డబ్ల్యూటీఓ షరతుల మేరకే ఇదంతా జరుగుతున్నదనే వాదన ఉంది. రానున్న కాలంలో ఉష్ణోగ్రతల పెరుగుదల వలన మంచినీటి సమస్య, సాగు నీటి సమస్య కూడా ఉత్పన్నం అయ్యే పరిస్థితి ఉంటుందని అంటున్నారు. గ్రామాలలో అసలు ఉపాధి లేదు. ఉపాధిలో వ్యవసాయ కూలి పనులు చేసుకుని జీవించే రెండు కోట్ల మంది మహిళలు ఇంటి వద్దే ఉండాల్సిన పరిస్థితి వచ్చింది. అధిక ధరలు, నిరుద్యోగంతో అస్తవ్యస్త ఆర్థిక పరిస్థితితో దేశం అల్లకల్లోలంగా ఉంది. మన రాజకీయులు మాత్రం అదే ఎన్నికలు, పోటీ చేయడం, గెలువడం కోసం అదే విద్వేషాలు రెచ్చగొట్టే ఉపన్యాసాలు, 80-20 రాజకీయాలు, బుల్డోజర్లు పెట్టి పేదల ఇండ్లు, ఉపాధినిచ్చే ఆధార ఉపాధి షెడ్లను కూల్చే పనిలో ఉన్నారు.
దేశంలో గోధుమ రైతు గోడు కడు దీనంగా మారింది. 2005-2006లో ఒకసారి ప్రైవేట్ వ్యాపారులు గోధుమలను కొనుగోలు చేసి గోడౌన్‌లలో దాచుకుని, ఆ తర్వాత వచ్చిన కరువులో డబుల్ ధరలకు అమ్ముకున్నారు. 5.5 మిలియన్ టన్నులు దిగుమతి చేసుకునే పరిస్థితి వచ్చింది. ఇప్పుడు ఉక్రెయిన్-రష్యా యుద్ధం నేపథ్యంలో ఈ దేశాల నుంచి 30 శాతం గోధుమలు దిగుమతి చేసుకునే దాదాపు 55 దేశాలలో పరిస్థితి ప్రస్తుతం ఆందోళనకరంగా ఉంది. మన దేశంలో గోధుమలు పండడానికి ఉండాల్సిన దానికన్నా తేమ నాలుగు నుంచి ఆరు శాతం ఎక్కువగా ఉండడంతో ఎకరానికి నాలుగు నుంచి ఐదు క్వింటాళ్ల పంట దెబ్బ తిన్నది.
గోధుమకు 30 డిగ్రీల సెల్సియస్ కన్నా ఎక్కువగా ఎండ ఉండొద్దు. కానీ, మార్చిలో 122 సంవత్సరాలలో ఎన్నడూ నమోదు కానంతగా 40 డిగ్రీల వరకు అధికంగా ఉష్ణోగ్రత నమోదైంది. మార్చి ఆరున అత్యధికంగా నమోదు అయిందని 'డౌన్ టూ ఎర్త్' పత్రిక రాసింది. వడగాలుల వలన మన దేశంలో 2013-2017 మధ్యన 4,800 మంది మరణించారు. బిహార్‌లో ఎండలు అత్యధికంగా ఉండడంతో జనం ఇండ్ల నుంచి బయటికి రావొద్దని 144 సెక్షన్ విధించారు. అప్పుడు బిహార్‌లో 121 మంది వడ దెబ్బకు చనిపోయారు. 2020లోను ఉష్ణోగ్రత ఎక్కువగానే నమోదైంది. ఈ ఏడాది 15 రాష్ట్రాలలో మార్చి, ఏప్రిల్ నెలలో అధిక ఉష్ణోగ్రత నమోదైంది. మహారాష్ట్ర, పంజాబ్, హర్యానా, హిమాచల్‌ప్రదేశ్, మధ్యప్రదేశ్, రాజస్థాన్‌లో 54 నుంచి 138 శాతం అధిక ఉష్ణోగ్రత నమోదైంది.
మండుతున్న ఎండలతో
పెరుగుతున్న ఉష్ణోగ్రతల కారణంగా గోధుమ పంటలు ఎండిపోయాయి. వేడి కారణంగా దిగుబడి తగ్గింది కాబట్టి రూ. 500 బోనస్ ఇవ్వాలనే డిమాండ్‌ను కేంద్రం పట్టించుకునే పరిస్థితులలో లేదు. ఎంఎస్‌పీ అంతకన్నా లేదు. క్వింటాల్‌కు బొటబొటిగా రూ.10 నుంచి రూ.15 లాభం మాత్రమే రైతులకు అందుతున్నది. దీంతో రైతుల ఆత్మహత్యలు కొనసాగుతున్నాయి. ఈ ఏప్రిల్‌లో ఒక్క పంజాబ్‌లోనే 14 మంది రైతులు ప్రాణాలు తీసుకున్నారు. భరించలేని వేడిమి కారణంగా గోధుమ పంట చాలా చోట్ల పూర్తిగా ఎండిపోయిన పరిస్థితి. ఎండిన పంటను పశువులకు, ఇతర అవసరం ఉన్నవారికి అమ్ముకునే విషయంలోనూ ఆటంకాలు ఎదురవుతున్నాయి.కార్డ్‌బోర్డు తయారీదారులకు అమ్మవద్దని ప్రభుత్వం అడ్డు తగులుతున్నది. 'ముందు నుయ్యి వెనుక గొయ్యి'లాంటి పరిస్థితి ఏర్పడింది.
ప్రస్తుతం గోధుమ రైతు మాత్రమే కాదు, ఎండలతో ఇతర పంటలు దెబ్బతిన్న రైతులు కూడా దిక్కుతోచని స్థితిలో పడిపోయారు. దేశంలో రైతు వ్యతిరేక ప్రభుత్వం కొనసాగుతున్నది. రైతులు పండించిన పంటలకు కనీస మద్దతు ధరలు లభించకపోవడంతో 2005-2006 పరిస్థితి మళ్లీ వస్తుందేమోననే భయం రైతులలో నెలకొంది. వరి, గోధుమకు సంబంధించి కేంద్రం ఇచ్చిన హామీ మేరకు ఈ రోజు వరకు కూడా ఎంఎస్‌సీ చట్టం తీసుకురాలేదు. 378 రోజుల రైతు ఉద్యమం సందర్భంగా వేలాది మంది మీద పెట్టిన కేసులను ఎత్తి వేయలేదు.. ఒక్క యూపీలోనే పది వేల మంది మీద కేసులు ఉన్నాయి.
భవిష్యత్తులోనూ ముప్పు
డబ్ల్యూటీఓ షరతుల మేరకే ఇదంతా జరుగుతున్నదనే వాదన ఉంది. రానున్న కాలంలో ఉష్ణోగ్రతల పెరుగుదల వలన మంచినీటి సమస్య, సాగు నీటి సమస్య కూడా ఉత్పన్నం అయ్యే పరిస్థితి ఉంటుందని అంటున్నారు. గ్రామాలలో అసలు ఉపాధి లేదు. ఉపాధిలో వ్యవసాయ కూలి పనులు చేసుకుని జీవించే రెండు కోట్ల మంది మహిళలు ఇంటి వద్దే ఉండాల్సిన పరిస్థితి వచ్చింది. అధిక ధరలు, నిరుద్యోగంతో అస్తవ్యస్త ఆర్థిక పరిస్థితితో దేశం అల్లకల్లోలంగా ఉంది.
మన రాజకీయులు మాత్రం అదే ఎన్నికలు, పోటీ చేయడం, గెలువడం కోసం అదే విద్వేషాలు రెచ్చగొట్టే ఉపన్యాసాలు, 80-20 రాజకీయాలు, బుల్డోజర్లు పెట్టి పేదల ఇండ్లు, ఉపాధినిచ్చే ఆధార ఉపాధి షెడ్లను కూల్చే పనిలో ఉన్నారు. అన్నదాతల సంగతి వారికి పట్టదు. 'రైతు ఆదాయం డబుల్ చేస్తామని, విదేశాల నుంచి నల్లధనం తెచ్చి అందరి పౌరుల ఖాతాలలో 15 లక్షల రూపాయల చొప్పున వేస్తామని, ఏడాదికి రెండు కోట్ల ఉద్యోగాలు ఇస్తామని పీఎం నరేంద్రమోదీజీ ఇచ్చిన హామీలు ఎటుబాయే?' అని దేశం అడుగుతున్నది. జర జవాబు చెప్పండి సాబ్. 'అయిసా కోయి దుఖ్ జమానేమే నహీ, బేరోజ్‌గారీకే సివా' సబ్ కా సాత్, సబ్ కా వికాస్, యా సిర్ఫ్ అదానీ అంబానీకా సాత్ ఔర్ వికాస్.'
ఎండీ మునీర్
జర్నలిస్ట్, కాలమిస్ట్
99518 65223