వ్యక్తిత్వ వికాస సూత్రం.. స్నేహం

ఒక కార్యక్రమంలో ప్రఖ్యాత గాయకులు స్వర్గీయ బాలసుబ్రహ్మణ్యం స్నేహం గురించి చెబుతూ..‘స్నేహం అనేది ఒక వ్యక్తితో ప్రారంభించే

Update: 2024-08-04 00:30 GMT

ఒక కార్యక్రమంలో ప్రఖ్యాత గాయకులు స్వర్గీయ బాలసుబ్రహ్మణ్యం స్నేహం గురించి చెబుతూ..‘స్నేహం అనేది ఒక వ్యక్తితో ప్రారంభించే ముందు ఆలోచించాలి. ఒకసారి ఆరంభించాక వెనుకకు వెళ్ల కూడదు. ఎదుటి వ్యక్తిలోని మంచితో పాటు చెడుని స్వీకరించాలి. అతడితో మన ప్రయాణం సజావుగా జరిగేలా చూసుకోవాలి’ అంటారు. నిజమే.. ఏ ఇద్దరి మనుషుల మనస్తత్వం ఒక్కలా ఉండదు. ఒక్కటిగా చేసుకోవటం, ఒక్కటిగా ఆలోచించటం నేర్చుకోవాలి. ‘భార్యాభర్తల మధ్య పొరపొచ్చాలకు కారణం ప్రేమ లేకపోవటం కాదు స్నేహం లేకపోవటమ'ని ఓ కథకుని మాట. కనుక మంచి స్నేహం వ్యక్తిని ఉన్నత్తున్ని చేస్తుంది.

వ్యక్తే స్నేహాన్ని వెతుక్కోవాలి!

స్నేహం.. కేవలం రెండు అక్షరాల సముదాయం కాదు. కలిస్తే.. రెండు జీవితాల జీవన గమనం. స్నేహం అనేది రెండంచుల కత్తి. మంచి చెడుల భాగస్వామి. కర్ణ.. దుర్యోధన, శ్రీరామ.. సుగ్రీవ, కృష్ణ... సుధామల స్నేహం, వారి జీవితాల్లో వెలుగు చీకట్లు అందరికి తెలిసినవవే. 'నీ స్నేహితులు ఎవరో చెప్పు... నీగురించి చెబుతాను' అనే నానుడి ఓ వ్యక్తిత్వ వికాస సూత్రం. స్నేహాన్ని వ్యక్తి వెతుక్కోవాలి. ఆ అన్వేషణ అతడి పరిణతికి ఉదాహరణగా నిలుస్తుంది. ఏ ఒక్కరి ముఖంపైన మంచి, చెడు రాసి ఉండదు. కాని.. మాట, నడతా, క్రియ వంటివి వ్యక్తిని పట్టిస్తాయి. వీటిని పరిశీలించటమే నైపుణ్యం. స్నేహం అనేది ఇద్దరి మధ్య, సమూహాల మధ్య అవసరమే. వేగవంతమైన వర్తమాన యుగంలో స్నేహం అనే మాటకు అవసరం అనేది పర్యాయ పదమైంది. నిస్వార్థం, సౌశీల్యం, క్షమ, రక్షణ, నిజాయితీ వంటివి మంచి స్నేహానికి గీటురాళ్లు. ఇవి ఎల్లవేళలా ప్రదర్శితం కావు. నటన స్నేహానికి శత్రువు. ఒకరి కష్టాలు ఒకరు సంపూర్ణంగా అవగాహన చేసుకోవాలి.

నిజమైన స్నేహానికి నిర్వచనం!

మంచి స్నేహం వెన్నెలలో ప్రయాణం వంటిదని కాళిదాసు మాట. అటువంటి స్నేహం ఎలా ఉండాలి అనేది ఎందరికో వచ్చే సందేహం. కానీ.. ప్రేమలో ఎటువంటి భావనలు ఉంటాయో స్నేహంలో కూడా అంతే. అసలు ప్రేమకు మొదటి మెట్టు స్నేహమే. మనిషి బాహ్యం గురించి తెలుసుకోవటం కాదు, అంతరం, అంతరంగం గురించి పరిపూర్ణమైన అవగాహన పరస్పరం అవసరం. ఒకరి ఆకలి వేరొకరికి కలగాలి. కష్టం వస్తే కాదు, రాకముందే గ్రహించి జాగ్రత్త చెప్పేది నిజమైన స్నేహం. ప్రతీరోజు పొగిడేవారు నిజమైన స్నేహితులు కారు. అవసరం అయితే విమర్శ చేయాలి. పొదుపు జీవితానికే కాదు, స్నేహానికీ అవసరమే. ‘పంచభూతాలు పరస్పరం కలుసుకోవు, కాని వాటిమధ్య చక్కని అవగాహన ప్రకృతికి ప్రాణం పోస్తుంది. జీవులకు జీవం అవుతుంది' అని ఋగ్వేదం ఉక్తి. మనిషి నేర్చుకోవలసిన, ఆచరించవలసిన సూక్తి. పొరపాట్లు, అవమానం, దాపరికం, అసహనం, అవహేళన, గర్వం, అసూయ వంటివి సుదీర్ఘ స్నేహాన్ని చంపేస్తాయి. వాటికి దూరంగా, సర్దుపాటుతో జీవితకాలమంతా గొప్ప స్నేహితులుగా నిలబడితే... అదే నిజమైన స్నేహానికి నిర్వచనం.

(నేడు స్నేహితుల దినోత్సవం)

- భమిడిపాటి గౌరిశంకర్

94928 58395

Tags:    

Similar News