నై మాలుమ్ సాబ్!

శుక్రవారం, ఉదయం 9 గంటలు. అల్వాల్ లోని ఫాదర్ బాలయ్య బస్టాప్. కాలేజీలకు వెళ్లే పిల్లలతో ఆ ప్రాంతమంతా కిక్కిరిసిపోయింది. రోడ్డుకు ఇవతలి వైపు సందు బోసిపోయి ఉంది.

Update: 2022-04-11 18:45 GMT

శుక్రవారం, ఉదయం 9 గంటలు. అల్వాల్ లోని ఫాదర్ బాలయ్య బస్టాప్. కాలేజీలకు వెళ్లే పిల్లలతో ఆ ప్రాంతమంతా కిక్కిరిసిపోయింది. రోడ్డుకు ఇవతలి వైపు సందు బోసిపోయి ఉంది. రెండు మూడు రోజుల క్రితం వరకు అక్కడ కూరగాయల షాపులు కనిపించేవి. పల్లెల నుంచి రైతులు గంపల్లో తాజా కూరగాయలు కూరగాయలు తెచ్చి అమ్మేవారు. చుట్టు పక్కల ప్రాంతాల వారంతా అక్కడికి వచ్చే కూరగాయలు కొనుక్కొని పోయేవారు. మొదట్లో పది మంది వరకు కూరగాయలు విక్రయించేవారు.

నాలుగైదు రోజుల క్రితం వరకు నలుగురైదుగురు కనిపించేటోళ్లు. ఇప్పుడు ఒక్కరూ లేరు. నాకు డౌటొచ్చింది. ఇక్కడ కూరగాయలు అమ్మట్లేదా? అని అడిగా. సిటీ జనం నుంచి వచ్చే కామన్ సమాధానం 'నై మాలుమ్'సరిగ్గా అదే వచ్చింది. తెలియదంటున్నాడాయన. ఇంకాస్తా ముందు కెళ్లి పాన్ టేలా కిషన్‌ను కలిశా. ఇక్కడ కూరగాయలు అమ్ముతలేరా? అనగానే 'ఇంకెక్కడి కూరగాయలు బంజేశిండ్రు కదా'అన్నడు. ఎందుకు? అని అడిగిన. 'పక్కకు కూరగాయల మాల్ పడ్డది. వాళ్లకు గిట్టుబాటు అయితలేదు. అందుకే బంజేసిండ్రు'అంటూ సమాధానం ఇచ్చాడాయన.

వీళ్లేమో రైతులు వీళ్లు పండించిన కూరగాయలను నేరుగా తెచ్చి అమ్ముకోవచ్చు. ఎలాంటి పన్నులూ ఉండవు. వీళ్లకెందుకు గిట్టుబాటు కాదు. కరెంటు బిల్లు ఉండదు. షాప్ రెంటూ ఉండదు! ఇంతకూ ఏం జరిగి ఉంటుందని ఇంకాస్తా లోతుల్లోకి వెళ్లే ప్రయత్నం చేశా. అసలు రంగు బయటపడింది. సిటీలో దాదాపు పది చోట్ల కూరగాయలు, పండ్లు, పాలు, బ్రెడ్స్ అమ్మేందుకు ఏర్పాటైన సదరు మెగా మార్ట్ ఆర్నెల్ల క్రితం అల్వాల్‌లో కూడా బ్రాంచి ఓపెన్ చేసింది.

వ్యాన్లు, లారీల్లో కూరగాయలు రావడం మొదలైంది. వాటిని అందమైన బాక్సుల్లో డిస్‌ప్లే చేయడం, ప్రత్యేక డ్రెస్ కోడ్‌తో కూడిన స్టాఫ్. ఎంటర్ కాగానే చల్లని గాలి. మర్యాదలు. వీటికి తోడు ఆరుబయట కొత్తిమీర రూ.1 కే బంచ్. ఏ ఆకు కూర తీసుకున్నా 3 రూపాయలే అనే బోర్డులు ఏర్పాటయ్యాయి. బహిరంగ మార్కెట్‌లో కిలో టమాట రూ. 30 ఉంటే, సండే ఆఫర్ కిలో టమాట రూ. 10కే కిలో అనే బోర్డులు ఏర్పాటు చేశారు. వీటన్నింటికీ ఆకర్షితులైన సగటు మధ్యతరగతి జనం అక్కడికి పరుగులు తీశారు. ఈ నోటా ఆ నోటా అన్ని బస్తీలకు విషయం చేరింది.

అప్పటి వరకు అక్కడికి కూరగాయలు తెచ్చిన రైతులు వాటిని తక్కువ ధరకు అమ్ముకొనే ధైర్యం చేయలేక, ఒక వేళ రేటు తగ్గించి ఇస్తామన్నా కస్టమర్లు రాక నానాపాట్లూ పడ్డారు. ఒక్క రోజు తిరిగి వెళ్లేందుకు కనీసం బస్ చార్జీలు కూడా లేని పరిస్థితిని గడిపారు. ఏం చేయాలో తెలియక నేరుగా మార్కెట్ యార్డుకే తరలించి ఎంతో కొంత తీసుకుంటున్నారు. నిన్నటి వరకు కూరగాయలు అమ్మిన రాజయ్య లేడు. కిష్టారెడ్డి కూరగాయలు పండిచ్చుడే బంద్ చేసిండు. ఊళ్లో నుంచి గంపల లెక్కన కొని తెచ్చి అమ్మిన ఇస్మాయిల్ ఈ వ్యాపారం బంజేసిండు.

ఇప్పుడు ఆ మాల్ అసలు ఆట షురూ చేసింది. నిన్నటి వరకు రూ.1కే కొత్తిమీర బంచ్... అది ఇప్పుడు 20 రూపాయలైంది. సండే ఆఫర్లు లేవు. కిలో టమోటా 50 రూపాయలు. పక్కన కొనేందుకు మన ఇస్మాయిల్ లేడు. రాజన్న దుకాణమూ లేదు. తప్పదు. కొనాల్సిందే! 'ఒక్కరోజు బాగోతానికి మూతిమీసాలు గొరుక్కున్నట్టు.. కార్పొరేట్ మాల్ మోజున పడి పరేషాన్లు కొని తెచ్చుకున్నట్లయిందంటూ నిట్టూర్చిండు పాన్ టేలా కిషన్.

ఎంఎస్ఎన్ చారి

79950 47580

Tags:    

Similar News