ఉస్మానియాలో చదివే వాతావరణం లేదా! ఈ పరిస్థితికి కారణం ఏంటి?

తెలంగాణ రాష్ట్రంలోని వివిధ ప్రాంతాలలో నివసించే విద్యార్థుల చిరకాల స్వప్నం ఉస్మానియా విశ్వవిద్యాలయంలో చదువుకోవడం.

Update: 2025-04-18 01:15 GMT
ఉస్మానియాలో చదివే వాతావరణం లేదా! ఈ పరిస్థితికి కారణం ఏంటి?
  • whatsapp icon

తెలంగాణ రాష్ట్రంలోని వివిధ ప్రాంతాలలో నివసించే విద్యార్థుల చిరకాల స్వప్నం ఉస్మానియా విశ్వవిద్యాలయంలో చదువుకోవడం. ఈ విశ్వవిద్యాలయం చాలామంది గ్రామీణ విద్యార్థులకు జీవితాన్ని, మంచి భవిష్యత్తును ఇచ్చింది. తెలంగాణ రాష్ట్రంలోని ఏ శాఖలో చూసినా ఏదో ఒక స్థాయిలో ఉస్మానియా వర్సిటీకి చెందిన విద్యార్థి తప్పనిసరిగా ఉంటారు. కానీ ఈ మధ్యకాలంలో నిర్వహించిన ప్రభుత్వ ఉద్యోగాలలో గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3, గ్రూప్ 4, ఇతర ఉద్యోగాలలో యూనివర్సిటీ విద్యార్థులకు వచ్చిన ఉద్యోగాలు గతంతో పోలిస్తే చాలా చాలా తక్కువ. అసలు దీనికి కారణం ఏమిటి, దీనికి కారకులు ఎవరు అని ఆత్మవిమర్శ చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది.

తెలంగాణ ఉద్యమానికంటే ముందు, ఉస్మానియా విశ్వ విద్యాలయంలో సీటు వచ్చిన విద్యార్థికి దాదాపు ఏదో ఒక ప్రభుత్వ ఉద్యోగం వచ్చేదని నమ్మకం ఉండేది. విద్యార్థులు కూడా అలాగే కష్టపడి చదివేవారు. అప్పట్లో ఏ ఒక్క నలుగురు ఒక్క దగ్గర నిలబడి చర్చిస్తున్నా, అది ఏ మెటీరియల్ చదివితే బాగుంటుంది, తాము చదువుతున్న వాటిల్లో తప్పులను గురించి, పరీక్షల సరళి గురించి మాట్లాడుకునేవారు.

చదివే వాతావరణం పోయిందా?

2009 కంటే ముందు, తెలంగాణలో వచ్చిన ఏ ఉద్యోగ నోటిఫికేషన్లలో అయినా సరే, దాదాపు 60 శాతం మంది కేవలం ఉస్మానియా వర్సిటీకి చెందిన విద్యార్థులకు మాత్రమే ఉద్యోగాలు వచ్చేవి. ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. అప్పట్లో ఉద్యోగాల నోటిఫికేషన్ వచ్చిందంటే, ఉస్మానియా విశ్వవిద్యాలయం చుట్టుపక్కల ఉన్న బస్తీలన్నీ గ్రామీణ ప్రాంత విద్యార్థులతో కిటకిటలాడేవి. అయితే, ఈ మధ్యకాలంలో నిర్వహించిన ప్రభుత్వ ఉద్యోగాలలో ఉస్మానియా యూనివర్సిటీకి వచ్చిన ఉద్యోగాలు గతంతో పోలిస్తే చాలా చాలా తక్కువ. గతంలో ఓయూలో నాన్ బోర్డర్లుగా ఉన్నా కూడా చాలా కష్టపడే విద్యార్థులు.. ఈ మధ్యకాలంలో ఉస్మానియా విశ్వ విద్యాలయంలో హాస్టల్ వసతి ఉన్నా, చదువుకోవడం వీలు కావడం లేదని అశోక్ నగర్, ఆర్టీసీ క్రాస్ రోడ్డు, దిల్‌షుక్ నగర్ లాంటి ఏరియాలలో హాస్టల్లో ఉండి, స్టడీ హాల్లో చదువుకునే పరిస్థితి ఎందుకు వచ్చింది అనేది చర్చనీయాంశం.

రాజకీయానికి ఆకర్షితులవుతూ..

ఒకప్పుడు ఉద్యోగస్తులను తయారు చేసే కర్మాగారంలో ఉన్న విశ్వవిద్యాలయం ఈ మధ్యకాలంలో విడుదలైన గ్రూప్ -1 ఉద్యోగ ఫలితాలలో కనీసం వేళ్ళ మీద లెక్క పెట్టే అంత మందికి కూడా ఉద్యోగం రాకపోవడం ఆశ్చర్యానికి కలిగించే అంశం. 2009 మలిదశ ఉద్యమంలో చురుకుగా పాల్గొని, తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించిన విద్యార్థుల త్యాగం అనిర్వచనీయమైంది. కానీ తెలంగాణ రాష్ట్రం సిద్ధించిన తర్వాత, ఉస్మానియా విశ్వవిద్యాలయంలో పరిస్థితులు చాలావరకు మారిపోయాయి. ఇంతకుముందు అకడమిక్స్, ప్రభుత్వ ఉద్యోగాలకు ఏ విధంగా తయారవ్వాలి అని, మాట్లాడుకునే విద్యార్థులు.. తరువాత దేశ రాష్ట్ర రాజకీయాల గురించి, తాము రాజకీయంగా ఏ విధంగా ఎదగాలని, ఏ రాజకీయ నాయకులతో పరిచయాలు పెంచుకుంటే తమకు భవిష్యత్తులో అవకాశాలు వస్తాయని అంచనా వేసుకుని పనిచేయడం ప్రారంభించారు. ఇందులో కొంతమంది విజయం సాధించి మంచి అవకాశాలు రావడంతో ఓయూ విద్యార్థులు ఒకరిని చూసి ఒకరు రాజకీయాలకు ఎక్కువగా ఆకర్షితులవుతున్నారు. ఇందులో భాగంగా, ఉస్మానియా విశ్వవిద్యాలయంలో ఒక్కొక్క కులానికి నాలుగైదు సంఘాలుగా ఏర్పాటు చేసుకోవడం, ప్రతి సంఘానికి అధ్యక్షులు, ఉపాధ్యక్షులు, కార్యదర్శులు లాంటి పదవులు తయారు చేసుకొని విద్యార్థి నాయ కులుగా చలామణి కావడం ప్రారంభించారు.

చులకనవుతున్న ఓయూ స్టూడెంట్స్

దీనివల్ల ఒక్కసారిగా యూనివర్సిటీలో వాతావరణం పూర్తిగా మారిపోయింది. ఒకప్పుడు ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థులు అంటే, ఎంతో గౌరవం ఇచ్చే చాలామంది ఈ మధ్యకాలంలో విద్యార్థుల గురించి చాలా చులకనగా మాట్లాడడం మనం చాలా సందర్భాల్లో చూశాం. ఇటువంటి పరిస్థితి ఏర్పడడం వల్ల నిజంగా సేవ చేయాలనుకునే చాలామంది విద్యార్థి నాయకులను, చదువుకునే విద్యార్థులందరినీ అదే కోవలో జతకట్టడం చింతించవలసిన విషయం. ఈ రోజున నిరసన తెలిపే హక్కు పైన కూడా ప్రభుత్వం నిషేధం విధించే పరిస్థితికి తీసుకు రావడానికి కారకులెవరు అనేది, విద్యార్థులు, మేధావులు ఆత్మ విమర్శ చేసుకోవాలి. ఎంతోమందికి మంచి భవిష్యత్తును అందించి, భావి భారత పౌరులుగా తీర్చిదిద్దినటువంటి యూనివర్సిటీ ఈ రోజున శోకసంద్రంలో ఉంది. మొత్తంగా ఓయూలో విద్యా వాతావరణం కుంటుపడిందని చెప్పవచ్చు. ఇందుకు నిదర్శనం ఈ మధ్యకాలంలో వచ్చిన ప్రభుత్వ ఉద్యోగాల ఫలితాలే.

ఓయూలో పూర్వ వాతావరణం రావాలి!

కాబట్టి ఉస్మానియా విశ్వవిద్యాలయానికి పూర్వ వైభవం రావాలంటే, తమ సొంత ఎజెండాతో యూనివర్సిటీకి గాని, సమాజానికి గాని సంబంధం లేని విషయాల గురించి అక్కడ చర్చించకుండా ఉంటే బాగుంటుంది. అలాగే యూనివర్సిటీలో చదువు పూర్తి అయిపోయిన విద్యార్థులను, యూనివర్సిటీ పేరు చెప్పుకొని బయట చలామణి అయ్యే వారిపైన నిషేధం విధించాలి. దీంతో వర్సిటీలో విద్యా వాతావరణం నెలకొనడంతో పాటు యూనివర్సిటీకి పూర్వ వైభవం వస్తుంది. 

డాక్టర్ ఎ. శంకర్

ప్రొఫెసర్, చాకలి ఐలమ్మ మహిళా వర్సిటీ

99514 50009

Tags:    

Similar News