గుండాల గుండె చ‌ప్పుడు లింగన్న

Remembering Activist Linganna

Update: 2023-07-29 23:30 GMT

ఆదివాసీ ముద్దుబిడ్డ, ఆదివాసీ పోరుబిడ్డ ఆదివాసీ పోరు కెర‌టం, గోదావ‌రి లోయ ప్రతిఘ‌ట‌న వీర యోధుడు, ఆజ్ఞాత ద‌ళాల నాయ‌కుడు. గుండాల మండ‌ల గుండె చ‌ప్పుడు. గుండాల విప్లవోద్యమ చరిత్రలో ధ్రువతార గుండాల చరిత్ర నీలాకాశంలో ఓ వేగు చుక్క. జ‌నార‌ణ్యంలో జ‌న నేత‌గా, అర‌ణ్యంలో అజ్ఞాత ద‌ళ నాయ‌కుడిగా ఉంటూ అనునిత్యం ఆదివాసీల‌కు అండ‌గా ఉంటూ, ఆదివాసీ పోడు భూముల ర‌క్షణ కోసం పోరు స‌ల్పుతూ గుండాల మండ‌ల ఆదివాసీల‌కు గుండెకాయ‌గా మారీ ఆదివాసీల గుండెల్లో గుడి క‌ట్టుకున్న యోధుడు లింగ‌న్న. ఈయన గుండాల మండలంలోని రోళ్ళగ‌డ్డ గ్రామంలో నిరుపేద ఆదివాసీ కుటుంబంలో జన్మించారు. బాల్యం నుండే సామాజిక సృహ, విప్లవ ప్రగ‌తిశీల భావాలు ‌క‌లిగి స్థానిక స‌మ‌స్యల‌పై స్పందించే గుణం క‌లిగి.. ఆదివాసీ స‌మ‌స్యల‌పై నిరంత‌రం అద్యయ‌నం చేస్తుండేవాడు. ప్రాథమిక విద్య ఆశ్రమ పాఠశాల‌లో అభ్యసించి, ఉన్నత విద్యనీ విప్లవంలో నేర్చుకోని, ఈ స‌మాజం కోసం స‌మిధిగా మారి భూమికోసం, భుక్తికోసం, ఈ దేశ‌ విముక్తికోసం, ఆదివాసీ స్వయం పాల‌న కోసం త‌న ప్రాణ‌ల‌ను ప‌ణంగాపెట్టి, భ‌విష్యత్ విప్లవ ఉద్యమాల‌కు ఊపిరిపోశాడు. ఆ విప్లవ భావ‌జాల‌మే విప్లవ సాయుధపోరాట రాజ‌కీయాల వైపు అడుగులు వేసే విధంగా చేసింది. ఆదివాసీ అణ‌గారిన వ‌ర్గాల‌కు రాజ్యధికారం రావాలంటే సాయుధ‌పోరాటమే మార్గమ‌నీ దృఢంగా న‌మ్మిన వ్యక్తి.

భూమి, భుక్తి, విముక్తి కోసం..

ఆ స‌మ‌యంలోనే గుండాల మండ‌లంలో బ‌ల‌మైన విప్లవ‌సాయుధ పోరాట‌ రాజ‌కీయాలు క‌లిగి ఆజ్ఞాత సాయుధ ద‌ళాల‌ను ఏర్పాటు చేసి సాయుధ పోరాటం చేస్తున్న సీపీఐఎంఎల్ న్యూడెమోక్రసీ పార్టీ వైపు ఆక‌ర్షితులై అంచ‌లంచ‌లుగా ఆ పార్టీలో ఉన్నత‌ స్థానానికి ఎదిగాడు. ఆ పార్టీ అనుబంధ యువ‌జ‌న సంఘ‌మైన ప్రగ‌తిశీల యువ‌జ‌న సంఘంలో 1997వ‌ర‌కు ప‌ని చేస్తున్న క్రమంలో గిరిజ‌నేత‌ర నాగ‌రిక స‌మాజంలో దోపిడీ దౌర్జాన్యాల‌ను చూసి చ‌లించిపోయి భూమి కోసం, భుక్తి కోసం, ఈ దేశ విముక్తి కోసం, నూత‌న ప్రజాస్వామిక విప్లవం కోసం, ఏజ‌న్సీలో ఆదివాసీ స్వయంపాల‌న కోసం, 1997లో ఆయుధం చేప‌ట్టి ఆదివాసీల‌కు అండ‌గా నిలిచి గుండాల మండ‌లానికి పెద్ద దిక్కుగా మారినాడు.

లింగ‌న్న త‌న ఊపిరి పోయేవ‌ర‌కు విప్లవ‌ రాజ‌కీయ‌ల‌ను వ‌దిలిపెట్టలేదు. త‌న 30 ఏళ్ళ విప్లవ రాజ‌కీయ జీవితంలో ఎన్నో నిర్భంధాలు వ‌చ్చినా నిర్భయంగా ఎదుర్కొని రాజ్యహింస‌లో రాటుదేలినాడు. ఈ స‌మాజంలో వ‌చ్చే ప్రతి స‌మ‌స్యను విప్లవ మార్కిస్టు దృక్పధంతో ప‌రిశీలించేవాడు. విప్లవ నాయ‌కుడిగా పేరు తెచ్చుకున్నాడు. త‌న క్రమ‌శిక్షణ, ఆత్మ విశ్వాసంతో అన‌తికాలంలోనే జిల్లా క‌మిటి స‌భ్యునిగా, రాష్ట్ర క‌మిటీ స‌భ్యునిగా నిత్యనిర్బంధం మ‌ధ్య ప్రజ‌ల కోసం ప‌ని చేశాడు. అను నిత్యం ఆదివాసీ స‌మ‌స్యల‌పై అలుపెర‌గ‌ని పోరాటం చేస్తూ గుండాల మండ‌ల ఆదివాసీల‌కు గుండెకాయ‌గా మారినాడు. గుండాల మండ‌లంలో తునికాకు, ప‌త్తి, మొక్కజొన్న రేట్లు పెంపుద‌ల విష‌యంలో ఆదివాసీల ప‌క్షాన నిల‌బ‌డి మ‌ద్దతు ధ‌ర కోసం వ్యాపార‌స్తుల‌తో క‌ల‌బ‌డి నిల‌బ‌డినాడు. ఆదివాసీల కుటుంబ స‌మ‌స్యలు, భూమి స‌మ‌స్యలు అత్యంత చాక‌చక్యంగా ప‌రిష్కారం చేశాడు. గిరిజ‌నేత‌ర ప్రజ‌ల స‌మ‌స్యలను కూడా బూర్జువా న్యాయ‌వ్యవ‌స్థ కంటే సునిశితంగా ప‌రిశీల‌న చేస్తూ ప‌రిష్కారం చేశాడు. ఆదివాసీల చ‌ట్టాలు అమ‌లు కావాల‌ని పాల‌కుల‌పై ఒత్తిడి తెచ్చాడు. పోడు భూముల ర‌క్షణ కోసం బ‌ల‌మైన ఉద్యమాన్ని గుండాల మండ‌లంలో నిర్మించాడు. అందుకే లింగ‌న్న గుండాల మండ‌ల పోరుభూమిలో విత్తనంలా ఆదివాసీ ప్రజ‌ల గుండెల్లో హ‌త్తుకుపోయాడు.

ఆయన జ్ఞాపకాలు చెరిపేసినా..

గుండాల మండ‌లంలో ఉన్న అట‌వీ సంప‌ద‌ను, ఖ‌నిజ సంప‌ద‌ను బ‌హుళ‌జాతి కంపెనీల‌కు అప్పజెప్పడానికి సింగ‌రేణి ఓపేన్ కాస్ట్‌లు తీయ‌డానికి ఈ పాల‌కులు కుట్రలు కుతంత్రాలు చేస్తున్న సంద‌ర్భంలో లింగ‌న్న ప్రజ‌ల‌తో క‌లిసి బ‌ల‌మైన ఉద్యమాన్ని నిర్మించి అడ్డుకోగ‌లిగాడు. అందుకే లింగ‌న్నను పాలక వర్గాలు అంతమొందించాయి. చివ‌ర‌కు సాయుధ‌ పోరాటంలోనే సాగిపోయి 2019 జులై 31న అత్యంత కిరాతకంగా రాజ్యంచే బూట‌క‌పు ఎన్‌కౌంట‌ర్‌లో భౌతికంగా హ‌త్యచేయబ‌డి ప్రజ‌ల గుండెల్లో కొలువైనాడు. అమరుడైన లింగన్న స్థూపాన్ని కుటుంబ సభ్యుల పట్టా భూమిలో నిర్మించడానికి అనేక అడ్డంకులు సృష్టించారు. సగం నిర్మాణం అయిన తరువాత పోలీసులు అర్ధరాత్రి వేళ కూల్చేశారు. దీంతో ఆ స్థూపం అసంపూర్తిగా శిధిలవస్థంగా తయారైంది. ఆయన జ్ఞాప‌కాల‌ను చెరిపేయాల‌ని పాల‌కులు ఎంత ప్రయ‌త్నించినా గుండాల మండ‌ల అడ‌విలో ప్రతి చెట్టులో ప్రతి పుట్టలో విప్లవ ప్రతిధ్వనితో ధ్వనిస్తూనే ఉంటాడు.

ఆయన మరణం ఆదివాసీల‌కు తీర‌ని లోటు. తెలంగాణ దొర‌ల రాజ్యంలో ఆదివాసీలను ల‌క్ష్యంగా చేసుకుని ఆదివాసీల హ‌క్కులు కాల‌రాస్తున్నారు. ఈ సామ్రాజ్యవాద అభివృద్ధి న‌మూన‌లో ఆదివాసీల‌ను అంతం చేస్తున్నారు. తెలంగాణ‌ రాష్ట్రం ఆదివాసీల పాలిట శాపంగా మారింది. ఆదివాసీ ప్రతినిధుల‌పైనా నిలువెల్లులా నిర్బంధాన్ని మోపుతున్నారు. లింగ‌న్న ఆశ‌యాలు సాధించ‌డానికి ఆదివాసీలు ఐక్యమై ఆదివాసీ అస్ధిత్వ విప్లవ సాయుధ పోరాట రాజ‌కీయాల‌ను కొన‌సాగించాలి. ఏజెన్సీలో ఆదివాసీ స్వయంపాల‌న కోసం పోరాడాలి.

(నేడు లింగన్న 4వ వర్ధంతి)

వూకె రామకృష్ణ దొర

ఫ్రీలాన్స్ జర్నలిస్ట్

9866073866

Tags:    

Similar News