నోటాకు ప్రాధాన్యత ఇవ్వండి!

2024 ఎన్నికల్లో డబ్బులు పంచి అధికారం చేజిక్కించుకోవాలన్న వారికి, ఉచిత పథకాల పేరుతో అధికారంలోకి రావాలనుకున్న వారికి ప్రజలు బుద్ధి చెప్పారు.

Update: 2024-06-08 01:15 GMT

2024 ఎన్నికల్లో డబ్బులు పంచి అధికారం చేజిక్కించుకోవాలన్న వారికి, ఉచిత పథకాల పేరుతో అధికారంలోకి రావాలనుకున్న వారికి ప్రజలు బుద్ధి చెప్పారు. ప్రజల సొమ్మును దుర్వినియోగం చేస్తూ.. అభివృద్ధి పేరుతో, డబ్బు ఖర్చు పెట్టేవారికి అహంకారం, నియంతృత్వ ధోరణితో వ్యవహరించే వారికి ఇక చెల్లదని లోక్‌సభ ఎన్నికలలో, కొన్ని రాష్ట్రాలలో జరిగిన శాసనసభ ఎన్నికలలో నాయకులకు, పార్టీలకు బుద్ధి చెప్పారు. ప్రజలు సైలెంట్‌గా ఎగ్జిట్ పోల్స్‌కు అందని విధంగా తీర్పును ఇస్తున్నారు.

ప్రజల కోసం, ప్రజల వలన, ప్రజల చేత ఏర్పాటైన ప్రభుత్వాలు ప్రజల శ్రేయస్సు కోరి పని చేయాలి. ఒకసారి ఎన్నికైన తర్వాత అయిదేళ్ల వరకూ తమను ఎవరూ ఏమీ చేయలేరని ఇష్టం వచ్చినట్లుగా ప్రవర్తిస్తూ ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తున్నారు. ఒక నియంత లాగా వ్యవహరిస్తున్నారు. దీంతో పనులు చేసుకునే సామాన్య ప్రజానీకం ఇబ్బందికి గురవుతున్నారు. స్వాతంత్ర్యం రాక పూర్వం మన దేశ ప్రజలకు అధికారం గురించి తెలియదు. ఎందరో త్యాగమూర్తుల ఫలితంగా ఎన్నో పోరాటాల ద్వారా వచ్చిన స్వాతంత్య్రం అనంతరం, ఒక్కసారిగా వచ్చిన అధికారాలతో ఎక్కువ మంది అధికార దుర్వినియోగానికి పాల్పడ్డారు. నేరుగా స్వాతంత్య్ర ఉద్యమంలో పాల్గొన్న వారు తప్ప మిగతా పరిపాలకులు పాలనలో గొప్ప మార్పులు తీసుకురాలేక పోయారు. వలస పాలకుల ప్రభావం, మన నిరక్షరాస్యత తోడుగా పేదరికంతో ప్రజలు ఇతరుల మభ్యపెట్టే మాటలతో, పలుకుబడితో వచ్చిన వారి మాటలను విని ఓటు వేసేవారు. మోసపోయే వారు. అభివృద్ధికి నోచుకోక మనం చాలా కాలం వృధా చేసుకున్నాం. కానీ ప్రస్తుత కాలంలో బాగా మార్పులు కనబడుతున్నాయి. ప్రజలు సైలెంట్‌గా ఎగ్జిట్ పోల్స్‌కు అందని విధంగా తీర్పును ఇస్తున్నారు.

నోటాకు ఎక్కువ ఓట్లు వస్తే...

పోటీలో ఉన్న అభ్యర్థులు మనకు ఇష్టం లేకుంటే మన భారత ఎన్నికల సంఘం ‘నోటా’ కు ఓటు వేసే సదుపాయం 2013 సంవత్సరంలో కల్పించిందని తెలిసిన విషయమే. అయితే భారత ఎన్నికల సంఘం ‘నోటా’కు ఎక్కువ ఓట్లు పోల్‌ అయినప్పటికీ తర్వాత శ్రేణిలో ఉన్న ఎక్కువ ఓట్లు సాధించిన అభ్యర్థిని గెలిచినట్లుగా ప్రకటిస్తున్నారు. అంటే పోలైన 100 ఓట్లలో ‘నోటా’కు 90 ఓట్లు పోలైనా, పోటీలో ఉన్న మిగతా అభ్యర్థులలో ఎక్కువ వచ్చిన వారిని గెలిసినట్లుగా ప్రకటిస్తారు. దీంతో ఓటర్ల ఉత్సుకత, ఉద్దేశం పూర్తవ్వడం లేదు. దీంతో ఎన్నికలకు దూరమయ్యే ప్రమాదం లేకపోలేదు. పార్టీలన్నీ కూడా నేరచరితులను, సేవాభావం లేని వారిని అభ్యర్థులుగా ప్రకటించడంతో ఓటర్ల నిర్లిప్తతతో ముఖ్యంగా నగరాలలో పోలింగ్‌ శాతం నమోదుకావడం లేదు. పోటీలో ఉన్న అభ్యర్థుల కంటే ‘నోటా’కు ఎక్కువ ఓట్లు నమోదైనట్లయితే ఓటర్లు పోటీలో ఉన్న అభ్యర్థులందరినీ తిరస్కరించినట్లే. కాబట్టి మన ప్రజాస్వామ్యంలో ఓటుకు విలువనిస్తూ తిరిగి కొత్త అభ్యర్థులతో మళ్ళీ ఎన్నికలు నిర్వహించాలి. ఇప్పటికే మహారాష్ట్ర, హర్యానా, ఢిల్లీ స్థానిక సంస్థల ఎన్నికల కోసం ఆయా రాష్ట్ర ఎన్నికల కమిషనర్లు ఆదేశాలు ఇచ్చారు. ఈ నేపథ్యంలో ఎన్నికల్లో కల్పిత అభ్యర్థిగా ‘నోటా’కు కనుక శక్తి చేకూరితే ఆయా పార్టీల వారు తమ అభ్యర్థులను ప్రకటించేముందు జాగ్రత్త పడతారు.

నోటాను కల్పిత అభ్యర్థిగా ఎంచితే

2024 మూడవ విడత పార్లమెంటు ఎన్నికల్లో సూరత్‌ పార్లమెంట్‌ నియోజకవర్గంలో ఒక పార్టీ అభ్యర్థి నామినేషన్‌ను తిరస్కరించడంతో మిగతా స్వతంత్ర అభ్యర్థులు కూడా వారి నామినేషన్లను ఉపసంహరించుకున్నారు. దీంతో విత్‌డ్రా చేసుకోని పార్టీ అభ్యర్థి ఒక్కరే పోటీలో ఉండడంతో అక్కడి ఎన్నిక ఏకగ్రీవమైంది. కొంతమంది నామినేషన్లు ఉపసంహరించుకోవడంతో, ఒక పార్టీ అభ్యర్థి నామినేషన్‌‌ని తిరస్కరించడంతో ప్రజాస్వామ్యవాదులు ఎన్నికైన అభ్యర్థిపై అయిష్టత చూపుతున్నా అక్కడి ఓటర్లు, విద్యావంతులు రాజ్యాంగం కల్పించిన తమ ఓటు హక్కును వినియోగించుకోలేక పోయామని తీవ్రంగా వ్యతిరేకించడం జరిగింది. ‘నోటా’ను ఒక కల్పిత అభ్యర్థి కింద పరిగణించి ఎన్నిక జరిపితే ‘నోటా’ కంటే పోటీలో ఉన్న ఆ ఒక్క అభ్యర్థికి ఓట్లు ఎక్కువగా వస్తే గెలిచినట్లుగా ప్రకటించాలని లేదా ‘నోటా’కు ఆ అభ్యర్థి కంటే ఎక్కువ వచ్చినట్లయితే ఆ ఎన్నిక చెల్లకూడదని మళ్ళీ ఎన్నికలు జరపాలని ప్రముఖ రచయిత శివ ఖేర సుప్రీంకోర్టును ఆశ్రయించారు. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి వై.వి. చంద్రచూడ్‌ దానిని ఎన్నికలకు సంబంధించిన విషయమని చెప్పి ప్రధాన ఎన్నికల కమిషనర్‌కు పంపించారు. ప్రస్తుతం ఆ అంశం వారి పరిశీలనలో ఉన్నట్లుగా భావిద్దాం.

ఓటు శాతం పెరుగుతుంది.

ఈ లోక్‌సభ ఎన్నికలలో ‘నోటా’కు ఓటు వేయడం వలన ప్రయోజనం లేదని ఓటర్లు భావించడంతో ‘నోటా’కు ఓటు పర్సెంటేజ్ పెరగలేదు. అయితే ఇప్పటికే లోకల్‌ బాడీ ఎన్నికలకోసం అమల్లో ఉన్న మహారాష్ట్ర, హర్యానా రాష్ట్రాలు, ఢిల్లీ, పుదుచ్చేరి కేంద్ర పాలిత ప్రాంతాల మాదిరిగా మన రాష్ట్రంలో కూడా రాబోయే పంచాయతీ ఎన్నికలలో ‘నోటా’ను ఒక కల్పిత అభ్యర్థిగా పరిగణించి ఎన్నికల ఫలితాలను వెలువరించాలి. దాంతో ఓటు నమోదు శాతం పెరుగుతుంది. ఓటు పోలింగ్‌ శాతం పెరుగుతుంది. ఎన్నికల ఖర్చు అరికట్టినట్లవుతుంది. ఎన్నికల్లో అభ్యర్థుల కోసం వేలం పాటలను అరికట్టవచ్చును. అప్పుడే సామాన్యుడు ఎన్నికల్లో పోటీలో ఉండే అవకాశాలుంటాయి. ఫోరం ఫర్‌ గుడ్‌ గవర్నెన్స్‌ అధ్యక్షులు యం. పద్మనాభరెడ్డి ఆధ్వర్యంలో ఈ విషయంపై రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌ను కలసి వినతి పత్రం ఇవ్వడం జరిగింది. అన్ని రాజకీయ పార్టీలకు కూడా ప్రతులు పంపడం జరిగింది. ‘‘రేపు రాబోయే కాలంలో ‘నోటా’కు ఒక ప్రాధాన్యత కలిగిస్తే రాబోయే ఎన్నికలలో రాజకీయపార్టీల అభ్యర్థులకు టికెట్లు ఇవ్వడం ఒక పెద్ద ఛాలెంజ్‌ అవుతుంది.’’

- సోమ శ్రీనివాసరెడ్డి,

ఫోరం ఫర్‌ గుడ్‌ గవర్నెన్స్‌

Tags:    

Similar News