌ మెడికల్‌ షాపులలో రోగులు మందులు కొనడం చూసి విస్తుపోయాం. ప్రభుత్వ ఆసుపత్రిలో అన్ని మందులు ఉచితంగా ఇవ్వడం లేదని గాంధీ హాస్పటల్‌ ఆవరణలో ఉన్న ప్రైవేటు మెడికల్‌ షాపులలో కొంటున్నారు. ప్రభుత్వం వారు అన్ని మందులు ఉచితంగా ఇచ్చి నిజమైన వైద్యం అందించినప్పుడే మంత్రి తన కర్తవ్యాన్ని శ్రద్ధతో, అంత:కరణ శుద్ధితో నిర్వహించినట్లు.

పదవే ధ్యేయంగా..

మన దేశంలో ప్రజల పన్నులతో మంత్రులు విలాసవంతమైన క్వార్టర్లలో మంచి రవాణా సదుపాయాలు, అన్ని సౌకర్యాలు సమకూర్చినప్పటికీ సామాన్యుడిని కలవడానికి అనుమతి ఇవ్వరు? అతని గోడు ఎందుకు వినిపించుకోరు? ఎప్పుడైతే మంత్రులు సామాన్యులందరినీ కలిసి వారి సమస్యలను విని సోదరభావముతో పరిష్కరించినప్పుడే మన రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసం ఉన్నట్లు లెక్క. పదవే ధ్యేయంగా అడ్డదారులు వెతుక్కుంటూ మంత్రి పదవి కొరకు, పార్టీల టిక్కెట్ల కొరకు పార్టీలు మారుతూ ఎన్నికల నిబంధనలకు వ్యతిరేకంగా ఖర్చు పెట్టి, ప్రజలను మభ్యపెట్టి, ఆశపెట్టి అంతుపట్టని వాగ్ధానాలు చేసి గెలిచి ఏం చేస్తావు? ఏమీ చేయలేవు. త్రికరణ శుద్ధిగా మనసా వాచా కర్మణా తీరుగా ఉన్నప్పుడే రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసం, విధేయత చూపినట్లు అవుతుంది.

పదవిలో ఉన్నంత వరకూ..

రాజకీయాల్లో ఒక మంచి పునాది లేకుండా ముఖ్యమంత్రి సీటులో కూర్చుంటే ప్రతిరోజు శాసనసభ్యులను బుజ్జగించాల్సిందే, నిరంతరం భయంతోనే పరిపాలన సాగుతుంది. వారికి ప్రమాణం ప్రకారం ఎటువంటి భయం గాని, పక్షపాతం గాని, రాగద్వేషాలు గాని లేకుండా పరిపాలన చేయడం కష్టము. అందుకే పదవే ధ్యేయంగా రాజకీయాల్లోకి వచ్చి అబాసుపాలు కాకండి. మంచి విలువలతో రాజకీయాల్లోకి వచ్చి సేవలు చేసి ప్రజాదరణ పొందండి. ప్రజలు రాజనీతజ్ఞుడని గుర్తుపెట్టుకుంటారు. రాజకీయనాయకుడని కాదు.

ఒక సర్వే, 18వ లోక్‌సభ ఎన్నికలలో 93% మంది కోటీశ్వరులు ఎంపీలుగా గెలిచారని తెలియజేసింది. అందులో వ్యాపారులు కూడా ఉన్నారు. ప్రజా ప్రతినిధులు మీ పదవిలో ఉన్నంత కాలం మీ వ్యాపారాలు, స్వంతపనులని పక్కన పెట్టి ప్రజల సమస్యలను తెలుసుకొని కొత్త సంస్కరణలు చేసి ప్రజలందరికీ న్యాయం చేయండి. అప్పుడే మీ గెలుపు సార్థకమవుతుంది. సామాజిక కార్యకర్తలు, స్వచ్ఛంద సంస్థలు సమాజం కొరకు ఏమీ ఆశించకుండా ఎంతో పనిచేస్తున్నారు. ప్రభుత్వాల నుండి అన్ని సౌకర్యాలు, సదుపాయాలు, జీతభత్యాలు పొందుతున్న మీరు పదవిలో ఉన్నంత కాలం నిస్వార్థంగా పని చేయాలి.

సోమ శ్రీనివాసరెడ్డి

ఫోరం ఫర్‌ గుడ్‌ గవర్నెన్స్‌

Tags:    

Similar News