వేడిమి తీవ్రం... జాగ్రత్తలు అవసరం.

వేడిమి తీవ్రం... జాగ్రత్తలు అవసరం... Protect Yourself From the Dangers of Extreme Heat

Update: 2023-04-24 23:15 GMT

ఈయేడు వేసవి తీవ్రత దేశమంతా ఎక్కువగా ఉంది. అత్యధిక వేడిమి నమోదవుతోంది. మహారాష్ట్రలో జరిగిన ఒక భారీ బహిరంగ సభలో 13 మంది మరణించడం, మరో ఎనిమిది మంది ఆసుపత్రి పాలవ్వడం వేసవి తీవ్రతను తెలియబరుస్తోంది. నడి వేసవిలో పూర్తి స్థాయి జాగ్రత్తలు తీసుకోకుండా మిట్ట మధ్యాహ్నం లక్షలాది మందితో సభ నిర్వహించడం అనుచితం అయినప్పటికీ ఈ నివారింప దగ్గ మరణాలు అందరికీ కనువిప్పు కావాలి. ముఖ్యంగా ఉదయం 11 గంటల నుండి మధ్యాహ్నం 3 గంటల వరకూ ఎండలో తిరగరాదు. వీలైనంత మేరకు నీడ పట్టున ఉండాలి. అధికార వర్గాలు, రాజకీయ పార్టీలు ఆ సమయంలో సభలు, ప్రచార కార్యక్రమాలు నిర్వహించకుండా ఉండాలి. తప్పనిసరి ఐతే మంచినీళ్ల అందుబాటు, నీడ, గాలి వీచే ఏర్పాట్లు, ప్రాథమిక చికిత్స అందుబాటులో ఉండేలా జాగ్రత్త తీసుకోవాలి. ఎండలో పని చేయడం వీలైనంత మేరకు అవాయిడ్ చెయ్యాలి. ఇక వ్యక్తిగతంగా కూడా ప్రతి ఒక్కరూ జాగ్రత్త వహించాలి. బయటకు వెళ్లడం తప్పనిసరి అయితే గొడుగు, తలకు టోపీ, పాగా లాంటివి పెట్టుకోవడం, కాటన్ దుస్తులు ధరించడం, నీడలో ఉండడం, ఎక్కువగా నీళ్ళు తాగడం లాంటివి చేయాలి. వేపుళ్ళు, జంక్ ఫుడ్‌లకు దూరంగా ఉండాలి. వడదెబ్బ లక్షణాలు కనబడితే.. కళ్ళు తిరగడం, వాంతులు ఒళ్ళు వేడెక్కడం లాంటివి.. వెంటనే ద్రవ పదార్థాలు తీసుకోవడం, చన్నీళ్లలో తడిపిన గుడ్డతో ఒళ్లంతా తుడవడం లాంటివి చేయాలి. దగ్గరలో వున్న చికిత్సా కేంద్రాలను సంప్రదించాలి. ఈ వేసవిలో అంటురోగాలు కూడా ప్రబలుతాయి. ఫుడ్ పాయిజనింగ్‌లకు కూడా ఆస్కారం ఎక్కువ. దీర్ఘకాలిక వ్యాధులున్న వారికి అనారోగ్యం ముదరబెడ్తుంది. కాబట్టి వారు, చిన్నపిల్లలు, వృద్ధులు మరింత జాగ్రత్త పడాలి. జూన్ వరకూ ఎండలు ఇలానే ఉండే అవకాశం ఉన్నందున అందరూ జాగ్రత్తలు పాటించాలి. ప్రభుత్వం కూడా అందుకు అనుగుణంగా విధానాలు పాటించాలి.

డా. డి.వి.జి.శంకరరావు

94408 36931

Tags:    

Similar News