వీరన్న ఆలోచనలే పీడిత సమాజానికి ఆయుధాలు

remembering comrade maroju veeranna on his death anniversary

Update: 2023-05-16 00:15 GMT

తెలంగాణ సాయుధ పోరాటాన్ని ఎత్తిపట్టిన నల్లగొండ జిల్లా కరివిరాల కొత్తగూడెంలో జన్మించిన ఉద్యమ పిడికిలి మారోజు వీరన్న. తన జీవిత ప్రయాణమంతా దోపిడీ శక్తులకు వ్యతిరేకంగా కొనసాగించాడు. ఈ దేశంలో అన్ని సమస్యలకు కులమే కారణమని ఆధిపత్య కులాలు అణగారిన కులాలను అణిచివేస్తున్నాయని పసిగట్టాడు. దళిత బహుజనులను ఐక్యం చేస్తూ అనేక ఉద్యమాలను నిర్వహించాడు. చిన్న రాష్ట్రాలతోనే దళిత బహుజనులకు రాజ్యాధికారం దక్కుతుందన్న అంబేద్కర్ ఆలోచనలను స్వీకరించి 1997లోనే వేలాదిమందితో తెలంగాణ మహాసభను నిర్వహించి తను నిర్మించిన దళిత బహుజన కుల సంఘాల ద్వారా గడపగడపకు తెలంగాణ భావజాలాన్ని వ్యాప్తి చేశారు. ఇది గిట్టని చంద్రబాబు ప్రభుత్వం 1999 మే 16న వీరన్నను ఎన్‌కౌంటర్ పేరుతో కాల్చి చంపింది. వీరన్న లేవనెత్తిన అనేక ప్రశ్నలు నేటికీ సజీవంగానే ఉన్నాయి.

ఉద్దేశపూర్వక నిర్లక్ష్యంతోనే ఈ సమస్య

భారతదేశంలో కులం రోజురోజుకు బలమైన ఉక్కు కంచెను పెనవేసుకుంటుంది. కుల వివక్షతలు పెరిగిపోతున్నాయి. మతోన్మాదం పెట్రేగుతుంది. మానవ ధర్మం లేని మనుధర్మం వేగంగా దూసుకొస్తుంది. ఈ సందర్భంలో మార్క్స్, మావో, లెనిన్, పూలే, అంబేడ్కర్, వీరన్న ఆలోచనలకు పదును పెట్టాల్సిన అవసరం ఉంది. దేశంలో పెరిగిపోతున్న సామాజిక, ఆర్థిక, రాజకీయ దోపిడిని నిలువరించడానికి పోరాటాలకు పదును పెట్టాలి.

దేశంలో అనాదిగా కులాన్ని బట్టి దోపిడీ చేస్తూ వస్తున్నారు. ఈ దేశంలో ఆధిపత్య కులాలు దళిత బహుజన కులాలను వేల సంవత్సరాలుగా ఆయుధాలకు, భూములకు, సంపదకు, అధికారానికి, దూరం చేస్తూ కట్టుబానిసలుగా చూస్తూ వస్తున్నారు. వీరన్న మాటల్లో చెప్పాలంటే మను ధర్మ శాస్త్రం దళిత బహుజన కులాల వారిని మనుషులను మనుషులుగానే చూడడం లేదు. కాబట్టి అలాంటి దోపిడీకి గురవుతున్న కులాలకు దగ్గర కావలసిన అవసరం ఉంది. గొంతులేని ఆ గొంతుకలకు తోడుగా నిలవాల్సిన అవసరం ఉంది. దోపిడీ వర్గాల భాగోతాన్ని బట్ట బయలు చేయాల్సిన అవసరం ఉన్నది. ఈ దేశంలో పై మార్పుల కోసం స్వాతంత్ర్యం అనంతరం కొన్ని అడుగులు వేగంగా పడ్డాయి. అందులో కీలకమైనది భారత రాజ్యాంగం ఈ దేశ సామాజిక రాజకీయ పరిస్థితులను నిర్దేశించడమే కాకుండా ఈ ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా ఆర్థిక వ్యవస్థను కూడా నిర్దేశించాలనే కీలకమైన అంశాన్ని మన రాజ్యాంగం ఏర్పరిచింది. ఇది మిగతా దేశాలలో జరిగిన లోటుపాట్లను ఈ దేశంలో జరగకుండా ముందస్తుగా జాగ్రత్త పడింది. కానీ ఈ దేశ సహజ పరిస్థితులు రాజ్యాంగానికి అడుగడుగునా అడ్డుపడ్డాయి.

వాస్తవికతలేని రాజకీయాలు ఎక్కడైనా నిరర్ధకమే. దేశ వాస్తవ పరిస్థితులను గ్రహించకుండా ఏ ప్రాథమిక ప్రణాళిక కూడా నిర్ణయించలేము, అమలుపరచలేము. ఈ దేశంలో ప్రాథమిక ప్రణాళిక అంటే వాస్తవంలో ఇక్కడి సామాజిక నిర్మాణమే. ఈ నిర్మాణం పైననే అసలైన రాజకీయ నిర్మాణం ఆధారపడి ఉంది. ఈ రాజకీయ నిర్మాణ పనితీరును హిందూ నాగరికత ప్రత్యేక సృష్టి ఐన కులం అనే భయంకరమైన వ్యవస్థపై నిర్మితమై ఉన్నదనేది సత్యం. దీనిని అందరికంటే ముందు గ్రహించి పరిష్కార మార్గాలు చూపించినది డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్. ఈ వెలుగుని ఆధారంగా చేసుకోవాల్సిన సామాజిక ఆర్థిక రాజకీయ విప్లవకారులు ఉద్దేశపూర్వక నిర్లక్ష్యాన్ని లేదా పట్టింపు లేనితనంలో ఉండడం వల్లనే ఈ దేశంలో సామాజిక విప్లవ డాక్యుమెంట్‌గా విజయవంతం కావాలసిన రాజ్యాంగం అపసవ్యపు దిశలో నడిచింది. ఈ సారాన్ని ఏ విప్లవ శక్తులు కూడా గ్రహించకపోవడం ఇండియాలో అత్యంత దురదృష్టకరం.

ఈ ఫ్యూడల్ ప్రభువులను అడ్డుకోవాలంటే..

ఈ పరిస్థితులలో ఈ విప్లవోద్యమానికి అసలైన ప్రాథమిక ప్రణాళిక గురించి ఆలోచించి ఆచరించి ఒక సైద్ధాంతిక రూపాన్ని ఇచ్చిన వీరన్ననే నేటి వర్తమానానికి సరిగ్గా అన్వయించుకోవాలసిన వాడు. భారతదేశంలో మార్క్సిజాన్ని ఆచరించడంలో అనుభవించడంలో ఉన్న పరిమితులను, లోటుపాట్లను గ్రహించి ఇండియాలో మార్క్సిజాన్ని విజయవంతం చేయడానికి సరైన తొవ్వను చూయించి మార్గనిర్దేశం చేసిన దార్శనికుడు వీరన్న.

నేటికీ కూడా దళితులను కమ్యూనిస్టు పార్టీలు కలుపుకొని పోవడం లేదు. ప్రథమ శ్రేణి నాయకత్వం దరిదాపులోనికి వారిని రానివ్వడం లేదు. వర్గ పోరాటంలో ఎదురయ్యే సవాళ్లను అధిగమించాలంటే వీరన్న ఎత్తిపట్టిన కులాన్ని ఎజెండాగా చేర్చుకొని సమస్యకు పరిష్కారం చూపాల్సిన బాధ్యత కమ్యూనిస్టు పార్టీలపై ఉంది. కానీ ఈ అంశాన్ని చర్చకు కూడా రానివ్వడం లేదు. దళిత ఉద్యమాలు, కుల ఉద్యమాలు‌, బహుజన ఉద్యమాలు వాటికి అవిగానే జరుగుతున్నాయి. కమ్యూనిస్టు పార్టీలు కూడా వాటికి అవిగా వర్గ పోరాటాన్ని కొనసాగిస్తున్నాయి. వీరన్న లేవనెత్తిన కుల ఎజెండాను వర్గంతో జమిలీ చేయకుండా దళితులకు బహుజనులకు కమ్యూనిస్టు పార్టీలు దూరమవుతున్నటువంటి పరిస్థితి.

సాధారణంగా అన్ని పార్టీలలో అగ్రశ్రేణి నాయకత్వంలో ఆదిపత్య కులాలే ఉంటాయి. విప్లవ పార్టీలలోను కూడా దోపిడీ కులాలే ఆధిపత్యాన్ని చెలాయిస్తున్నాయి. నేడు దేశంలో ఉన్న ప్రధాన కమ్యూనిస్టు పార్టీలను పరిశీలిస్తే దళితులు నాయకత్వం వహిస్తున్న విప్లవ పార్టీ ఒక్కటి కూడా లేదు. అంతా ఆధిపత్య కులాల చేతుల్లోనే ఉన్నాయి. వర్గ పోరాటానికి కులపోరాటాన్ని జమీలీ చేస్తే వారి పీఠాలు కదులుతాయని కుల ఎజెండాను దూరం పెడుతున్నాయి. అంతర్గతంగా మాత్రం ఆధిపత్య కుల భావజాలాన్ని విస్తృతం చేసుకుంటున్నాయి.

ఇండియా పరిస్థితులకు అనుగుణంగా మర్క్సిజంను సృజనాత్మక ధోరణిలో అమలు చేయకుండా, మార్క్సిజాన్ని అన్వయించకుండా, యాంత్రిక దోరణిలోనే కమ్యూనిస్టు పార్టీల పోరాటాలు కొనసాగుతున్నాయి. ప్రత్యేక తెలంగాణలో విజృంభించిన కులం ఫ్యూడలిజం నీడలో పాలక వర్గాల కంటే సామాజిక పరివర్తన కోసం ప్రయత్నించే శక్తులు కూడా చాలా వరకు ఈ లోపాలను గ్రహించడం లేదు. అత్యంత నిర్బంధ కాలంలోను మనుషుల ఏరివేత జరుగుతున్న పోలీసు రాజ్య సందర్భంలోను మారోజు వీరన్న ప్యూడల్ కుల ప్రతినిధి ఐన రాజ్యాన్ని ఎదిరించి నిలబడి ఈ దేశ సమస్యలకు ఒక పదునైన పరిష్కారం గా నిలబడ్డాడు. ఆయనను బౌతికంగా నిర్మూలించినప్పటికి ఆయన అందించిన పదునైన ఆలోచన ఆయుధాలు ఇప్పుడు అత్యంత అవసరం. ఆధిపత్య శక్తులపై వాటిని సంధించకపోతే కేంద్రంలోని మనువాద ప్రభువులను ఇక్కడి ఫ్యూడల్ ప్రభువులను అడ్డుకోలేం. ఈ సమాజాన్ని ప్రజాస్వామికీకరించలేము.

(నేడు మారోజు వీరన్న 24వ వర్ధంతి)

పందుల సైదులు

తెలంగాణ విద్యావంతుల వేదిక

94416 61192

Tags:    

Similar News