చదువుల్లో నాణ్యత ప్రభుత్వాల బాధ్యత..!
Quality in education is the responsibility of governments..!
ఏ దేశాన్నైనా నాశనం చేయాలంటే ఆయుధాలు, బయో వెపన్లు ప్రయోగించనవసరం లేదు. ప్రజలకు నాణ్యమైన విద్యను దూరం చేసి, వారిచే అసమర్ధ నాయకులను అధికార పీఠంపై కూర్చోబెట్టేలా చేస్తే చాలు దానికదే సర్వనాశనమై పోతుంది అంటున్నారు నిపుణులు. దీన్ని బట్టి విద్యా వ్యవస్థ(బడి) ప్రాధాన్యత ఎంతో ఉందని తెలుస్తోంది. విద్య జ్ఞానానికి జన్మనిస్తుంది, జాతి భవితను నిర్మిస్తుంది. సరైన నిర్ణయాలకు, సామాజిక విలువలకు ప్రాణం పోస్తుంది. అజ్ఞానాన్ని నిర్మూలించే అత్యంత ప్రాముఖ్యత గల బడులు పునఃప్రారంభం కాబోతున్న వేళ.. బడులు సర్వహంగులతో సిద్ధంగా ఉన్నాయా! సకల సమస్యలతో కునారిల్లుతున్నాయా? ఉచిత, న్యాణమైన చదువులు అందుకోబోతున్న తరుణంలో ప్రభుత్వ విధానాలు, బాధ్యతలను పరిశీలిద్దాం..
పోటీని తట్టుకోలేక..
ఉపాధ్యాయులు చదువులు చెప్పగలరు కానీ పాలకుల స్వభావాన్ని, విధానాలను మార్చలేరు. ప్రపంచంలోనే అతిపెద్ద పాఠశాల విద్యా వ్యవస్థ మనదేశంలో ఉంది. దేశవ్యాప్తంగా సుమారు 15 లక్షల పాఠశాలలుంటే, వీటిలో 25 కోట్ల మందికి పైగా విద్యార్థులకు 85 లక్షల మంది ఉపాధ్యాయులు బోధిస్తున్నారు. మైనం ముద్ద లాంటి చిన్నారులను భావి భారత నిర్మాతలుగా మలచడంలో సర్వహంగులున్న పాఠశాలలు, గురువుల పాత్ర కీలకం. ఆహ్లాదకరమైన తరగతి గదిలో వృత్తి నిబద్ధత గల ఉపాధ్యాయుల బోధనలను అంది పుచ్చుకున్న జ్ఞానమే విద్యార్థుల భవిష్యత్తుకు చుక్కానిగా నిలుస్తుంది. వీరి ప్రతిభా పాటవాలే రేపటి దేశ అభివృద్ధికి దోహదపడుతాయి. కానీ పాలకులకు విద్యా వ్యవస్థ మీద ఉన్న ఉదాసీన విధానాలకు తోడుగా, కరోనా తోడవడంతో రెండు విద్యా సంవత్సరాలు మూతబడినాయి. ఆ తర్వాత ఆన్లైన్ చదువుల పుణ్యాన చదువుల్లో అభ్యసన సామర్థ్యాలు, విద్యా ప్రమాణాలు పాతాళానికి దిగజారిపోయాయి.. బడి గడప తొక్కకుండానే నేరుగా ఆ కాలంలోని విద్యార్థులు వారి వయసు ఆధారం చేసుకుని మూడో తరగతిలోకి చేర్చుకోవలసి వచ్చింది.
అలా ప్రాథమిక, ఉన్నత పాఠశాలలో భాష, గణిత తదితర విషయాల్లో విద్యార్థుల్లో కనీస అభ్యసన స్థాయిలైన పఠనం, లేఖనం నైపుణ్యాలు ఘోరంగా తెగ్గోసుకుపోయాయని అనేక నివేదికలు, అధ్యయనాలు చెబుతున్నాయి. ఈ సంక్షోభం ప్రైవేట్, ప్రభుత్వం అనే తేడా లేకుండా అందరినీ కుదిపేసింది. ప్రైవేట్ బడిలో చదివే పిల్లలకు ట్యూషన్లు పెట్టించడం వలన అభ్యసనం మెరుగైతే, ప్రభుత్వ పాఠశాలలోని పిల్లలకు ట్యూషన్ చెప్పించడానికి ఆర్థిక పరిస్థితులు సహకరించవు. దీంతో విద్యలో నాణ్యత లేమి వీరికి శాపంగా మారడంతో, వీరు విజ్ఞాన పోటీ ప్రపంచంలో తట్టుకోలేకపోతున్నారు. దీని మూలంగా విజ్ఞాన, ఆర్థిక, సామాజిక అసమానతలు వెంటాడబోతున్నాయి. ఇది దేశాభివృద్ధికి రేపటి తరానికి గొడ్డలిపెట్టుగా మారుతుంది.
90 శాతం నిధులు జీతాలకే!
ఈ ఉపద్రవాన్ని గుర్తించిన పాలకులు పలు నివేదికల, సూచనల మేరకు విద్యార్థులలో అభ్యసన సామర్ధ్యాలను పెంచాలన్న లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం గత విద్యా సంవత్సరం నుండి ఫౌండేషన్ లిటరసీ న్యూమరసీ (ఎఫ్‌ఎల్‌ఎన్) పేరిట అన్ని రాష్ట్రాల్లో ప్రత్యేక కార్యక్రమాన్ని అమలు చేస్తుంది. దీనిని తెలంగాణలో తొలిమెట్టు పేరుతో 2022 ఆగస్టు 15న దీనికి శ్రీకారం చుట్టింది. ఈ కార్యక్రమాన్ని ప్రారంభించే ముందే అభ్యసన సామర్ధ్యాలు ఎలా ఉన్నాయో? దేశవ్యాప్తంగా మౌఖిక, రాతపూర్వకంగా మొత్తం 20 మాతృభాషలు, గణితంలో మూడో తరగతి విద్యార్థుల ప్రగతిని జాతీయ విద్యా పరిశోధన శిక్షణ మండలి (ఎన్సీఈఆర్టీ) పరిశీలించారు. దీని ప్రకారం సగటున 52 శాతం మంది విద్యార్థులలో కనీస అభ్యసన సామర్థ్యాలు లేవని స్పష్టమైనది. అబ్బాయిల కంటే అమ్మాయిలు చాలా వరకు మెరుగ్గా ఉన్నారని, మూడో తరగతిలో మాతృభాషను చదవలేకపోతున్నారని, 19 శాతం మంది ఒక్క తెలుగు పదం కూడా చదవలేకపోవడం ఆందోళన కలిగిస్తుంది. మన రాష్ట్ర ప్రభుత్వాలు పాఠశాల విద్యలో ఒక్కొక్క విద్యార్థిపై చేసే సగటు ఖర్చు అరవై వేలు దాటుతుంది అని చెప్తుంది.
విద్యా ప్రమాణాలు మాత్రం వెనుకబాటులో నాసిరకంగా ఉంటుందనే ప్రభుత్వాల వాదనలు ఇలా ఉంటే? నిజానికి పాఠశాల విద్యా బడ్జెట్ పెరుగుతున్నా అందులో 90 శాతం నిధులు జీతభత్యాలకే సరిపోతుంది. మిగిలిన పది శాతం మాత్రమే పాఠశాలల అభివృద్ధికి ఖర్చుపెడుతున్నారు. ఇప్పటికీ 85 శాతం బడుల్లో కంప్యూటర్లు లేవు, నియామకాలు లేవు, 6 వేలకు పైగా బడుల్లో ఒక్క ఉపాధ్యాయుడే 5 తరగతులు బోధించాల్సి వస్తుంది. బడి పారిశుద్ధ్య నిర్వహణ కోసం స్కావెంజర్లు లేరు, వాచ్మెన్లు లేరు. పాఠ్యపుస్తకాలు, దుస్తులు సకాలంలో అందడం లేదు. గత అనుభవాలు.. వివిధ రకాల ఖాళీలతో పాఠశాలల పర్యవేక్షణ పడకేసింది. 602 మండలాల్లో కేవలం 17 చోట్ల మాత్రమే రెగ్యులర్ ఎంఈఓలు ఉన్నారు. ప్రాంతీయ, జిల్లా అధికారుల పోస్టులు ఖాళీలతో ఉంటే పర్యవేక్షణ లోపాలు సరిచేసేది ఎవరు? విద్యావ్యవస్థలో ప్రభుత్వం లోపాలను కప్పిపుచ్చుకుంటూ, ఉపాధ్యాయులను తక్కువ చేయడం భావ్యమా!
భాషపై పట్టుతోనే అది సాధ్యం!
ప్రభుత్వ పాఠశాలలలో ఒకటి నుంచి ఐదవ తరగతి విద్యార్థులకు మాతృభాష లేదా ప్రాంతీయ భాషల్లో చదవడం, రాయడం భాషా ప్రయోజనాలు చేకూర్చడం, జ్ఞాపక శక్తిని పెంచడం వంటి అంశాలపై ‘రీడ్ టు రూమ్’ అనే గ్రంథాలయ సంస్థ దృష్టి పెట్టి ఆకర్షణీయ పుస్తకాలు, అకట్టుకునే కథలు ఉండేలా చూస్తున్నారు. ప్రాథమిక స్థాయిలో ఈ ప్రత్యేక గ్రంథాలయాల ద్వారా 2025 నాటికి 5వ తరగతి లోపు విద్యార్థులందరిలో భాషా నైపుణ్యాలు నేర్పడం లక్ష్యంగా ఈ గ్రంథాలయాలు పనిచేయబోతున్నాయి. ఏ విషయాన్ని అవగాహన చేసుకోవాలన్నా.. భాషపై పట్టు రావాలి. భాషాపరమైన వెనుకబాటు ఉంటే ఇతర సబ్జెక్టుల్లో రాణించలేరు. ఈ సమస్య పరిష్కరించబడాలన్నా.. పాఠశాల విద్య బాగుపడాలన్నా.. క్షేత్రస్థాయిలో ఇన్నాళ్ల నిర్లక్ష్యం వీడి ప్రభుత్వాలు టైం బౌండ్ ప్రోగ్రాంతో బడులను సకల సౌకర్యాలతో ఎలాంటి ఖాళీలు, సమస్యలు లేని విధంగా సర్వహంగులతో తయారు చేయాల్సి ఉంది. ప్రభుత్వ బడంటే? సమాజ ఆస్తి. అది విలువలు, సమానత్వం, నైతికత పరిపూర్ణమైన వ్యక్తిత్వం గల పౌరులను తయారు చేసే కేంద్ర బిందువు. జీవితాన్ని నిలబెట్టే నాణ్యమైన విద్య పొందడం బాలబాలికల ప్రాథమిక హక్కు. విద్యా వ్యాపారాన్ని ఆపి ‘కామన్ స్కూలు’ విధానంలో అందరికీ ఉచిత నాణ్యమైన విద్యను అందించాలి..
మేకిరి దామోదర్
సామాజిక విశ్లేషకులు
95736 66650