ఓటు రూపం దాల్చిన ‘అక్షింతలు’

Ramalaya Akshintalu became votes for BJP..

Update: 2024-06-05 00:30 GMT

గతంలో ఎన్నడూ లేని రీతిలో భారతీయ జనతా పార్టీ తెలంగాణలో బలపడింది. మొన్న జరిగిన అసెంబ్లీ ఎన్నికల సమయంలో... పట్టణ ప్రాంతాలకు మాత్రమే పరిమితంగా కనిపించిన ఓటర్లు ఈసారి గ్రామీణ ప్రాంతాల్లోనూ ఆ పార్టీ వైపు మొగ్గు చూపారు. దీనికి ప్రధాన కారణం అయోధ్య రామ జన్మభూమిలో బాలరాముని ప్రతిష్టాపన కార్యక్రమం సందర్భంగా జరిగిన అక్షింతల పంపిణీ కార్యక్రమం అని స్పష్టం అవుతున్నది. ఎన్నికల ఫలితాల సందర్భంగా ఓటరు బీజేపీ వైపు మొగ్గడానికి కారణం ఫలితాల్లో స్పష్టంగా కనిపించింది. అక్షింతల పంపిణీ కార్యక్రమం స్వయంగా నరేంద్ర మోడీ నేతృత్వంలోనే జరుగుతున్నదన్న ప్రచారాన్ని బీజేపీ బలంగా ప్రజల్లోకి తీసుకువెళ్లింది ఈ కార్యక్రమం ముఖ్యంగా మహిళలు, యువతలో బలంగా నాటుకుంది. ఈ ప్రచారం కాస్త ఎన్నికల సమయం నాటికి ఓటు రూపంలోకి మారింది.

ఇంటింటికి అక్షింతలు...

జనవరి 22వ తేదీన అయోధ్యలో ప్రధాని నరేంద్ర మోడీ చేతుల మీదుగా ప్రాణప్రతిష్ట జరిగిన బాలరాముని విగ్రహ ప్రతిష్ట ఉత్సవం భారతీయ జనతా పార్టీకి బాగా కలిసి వచ్చింది. పార్లమెంట్ ఎన్నికల సందర్భంగా బాల రాముడి ప్రతిష్ట ఉత్సవాన్ని బీజేపీ ఓటు ఆయుధంగా మలుచుకుంది. అయోధ్య నుంచి పంపినట్లుగా చెబుతున్న అక్షింతలు ప్రధాన నగరాలు, పట్టణాలతో పాటు గ్రామాలకు కూడా చేరాయి. ఈ అక్షింతల పంపిణీ కార్యక్రమం వెనుక బీజేపీ, సంఘ్ పరివార్, ఆర్ఎస్ఎస్, భజరంగదళ్, విశ్వహిందూ పరిషత్ లాంటి సంస్థలు ఉండి ఇంటింటికీ పంపిణీ చేశాయి. ఇదే ఇప్పుడు ఆదిలాబాద్ పార్లమెంటు సహా తెలంగాణలో 8 స్థానాల్లో బీజేపీ ఆదిక్యత చూపడానికి కారణంగా చెబుతున్నారు. ఉత్తర తెలంగాణ జిల్లాలపై ఈ ప్రభావం బలంగా చూపింది. అయితే కాంగ్రెస్ మూలాలతో పాటు ఆయా పార్లమెంటు నియోజకవర్గం పరిధిలో కాంగ్రెస్ శాసనసభ్యుల ప్రాతినిధ్యం ఉన్నచోట మాత్రం ఆ పార్టీ అభ్యర్థులే విజయం సాధించారు. ఏదేమైనా గత అసెంబ్లీ ఎన్నికలతో పోలిస్తే పార్లమెంట్ ఎన్నికల ఫలితాలు భవిష్యత్ రాజకీయాలకు సంబంధించి తెలంగాణలో కమలం పార్టీకి కొండంత బలం చేకూర్చి పెట్టింది.

- శారదా కృష్ణ మోహన్,

సీనియర్ జర్నలిస్ట్

94404 43554

Tags:    

Similar News