నాన్నా.. నన్ను క్షమించు..

మేము నలుగురం పిల్లలం.. అక్క, నేను, తమ్ముడు, చెల్లి.. అమ్మ గృహిణి.. రైల్వే ఎంప్లాయి కావడంతో మేము కోరినవన్నీ కొనిచ్చేందుకు ముందుండేవాడు మా నాన్న

Update: 2023-04-07 18:45 GMT

మేము నలుగురం పిల్లలం.. అక్క, నేను, తమ్ముడు, చెల్లి.. అమ్మ గృహిణి.. రైల్వే ఎంప్లాయి కావడంతో మేము కోరినవన్నీ కొనిచ్చేందుకు ముందుండేవాడు మా నాన్న. మా ఊరిలో అమ్మాయిలకు చదువు ఎందుకనే టైమ్‌లోనే మమ్మల్ని పీజీలు చదివించాడు. మాకు వచ్చిన మార్కులు చూసి మురిసిపోయాడు. మా సక్సెస్‌ను ఆయన సెలబ్రేట్ చేసుకున్నాడు. ఊరంతా గొప్పగా చెప్పుకున్నాడు. అయిన వాళ్లందరినీ పిలిచి చిన్నపాటి ఉత్సవమే చేశాడు. మొత్తానికి నాన్న రిటైర్మెంట్ అయ్యేసరికి అక్కకు, నాకు పెళ్లి చేశాడు. ప్రస్తుతం చెల్లికి మ్యారేజ్ చేసి ఆడపిల్లల బాధ్యత బరువును దించుకునే ప్రయత్నంలో ఉన్నాడు.

ఈ మధ్యలో అక్క డిగ్రీ లెక్చరర్ అయింది. నేను ఓ స్క్రిప్ట్ రైటర్‌గా కెరీర్‌లో స్థిరపడిపోతే.. చెల్లి ఏకంగా డాక్టర్ అయిపోయి.. మాకే కాదు మా చుట్టు పక్క ఊళ్లలో అందరికీ ఆదర్శంగా నిలుస్తోంది. ఇక తమ్ముడు షార్ట్ ఫిల్మ్స్ చేశాడు. ప్రస్తుతం గ్రూప్స్‌కు ప్రిపేర్ అవుతున్నాడు. ఈ క్వాలిఫికేషన్స్ ఎందుకు చెప్తున్నానంటే.. మా నాన్న ఎన్ని త్యాగాలు చేస్తే మాకు ఇంత గొప్ప లైఫ్ లభించిందో మీరు ఒక ఫ్లాష్ బ్యాక్ వేసుకుంటారని.. ఓ ఇమాజినేషన్‌లోకి వెళ్తారని. ఎన్ని కోరికలను అణిచివేసుకుంటే మా డ్రీమ్స్ ఫుల్ ఫిల్ అయ్యాయో అర్థం చేసుకుంటారని. కానీ ప్రజెంట్ సీన్ రివర్స్ అయింది. ఇప్పుడు మేం పెద్దోళ్లం కదా. చిన్నప్పుడు హీరోగా కనిపించిన నాన్న ఇప్పుడు జీరోగా కనిపిస్తున్నాడు. ఏది అడిగినా క్షణాల్లో మా ముందు ఉంచిన నాన్న.. రీచార్జ్ చేయ్ బిడ్డా అని అడిగితే డబ్బులు లేవనే స్థితికి వచ్చేశాం. ఏంటి ఈ నాన్న ఎప్పుడు మనీ అడుగుతాడు అని నలుగురం ముచ్చట్లు వేసుకునీ మరి తిట్టుకుంటున్నాం. అమ్మ ఇవన్నీ విన్నా సైలెంట్‌గానే ఉండిపోతుంది. అయితే ఈ గ్యాప్‌లో నాన్న మారాడా? లేక మేము మారామా? అంటే.. ఈ ప్రశ్నకు జవాబు ‘రంగమార్తాండ’ సినిమా చూశాక దొరికింది.

నాన్న నిజంగానే తప్పు చేశాడు. ఒక్క రూపాయి దాచుకోకుండా మా కోసం ఇష్టమొచ్చినట్లు ఖర్చు చేయడం నిజంగా నాన్న తప్పే. అమ్మకు తాళిబొట్టు చేయిస్తానని దాచిపెట్టిన డబ్బు నాకు ల్యాప్ టాప్ కొనిచ్చి నాన్న నిజంగానే పెద్ద తప్పు చేశాడు. ఈ సారైనా కాస్త భూమిని కొంటానని పెట్టుకున్న డబ్బును.. అక్క ఫ్రెండ్స్ అందరూ కాస్త రిచ్‌గా ఉండటం చూసి, మాకేందుకులే బిడ్డ కాలేజీకి పోతుందిగా గోల్డ్ చైన్ కొనిద్దామని ఆయన చేసిన త్యాగం పెద్ద తప్పే. ఒకేసారి నలుగురికి ఫీజులు కట్టేంత స్థోమత లేకపోయినా సరే అప్పులు తెచ్చి మరీ చదివించి తప్పు చేశాడు. ఇది చేయి.. ఇది చేయొద్దు.. ఇది చదువు.. ఇదే చదువు.. అని వారించకుండా పెద్ద తప్పే చేశాడు. నీకు ఇష్టమైన కెరీర్ ఎంచుకోమ్మా.. నేను ఉన్నా కదా.. డబ్బు గురించి భయపడొద్దు అని భరోసా ఇచ్చి ఘోరమైన తప్పు చేశాడు. అందుకే నా పెళ్లి అయ్యాక పండుగకు డబ్బులు లేవు బిడ్డా ఐదు వేలు అప్పు ఇవ్వు అని నన్ను అడిగితే.. నేను ఏం చెప్పానో తెలుసా? ఏంది నాన్న ఇంటికి వచ్చిన ప్రతీసారి పైసలు అడుగుతవ్... అని ఎందుకు చేతకాని వాడి వైపు చూసినట్లు ఓ లుక్ ఇచ్చా. ఆ లుక్ ‘రంగమార్తాండ’ చూశాక గుర్తొచ్చింది. సిగ్గుపడి కుమిలి కుమిలి ఏడ్చేలా చేసింది.

ఇక నా ఫ్రెండ్స్ గురించి ఇక్కడ ప్రత్యేకంగా చెప్పాలి. హైదరాబాద్‌లో హాస్టల్‌లో చేర్పించేటప్పుడు మా నాన్న నా కన్నా ఎక్కువ భయపడ్డాడు. కానీ కొద్ది రోజులకే హమ్మయ్యా నా బిడ్డకు ఇక ఢోకా లేదు, హ్యాపీగా ఉంటుంది అనే నమ్మకానికి వచ్చాడు. కారణం నా దోస్తులు మహి, నవ్వి. నేను నవ్వితే వాళ్లు నవ్వారు. నేను ఏడిస్తే ఓదార్చారు. నేను తప్పు చేస్తే సరిదిద్దారు. నేను డౌన్ అయినప్పుడు పవర్ బూస్టర్స్‌గా పనిచేశారు. ఒక్కమాటలో చెప్పాలంటే వీళ్ల వల్లనే లైఫ్ అంటే ఏంటో.. ఫ్రెండ్ షిప్ వాల్యూ ఏంటో తెలిసొచ్చింది. అంతకు ముందు వరకు ఎమోషనల్‌ ఫూల్‌గా బతికిన నేను.. వీళ్ల దోస్తానీతో ఎమోషనల్ బ్యాలెన్స్‌డ్ పర్సన్‌గా ఎదిగాను. అప్పటి వరకు నాన్న కూచీగానే ఇంట్రోవర్ట్‌గా ఉన్న నేను.. ఆ తర్వాత ఫీలింగ్స్‌ ఎక్స్‌ప్రెస్ చేయడం స్టార్ట్ చేశా. ఎదుటివాళ్లు తప్పు చేస్తే తప్పు అని చెప్పేయడం ప్రారంభించా. నా అక్కాచెల్లెళ్లు, తమ్ముడితో అప్పుడప్పుడు గొడవ పడ్డానేమో కానీ అసలు వీళ్లిద్దరితో మాత్రం నాకెప్పుడూ ఎక్కడా కనీసం హర్ట్ అయిన ఫీలింగ్ కూడా రాలేదు. కారణం వాళ్ల మెచ్యూరిటీ, లైఫ్‌ను చూస్తున్న కోణం.

మనస్పర్థలు వస్తే.. మా మనసులే మాట్లాడుకుని.. ఓకే అయిపోయాం అనుకుంటా. ‘రంగమార్తాండ’లో బ్రహ్మానందం, ప్రకాశ్ రాజ్ ఫ్రెండ్‌షిప్ చూస్తున్నప్పుడు వీళ్లిద్దరు నా కళ్ల ముందు ప్రత్యక్షమయ్యారు. ఇందులో కూడా ఈ ఇద్దరు దోస్తులు మాలాగే మనసులతో మాట్లాడుకున్నారు. అయితే జీవితమంతా పక్కనే ఉంటూ కష్టసుఖాలు, జయాపజయాల్లో పాలుపంచుకున్న వ్యక్తిని.. భార్య పోయి పుట్టెడు దు:ఖంలో ఒంటరిగా పడి ఉన్నప్పుడు.. తన స్నేహితుడు పట్టించుకోకపోయినా సరే ఓ చెంపదెబ్బ కొట్టి అతని తప్పును తెలియజెప్పాడే కానీ కష్టాల్లో తోడులేని నువ్వెందుకురా నాకు అని దూరం పెట్టలేదు. అలాగని చెంపదెబ్బ కొట్టాడు కదా అని ఈ దోస్త్ కూడా ఫీల్ కాలేదు.. అతను చేసింది తప్పే అని తెలుసుకున్నాడు కాబట్టి కన్నీటితో ఆ తప్పును కడిగేసుకున్నాడు. ఫ్రెండ్‌ను అక్కున చేర్చుకున్నాడు. కర్ణుడు, దుర్యోధనుడి స్నేహం గురించి వినడమే కానీ.. మహాభారతంలో కూడా మిస్ అయిన ఆ దోస్తానీని వెండితెరపై ఆవిష్కరించి, వాహ్ అనిపించాడు డైరెక్టర్ కృష్ణవంశీ.

ఒక కళాకారుడు స్టేజ్‌పైకి వెళ్తే అందులో జీవించేస్తాడు. ఆ వేదికను దిగితే నిజ జీవితంలో జీవించేందుకు భయపడతాడు. ఆ పాత్రలోనే జీవిస్తే బాగుండేది.. ఈ జీవితం ఎందుకురా నాయనా అనే స్థితికి వచ్చేస్తాడు. ఒక ఆర్టిస్టు మనకు కనిపించేంత హ్యాపీగా ఉండడు, ఆయనను పీక్కు తినేందుకు మనలాంటి కూతురు, కొడుకు, అల్లుడు, కోడళ్లు చుట్టూ తిరుగుతూనే ఉంటారు. అందుకే ఆయన ప్రేక్షకుల మనిషి. ప్రేక్షకుల చప్పట్లలో సంతోషాన్ని వెతుక్కునే సాదాసీదా మనిషి అనేదే ఈ ‘రంగమార్తాండ’ కథ.

నన్ను క్షమించు.. నాన్నా..

- ‘రంగమార్తాండ’లో నీ కథ చూశా..

- నీ కోసమే ఈ సమీక్ష రాశా..

- సినిమా చూశాక అందరిలోనూ ఈ భావనే

- తప్పు తెలుసుకునేందుకు తప్పకుండా చూడాల్సిన మూవీ

- కళావతి

Tags:    

Similar News