స్టెమ్ విద్యలో నాణ్యత పెంచాలి!

మానవాభివృద్ధిలో శాస్త్ర, సాంకేతికత కీలక పాత్ర పోషిస్తుంది. ఆ విజ్ఞానాన్ని మానవాళి శ్రేయస్సు కొరకు వినియోగించే ప్రక్రియనే టెక్నాలజీ. 21వ శతాబ్దంలో

Update: 2024-05-21 00:45 GMT

మానవాభివృద్ధిలో శాస్త్ర, సాంకేతికత కీలక పాత్ర పోషిస్తుంది. ఆ విజ్ఞానాన్ని మానవాళి శ్రేయస్సు కొరకు వినియోగించే ప్రక్రియనే టెక్నాలజీ. 21వ శతాబ్దంలో సాంకేతికతతో ముందుకెళ్లిన దేశాలే పైచేయి సాధిస్తాయి. ఆధునిక యుగ అవసరాలకనుగుణంగా శాస్త్ర, సాంకేతికతను అన్ని రంగాలలో విస్తరించారు. ఇది దేశ వ్యవసాయ, పారిశ్రామిక, సాఫ్ట్‌వేర్, కమ్యూనికేషన్, విద్య, వైద్య ,ఆరోగ్య, రక్షణ, అణుశక్తి మరియు అంతరిక్ష రంగాల అభివృద్ధికి నాంది పలికింది.

స్వాతంత్ర్యానంతరం సమగ్ర జాతీయ అభివృద్ధికి సైన్స్ & టెక్నాలజీ అనేవి రెండు మూల స్తంభాలాంటివని భారత మొదటి ప్రధాని జవహర్ లాల్ నెహ్రూ గుర్తించి.. అందుకోసం దేశంలో పరిశోధన కేంద్రాలను, విశ్వవిద్యాలయాలను, ఐఐటీ వంటి ఆధునిక సాంకేతిక సంస్థలను ఏర్పాటు చేశారు. గత కొంతకాలంగా మనదేశంలోని శాస్త్ర సాంకేతిక రంగంలో విప్లవాత్మక మార్పులు వచ్చాయి. ఈ నూతన ఆవిష్కరణలు మనల్ని అగ్రరాజ్యాల సరసన నిలబెట్టడుతున్నాయి. ఇటీవల చేపట్టిన చంద్రయాన్ -3, ఆదిత్య ఎల్-1 కార్యక్రమాలే దీనికి నిదర్శనం. భారతదేశం గ్లోబల్ ఇన్నోవేషన్ ఇండెక్స్ (GII)- 2023లో ప్రపంచంలోని 132 ఆర్థిక వ్యవస్థలలో 40 వ స్థానానికి చేరుకుంది. (2015 సంవత్సరంలో 81 వ స్థానం). దీంతో 37 దిగువ -మధ్య ఆదాయ గ్రూప్ ఆర్థిక వ్యవస్థలలో భారతదేశం 1వ స్థానంలో నిలవడం సానుకూలాంశం. అన్ని రంగాల్లో నవీకరణ, వ్యవస్థాపకతలతో అంకుర సంస్థల స్థాపన పెరుగుతోంది. 100 కోట్ల డాలర్ల విలువ గల అంకుర సంస్థలను యూనికార్న్‌లని అంటారు. భారత్ 67 యూనికార్న్‌లతో అమెరికా, చైనా తర్వాత మూడవ స్థానంలో నిలిచింది. ఇవి ఆర్థికాభివృద్ధికి చోదక శక్తిగా నిలుస్తున్నాయి. ఒకవైపు శాస్త్ర, సాంకేతికతతో దూసుకు పోతున్నప్పటికీ... సంస్థాగత వైఫల్యాలు మనల్ని వెనక్కి నెట్టుతున్నాయి.

సూడో సైన్స్ ప్రభావంతో..

భారతీయ విద్యాసంస్థలు ప్రపంచ అగ్రశ్రేణి విశ్వవిద్యాలయాలతో పోటీ పడకపోవడం బాధాకరం. మనదేశ ఉత్పత్తులు ప్రపంచాన్ని శాసించడం లేదు. భారత్‌లో తయారీ కార్యక్రమం అమలవుతున్నప్పటికీ ఇంకా ఎలక్ట్రానిక్ వస్తువులు, సెమీకండక్టర్ చిప్స్, భారీ యంత్రాలు, ఆర్గానిక్ కెమికల్స్, ప్రధాన ఆయుధాలు ఇతర దేశాల నుంచి దిగుమతి చేసుకుంటున్నాం. స్వావలంబన సాధించలేకపోతున్నాం. ఇది భారతదేశానికి పెద్ద అవరోధం. మన దేశంలో పరిశోధన అభివృద్ధికి ఆశించిన స్థాయిలో నిధుల కేటాయింపు జరగకపోవడమే దీనికి కారణం. అభివృద్ధి చెందిన దేశాల్లో ఏటా కనీసం రెండు నుంచి నాలుగు శాతం వరకు నిధులు ఖర్చు కేటాయిస్తుండగా.. మనదేశంలో 0.7 శాతం లోపే. ఇప్పటివరకు శాస్త్ర, సాంకేతిక రంగంలో అపూర్వ విషయాలు అరకొర నిధులతోనే సాధించాము. 21వ శతాబ్దపు అవసరాలకు తీర్చడానికి ఈ వ్యయాన్ని భారీగా పెంచాల్సిన అవసరం ఉంది. మరోవైపు భారతదేశంలో సుడో సైన్స్ (అసత్య సైన్సు) ప్రచారం వైజ్ఞానిక ప్రగతికి అవరోధంగా మారింది. ఇటీవల పతంజలి ఉత్పత్తులపై తప్పుదారి పట్టించే ప్రకటనలపై సర్వోన్నత న్యాయస్థానం తీవ్రంగా పరిగణించిన విషయం తెలిసిందే. ఇలాంటివి ప్రజలను గందరగోళానికి గురి చేస్తాయి. మరోవైపు శాస్త్రీయ అచైతన్యంతో ప్రజల్లో ముడత్వ భావాల వ్యాప్తి పెరుగుతోంది. ఇది ఆందోళన కలిగించే విషయం. పాఠ్య పుస్తకాల్లో సైతం వాస్తవ శాస్త్రీయ విజ్ఞానం ఉండటం లేదు. తద్వారా దేశంలో చాందస భావాల పరిధి పెరిగి సైన్స్ పరిధి తగ్గుతుంది.

సాంకేతిక అభివృద్ధితో పాటు..

వికసిత్ భారత్ 2047 సహకారంలో సాంకేతికత కీలక పాత్ర పోషించనుంది. రోజూరోజుకు తరిగిపోతున్న వనరులతో దేశా జనాభా అవసరాలకు తీర్చడానికి శాస్త్ర, సాంకేతికత అత్యవసరం. ప్రస్తుతం బిగ్ డేటా, కృత్రిమ మేధ, మెషిన్ లెర్నింగ్, రోబోటిక్స్, ఇంటర్నెట్ ఆఫ్ థింక్ వంటి ఆధునిక సాంకేతికత ప్రపంచాన్ని శాసిస్తోంది. వీటి ఆధారిత కోర్సులను చదవడం వల్ల మెరుగైన ఉద్యోగావకాశాలను అందిపుచ్చుకోవచ్చు. భవిష్యత్తులో ప్రతి రంగాన్ని కృత్రిమ మేధ తీవ్రంగా ప్రభావితం చేస్తుంది. కృత్రిమ మేధ, రోబోలతో నవ్య మానవుడు అవతరించనున్నాడు. వీటి ప్రభావంతో ఉద్యోగాల స్వరూప స్వభావాలు కూడా మారుతున్నాయి. అంతేకాకుండా కృత్రిమ మేధ టెక్నాలజీతో ప్రమాదం కూడా పొంచి ఉందనేది కాదనలేని సత్యం. ఇటీవల ఎన్నికల్లో డీప్‌ ఫేక్‌లతో అసత్యప్రచారం హోరెత్తిస్తున్నారు. ఇది వ్యక్తిగత స్వేచ్ఛ, గోప్యత, గౌరవం మొదలుకొని జాతీయ భద్రత దాకా అన్నిటికీ ముప్పుగా మారుతున్నది. సైబర్ క్రైమ్ కూడా విపరీతంగా పెరుగుతుంది. కావున సాంకేతిక అభివృద్ధితో పాటు నియంత్రణ కూడా అవసరమని నిపుణులు భావిస్తున్నారు. ప్రభుత్వాలు సైన్స్ విద్య ను ప్రోత్సహించాలి. పాఠశాల స్థాయి నుంచి యూనివర్సిటీ స్థాయి వరకు సైన్స్ విద్యలో నాణ్యత పెంచాలి. ముఖ్యంగా ప్రయోగాపూర్వక విద్యనందించాలి. హరిత సాంకేతికతపై దృష్టి పెట్టి భూగోళ సంరక్షణకు తోడ్పడాలి. శాస్త్ర, సాంకేతిక, ఇంజనీరింగ్, మ్యాథమెటిక్స్ (STEM) రంగాలలో మహిళా భాగస్వామ్యాన్ని పెంచాలి. దేశవ్యాప్తంగా పరిశోధనకు పెద్ద పీట వేయడానికి గతేడాది నేషనల్ రీసెర్చ్ ఫౌండేషన్ ఏర్పాటు చేశారు. ఇది పరిశోధన, ఆవిష్కరణకు పెద్దపీట వేసి మేధో వలసలను అరికట్టాలి. అప్పుడు నూతన ఆవిష్కరణలు రావడానికి అవకాశం ఏర్పడుతుంది. తద్వారా సుస్థిర అభివృద్ధికి బాటలు పడతాయి.

సంపతి రమేష్ మహారాజ్

సామాజిక విశ్లేషకులు

7989579428

Tags:    

Similar News