వందల నాటకాలలో నటుడిగా, జర్నలిస్టుగా వ్యాసాలు, చిత్రకారుడుగా వేలాది చిత్రాలు, రచయితగా పుస్తకాలు, అందమైన దృశ్యాలను తీసిన ఫోటోగ్రాఫర్‌గా.. బహుముఖ ప్రజ్ఞావంతులుగా వెలిగిన సుదర్శన్ సార్ 1-4-2024 మన నుండి దూరమైయ్యారు. ఆయన మనమధ్య లేకపోయినా.. ఆయన కళ ఎప్పటికి శాశ్వతంగా నిలిచే ఉంటుంది.
నేను పుట్టి పెరిగిన నల్లగొండలో సంగీత, సాహిత్య, చిత్ర కళా, ఫోటోగ్రఫీ నాటక రంగాలలో నిష్ణాతులైన వ్యక్తులు చాలా మంది ఉండేవారు. ఇంతమంది ప్రతిభావంతుల్లో బహుముఖ ప్రజ్ఞ కలిగిన వారు సుదర్శన్ సార్. ఆరడుగుల ఎత్తు, ముఖంపై చిరునవ్వు, సేవా భావం, అకుంఠిత దీక్ష కలిగిన వ్యక్తి. కవి, గాయకుడు, చిత్రకారుడు, రచయిత, రంగస్థల నటుడు. ఆయన ఉపాధ్యాయుడిగా పనిచేస్తూ సమాజ చైతన్యానికి తనవంతు సహకారం అందించేవారు. నల్లగొండ టౌన్ హాల్‌లో 35 సంవత్సరాల క్రితం "దాసి" చిత్రం యూనిట్‌కి జాతీయ అవార్డులు వచ్చిన సందర్భంగా పౌర సన్మాన కార్యక్రమం జరిగింది. ఆ చిత్రానికి సార్‌కి కాస్ట్యూమ్ డిజైనర్‌గా జాతీయ అవార్డు రావడంతో పిట్టంపల్లి సుదర్శన్ కాస్తా ‘దాసి సుదర్శన్’ అయ్యారు. ఆ కార్యక్రమాన్ని విద్యార్థులుగా మేము ప్రత్యక్షంగా చూశాం.
ఒక కళాకారుడిగా ఆయన జాతీయ చలనచిత్ర అవార్డుల జ్యురీ ప్యానల్ సభ్యుడుగా పనిచేసినందున మనందరికీ గర్వకారణం. ఎవరు అడిగినా ప్రేమతో బొమ్మలు గీసి ఫ్రేమ్ కట్టించి కూడా ఇచ్చేవారు. ఆయన కళను కమర్షియల్ కోణంలో ఎన్నడూ చూడలేదు. పాఠ్యపుస్తకాలకు సైతం బొమ్మలు గీశారు. ప్రముఖ సాహిత్యకారులందరు నాగార్జునసాగర్‌లో వారి ఆతిథ్యాన్ని స్వీకరించిన వారే. వారి శ్రీమతి "స్వతంత్ర" గురించి ఎంత చెప్పినా తక్కువే. అన్నపూర్ణ అంటే ఏమిటో ఆమె అతిధి మర్యాదలను బట్టి చూస్తే తెలుస్తుంది. వందల నాటకాలలో నటుడిగా, జర్నలిస్టుగా వ్యాసాలు, చిత్రకారుడుగా వేలాది చిత్రాలు, రచయితగా పుస్తకాలు, అందమైన దృశ్యాలను తీసిన ఫోటోగ్రాఫర్‌గా బహుముఖ ప్రజ్ఞా వంతులుగా వెలిగిన సుదర్శన్ సార్ మన నుండి దూరమైనా.. ప్రతి కార్యక్రమంలో, ప్రతి చిత్రంలో, ప్రతి నాటకంలో వారు జీవించి ఉంటారు. ఆయన చిత్రాలన్నిటినీ ఒక ప్రదర్శనగా ఏర్పాటుచేసి, ఆశయాలను అనుసరించడమే ఆయన అభిమానులుగా మనందరి కర్తవ్యం.
(నేడు మిర్యాలగూడలో దాసి సుదర్శన్ సంస్మరణ సభ సందర్భంగా)
- కూరెళ్ల శ్రీనివాస్
ప్రముఖ చిత్రకారులు
98495 43728