జాతి హననం

గత నెలరోజులుగా పాలస్తీనాలోని ఉత్తర గాజా నుండి దక్షిణ గాజాకు పయనమై రఫా నగరానికి చేరుకున్న వారిపై విమాన దాడులు కొనసాగుతూనే ఉన్నాయి.

Update: 2024-06-19 00:00 GMT

చివరి క్షణం వరకు మాతృభూమిని వదులుకోం...‍!

గత నెలరోజులుగా పాలస్తీనాలోని ఉత్తర గాజా నుండి దక్షిణ గాజాకు పయనమై రఫా నగరానికి చేరుకున్న వారిపై విమాన దాడులు కొనసాగుతూనే ఉన్నాయి. నిజానికి, రఫా నగరం జనాభా కేవలం లక్షా యాభై వేలు, కానీ దాడుల భయానికి ఉత్తర దక్షిణ గాజా ప్రాంతం నుండి వచ్చి స్థిరపడిన వారి సంఖ్య పదిరెట్లు అంటే పదిహేను లక్షల వరకు చేరింది. వీరికి ఆహారం రావడం లేదు, మానవతా దృక్పథంతో ఇతర దేశాల వారు పంపిన ఆహారాన్ని రాకుండా అన్ని వైపుల నుండి దిగ్బంధం చేశారు. రఫా నగరాన్ని వదిలి వెళ్లమంటూ యూదులు బెదిరిస్తూనే ఉన్నారు. కానీ ఎవరు బెదిరించినా ఎన్ని ప్రాణాలు పోయినా చివరి క్షణం వరకు మా మాతృభూమిని కాపాడుకుంటూనే ఉంటామని అరబ్బులు శపథం చేస్తున్నారు.

2023 అక్టోబర్‌ 7న హమాస్‌ ఇజ్రాయిల్‌‌పై చేసిన దాడి ఒక శూన్యం నుంచి అయితే పుట్టింది కాదు. ఈ చర్య కేవలం ప్రతిస్పందన మాత్రమే. ఏడున్నర దశాబ్దాలుగా ఈ తిరుగుబాటు, నరమేధం కొనసాగుతూనే ఉంది. అరబ్బులు చనిపోతూనే ఉన్నారు. ఇంత జరిగినా పాలస్తీనాకు మిగిలింది కేవలం పది శాతం నేల మాత్రమే, తొంబై శాతం భూమి యూదుల చేతుల్లోకి వెళ్లిపోయింది. ఒకప్పటి పాలస్తీనా లిబరేషన్‌ ఫ్రంట్‌ ఇప్పుడు హమాస్‌‌గా ఎదిగి పాలన వారి చేతిలోకి తీసుకొని తిరుగుబాటు చేస్తూనే ఉంది. నాలుగు తరాలు గడిచాయి, ఎన్నో అంతర్జాతీయ తీర్మానాలు జరిగినా, వాటిని అమలు కాకుండా అడ్డుపడిరది అమెరికాయే.

36 వేలమంది ప్రాణాల బలి

ఉత్తర భూభాగంలోని గాజా ప్రాంతం ప్రజలందరినీ దక్షిణ వైపు వెళ్ళమని ఇజ్రాయిల్‌ ఒత్తిడి చేస్తునేవుంది. మీరు ఒప్పుకోకపోతే మిమ్మల్ని నిర్మూలిస్తామంటూ, జియోనిస్టులు’ భయపెడుతూనే వున్నారు. దక్షిణ ప్రాంతంలో రఫా నగరం పరిధిలోనె చిన్నచిన్న గుడారాలుగా వేసుకొని బిక్కు బిక్కు మంటూ శరణార్థులుగా జీవిస్తున్నారు. గత 240 రోజుల దాడిలో 36,000 మంది పౌరులు చనిపోయారు. ఎనబై వేల మందికి పైగా క్షతగాత్రులు, ఇందులో పద్దెనిమిది వేల మంది పసికందులు, బాలలు, బాలికలు. కనీసం పదిహేను వేల మంది వరకు తల్లిదండ్రులను కోల్పోయిన అనాధ పిల్లలు. వైద్యం అందక కొన్ని వేలమంది అమరులు అవుతున్నారు. 140 మంది ప్రింట్‌, ఎలక్ట్రానిక్‌ మీడియా ప్రతినిధులు అసువులు బాసారు. గాజా నగరం అన్ని ప్రాంతాల్లో వీరు బాంబులు వేస్తూనే ఉన్నారు. యూనివర్సిటీల పైన దాడులు చేసి అన్ని బంగాళాలను కూల్చివేశారు. మానవీయ జ్ఞాన సముపార్జనకు తావు లేకుండా చేస్తున్నారు. వందలాది పాఠశాలలు, మరెన్నో వైద్యశాలలను కూడా వదలడం లేదు. ఆసుపత్రులను, వారి స్థావరాలుగా మార్చుకొని హమాస్ మిలిటెంట్లు యుద్ధం చేస్తున్నారంటూ, చిన్న పిల్లల దవఖానాలపై దాడులు చేస్తూ ఆసుపత్రిని అందులోని డాక్టర్లను, నర్సులను, పారామెడికల్‌ సిబ్బందిని చంపి వేస్తున్నారు. గ్రామాలలోని 146 అంబులెన్స్‌‌లను కాల్చివేశారు.

గాజాలో జరుగుతున్నది ఘోర తప్పిదం

గాజాలో జ్ఞాన కేంద్రాలుగా ఉన్న విశ్వవిద్యాలయాలన్నింటినీ పనికట్టుకొని ధ్వంసం చేస్తున్నాయి. గాజాలోని ఇస్లామిక్‌ యూనివర్సిటీ వైస్‌ ఛాన్సలర్‌ డాక్టర్‌ సోఫియా దాడుల్లో చనిపోయారు. కొన్ని జాతుల సంపదలను నిర్మూలించాలనుకున్నారు. కెనడా దేశస్తుడైన ఒక సోషల్‌ సైంటిస్ట్‌ ప్రొఫెసర్‌ దీన్ని ఘోరమైన తప్పిదంగా అభివర్ణించారు. అంతేకాకుండా తొంబై మంది ప్రొఫెసర్లు, 400 మంది విద్యార్థులు కనిపించకుండా పోయారు. వీళ్ళతో పాటుగా వేలాదిమంది విద్యార్థులు తమ పై చదువులను వదులుకున్నారు. అంటే చరిత్ర నుండి పాలస్తీనా ఉనికిని లేకుండా చేయాలనుకుంటున్నారు. ఇప్పటివరకు 75 వేల టన్నులు బరువున్న బాంబులను వేసి స్త్రీలు, పిల్లలు, కొన్ని వేల మందిని కనిపించకుండా పోయేలా చేశారు.

రెండు రాజ్యాలూ కొనసాగాలి

యాసర్‌ అరాఫత్‌ నాయకత్వంలో గతంలో చేసుకున్న ఒప్పందాలన్నింటిని నిర్వీర్యం చేసి, ఏకరాజ్య సిద్ధాంతం తీసుకురావాలని అమెరికా, ఇజ్రాయిల్‌ భావిస్తున్నాయి. గాజా, రఫా మీద దాడులను అమెరికా సమర్ధిస్తుంది. తదనంతరం హామాస్‌‌ను లేకుండా చేయవచ్చు అనేది ఇజ్రాయిల్‌ వ్యూహం. కాని, ఐక్యరాజ్యసమితితోపాటు, మనం కూడా ఈ మారణ కాండను చూస్తూ ఊరుకుందామా, మనం ప్రేక్షకులుగా మిగిలిపోదామా! ఈ విషాదకర పరిస్థితులను అందరం కూడా ప్రశ్నించుకోవలసిన అవసరం ఉంది. ఇజ్రాయిల్‌ దృక్పథంలో మార్పులు రావడం లేదు.

140 కోట్ల జనాభాతో ఉన్నతమైన ప్రజాస్వామిక భారతదేశం తటస్థ వైఖరితోనే ఉంటోంది. నరమేధం అపడంలో భారత్ పెద్దన్న పాత్ర పోషించాలి, దక్షిణాసియాలో జియోనిస్టులను సమర్ధిస్తున్న దేశాల పాలకులు సంఖ్య పెరుగుతోంది, కానీ శాంతి కావాలి ఆయుధాలు, యుద్ధాలు ఆగాలి అని ప్రజలు స్పష్టంగా తెలుసుకున్నారు. పాలస్తీనా, ఇజ్రాయిల్‌ రెండు రాజ్యాలూ ఉండాలని, శాంతియుతంగా ఉండాలని ప్రజలు కోరుకుంటున్నారు. ఐక్యరాజ్యసమితి సెక్రటరీ జనరల్‌ కూడా శాంతియుత పరిస్థితుల పునరుద్ధరణకు ప్రయత్నించాలి. 76 ఏళ్ల యుద్ధం పరిసమాప్తి కావాలి, యుద్ధం నిలువరించేలా చేయాలి, పాలస్తీనా ప్రజల పునరావాసం పట్ల, సాటి మానవాళి పట్ల మానవులుగా మన వంతు కర్తవ్యాలను చేపట్టాలి.

బాలరాజ్ ఉప్పాల

విశ్రాంత తహశీల్దారు

94409 39160


Similar News