చైనా తైవాన్ మధ్య ఉద్రిక్త వాతావరణానికి కారణాలేంటి?

అమెరికా కాంగ్రెస్ దిగువ సభ స్పీకర్ నాన్సీ పెలోసీ తైవాన్ పర్యటన చైనాను తీవ్ర ఆగ్రహావేశాలకు గురిచేసింది. ఆంక్షలు, సైనిక విన్యాసాలు, క్షిపణుల

Update: 2022-08-09 18:45 GMT

సోవియట్ యూనియన్‌కు పోటీగా బీజింగ్‌ను దగ్గర చేసుకోవాలని అమెరికా అధ్యక్షుడు రిచర్డ్ నిక్సన్ 1972లో ఒకే చైనా విధానాన్ని ముందుకు తెచ్చారు. చైనాలో 1949 అంతర్యుద్ధంలో ఓడిపోయిన కొమింటాంగ్ పార్టీ సమీపంలోని ఫార్మోజా దీవి (నేటి తైవాన్)కు పారిపోయి రిపబ్లిక్ ఆఫ్ చైనా పేరుతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. చైనా ప్రధాన భూభాగంలో పీపుల్స్ రిపబ్లిక్ ఆఫ్ చైనాను కమ్యూనిస్టు పార్టీ స్థాపించింది. చైనా, తైవాన్ వేరుకావని, అవి ఒకే దేశమని కమ్యూనిస్టు పార్టీ చెబుతోంది. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా 15 రాజ్యాలే తైవాన్‌ను ప్రత్యేక దేశంగా గుర్తిస్తున్నాయి. ఒకే చైనా విధానాన్ని భారత్, అమెరికా సహా అత్యధిక దేశాలు ఆమోదిస్తున్నాయి. చైనా, తైవాన్ ఏకీకరణ బలప్రయోగంతో కాకుండా పరస్పర అంగీకారంతో జరగాలని అగ్రరాజ్యం స్పష్టం చేస్తోంది.

మెరికా కాంగ్రెస్ దిగువ సభ స్పీకర్ నాన్సీ పెలోసీ తైవాన్ పర్యటన చైనాను తీవ్ర ఆగ్రహావేశాలకు గురిచేసింది. ఆంక్షలు, సైనిక విన్యాసాలు, క్షిపణుల ప్రయోగంతో ఇప్పటికే ఆ ప్రాంతంలో ఉద్రిక్తతలకు కారణమైంది డ్రాగన్ ప్రభుత్వం. ఇది ఇంతటితో ఆగుతుందా? మూడో ప్రపంచ యుద్ధానికి దారితీస్తుందా? అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అమెరికా సెనేట్‌ స్పీకర్‌ నాన్సీ పెలోసీ తైవాన్‌ పర్యటన పెద్ద ప్రకంపనమే సృష్టించింది. ఎట్టకేలకు ఆమె తైవాన్‌లో అడుగుపెట్టారు. ఈ విషయం తెలుసుకున్న చైనా కస్సుమంటూ జరగబోయే ఏ పరిణామానికైనా అమెరికానే కారణమంటూ తన అక్కసును వెళ్లగక్కింది. ఈ నేపథ్యంలోనే తైవాన్‌‌పై చైనా కక్ష సాధింపు చర్యలు ప్రారంభించింది. అందులో భాగంగా తైవాన్‌ దిగుమతులపై నిషేధం విధించింది. చైనా వాణిజ్య మంత్రిత్వ శాఖ తైవాన్‌ సహజ సిద్ధ ఇసుకను నిషేధిస్తూ కారణాలను వెల్లడించకుండానే నోటీసులు జారీ చేసింది.

ఇలా తైవాన్‌ ఎగుమతులను చైనా నిషేధించడం తొలిసారి కాదు. మార్చి 2021లో తైవాన్‌ ఎగుమతి చేసే పైనాపిల్‌లో అధిక రసాయనాల అవశేషాలు ఉన్నాయంటూ నిషేధించింది. అదీగాక 2016 నుంచి తైవాన్‌ అధ్యక్షురాలిగా 'సాయ్‌ ఇంగ్‌ వెన్‌' పగ్గాలు చేపట్టినప్పటి నుంచి తైవాన్‌‌పై ఒత్తిడి పెంచింది చైనా. ఆమె తమ దేశాన్ని సార్వభౌమ దేశంగానూ, వన్‌ చైనాలో భాగంగా కాదు అన్నట్లుగా భావించడంతోనే చైనా ఈ సాధింపు చర్యలకు పాల్పడుతోంది. అయినా దాదాపు 23 మిలియన్ల జనాభా ఉన్న తైవాన్‌ ప్రజలు ఎప్పటికైన చైనా దండయాత్ర చేస్తుందన్న దీర్ఘకాలిక భయాలతోనే జీవిస్తున్నారు. ప్రస్తుత చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్‌ హయాంలో ఆ ముప్పు మరింత తీవ్రతరమైంది. దక్షిణ చైనా సముద్రంలో నాలుగు రోజులపాటు లైవ్‌ ఫైర్‌ డ్రిల్స్‌ పేరిట డ్రాగన్‌ చేసిన హడావుడి బెడిసికొట్టే ప్రమాదం ఉంది. ఇప్పటికే తైవాన్‌ ఆర్థిక వ్యస్థను ఉక్కిబిక్కిరి చేసేలా యుద్ధ విన్యాసాలను చేసినట్లు డ్రాగన్‌ సంబరపడుతోంది. భవిష్యత్తులో తరచూ నిర్వహిస్తామని కూడా చెబుతోంది. ఇప్పటికే చైనా ఆర్థిక వ్యవస్థ రియల్‌ ఎస్టేట్‌ సంక్షోభంతో ఉక్కిరిబిక్కిరి అవుతోంది. తాజాగా తైవాన్‌ జల సంధి సంక్షోభం కూడా తోడైతే అది చైనా ఆర్థిక వ్యవస్థపై భస్మాసుర హస్తం వలే పరిణమించే ప్రమాదం ఉందని నిపుణులు అంచనా వేస్తున్నారు.

ప్రమాదకరంగా షిప్పింగ్‌

తైవాన్‌ వద్ద డ్రాగన్‌ లైవ్‌ ఫైర్‌ డ్రిల్స్‌ చేపట్టింది. అంటే యుద్ధంలో వాడే నిజమైన ఆయుధాలతో యుద్ధవిన్యాసాలు చేయడమన్నమాట. అంటే ఆ మార్గంలో ప్రయాణించడం నౌకలకు మృత్యువుతో సమానం. ఈ క్రమంలో ఉత్తర ఆసియా నుంచి వచ్చే డజన్ల కొద్దీ నౌకలు గత కొన్ని రోజులుగా మార్గం మార్చుకోవడం గానీ, ప్రయాణాన్ని ఆలస్యం చేయడం గానీ చేస్తున్నాయి. తైవాన్‌, ఆ ద్వీపం తూర్పు మార్గంలో సాధారణంగా నిత్యం 240 నౌకలు వెళతాయి. ఈ క్రమంలో అవి మార్గం ముందు ప్రమాదం లేదని నిర్ధారించుకొన్న తర్వాతే కదలాల్సిన పరిస్థితి.

తైవాన్‌ను అడ్డుకోగానే సంబరం కాదు. చైనా శక్తి ప్రదర్శన నిర్వహించి తైవాన్‌ వాయు, సముద్ర మార్గాలను ఎంత తేలిగ్గా చుట్టుముట్టగలదో ప్రపంచానికి చూపించింది. అదే సమయంలో ఆ చర్యలు చైనా ఆర్థిక వ్యవస్థపై అంతే పెనుభారంగా మారతాయనే విషయాన్ని మర్చిపోయింది. వాస్తవానికి చైనా బ్లాకేడ్‌ను తైవాన్‌ జలసంధిలో అమెరికా నౌకలు సవాలు చేస్తే ఆ ప్రాంతంలో తీవ్ర ఉద్రిక్తత నెలకొంటుంది. ఆ మార్గంలో వ్యాపారాలు నిర్వహించే సంస్థలు, కంపెనీలకు ఫైనాన్స్‌ లభించడం నిలిచిపోతుంది. షిప్పింగ్‌కు అవసరమైన బీమా ధరలు పెరగడం గానీ, అసలు లభించకపోవడంగానీ చోటు చేసుకుంటాయి. తైవాన్‌ తూర్పు, పశ్చిమ ప్రాంతాలలో నెలకొనే ఉద్రిక్తతలు చైనా ఆర్థిక వ్యవస్థపై దారుణమైన ప్రభావం చూపిస్తాయి.

జలసంధి మీదనే ఆధారం

చైనా ప్రధాన నౌకాశ్రయాలైన షాంఘై, డాలియన్‌, తియాన్‌జిన్‌ ప్రధానంగా తైవాన్‌ సమీప జలాల నుంచి జరిగే వ్యాపారంపై ఆధారపడి ఉన్నాయి. తైవాన్‌ జలసంధిపైనే దక్షిణ కొరియా, జపాన్‌, చైనా ఆధారపడి ఉన్నాయి. దక్షిణ చైనా సముద్రం నుంచి అమెరికాకు వెళ్లడానికి ఇది ప్రధాన మార్గంగా ఉంది. ఆస్ట్రేలియా నుంచి ఉత్తర చైనాలోని ప్రధాన రేవులకు వెళ్లే ముడి ఇనుము తైవాన్‌ జలాలను దాటాల్సిందే. ఉక్రెయిన్‌లో యుద్ధం కొనసాగుతున్న సమయంలోనే అమెరికా కాంగ్రెస్ (పార్లమెంటు) దిగువ సభ స్పీకర్ నాన్సీ పెలోసీ తైవాన్‌ను సందర్శించడం సంచలనం సృష్టిస్తోంది. పెలోసీ యాత్రపై చైనా మండిపడటంతో మరో కొత్త యుద్ధం మొదలవుతుందా? అనే ఆందోళన వ్యక్తమవుతోంది. తైవాన్‌లో ఒక ఉన్నతస్థాయి అమెరికా ప్రతినిధి అధికారికంగా పర్యటించడం 25 ఏళ్ల తరవాత ఇదే తొలిసారి. పెలోసీ తైవాన్‌కు వస్తున్నారని తెలిసినప్పటి నుంచే ఆ ప్రయత్నం మానుకోవాలని చైనా డిమాండ్ చేసింది. తీరా ఆమె రానే వచ్చారు.

తైవాన్ తీరం చుట్టూ డ్రాగన్ సేనలు భారీ స్థాయిలో యుద్ధ విన్యాసాలు మొదలు పెట్టాయి. నిజానికి తైవాన్ చైనాలో అంతర్భాగమని మొదట అమెరికాయే ప్రకటించింది. దాన్నే 'ఒకే చైనా' విధానమంటారు. సోవియట్ యూనియన్‌కు పోటీగా బీజింగ్‌ను దగ్గర చేసుకోవాలని అమెరికా అధ్యక్షుడు రిచర్డ్ నిక్సన్ 1972లో ఒకే చైనా విధానాన్ని ముందుకు తెచ్చారు. చైనాలో 1949 అంతర్యుద్ధంలో ఓడిపోయిన కొమింటాంగ్ పార్టీ సమీపంలోని ఫార్మోజా దీవి (నేటి తైవాన్)కు పారిపోయి రిపబ్లిక్ ఆఫ్ చైనా పేరుతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. చైనా ప్రధాన భూభాగంలో పీపుల్స్ రిపబ్లిక్ ఆఫ్ చైనాను కమ్యూనిస్టు పార్టీ స్థాపించింది. చైనా, తైవాన్ వేరుకావని, అవి ఒకే దేశమని కమ్యూనిస్టు పార్టీ చెబుతోంది. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా 15 రాజ్యాలే తైవాన్‌ను ప్రత్యేక దేశంగా గుర్తిస్తున్నాయి. ఒకే చైనా విధానాన్ని భారత్, అమెరికా సహా అత్యధిక దేశాలు ఆమోదిస్తున్నాయి. చైనా, తైవాన్ ఏకీకరణ బలప్రయోగంతో కాకుండా పరస్పర అంగీకారంతో జరగాలని అగ్రరాజ్యం స్పష్టం చేస్తోంది.

ఇస్కా రాజేశ్‌బాబు

93973 99298

Tags:    

Similar News