మెరుగైన వైద్యం అందించండి మహాప్రభో!

Provide better health facility for telangana employees

Update: 2023-07-05 00:15 GMT

ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ఉద్యోగ,ఉపాధ్యాయ, పెన్షనర్‌లు అందించిన హెల్త్ కార్డుల ద్వారా ఉచిత వైద్యం అందని ద్రాక్షగానే మిగిలింది. కార్పొరేట్ ఆసుపత్రులకు ప్రభుత్వం వైద్య ఖర్చులు అందించకపోవడంతో ఈ పరిస్థితి నెలకొన్నది. కన్ను, దంత వైద్యులకు తప్పితే హెల్త్ కార్డులు దేనికి ఉపయోగపడడం లేదు. ప్రాణాంతక వ్యాధులకు కార్డుల ద్వారా వైద్యం అందక కార్పొరేట్ ఆసుపత్రుల చుట్టూ చెప్పులరిగేలా తిరిగినా ప్రయోజనం శూన్యం. ఇటీవలే నల్గొండ జిల్లాలో విధులు నిర్వహిస్తున్న ఉపాధ్యాయుడు తన తండ్రికి నగరంలోని ఒక కార్పొరేట్ ఆసుపత్రిలో బ్రెయిన్ సర్జరీ చేయించగా 6 లక్షలు ఖర్చయింది. ‘ఈహెచ్‌ఎస్’ ద్వారా చేయాలని సదరు ఉపాధ్యాయుడు ఆసుపత్రి యాజమాన్యాన్ని సంప్రదించగా రాష్ట్ర ప్రభుత్వం జారీచేసిన హెల్త్ కార్డులను అంగీకరించబోమని నిక్కచ్చిగా చెప్పడంతో చేసేదిలేక అప్పోసప్పో చేసి ఆపరేషన్ చేయించాడు. ఇది ఒక ఉపాధ్యాయుడి సమస్య కాదు. రాష్ట్రంలో ప్రభుత్వ ఉద్యోగస్తులందరికీ ఎదురవుతున్న సమస్య.

ప్రభుత్వ కార్డులు పనిచేయక...

రాష్ట్ర ప్రభుత్వం అందించిన హెల్త్ కార్డుల ద్వారా మెరుగైన వైద్యం అందక ఉద్యోగ, ఉపాధ్యాయ, పెన్షనర్‌లు వారి కుటుంబ సభ్యులు తీవ్ర అరోగ్య సమస్యలతో సతమతమవుతున్నరనేది నిర్వివాదాంశం. నిజానికి రాష్ట్ర ప్రభుత్వం వైద్య ఖర్చులకు రీయంబర్స్‌మెంట్ అందిస్తుంది కానీ గరిష్టంగా 2 లక్షలే కేటాయిస్తుండడంతో దీర్ఘకాలిక వ్యాధులకు శస్త్రచికిత్సకు అది సరిపోవడం లేదు. పైగా ఆ మొత్తాన్ని మంజూరు చేయాల్సిందిగా దరఖాస్తు చేసుకున్న 6 నెలలకు పైబడి గాని మంజూరు కావడం లేదు. పైగా సరిహద్దు రాష్ట్రాలలో వైద్యం చేయించుకుంటే ఆ వైద్యానికి ప్రభుత్వం రీయంబర్స్‌మెంట్ చెల్లించకపోవడంతో ఉద్యోగులు నానా ఇబ్బందులు పడుతున్నారు. ప్రభుత్వ హెల్త్ కార్డులు పనిచేయకపోవడంతో ఉద్యోగులు ప్రైవేటు హెల్త్ ఇన్సూరెన్స్‌లను అశ్రయిస్తున్నారు. ఏటా వేలకు వేల రూపాయలు ఇన్సూరెన్స్‌కు వెచ్చించడం ఆర్థిక భారంగా మారింది.

ఈ కార్పొరేట్ ఆసుపత్రులలో మెరుగైన వైద్యం అందించండి.. అందుకు కావాలంటే అందుకు నెలవారీగా ప్రీమియం చెల్లిస్తామని ప్రభుత్వానికి ఉద్యోగ సంఘాలు ఎన్నిసార్లు విన్నవించినా పెడచెవిన పెట్టడం విచారకరం. ఇటీవల దీనిపై సంబంధిత మంత్రిని కలిసినా ఉపయోగం లేదు. ప్రభుత్వ ఉద్యోగుల ఆరోగ్యం పట్ల ప్రభుత్వం శ్రద్ధ వహించాలి. నెలవారీ ప్రీమియం స్వీకరించి అన్ని కార్పొరేట్ ఆసుపత్రుల్లో అన్ని రకాల వ్యాధులకు మెరుగైన వైద్యం అందించే దిశగా చర్యలు చేపట్టాలి. దీనికై ఒక ప్రత్యేక వ్యవస్థను ఏర్పాటు చేయడం తక్షణ కర్తవ్యంగా గుర్తించాలి. ఏళ్ల క్రితం రూపొందించిన CGHS ప్యాకేజీ రేట్లను సవరించి ప్రస్తుత ధరల కనుగుణంగా రీయంబర్స్మెంట్ చెల్లించాలి. గరిష్ట పరిమితిని 2 లక్షల నుండి 5 లక్షలకు పెంచాలి.

సుధాకర్.ఏ.వి

అసోసియేట్ అధ్యక్షులు STUTS

90006 74747

Tags:    

Similar News