అందుకే కేసీఆర్ రాష్ట్ర పార్టీని జాతీయ పార్టీగా మార్చారా?
కేసీఆర్ ఏది తలపెట్టినా హంగూ ఆర్భాటం భారీ ఎత్తున ఉంటాయి. దసరా రోజున ఆయన భారత్ రాష్ట్ర సమితిని ఏర్పాటు చేశారు. దీంతో కేసీఆర్ దేశ
కేసీఆర్ ఏది తలపెట్టినా హంగూ ఆర్భాటం భారీ ఎత్తున ఉంటాయి. దసరా రోజున ఆయన భారత్ రాష్ట్ర సమితిని ఏర్పాటు చేశారు. దీంతో కేసీఆర్ దేశ రాజకీయాలలో కీలక పాత్ర పోషించనున్నారని అర్థమవుతోంది. అయితే, కేసీఆర్ రాష్ట్రాన్ని విడిచి దేశ రాజకీయాలలో ఏం చేస్తారనేది సామాన్యులలో కలుగుతున్న సందేహం. రాష్ట్రంలోనే పరిస్థితి సరిగా లేని సమయంలో దేశ రాజకీయాలలోకి ప్రవేశించడం ఆ పార్టీ సామాన్య కార్యకర్తలకు కూడా అర్థం కావడం లేదు. 'కేసీఆర్ అనాలోచితంగా ఏదీ చేయరు. తనకు లాభం లేని పని ఏమీ చేయరు' అని పార్టీ కీలక నేతలు చెబుతున్నారు.
అందుకే సొంత పార్టీ
కేసీఆర్ స్వప్రయోజనాల కోసం ఏదైనా చేస్తారని గతంలో ఎన్నోసార్లు నిరూపించారు. టీఆర్ఎస్‌ను ఉద్యమ పార్టీగా ప్రారంభించి, అనంతరం ఫక్తు రాజకీయ పార్టీ అనడం, దళిత ముఖ్యమంత్రి అని ప్రకటించి, అందరి ప్రయోజనాల కోసం తానే ముఖ్యమంత్రి అయ్యాననడం, కేసీఆర్‌ను వాడుకుందాని కాంగ్రెస్ అనుకుంటే, కేసీఆరే కాంగ్రెస్‌ను వాడుకొని బలహీనపరచడం, రెండోసారి అసెంబ్లీ ఎన్నికల సమయంలో చంద్రబాబు సెంటిమెంట్ రగిల్చి అధికారంలోకి రావడం, కేంద్రంలో బీజేపీతో సరిగా ఉంటే చాలు రాష్ట్ర బీజేపీని పట్టించుకోనవసరం లేదనుకోవడం, రాష్ట్రంలో బలపడుతోందని ఇప్పుడు బీజేపీని టార్గెట్ చేయడం వంటివన్నీ ఈ కోవలోనివే. రాష్ట్ర బీజేపీను అదుపు చేయాలంటే కేంద్రంలోని బీజేపీను చికాకు పెట్టక తప్పదనే ఉద్దేశ్యంతోనే కేసీఆర్ జాతీయ రాజకీయాల వైపు దృష్టి సారించారు.
కూటమి ఏర్పాటు చేయాలనుకున్నారు. రాష్ట్రపతి, ఉప రాష్ట్రపతి ఎన్నికల సమయంలో సఖ్యత కొరవడి కేసీఆర్ ఆశించిన మేరకు జాతీయస్థాయిలో ప్రాధాన్యం లభించలేదు. దీంతో నూతన పార్టీ అంకానికి తెర తీశారు. ప్రస్తుత పరిస్థితులలో దేశ రాజకీయాలలో రాణించాలంటే, కూటమి అత్యవసరం. కాంగ్రెస్ లేకుండా అది సాధ్యపడదు. కాంగ్రెస్ కేసీఆర్‌ను విశ్వసించదు. తెలంగాణలో కేసీఆర్ 17 లోక్‌సభ స్థానాలు గెలిచినా దేశంలో బీజేపీని ఎదుర్కోలేరు. ఆంధ్రప్రదేశ్‌లోనూ ఆయనను నమ్మే పరిస్థితి లేదు. తెలుగువారు ఎక్కువగా ఉండే కర్ణాటక, మహారాష్ట్రలో పోటీ చేయాలనుకున్నా బీఆర్ఎస్‌కు సీట్లు వస్తాయని చెప్పలేం. గుజరాత్‌లో అభ్యర్థులు దొరకడం కష్టమే. ఈ పరిస్థితులలో దేశ రాజకీయాలలో రాణించడం 'నేల విడిచి సాము' చేయడమే.
Also read: కేసీఆర్ జాతీయ పార్టీని విమర్శించిన వారికి ఇవే సమాధానాలు!
ఆ పాచికలు పారితేనే
తెలంగాణ మోడల్‌ను దేశ వ్యాప్తంగా అమలు చేస్తామంటున్నారు. రాష్ట్రంలో ఎన్నో హామీలు ఇప్పటికీ మిగిలే ఉన్నాయి. ఎన్నో పథకాలు రాష్ట్రంలోనే సరిగా అమలు చేయని కేసీఆర్ దేశవ్యాప్తంగా తెలంగాణ మోడల్ ఎలా అమలు చేస్తారు? రైతుల సంక్షేమం అంటున్నారు. రాష్ట్రంలో రైతుల ఆత్మహత్యలు కొనసాగుతున్నాయి. బీఆర్ఎస్ ప్రకటన కార్యకర్తల హడావుడే. జేడీఎస్ మినహా ఇతర పార్టీల నుంచి కనీసం అభినందనలు కూడా రాలేదు. ఇప్పటికే ఒకటికి మించి రాష్ట్రాలలో పోటీ చేసిన తృణముల్, ఆప్, బీఎస్‌పీ, ఎస్‌పీ, జేడీయూ, టీడీపీ, వైఆర్‌ఎస్‌పీ వంటి పార్టీలు కూడా పూర్తి గుర్తింపు పొందలేకపోయాయి. కేసీఆర్ పార్టీ వచ్చే ఆరు నెలలలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న హిమాచల్‌ప్రదేశ్, గుజరాత్, రాజస్థాన్, మధ్యప్రదేశ్, కర్ణాటక రాష్ట్రాలలో పోటీ చేయకపోతే అది వారి ఉనికికే ప్రమాదం.
నిజానికి రాష్ట్రంలోనే కేసీఆర్ మరోసారి పాచికలు పారితేనే గెలుస్తారు. బీఆర్ఎస్ ప్రభావంతో తెలంగాణలో వచ్చే అదనపు ప్రయోజనం ఏమీ లేదు. ఉద్యమ కాలంలో టీఆర్ఎస్ అంటే తెలంగాణ అనే విధంగా నాటుకుపోయింది కాబట్టి అధికారంలోకి రావడానికి దోహదపడింది. రెండోసారి కూడా సెంటిమెంట్ ఎంతో కొంత పనికొచ్చింది. ఇప్పుడా పరిస్థితి లేదు. ఇప్పటికే కేటీఆర్‌ను సీఎం చేయడానికే జాతీయ పార్టీ నిర్ణయం తీసుకున్నారనే విమర్శలు ఉన్నాయి. బీజేపీ నుంచి ఎదురవుతున్న సవాలును ఎదుర్కొవడం అంత తేలిక కాదని ఊహించిన కేసీఆర్ బీఆర్ఎస్ ఏర్పాటుకు పూనుకున్నారనే విమర్శ సైతం ఉంది. మునుగోడు ఉపఎన్నికలో టీఆర్ఎస్ విజయం సాధిస్తే బీజేపీను నిలవరించే అవకాశం ఉంది. లేకపోతే రాష్ట్రంలో గెలవడానికే చాలా శ్రమించాల్సి ఉంటుంది. అప్పుడు దేశ రాజకీయాలపై దృష్టి పెట్టే అవకాశాలు ఉండవు.
Also read: బీఆర్ఎస్ కు జాతీయ పార్టీ హోదా శాశ్వతమేనా?
ఐవీ మురళీకృష్ణ శర్మ,
పీపుల్స్ పల్స్ రీసెర్చ్ సంస్థ
99493 72280