దీనజన బాంధవుడు భాగ్యరెడ్డి వర్మ
దీనజన బాంధవుడు భాగ్యరెడ్డి వర్మ... remembering Bhagyareddy Varma death anniversary
మహాత్మాగాంధీ, అంబేద్మర్‌ల కంటే ముందే అస్పృశ్యత నివారణకై, అణగారిన వర్గాల హక్కులకై గళమెత్తిన గొంతుక, దళితుల ఆత్మగౌరవానికి ప్రతీక, అది హిందూ ఉద్యమ నిర్మాత, విద్యాప్రదాత, దీనజన బాంధవుడు, సంఘసంస్కర్త, నిమ్న జాతి జీవన వికాస భాగ్యరేఖ, తెలంగాణ గడ్డపై ఉదయించిన భాగ్యోదయం మన మాదరి వేంకట భాగ్యరెడ్డి వర్మ.
భాగ్యరెడ్డివర్మ 1888 మే 22న దళిత కులంలో పుట్టారు. నిరుపేద కుటుంబం. భాగ్యరెడ్డి వర్మకు తల్లిదండ్రులు పెట్టిన పేరు మాదరి వేంకట భాగయ్య. అయితే దళితులు ఈ దేశ మూలవాసులని, వారే మొదటి పాలకుడు అనే అర్థాన్ని సూచించేందుకే రెడ్డి పదాన్ని వారి కులగురువైన భాగయ్యకు రెడ్డి పదాన్ని చేర్చి 'భాగ్యరెడ్డి గా మార్చారు. తదనంతర కాలంలో హిందూ సమాజానికి భాగ్యరెడ్డివర్మ చేసిన సేవకు ఆర్య సమాజం ఆయనకు వర్మ అనే బిరుదును ప్రదానం చేసింది. భాగ్యరెడ్డి ప్రాథమిక విద్య చదువుతున్న సమయంలో తండ్రి మరణించడంతో ఒక బారిష్టర్ దగ్గర ఇంట్లో పనికి చేరాడు. అక్కడి న్యాయవాది సహకారంతో చదవడం, రాయడం నేర్చుకున్నారు. ఆ న్యాయవాదిని కలవడానికి వచ్చిన ప్రముఖులతో మాట్లాడుతూ ఈయన ఎన్నో కొత్త విషయాలు నేర్చుకునేవాడు. ఆ ఇంటికి వచ్చిన అన్ని పత్రికలను చదివేవాడు. ఈ క్రమంలో ఆయనకు శ్రీ కృష్ణదేవరాయాంధ్ర భాషా నిలయం స్థాపకుల్లో ఒకరైన రావిచెట్టు రంగారావుతో పరిచయం కలిగింది. ఆయన ప్రోత్సాహంతో వర్మ ఎన్నో పుస్తకాలు చదివి విషయ పరిజ్ఞానాన్ని పెంచుకోవడంతో పాటు ఉర్దూ, హిందీ, ఇంగ్లీషు భాషలు నేర్చుకున్చాడు. ఆయనపై బ్రహ్మసమాజంతో పాటు బుద్ధిజం ప్రభావం కూడా ఉండేది అందుకే ఆయన కుమారుడికి గౌతమ్ పేరు పెట్టారు. తరువాత కొంతకాలం ఒక ఎలక్ట్రికల్ కంపెనీలో, ఆ తరువాత నిజాం ప్రభుత్వ విద్యుత్ శాఖ ఉద్యోగంలో చేరాడు.
కులం కారణంగా తన జాతిజనులు సామాజిక వివక్షతకు గురవుతూ నాటి హిందూ సమాజంలో అస్పృశ్యులుగా అవమానాలు పొందడం ఆయనకు బాధ కలిగించింది. తాము అంటరానివారం కాదని ఈ దేశమూలవాసులైన ఆది హిందువులమని పేర్కొన్నాడు. దళితుల దుస్థితికి వారి అవిద్య, అజ్ఞానం, ఉదాసీనత కారణమని గ్రహించాడు. ఆది హిందువులు మూఢ నమ్మకాలకు, సాంఘిక దురాచారాలకు బలికావడం, మద్యపానం వంటి వ్యసనాలకు బానిసలు కావడం భాగ్యరెడ్డిని బాగా కలచి వేసింది. అందుకే తన జాతి జనులలో చైతన్యం తీసుకువచ్చి వారిలో సామాజిక వికాసం కలిగించడానికి, సామాజిక సంస్కరణోద్యమాలు మొదలుపెట్టాడు. దళిత జాతి హక్కులకై, వారి ఉన్నతికి కృషి చేశారు. 'జగన్మిత్రమండలి'ని స్థాపించి అణగారిన కులాల వారు నివసిస్తున్న బస్తీలలో హరికథలు, భజన కీర్తనలు, సమావేశాలు నిర్వహిస్తూ వారిని చైతన్య పరిచాడు. అంతేకాకుండా తాను స్వయంగా శాఖాహారిగా ఉంటూ ఆ మండలి సభ్యులందరూ మద్యమాంసాలు స్వీకరించకూడదని నిబంధన పెట్టాడు.
'దక్కన్ హుమ్యనిటేరియన్ లీగ్' అనే సంస్థ స్థాపించి జీవహింస చేయరాదని ప్రచారం చేశాడు. జంతుబలిని నిషేధించాలని నిజాం ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశాడు. ఆయన ఆది హిందువుల విద్యావికాసానికై ముఖ్యంగా బాలికా విద్య కోసం బాలికల పాఠశాలలను ప్రారంభించారు. నిమ్మ వర్గాల కోసం హైదరాబాద్‌లో 26 పాఠశాలలు స్థాపించి వందల మంది పిల్లలకు విద్య అందించాడు. అయితే ఆ పాఠశాలల స్వాధీనం కోసం నిజాం ప్రభుత్వం ముందుకురాగా వాటిని తెలుగు మాధ్యమంలో నిర్వహిస్తానంటే అప్పగిస్తానని నిబంధన పెట్టాడు. దానికి నిజాం ప్రభుత్వం ఒప్పుకోవడం అప్పట్లో సంచలనం. భాగ్యరెడ్డి తన కృషి, పట్టుదల, చిత్తశుద్ధి, నీతి నిజాయితీలతో తన సేవా కార్యక్రమాల ద్వారా అటు ఆది హిందువులలో, ఇటు ప్రభుత్వంలో అభిమానాన్ని చూరగొన్నాడు. ఆ తర్వాతి కాలంలో జగన్మిత్ర మండలిని మన్య సంఘంగా మార్చాడు. ఆ సంఘం ఆధ్వర్యంలో బాల్య వివాహాలు, దేవదాసి, జోగిని, ముర్లీ వంటి సాంఘిక దురాచారాలకు, మూఢనమ్మకాలకు వ్యతిరేకంగా ఉద్యమించి తన జాతి జనులలో చైతన్యం తీసుకువచ్చాడు. అలాగే ఉగాది పండుగన తమ జాతి జనుల వికాస్ నిజంగా జరిపించేవాడు. ఆయన సేవలు హైదరాబాదు సంస్థానానికే పరిమితం కాకుండా అటు ఆంధ్ర, కర్ణాటక, మహారాష్ట్ర ప్రాంతాలకు విస్తరించాయి. విజయవాడలో జరిగిన మొదటి ఆంధ్ర పంచమ మహాసభకు అధ్యక్షుడిగా హాజరైన వర్మ దళితుల ఆత్మగౌరవాన్ని కించపరిచే పంచమ శబ్దం తొలగించి దాని స్థానంలో ఆది ఆంధ్ర పదం చేర్చి ఆది హిందూ లేదా ఆది మహాసభ సంబోధించాలని కోరాడు. కాలక్రమంలో మన్య సంఘం స్థానంలో 'ఆది హిందూ సోషల్ సర్వీస్ లీగ్'ను ఏర్పాటు చేసి తన సేవా కార్యక్రమాలను విస్తరించాడు.
స్వాతంత్ర్య ఉద్యమ సమయంలో లండన్‌లో జరిగే రౌండ్ టేబుల్ సమావేశానికి నిమ్నజాతి తరఫున ప్రతినిధిగా అంబేద్కర్ పేరును సూచించినవాడు. అలాగే ఆది హిందువులు తమ గొడవలు, సమస్యలు తామే పరిష్కరించుకునే విధంగా మొహల్లా (బస్తీ) పంచాయితీలను నడిపేవాడు. అవి ఎన్నో వివాదాలను పరిష్కరించాయి. ఆయన కృషి ఫలితంగానే నాటి నిజాం ప్రభుత్వం 1931లో హైదరాబాదు సంస్థానంలో చేపట్టిన జనాభా లెక్కల్లో 'అంటరాని' వర్గాల వారిని ఆది హిందువులుగా నమోదు చేసింది. భాగ్యరెడ్డివర్మ ఆంధ్ర మహాసభ, ఆది హిందూ మహాసభ, అఖిల భారత 'అంటరాని' వర్గాల సభ వంటి సంస్థలు జాతీయ స్థాయిలో నిర్వహించిన అనేక సభలలో పాల్గొని తన జీవిత కాలంలో సుమారు 3,348 ఉపన్యాసాలు ఇచ్చాడు.
భాగ్యరెడ్డి వర్మకు ఆర్య సమాజం వర్మ అని, వెనుకబడిన తరగతుల సామాజిక సభ 'శివక్రేష్టి' అని ఏలూరు ఆంధ్ర మహాసభ సంఘమాన్య అనీ బిరుదులు ఇచ్చాయి. భాగ్యరెడ్డి వర్మ ఆది హిందూ భవనం నిర్మించి ఎన్నో సమావేశాలు నిర్వహించారు. భాగ్యనగర్ పేర పత్రికను నడిపేవాడు. దానిని కాలక్రమంలో ఆది హిందూ పత్రికగా మార్చాడు. ఆ పత్రికలో ప్రాథమిక హక్కుల పేర సంపాదకీయ వ్యాసాలు రాశాడు. వెట్టి మాదిగ అనే నవల రాశాడు. ఇవి కాకుండా కొన్ని కవితలు, కథలు రాశాడు. దళిత జనోద్ధరణకై, వారి హక్కుల సాధనకై, హిందూ సమాజ పరిరక్షణకై జీవిత చరమాంకం వరకు పోరాడి ఎందరికో మార్గదర్శకుడుగా నిలిచిన మన భాగ్యనగరపు భాగ్య రత్నం భాగ్యరెడ్డివర్మ క్షయ వ్యాధితో 1939 ఫిబ్రవరి 18న మరణించాడు.
(నేడు భాగ్యరెడ్డి వర్మ వర్ధంతి)
ఏవీ సుధాకర్
రాష్ట్ర అసోసియేట్ అధ్యక్షులు, STUTS
90006 74747
పబ్లిక్ పల్స్ పేజీకి, సాహితీ సౌరభం పేజీకి రచనలు పంపవలసిన మెయిల్ ఐడీ dishaopinion@gmail.com, వాట్సప్ నెంబర్ 7995866672