పొలిటికల్ కింగ్ మేకర్ ‘జగ్జీవన్‌రామ్’

Remembering Babu Jagjivan Ram An Important Dalit Leader

Update: 2023-04-04 18:30 GMT

ళితోద్యమానికి, సామాజిక నేపథ్యాన్నీ, సైద్ధాంతిక భూమికనూ సమకూర్చడంలో బాబు జగ్జీవన్ రాం లాంటి మేధావులు చేసిన విశేష కృషి ఎన్నటికీ మరువలేం. ఒకప్పుడు ఆర్యులతో సమస్థాయిలో రాజ్యాలు ఏలిన చరిత్ర మాదిగల (జాంబవులు)ది. నాటి చరిత్రకు భిన్నంగా నేడు వీరు దారిద్ర్య కోరలలో చిక్కుకొని విలవిలలాడుతున్నప్పుడు, అసలు తన సమాజం ఎందుకు ఇలా ఉంది, మాదిగవారి బానిసతనానికి కారణమేమిటి అనేది తెలుసుకోవడానికి చేసిన ప్రయత్నంలో ఆయన ఎన్నో ఒడుదొడుకులను చవిచూశారు. అస్పృశ్యత దురాచారానికి ఊపిరిలూదిన పరిస్థితులను అవగతం చేసుకుని సామాన్యులకు సైతం అర్థమయ్యే విధంగా బాబూజీ చైతన్య బావుటా ఎగరవేసినారు. బాబు జగ్జీవన్ రామ్ 1908 ఏప్రిల్ 5 న బీహార్‌లోని షాహాబాద్ జిల్లాలోని చంద్వా అనే చిన్న గ్రామంలో జన్మించాడు. తల్లి వసంతి దేవి, తండ్రి శోబి రామ్ మొదట బ్రిటిష్ సైన్యంలో పని చేసేవాడు. తన తండ్రి నుండి మానవతావాదం, ఆదర్శవాదం, స్థితిస్థాపకత విలువలను నేర్చుకున్నాడు. భారత రిపబ్లిక్ తొలి లోక్‌సభ (1952)లో ప్రవేశించిన జగ్జీవన్‌రామ్ వరుసగా ఎనిమిదిసార్లు గెలిచారు. ముప్ఫై మూడు సంవత్సరాలు కేంద్రమంత్రిగా, దేశ ఉప ప్రధానిగా దేశంలో ప్రజారాజ్య నిర్మాణానికి నిరంతరం కృషి సాగించారు. మొదటి శ్రేణి పార్లమెంటేరియన్‌గా నిలిచాడు.

1935 జూన్ ఒకటిన కాన్పూర్‌కి చెందిన సంఘసేవకుడు డాక్టర్ బీర్బల్ కుమార్తె ఇంద్రాణిదేవితో జగ్జీవన్‌రామ్ వివాహం జరిగింది. ఇంద్రాణిదేవి స్వాతంత్య్ర సమరయోధురాలు మాత్రమేగాక, విద్యావేత్త కూడా. స్వాతంత్య్రోద్యమ కాలమంతా తోడుగా పోరాడిన వీరిద్దరికీ ఇరువురు సంతానం. కుమారుడు సురేష్. కుమార్తె మీరా. ఆయన కుమార్తె మీరాకుమార్ తండ్రి ఆదర్శాలతోనే పెరిగి కేంద్రమంత్రిగా, లోక్‌సభ స్పీకర్‌గా దేశానికి సేవలందించారు. ఆయన జీవితకాలం 78 ఏళ్ళు అయితే అందులో 52 ఏళ్ళు రాజకీయ జీవితం గడిపారు. ఆయన్ని పొలిటికల్ కింగ్ మేకర్‌గా అభివర్ణిస్తారు.

హరిజనుల అభ్యుదయం నా ప్రాణంతో సమానం.. నాకు అన్నపానీయాలు ఎంత ముఖ్యమో, హరిజనులకు సేవ చేయడం అంత ముఖ్యం అని చెప్పిన గాంధీజీ.. బాబు జగ్జీవన్‌రామ్‌కు మార్గదర్శకుడైనారు. గాంధీజీ హరిజన సేవాసంఘం స్థాపించినప్పుడు, గాంధీజీ హరిజన పత్రిక ద్వారా అస్పృశ్యత నివారణకు చేస్తున్న కృషిని గురించి తెలుసుకొని గాంధీజీ శిష్యులలో ఒక్కడైయ్యాడు. హరిజనోద్ధరణకు బయలుదేరిన గాంధీజీపై మత ఛాందసవాదులు ఇటుక ముక్కలు, పాత చెప్పులు, రాళ్లు రప్పలు విసిరినారు. గాంధీ జంకకుండానే హరిజనోద్యమం ఉధృతంగా కొనసాగించారు. బీహార్ పర్యటనలో బాబు జగ్జీవన్‌రామ్ గాంధీజీ వెంట ఉన్నారు. గాంధీజీ శిష్యుడైన జగ్జీవన్‌రామ్ ఒక్క విషయంలో మాత్రం గాంధీజీని ఎదిరించారు. హరిజనులు గోవులతో సమానం అని గాంధీజీ వర్ణించినప్పుడు 'బాపూజీ మేము చేతకాని వారమా, పశువుతో సమానమా' అని జగ్జీవన్‌రామ్ ప్రశ్నించి గాంధీజీ మెచ్చుకోలుకు పాత్రుడైనారు. ఆ సమయంలో అఖిల భారత దళిత సంఘానికి బీహార్ ప్రాంత అధ్యక్షునిగా జగ్జీవన్‌రామ్ ఎన్నికైనారు.

1935లో శాసనసభలకు జరిగే ఎన్నికలకుగాను బాబు జగ్జీవన్‌రామ్ బరిలో నిలిపిన 15 మందిలో 14 మంది పోటీ లేకుండా ఎన్నికయ్యారు. దశాబ్దాల పాటు కేంద్రమంత్రిగా పని చేయడం చారిత్రాత్మక విజయంగా మేధావులు అభిప్రాయపడ్డారు. తాను ఏ శాఖ మంత్రిగా పనిచేసినా ఆ శాఖలో దళితుల కోటాను తప్పనిసరిగా భర్తీ చేసేవాడని డాక్టర్ సి. సుబ్రహ్మణ్యం చమత్కరిస్తూ ఉండేవారు. బాబుజీ చెయ్యి 'గోల్డెన్ హ్యాండ్' అని కొనియాడేవారు. ఆయన చెయ్యి తాకిన ప్రతి ఒక్కరికి బంగారు భవిష్యత్తు లభించిందనే అభిప్రాయం నెలకొంది. మంత్రివర్యులుగా పాతికేండ్ల పాటు కొనసాగినప్పటికీ ఎక్కడా మరకలు అంటని తెల్లపేపర్‌గా అయన జీవితం కొనసాగింది. ఒకానొక సందర్భంలో ‘కొలిమి జ్వాల‌ల్లో వన్నెదేలిన బంగారంలా ఎదిగిన జగ్జీవన్‌రామ్ పట్ల నా ఆత్మ గౌరవాభిమానంతో ఉప్పొంగుతున్నది, జగ్జీవన్‌రామ్ అమూల్యరత్నం’’ అని గాంధీ కొనియాడారు. 1986 జూలై 6వ తేదీన బాబూజీ తన తుదిశ్వాస విడిచారు. యావత్తు భారతజాతి కన్నీరుమున్నీరైంది. ఆయన భౌతికంగా భారత దేశాన్ని విడిచినా ఆయన దేశానికి చేసిన సేవలు, సంఘ సంస్కరణలు, ఆయన ఆచరించిన సిద్ధాంతాలు ఎప్పటికీ సజీవంగానే ఉంటాయి

(నేడు బాబు జగ్జీవన్‌రామ్ జయంతి)

డా. సంగని మల్లేశ్వర్,

జర్నలిజం విభాగాధిపతి, కేయూ

98662 55355

Tags:    

Similar News