ప్రజల్లో మత మౌఢ్యం పోవాలి..
Religious ignorance should disappear among people..
ఛత్రపతి శివాజీ రాజు అయ్యుండి.. తనని అగ్ర వర్ణాలు హత్తుకోలేదు. కారణం... శివాజీని శూద్రుడుగా పరిగణించడమే... అగ్ర వర్ణాల అహంకారమో, శూద్రుల కంటే తమ శక్తి,యుక్తులు మెరుగ్గా ఉంటాయనే అధిక ఆలోచనో కావచ్చు అంత పెద్ద మరాఠా రాజు.. అందరినీ సమాన దృక్పథంతో చూసిన వాడు.. రాచరిక వ్యవస్థలో కూడా లౌకిక పాలకుడు అయ్యాడు. మొత్తానికి శివాజీ అగ్ర తాంబూలం అందుకోలేక పోయారు. నాటి నుంచి నేటిదాకా కింది వర్గాలపై సమాజం దృక్పథం మారకపోవడం విచారకరం.
“ఇది నా కాలే … ఇది కూడా నా కాలే .. నా కాలు మీద నేను కాలేసుకుంటే తప్పేంటి”. అనే డైలాగ్ అన్ని వయస్కుల్లో కొత్త జోష్ నింపింది. దీన్ని చాలా హస్యాస్పదంగా కొందరు భావిస్తే మరి కొందరు పంచ్ డైలాగ్ అదిరింది అనుకున్నారు. కాని నిజంగా ఆ డైలాగ్ అంత లైట్ తీసుకుని వదిలేసేది కాదు. మగధ రాజ్యం నుంచి మొదలు డొమినియన్ ఆఫ్ పాకిస్థాన్ అనే సుదీర్ఘ చరిత్ర వరకు, కిందివర్గాలకు కాలు మీద కాలేసుకునే స్వేచ్ఛ లేదని చరిత్రలోని రాచరిక వ్యవస్థలో ఆధారాలు స్పష్టం చేస్తున్నాయి. ఛత్రపతి అంటే పరమత సహనం, స్త్రీల పట్ల గౌరవం గుర్తుకొస్తుంది. అనేక మసీద్‌లు నిర్మించిన హిందూ పాలకుడు. భవానిదేవి భక్తుడైన శివాజీ తన రాజ్యంలో అన్ని మతాలను సమాన దృష్టితో చూసారని చరిత్ర సాక్ష్యం చెబుతుంది.
ప్రస్తుతం తరచిచూస్తే ఆనాటి రాజ్యాలు పోయాయి. బ్రిటిష్ పాలన పోయింది. ఇప్పుడు డా. బాబా సాహెబ్ అంబేద్కర్ రాసిన రాజ్యాంగాన్ని అమలు పరుచుకుంటున్న తరుణంలో కూడా అనేక గ్రామాల్లో దళిత, ఆదివాసీలు, శూద్రులందరూ, అవమానాలకు గురౌతూనే ఉన్నారు. వారి మాన, ప్రాణాలకు విలువ లేకుండా పోయింది. ఊంచ్.. నీంచ్ వ్యత్యాసం ఉంది. అది పోవాలి. మత మౌఢ్యం నుంచి మత సామరస్యం పెంపొందించబడాలి. శివాజీని ఆదర్శంగా తీసుకునే వారు ముందుగా ఛత్రపతి విధానాలను సంపూర్ణంగా తెలుసుకోవాలి. అర్ధం చేసుకోవాలి. దేశ ఐక్యత కోసం కృషి చేయాలి.
- ఖదీర్
87909 99423