రాహుల్ అనర్హతతో నేతల్లో మార్పువచ్చేనా?
రాహుల్ అనర్హతతో నేతల్లో మార్పువచ్చేనా?... Rahul's disqualification will change the leaders
పరువు నష్టం కేసులో రాహుల్ గాంధీకి రెండేళ్ల జైలు శిక్ష పడింది. తర్వాతి రోజే లోక్‌సభ నుండి అనర్హత వేటు వేయడం జరిగిపోయింది. 2019 ఎన్నికల ప్రచారంలో ఆయన మోడీని గుర్తుచేసేలా అన్యాపదేశంగా ' దేశంలో దొంగల పేర్లు మోడీగా ఉంటాయి ఎందుకో' అంటూ వ్యాఖ్య చేశారు.. దీనికి నీరవ్ మోడీ, లలిత్ మోడీ ఉదంతాల్ని ఎత్తిచూపారు. ఆయన మాటలు నూటికి నూరు శాతం తప్పు. ఒకరి ఇంటి పేరుని అవహేళన చేయడమే కాక ప్రధానిని కూడా తప్పుగా చిత్రీకరించడమే. అందుకు గానూ మోడీ ఇంటిపేరు గల ఒకరు వేసిన పరువు నష్టం కేసులో సూరత్ కోర్టు ఈ విధంగా తీర్పునిచ్చింది. అయితే ఆయన పార్లమెంటు సభ్యుడు కనుక సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం ఎవరైనా చట్టసభలలోని సభ్యుడు రెండేళ్ల జైలు శిక్షకు గురైతే వెనువెంటనే సదరు సభ్యత్వాన్ని కోల్పోతాడు. ఇంతకు ముందు అనర్హతపై ఆరు మాసాల వరకూ వేటు పడకుండా విండో పీరియడ్ ఉండేది.పై కోర్టుకు వెళ్ళడానికి,స్టే తెచ్చుకోడానికి బోలెడు అవకాశం ఉండేది. ఇప్పుడలా లేదు. వెంటనే అమల్లోకి వస్తుంది. ఈ లోగా పై కోర్టు నుండి స్టే తెచ్చుకొంటే పరవాలేదు. పై కోర్టు క్రింది కోర్టు తీర్పుపై అభ్యంతరం చెప్పకపోతే అనర్హత తప్పదు.
అయితే, ఇప్పుడు ఈ అనర్హత, జైలు శిక్ష రాజకీయ వేడి తప్పా పెద్ద సంచలనాలు ఏవీ ఉండకపోవచ్చు. కానీ ఈ తీర్పుతో నేతల ప్రసంగాల శైలిలో కొంత సంస్కరణ వస్తే మేలు. సరైన ఆధారాలు లేకపోయినా, ఎంత అన్యాయంగా మాట్లాడుతున్నామన్న స్పృహ లేకుండా ఏది పడితే అది మాట్లాడటం నేటి ఫ్యాషన్ గా మారింది. ఎదుటి వారిని దూషించడం తద్వారా ప్రచారం పొందడమే ముఖ్యమైపోయింది. సామాజిక మాధ్యమాల యుగంలో బాధ్యతాయుత స్థానాల్లో ఉన్నవారు కూడా వేదికలతో సంబంధం లేకుండా సందర్భంతో పనిలేకుండా విచ్చలవిడిగా ఎదుటివారిని అవమానపరుస్తున్నారు. గౌరవంగా జీవించడం, గౌరవాన్ని కాపాడుకోవడం పౌరుని హక్కు. పరువు నష్టం కలిగినప్పుడు న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తే, నేరం రుజువైతే, తప్పు చేసినవాడికి గరిష్టంగా రెండేళ్ల వరకూ సాధారణ జైలు శిక్ష,పెనాల్టీ పడుతుంది. పార్లమెంట్ సభ్యుడికి రెండేళ్ల మించి జైలు శిక్ష పడితే సభ్యత్వం వదులుకోవాలి. ఒక సందేశంలా ఉంటుందని భావించి న్యాయస్థానం ఈ కేసులో గరిష్ఠంగా శిక్షని ప్రకటించింది అని భావించవచ్చు. ఏది ఏమైనా నేతలకు ప్రత్యర్థుల్ని గౌరవించే సంస్కృతి అలవడాలి. ప్రచార లాభం కోసం పరువు నష్టం చేయడానికి వెనుకాడకపోవడం సమాజానికి మంచిది కాదు.
- డా. డి.వి.జి.శంకర రావు
94408 36931