పరీక్షల్లో ఫెయిల్... జీవితం ముగిసినట్టు కాదు...!
తెలంగాణలో ఇంటర్ ఫలితాలు వెలుబడ్డాయో లేదో క్షణాల్లోనే ఆరుగురు ఆత్మహత్యలకు పాల్పడ్డారని సైకియాట్రీ ఎండీ డా. బి.వి. కేశవులు అన్నారు..
తెలంగాణలో ఇంటర్ మొదటి సంవత్సరం ఫలితాలు ఇలా వెలుబడ్డాయో లేదో క్షణాల్లోనే ఆరుగురు ఆత్మహత్యలకు పాల్పడగా, మరొకరు ఫలితాలకు కొన్ని గంటల ముందు.. ఫెయిల్ అవుతానన్న భయంతో మరో విద్యార్థిని ఫలితాలకు ముందు రోజు ఆత్మహత్య చేసుకుంది. ఉదయం ఫలితాలు వెలువడగా తీరా చూస్తే ఆమె 401 మార్కులతో పాస్ అయింది. విద్యార్థుల ఆత్మహత్యలు. ప్రభుత్వాలు అంగీకరించవలసిన భారీ సంక్షోభం..
ఈ పసికూనల ఆత్మహత్యలు విద్యార్థి లోకంలో మరొకసారి ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. గడచిన దశాబ్ద కాలంగా తెలుగు రాష్ట్రాల్లోనూ ఆత్మహత్యలు పెరిగిపోతున్నాయి. దేశవ్యాప్తంగా సంభవిస్తున్న ఆత్మహత్యల్లో ఎనిమిది శాతం విద్యార్థులవే ఉండటం ఆందోళన కలిగించే అంశం. చక్కగా చదువుకుని వివిధ వృత్తుల్లో స్థిరపడి దేశానికి మానవ వనరుల సంపదగా మారాల్సిన విద్యార్థులు అర్థాంతరంగా ప్రాణాలు తీసుకోవడంపై సమాజంలోని అన్ని వర్గాలు ఆలోచించాల్సిన తరుణం...
గతంలో సావిత్రీబాయి మరియు జ్యోతిరావ్ ఫూలే, భీమ్‌రావ్ రామ్‌జీ అంబేద్కర్, పెరియార్, నారాయణ్ గురు వంటి సంఘ సంస్కర్తలు ప్రజలను అణచివేత నుండి విముక్తి చేయడానికి విద్యను ఒక సాధనంగా ఉపయోగించుకోగా, నేడు సమాజం తరువాతి తరాన్ని పౌరులుగా తయారు చేసేందుకు, రాష్ట్రాలు తమ భావజాలాన్ని నిలబెట్టుకోవడానికి విద్యను ఒక సాధనంగా వాడుతున్నాయే తప్ప భవిష్యత్తులో జరిగే భారీ ముప్పును గుర్తించలేకపోతున్నాయి. ప్రభుత్వాలు, పౌర సమాజం విద్యార్థుల ఆత్మహత్యలను దేశ విద్యా వ్యవస్థ తీవ్రమైన సంక్షోభానికి సూచికగా చూడటం ప్రారంభించాల్సిన సమయం ఆసన్నమైంది.
రోజుకు 34 మంది విద్యార్థులు....
భారతదేశ జనాభాలో 25 సంవత్సరాల కంటే తక్కువ వయస్సు ఉన్నవారు 53-54 % మంది ఉన్నారు. మరో ముఖ్యమైన ఆందోళన ఏమిటంటే నేషనల్ క్రైమ్ రికార్డ్ బ్యూరో ప్రకారం భారతదేశంలో ప్రమాద మరణాలు, ఆత్మహత్యలు (ఏడీఎస్ఐ) నివేదిక, 2020 ప్రకారం, దేశంలో సుమారు 8.2% మంది విద్యార్థులు ఆత్మహత్యలకు బలవుతున్నారు ప్రతి 42 నిమిషాలకు ఒక విద్యార్థి ఆత్మహత్య చేసుకున్నాడు, అంటే ప్రతిరోజూ 34 మందికి పైగా విద్యార్థులు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. ఒక అంచనా ప్రకారం, ఒక ఆత్మహత్య కారణంగా మన దేశంలో 60-90 మంది ఇతరులు ప్రభావితమవుతారు. దీన్ని తీవ్ర సంక్షోభంగా సామాజిక సమస్యగా గుర్తించకపోవడం ఆందోళన కలిగిస్తోంది. గుర్తించడానికి ఈ గణాంకాలు సరిపోవా?
రైతుల కంటే ఎక్కువ ఆత్మహత్యలు
భారత్‌లో రైతుల ఆత్మహత్యలు ఎక్కువ అనే విషయం తెలిసిందే. అయితే రైతుల కంటే ఎక్కువగా విద్యార్థులు ఆత్మహత్యలకు పాల్పడుతున్న ఘటనలు ఆందోళన కలిగిస్తున్నాయి.2020లో రైతుల కంటే ఎక్కువ మంది విద్యార్థులు ఆత్మహత్యలతో చనిపోయారు, 2020లో ఆత్మహత్య చేసుకున్న వారిలో 8.2% మంది విద్యార్థులు ఉండగా, 7% మంది రైతులు, ఉన్నారు, అయినప్పటికీ భారతదేశంలో రైతుల ఆత్మహత్యలు సంక్షోభంగా విస్తృతంగా గుర్తించబడుతున్నప్పటికీ, విద్యార్థుల ఆత్మహత్యలు ఎక్కువగా కబ్జాకు గురవుతున్నయి. ఈ వ్యవహారంపై కేంద్రంతోపాటు రాష్ట్ర ప్రభుత్వాలు కూడ సీరియస్‌గా దృష్టిపెట్టాలని పార్లమెంట్ స్థాయీ సంఘం కోరింది. రైతుల మరణాలను జాతీయ సంక్షోభంగా భావిస్తున్నామని, విద్యార్థుల మరణాలపై కూడా ఆ స్థాయిలో కలవరపడాల్సిన సమయం ఆసన్నమైందని తెలిపినప్పటికీ ప్రభుత్వాలలో చలనం లేకపోవడం బాధాకరం. 19 నుంచి 29 ఏళ్ల లోపు వయస్సు వారిలో ప్రాణాలు తీసుకోవాలనే ఆలోచనలు ఎక్కువగా ఉండటం భవిష్యత్తుకు ప్రమాద ఘంటికలు సూచిస్తున్నాయి. మేధావులు, ప్రభుత్వాలు దీర్ఘకాలంగా రైతుల ఆత్మహత్యలను భారతదేశ వ్యవసాయ సంక్షోభంతో ముడిపెట్టారు, కానీ ముక్కు పచ్చలారని విద్యార్థుల ఆత్మహత్యల విషయంలో మాత్రం అందరూ ముక్కున వేలేసుకుంటున్నారు తప్ప నిశితంగా పరిశీలించడం లేదు.
తల్లిదండ్రులకు కడుపుకోత...!
నేటి సమాజంలో విద్యార్థులు చిన్న తప్పిదాలకు, అపజయాలకు, అతిగా ఊహించుకొని పరీక్షల్లో ఫెయిల్ అయితే ఇక జీవితమే లేదన్నట్టుగా భయపడి మంచి భవిష్యత్తు ఉన్న జీవితాన్ని మధ్యంతరంగానే ముగించేస్తున్నారు, నవ మాసాలు మోసి, పెంచి పెద్ద చేసిన తల్లిదండ్రులను కాదనుకొని, క్షణికావేశంలో తీసుకుంటున్న ఈ అపరిపక్వ నిర్ణయాలు తల్లిదండ్రులను జీవిత కాలం పాటు బాధిస్తుంటాయనే విషయాన్ని పిల్లలు ఆలోచించాలి, ఈ ప్రపంచంలో నూటికి 60 శాతం మంది తమ జీవిత కాలంలో ఏదో ఒక పరీక్షల్లో ఫెయిల్ అయిన వాళ్లేనన్న విషయం తెలుసుకోండి, ముఖ్యంగా అకాడమిక్‌లో సక్సెస్ అయిన వాళ్ళు జీవితంలో సక్సెస్ కాలేకపోతున్నారు, విద్యాపరంగా ఫెయిల్ అయిన వాళ్లు జీవితంలో ఎక్కువగా రాణిస్తున్నట్లు మనందరికీ తెలిసిందే, అలాగే విద్యాపరంగా ఎదురుదెబ్బలు తిని విజయవంతమైన ప్రసిద్ధ వ్యక్తులలో థామస్ ఎడిసన్, ఆల్బర్ట్ ఐన్‌స్టీన్, ఓప్రా విన్ఫ్రే, వాల్ట్ డిస్నీ ఉన్నారు. ఈ వ్యక్తులలో ప్రతి ఒక్కరు విద్యాపరమైన సవాళ్లు లేదా వైఫల్యాలను ఎదుర్కొన్నారు, కానీ చివరికి కృషి, సృజనాత్మకత ద్వారా వారి సంబంధిత రంగాలలో విజయం సాధించారు.
మృత్యు కేంద్రాలుగా మార్చకండి...
మన పిల్లలకోసం స్వర్గం లాంటి విద్యాసంస్థలను తయారు చేయలేకపోయినా.. కనీసం వాటిని మృత్యు కేంద్రాలుగా మార్చకుండా ప్రభుత్వాలు చేయాలి, విద్యా వ్యవస్థ నిర్మాణాత్మక అంశాలపై లోతైన ఆత్మపరిశీలన అవసరం.
విద్యా వ్యవస్థని సంస్కరిస్తూ విద్యార్థుల ఆత్మహత్యలు ఒక సంక్షోభమని గుర్తించి, సమస్య పరిష్కారానికి చర్యలు తీసుకోవడం మన సమిష్టి బాధ్యత. అలా చేయడంలో విఫలమైతే, విద్యావ్యవస్థ వారిని విఫలం చేసినందున, వారి జ్ఞాపకాలను పాతాళంలోకి నెట్టివేసి, విద్యార్థుల మృతదేహాలపై భారతీయ సమాజం నిర్మిస్తున్నామనే చేదు విషయాన్ని జీర్ణించుకోక తప్పదు..
డా. బి.వి. కేశవులు. ఎండీ. సైకియాట్రీ,
ఛైర్మన్ తెలంగాణ ఆత్మహత్యల నిరోధక కమిటీ,
తెలంగాణ మేధావుల సంఘం,
85010 61659.