గిరిజన భూములను కాపాడాలి!

హైడ్రా( హైదరాబాద్ డిజాస్టర్ రెస్పాన్స్ అండ్ అస్సెట్ ప్రొటెక్షన్ ఏజెన్సీ) హైదరాబాద్ విపత్తు నిర్వహణ ప్రభుత్వ ఆస్తుల రక్షణ కోసం ప్రభుత్వ ఉత్తర్వులు 99 మేరకు

Update: 2024-09-04 00:45 GMT

హైడ్రా( హైదరాబాద్ డిజాస్టర్ రెస్పాన్స్ అండ్ అస్సెట్ ప్రొటెక్షన్ ఏజెన్సీ) హైదరాబాద్ విపత్తు నిర్వహణ ప్రభుత్వ ఆస్తుల రక్షణ కోసం ప్రభుత్వ ఉత్తర్వులు 99 మేరకు జూలై 2024లో ఒక స్వతంత్ర సంస్థగా ఏర్పాటు అయింది. దీని ప్రధాన లక్ష్యం హైదరాబాద్‌లోని చెరువులు, పార్కులు, లే అవుట్‌లోని ఖాళీ స్థలాలు, ఆటస్థలాలు, నాళాలు, రహదారులు, ఫుట్‌పాత్‌ల పరిరక్షణ వాటిలోని ఆక్రమణల తొలగింపు చర్యలు చేపట్టడం. జాతీయ విపత్తుల నిర్వహణ చట్టానికి అనుగుణంగా దీనిని ఏర్పాటు చేశారు.

హక్కుల పట్ల అవగాహన లేకపోవడంతో..

అయితే హైడ్రా తరహాలో ఏజెన్సీ ప్రాంతాల కోసం (ఎడ్రా) అమలు చేయాలని కోరుతున్నారు. అడవులకు దగ్గరగా ఉన్న ప్రాంతాలను ఏజెన్సీ ప్రాంతాలుగా పిలుస్తారు. ఈ ప్రాంతాలలో గల భూములపై గిరిజనేతరులకు హక్కులు సంక్రమించవు. గిరిజనులకు మాత్రమే భూములపై ప్రత్యేక హక్కులు ఉంటాయి. ఆ హక్కులు రక్షించడానికి ప్రత్యేక చట్టాలు, నిబంధనలు ఉన్నాయి. ఈ భూముల రక్షణ కోసం బ్రిటిష్ కాలంలో 1917లోనే భూ బదలాయింపు చట్టం రూపొందించారు. స్వాతంత్ర్యం అనంతరం 1959లో భూమి క్రమ బద్ధీకరణ నిబంధనలు సైతం ప్రభుత్వం రూపొందించింది. తర్వాత వాటిని 1970లో సవరించింది. వీటి ద్వారా గిరిజనులు గిరిజనేతరుల మధ్య భూ బదలాయింపులు నిషేధించబడ్డాయి. అయినప్పటికీ ఈ భూములను గిరిజనేతరులు కూడా అనుభవిస్తున్నారు. దీనివలన గిరిజనుల మనుగడ ప్రశ్నార్థకమైనది. మైదాన ప్రాంతాల నుండి గిరిజనేతరులు షెడ్యూల్ ప్రాంతాలకు వలసలు వస్తూనే ఉన్నారు. భూములను సాగుచేస్తూనే ఉన్నారు. చట్టంలో లొసుగుల అమలుకు పటిష్ట యంత్రాంగం లేకపోవడం అలాగే హక్కుల పట్ల గిరిజనులకు సరైన అవగాహన లేకపోవడమే దీనికి కారణం.

హైడ్రా తరహాలో..

తెలంగాణ, ఆంధ్ర షెడ్యూల్ ప్రాంతంలో భూమి అంతా ఒకప్పుడు వివిధ ఆదివాసీ తెగల ఆధీనంలో ఉండేది. గిరిజనేతర వడ్డీ వ్యాపారులు, వారి భూముల్ని తమ ఆధీనంలోకి తెచ్చుకొని వారిని బానిసలుగా మార్చేశారు. ఆదివాసేతరులు దౌర్జన్యంగా కూడా కొన్ని భూములు ఆక్రమించుకున్నారు షెడ్యూల్ ప్రాంతాల్లో 1/70 చట్టం, పీసా చట్టం ఉండి కూడా తమ హక్కుల్ని పరిరక్షించే భూ చట్టాలు ఉల్లంఘించి అక్రమ వెంచర్లు ఏర్పాటు చేసి భూములను అధిక ధరలకు విక్రయించి చట్టానికి విరుద్ధంగా గిరిజనేతరులు బహుళ అంతస్తుల నిర్మాణం చేశారు. వీటిపై సంబంధిత అధికారులకు వివిధ ఆదివాసీ కుల సంఘాలు ఫిర్యాదు చేసినప్పటికీ అధికారులు చూసి చూడనట్లుగా వ్యవహరించడం మూలంగా ఆదివాసేతరులు వారిని దోచుకున్నారు. ఇప్పటికీ దోచుకుంటూనే ఉన్నారు. ఇటువంటి తరుణంలో హైదరాబాద్‌లోని హైడ్రా తరహాలో ఏజెన్సీ ప్రాంతంలో ఏజెన్సీ విపత్తు నిర్వహణ ఏజెన్సీ ఆస్తుల రక్షణ కోసం ఓ వ్యవస్థను తీసుకొచ్చి ఆదివాసీ గిరిజనులకు భూములకు రక్షణ కల్పించాల్సిన అవసరం ప్రభుత్వంపై ఉంది.

పెనుక ప్రభాకర్

ఆదివాసీ రచయితల వేదిక రాష్ట్ర ఉపాధ్యక్షులు,

94942 83038

Tags:    

Similar News