అప్పుడే స్కూల్ ఫీజుల దోపిడా!?

అప్పుడే స్కూల్ ఫీజుల దోపిడా!?... Private schools forcing parents for admissions

Update: 2023-04-18 23:00 GMT

నేడు రాష్ట్రంలోని పలు ప్రైవేట్‌, కార్పొరేట్‌ స్కూళ్ల ఫీజులు చూస్తే కళ్లు తిరగాల్సిందే. వామ్మో ఇంత ఫీజులా అని ముక్కున వేలేసుకోవాల్సిందే. కొన్ని స్కూళ్లల్లో ఎల్‌కేజీ ఫీజులే సుమారు రూ.50 వేల నుంచి రూ.లక్ష మధ్యలో వసూళ్లు చేస్తున్నారు. రాష్ట్రంలో ఇంకా విద్యా సంవత్సరం పూర్తి కాకుండానే ప్రైవేట్‌, కార్పొరేట్ స్కూళ్లు 2023-24 విద్యా సంవత్సరానికి అడ్మిషన్ల ముసుగులో ఫీజుల మోత మోగిస్తున్నాయి. కొన్ని స్కూళ్లల్లోనైతే అప్పుడే అడ్మిషన్లు అయిపోయినట్లు, పూర్తయినట్లు చెబుతున్నారు. తమ పిల్లలకు ఇంగ్లీష్‌ మీడియం చదువులు చెప్పించాలనే ఉద్దేశంతో అడ్మిషన్ల కోసం ప్రైవేట్‌ స్కూళ్లకు వెళుతున్న తల్లిదండ్రులు అక్కడి ఫీజులు చూసి, వాటిని కట్టడం తమ వల్ల కాదని నిరాశతో వెనుదిరిగి వస్తున్న పరిస్థితి రాష్ట్రంలో నెలకొంది. ప్రభుత్వం ఎన్ని జీవోలు, నిబంధనలు రూపొందించినా తమ రూల్‌ తమదే అనేలా కార్పొరేట్, ప్రైవేట్ స్కూల్స్ ప్రవర్తిస్తున్నాయి. కొన్ని స్కూళ్లయితే ఒకేసారి మొత్తం అడ్మిషన్ ఫీజు, పాఠశాల ఫీజు కట్టాలనే నిబంధనలను అమలు చేస్తున్నాయి, లేదంటే అడ్మిషన్లు ఇవ్వమంటూ విద్యార్థుల తల్లిదండ్రులను భయాందోళనకు గురి చేస్తున్నాయి. 2023-24 కి గాను పలు పాఠశాలల యాజమాన్యాలు ఫీజలు భారీగా పెంచనున్నాయి. ప్రస్తుతం ఉన్న ఫీజుల కంటే 6 నుంచి 20 శాతం వరకు పెంచే ఆలోచనలో యాజమాన్యాలు ఉన్నారు. దీంతో విద్యార్థుల తల్లిదండ్రులపై మోయలేని భారం పడుతోంది. అంతేకాకుండా ఈ విద్యా సంవత్సరం వార్షిక పరీక్షలు ఇంకా ముగియక ముందే. వచ్చే ఏడాదికి కట్టాల్సిన స్కూల్ ఫీజుల విషయంలో కొన్ని కార్పొరేట్, ప్రవేట్ పాఠశాలల యాజమాన్యాలు ఇప్పటికే విద్యార్థుల తల్లితండ్రులకు వాట్సాప్‌ మెసెజ్‌లు, నోటీసులు, మెయిల్స్‌ పంపడం గమనార్హం.

ఫీజులపై నియంత్రణ ఏది?

ప్రయివేటు, కార్పొరేట్‌ స్కూళ్ళల్లో ఫీజుల నియంత్రణ చేస్తాం. కార్పొరేట్‌ స్కూళ్లు, కాలేజీలను ఊరి పోలిమేరల వరకు తరిమేస్తామని ఉద్యమ సమయంలో ముఖ్యమంత్రి కేసీఆర్ ముక్తకంఠంతో చెప్పారు. కానీ నేడు తెలంగాణలో కార్పొరేట్‌, ప్రయివేటు స్కూళ్లు మండల స్థాయి వరకు విస్తరించి ఇష్టారాజ్యంగా ఫీజులు వసూలు చేస్తుంటే ఈ ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్లుగా వ్యవహరిస్తున్నారు. పేద, మధ్య తరగతి తల్లిదండ్రుల కష్టార్జితాన్ని ప్రయివేటు సూళ్ల యాజమాన్యాలు జలగల్లా పట్టి వారి రక్తాన్ని పీడిస్తున్నారు. ప్రభుత్వ అసమర్థత అవకాశవాదంతో ప్రయివేటు, కార్పొరేట్‌ స్కూళ్ళు ఆడిందే ఆటగా తయారైతున్నాయి. ప్రయివేటు స్కూళ్ళ స్థాపన, నిర్వహణ, నియంత్రణకు సంబంధించి జీవో వచ్చినా అమలుకు నోచుకోవడం లేదు. అంతేకాకుండా ప్రభుత్వం ఫీజుల నియంత్రణ కోసం 2017లో ప్రొఫెసర్ తిరుపతి రావు నేతృత్వంలో కమిటీ వేసింది. ఏడాదికి 10 శాతం ఫీజులు పెంచుకోవాలని ఆ కమిటీ సిఫార్సులు కూడా చేసింది. అయితే ఆ కమిటీ నివేదిక ఇప్పటికీ ప్రభుత్వ పరిశీలనలో మాత్రమే ఉంది. కానీ అమలుకు నోచుకోలేదు. అంతేకాక కరోనా కారణంగా ఫీజులు పెంచొద్దని.. 2020 ఏప్రిల్లో రాష్ట్ర ప్రభుత్వం 46 జీవో జారీ చేసింది. కానీ ప్రైవేటు, కార్పొరేట్ విద్యాసంస్థలు ప్రభుత్వ ఉత్తర్వులను తుంగలో తొక్కాయి. ప్రైవేట్, కార్పొరేట్ స్కూళ్ల ఆగడాలకు అడ్డు అదుపు లేకుండా పోతోంది. 2009 విద్యాహక్కు చట్టం ప్రకారం.. ప్రైవేట్ కార్పొరేట్ స్కూళ్లు మొత్తం సీట్లలో 25శాతం పేద పిల్లలకు ఇవ్వాలి. కానీ రాష్ట్రంలోని ప్రైవేటు, కార్పొరేట్ స్కూల్స్ విద్యాహక్కు చట్టాన్ని పట్టించుకోకుండా డొనేషన్, అడ్మిషన్ ఫీజుల పేరుతో నోట్ బుక్‌ల పేరుతో యూనిఫాం పేరుతో లక్షలాది రూపాయలు వసూలు చేస్తున్నాయి. దీంతో పేరెంట్స్ ఏం చేయాలో తెలియని పరిస్థితుల్లో ఉన్నారు.

నియంత్రణ చట్టం అవశ్యం

రాష్ట్రంలో ఇష్టానుసారంగా ఫీజులు పెంచుతున్న కార్పొరేట్ ప్రైవేట్ పాఠశాలలపై విద్యాశాఖ అధికారులు పర్యవేక్షణ లేకుండా అధికారులు నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహరిస్తున్నారు. సర్కారు నిబంధనలు లెక్క చేయకుండా, ఇష్టారాజ్యంగా నడుస్తున్న పాఠశాలలపై అధికారులు కన్నెత్తి కూడా చూడకపోవడం శోచనీయం. ప్రైవేటు పాఠశాలల యాజమాన్యాలు యథేచ్ఛగా ఫీజుల దందా కొనసాగుతున్నా అధికారులు చూసీచూడనట్లు వ్యవహరిస్తున్నారు. నిబంధనలు అతిక్రమిస్తున్నా.. తమకేమీ పట్టనట్లుగా రాష్ట్రంలో ఉన్నటువంటి విద్యాశాఖ అధికారులు ఉంటున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా చాలా వరకు కార్పొరేట్‌ స్కూళ్లు ప్రభుత్వం నిర్దేశించిన పాఠ్య పుస్తకాలను కాకుండా వారు రూపొందించిన పాఠ్యపుస్తకాల ద్వారా బోధన చేస్తున్నారు. వాటిని తమ పాఠశాలల్లోనే కొనాలని చెప్పి ఫీజులకు, పుస్తకాలకు లింకు పెడుతున్నారు. మరికొన్ని చోట్ల నోటు పుస్తకాలు, యూనిఫాం తమ వద్దే కొనాలని ఆదేశిస్తూ చివరకు ఫీజు కట్టడం తప్పనిసరి చేస్తున్నాయి. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం మేల్కొని ప్రైవేట్ కార్పొరేట్ పాఠశాలలపై చర్యలు తీసుకొని రాబోయే విద్యా సంవత్సరం నుండి ఫీజు నియంత్రణ చట్టం తీసుకురావాలని విద్యార్థుల తల్లిదండ్రులు ఆశిస్తున్నారు

ముంజంపల్లి దేవేందర్

ఏబీవీపీ స్టేట్ వర్కింగ్ కమిటీ మెంబర్

8978458611

Tags:    

Similar News