ఒకప్పుడు వస్తు మార్పిడి ద్వారా వ్యాపారం జరుగుతుండేది. రానురాను వ్యాపార లావాదేవీల్లో మార్పులు వచ్చి చెల్లింపుల పద్ధతి ఉనికిలోకి వచ్చింది. దేశం అభివృద్ధి పథంలో పయనిస్తున్నప్పటికీ మొత్తంగా చూస్తే ప్రపంచీకరణ వినాశనానికి దారితీస్తోంది. అదే సమయంలో ఏ రంగంలోనైనా ప్రజాహిత సంస్కరణలు చేపట్టకపోతే దేశం ఉనికి కోల్పోతుంది. దేశానికి వెన్నెముక రైతు. వారు బాగుంటేనే ఆర్థిక చక్రం బాగుంటుంది. రైతులను ప్రోత్సహిస్తే అంత అందరి వ్యాపారాలు అంత సజావుగా సాగుతాయి. ప్రతి లావాదేవీలోనూ రైతు పాత్ర ఎంతో కొంత ఉంటుంది.
ఆగమ్యగోచరంగా దేశ భవిష్యత్
ఒకప్పుడు చేతిపనులకు, ఆదరణ లభించేది. అప్పటి పరిస్థితులు అలా ఉండేవి. ఇప్పుడు ప్రపంచీకరణ నేపథ్యంలో సులభంగా తయారు చేసే యంత్రాలు వచ్చినా క్వాలిటీ తగ్గింది. చేనేత కార్మికులు ఉపాధి కోల్పోయారు. 100 మంది చేసే పని ఒక్క యంత్రం చేస్తుంటే మిగతా వాళ్ల పరిస్థితి దారుణంగా ఉంటుంది. ఉపాధి కరువై కార్మికులు విలవిలలాడుతున్నారు. ఇక డిజిటల్ చెల్లింపులకు వస్తే అన్నీ మోసాలు, నిరక్షరాస్యులకు కష్టాలు. మెదడుకు పదును తగ్గింది. రెండు నాలుగులు ఎనిమిది అంటే కూడా కాలిక్యులేటర్ ఉపయోగించాల్సిన పరిస్థితి. ఎవరి చేతుల్లోనూ డబ్బు కనపడడం లేదు. ఇక కూలీల పరిస్థితి దారుణం. ఉపాధి పనులకు పోతున్నా ప్రభుత్వ చెల్లింపుల్లో అవకతవకలు ఉండటం, పనుల గుర్తింపులో లోపాలు ఉన్నాయి. ఉపాధి పనులను వ్యవసాయ పనులకు అనుసంధానిస్తే బాగుంటుంది. ఇక పాఠశాలల విషయానికి వస్తే ఒక ఉపాధ్యాయుడు, విద్యార్థి మధ్య సంబంధాలు లేకుండా పోతున్నాయి. డిజిటల్ తరగతుల పేరిట క్లాసులు పెడితే దానిలో చెప్పింది వినడమే తప్ప సందేహాలు తీర్చుకోవడానికి లేదు. ఇకపోతే, కార్పొరేట్ వ్యవస్థ సామాన్యుడి నడ్డి విరుస్తోంది. కూరగాయలు కూడా సూపర్ మార్కెట్‌లో పెడితే ఇక కూలీల పరిస్థితి ఏమిటి? ఇలా దేశ భవిష్యత్తు అగమ్యగోచరంగా తయారయ్యింది. ఇక వైద్య విషయానికి వస్తే సామాన్యునికి వైద్యం అందుబాటులో లేదు. కార్పొరేట్ వైద్యశాలలో సేవలు సామాన్యుడికి అందుబాటులో లేవు. శ్రామిక జీవనం కొనసాగించేలా వ్యవసాయంలో మార్పులు తీసుకుని వస్తే తప్ప, ఎవరికి వారే ఒంటరిగా బతకడం, కుటుంబ వ్యవస్థ చిన్నాభిన్నం కావడం జరిగి తీరుతుంది.
నాంపల్లి శ్రీనివాస్
సీనియర్ జర్నలిస్ట్
77940 56287