రాహుల్, హోదాకు తగ్గట్టు ప్రవర్తించండి!
రాష్ట్రీయ స్వయం సేవక సంఘాన్ని అనవసరంగా, అసందర్భంగా దూషించడం రాహుల్ గాంధీకి ఒక రాజకీయ వైచిత్రిగా మారింది. ఈ సంస్థపై అవాకులు
రాష్ట్రీయ స్వయం సేవక సంఘాన్ని అనవసరంగా, అసందర్భంగా దూషించడం రాహుల్ గాంధీకి ఒక రాజకీయ వైచిత్రిగా మారింది. ఈ సంస్థపై అవాకులు చవాకులు పేలడం ఆయన దినచర్యలో భాగంగా మారిందంటే అతిశయోక్తి కాదేమో! స్వదేశంలోనూ, విదేశాలలో ఆ సంస్థను ఆడిపోసుకోవడం తనకుండే టాలెంట్‌గా ఆయన అనుకుంటున్నారేమో! అమెరికా పర్యటనలో ఉన్న ఆయన ఆ సంస్థపై అనవసర విమర్శలు గుప్పించిన విషయం ప్రపంచ రాజకీయ విశ్లేషకులను దిగ్భ్రాంతికి గురిచేసింది. ఆర్ఎస్ఎస్ గురించి, దేశం పట్ల, సమాజం పట్ల ఆ సంస్థకు ఉండే నిబద్ధత గురించి ప్రపంచ రాజకీయ నాయకులకు బాగా తెలుసు. గతంలో ఈ సంస్థను ఇస్లామిక్ తీవ్రవాద సంస్థ అయిన 'సిమీ'తో పోల్చి దేశ ప్రజల ముందు తలదించుకోవలసిన పరిస్థితి తెచ్చుకున్నారు.
పది సంవత్సరాలు ప్రతిపక్ష హోదా లేక చతికిలబడి, మూడో పర్యాయం మిత్రపక్షాల సహాయంతో 99 సీట్లు గెలిచి, ప్రతిపక్ష హోదాను పొందిన వెంటనే బీజేపీనీ, దాని మాతృ సంస్థ రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘాన్నీ విచక్షణ కోల్పోయి దూషించడం రాహుల్ గాంధీ హోదాకు తగినది కాదు. 1952 నుంచి ప్రతిపక్ష పాత్రను హుందాగా నిర్వహిస్తూ వచ్చిన బీజేపీ (1980 వరకు జనసంఘ్ పేరుతో) నుండి ఆయన స్ఫూర్తి పొందవలసిన అవసరం ఉంది. రాహుల్ గాంధీని ఈ దేశ అధినేతగా చూడాలని ఉత్సాహం చూపించే ఓటర్లను తృప్తి పరచడం కోసమైనా ఆయన హుందాగా ప్రవర్తించవలసిన అవసరం ఎంతైనా ఉంది.
హిందూ ఓటు పోలరైజ్ కావడం వల్లే..
ఇక రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘాన్ని తిట్టడానికి ముస్లింలు, క్రైస్తవులు, కమ్యూనిస్టులు పోటీ పడుతుంటారు. ఈ దేశానికి గొప్ప సంస్కృతి, చారిత్రిక వైభ వం, ఆధ్యాత్మిక పరంపర ఉందని, ఈ దేశాన్ని విశ్వ గురు స్థానంలో నిలపాలని పరిశ్రమించే రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘం ఆలోచన విధానాన్ని పైన తెలి పిన మూడు వర్గాలు వ్యతిరేకిస్తూనే ఉంటాయి. దేశం లో ఈ సంఘం ప్రభావాన్ని నిలువరించి, దాని రాజకీయ క్షేత్రమైన బీజేపీ దూకుడును ఎదుర్కోవడానికి ముస్లింలు, క్రైస్తవులు, కమ్యూనిస్టులు, హిందూ సంస్కృతికి వ్యతిరేకంగా పనిచేసే విదేశీ ఎన్జీవో ప్రతినిధులు శక్తివంచన లేకుండా పనిచేస్తున్నారు. వీరందరికీ రాహుల్ గాంధీ ఒక ఆశాకిరణంగా మారారు. ఆర్ఎస్ఎస్, బీజేపీలను దుమ్మెత్తిపోస్తూ, దూషించడంతో హిందువులు సంఘటిత శక్తిగా మారి, హిందూ ఓటు పోలరైజ్ కావడం వల్లనే కాంగ్రెస్ అటు కేంద్రంలో, అనేక రాష్ట్రాల్లో తుడిచిపెట్టుకుపోయిందనీ, దాని స్థానంలో బీజేపీ అధికారంలోకి వచ్చిందనే విషయం రాహుల్ గాంధీ గ్రహించకపోవడం ఆయన మూర్ఖత్వానికి పరాకాష్ట!
ఎందుకింత ద్వేషం?
ఆర్ఎస్ఎస్‌పై రాహుల్ గాంధీ విచక్షణారహితంగా ద్వేషం వెళ్లగక్కడానికి చాలా కారణాలు ఉన్నాయి. ఆయన క్రిస్టియన్ వారసత్వానికి చెందినవారు కావడం మొదటి కారణం కాగా, కులాల వారిగా ఉండే హిందువులను ఆర్ఎస్ఎస్ ఒక సంఘటితశక్తిగా మలచడం, దాని రాజకీయ క్షేత్రమైన బీజేపీని అధికారంలో ఉంచి, దేశంలో జాతీయవాద భావాలను ప్రాచుర్యంలోకి తేవడం రెండవ కారణం. ఇక తన తల్లి సోనియా గాంధీ ప్రధాని కాకపోవడానికి ప్రధాన కారణం ఆర్ఎస్ఎస్ అని, ఆయన భావించడం, హిందూ సమాజానికి కాంగ్రెస్ పార్టీ చేసిన ద్రోహాన్ని ఆ సంస్థ దేశ ప్రజలకు వివరించి, హిందువుల్లో కాంగ్రెస్ పట్ల వ్యతిరేక భావాన్ని నిర్మాణం చేయడమూ మరొక కారణం.
దూషిస్తూ పోతే గల్లంతు కాక తప్పదు!
ఇక ఈ దేశంలో హిందుత్వం కోసం, హిందూ సంస్కృ తి కోసం ఎవరు కృషి చేసినా, వారిని దూషించడం ఒక ఆనవాయితీగా, అది ఒక ప్రత్యేక లౌకికవాదంగా హిందూ వ్యతిరేక హిందూ రాజకీయ నాయకులు భావించడం పొరపాటు. హిందుత్వాన్ని దూషిస్తే ముస్లింలు, క్రైస్తవులు గుండుగుత్తగా ఓట్లు వేస్తారనే తప్పుడు భావనలను ఈ దేశ నాయకులు తమ మెదళ్లలోకి ఎక్కించుకోవడం ఈ దేశానికి పెద్ద ప్రమాదం తెచ్చిపెట్టే విషయం. అసెంబ్లీలలో పాకిస్తాన్ జిందా బాద్ అనే నినాదాలు చేస్తున్నా, జిహాదీ ఉగ్రవాద భావాలతో వీడియోలు చేసి, సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నా, లౌకికవాద ముసుగు వేసుకున్న రాజకీయ నాయకులు గోడమీద పిల్లుల్లా ప్రవర్తించడం ఈ దేశ ప్రజాస్వామ్యానికి తీవ్రస్థాయిలో నష్టాన్ని కలిగిస్తుంది. మైనారిటీ ఓట్ల కోసం ఈ దేశ ఉత్థాన పతనాలతో బలంగా పెనవేసుకున్న హిందువులను, వారికోసం పనిచేసే ఆర్ఎస్ఎస్‌ను అనవసరంగా దూషిస్తే ఈ దేశంలోఏ రాజకీయ పార్టీ అయి నా గల్లంతు కావాల్సిందే!
- ఉల్లి బాల రంగయ్య,
సామాజిక, రాజకీయ విశ్లేషకులు.
94417 37877