తెలంగాణ తొలి ప్రయోగాత్మక చిత్రం 'ప్రత్యూష'

ఫ్యూడల్ వ్యవస్థ అమానవీయంగా పెంచి, పోషించిన, పోషిస్తున్న దుర్మార్గపు మూఢాచారాలలో జోగిని వ్యవస్థ ఒకటి.

Update: 2023-04-14 18:45 GMT

ఫ్యూడల్ వ్యవస్థ అమానవీయంగా పెంచి, పోషించిన, పోషిస్తున్న దుర్మార్గపు మూఢాచారాలలో జోగిని వ్యవస్థ ఒకటి. జోగిని వ్యవస్థలోని స్త్రీలకు దేవుడితో పెళ్లి జరిపించి వారు నివశించే గ్రామాల్లోని పెత్తందార్లకు ఉంపుడుగత్తెలుగా మారి జీవితాంతం మనుగడను కొనసాగించవలసిన దుర్భర పరిస్థితి కొనసాగేది. శాస్త్ర, సాంకేతిక రంగాల్లో అనేక విప్లవాత్మకమైన మార్పులు చోటుచేసుకుని, ఆధునిక సమాజం పరుగులు పెడుతున్నప్పటికి, ఇలాంటి దౌర్భాగ్యపు ఆచారాలు కొన్ని ఇంకా కొనసాగుతున్న వార్తలను వింటూనే ఉన్నాం. సభ్య సమాజం తలవంచుకునే దుస్థితి ఇది. ఇక జోగిని వ్యవస్థ విషయానికి వచ్చినట్టైతే...ఒకప్పుడు తెలంగాణ ప్రాంతంలోని నిజామాబాద్, ఆదిలాబాద్, కరీంనగర్, మెదక్ లాంటి జిల్లాల్లోని భూస్వామ్య పెత్తందార్ల అహంకారానికి నిదర్శనంగా జోగిని వ్యవస్థ కొనసాగింది. ఈ ఆచార ఆనవాళ్లు ఇంకా ఇప్పటికి ఉన్నట్టుగా కొందరు చెబుతుంటారు.

1978 ప్రాంతంలో అంటే 44 ఏళ్ల క్రితం నిజామాబాద్‌కు చెందిన కొంతమంది ప్రగతిశీలభావాలు కలిగిన యువకులు జోగిని వ్యవస్థకు వ్యతిరేకంగా ఉద్యమించారు. సమాజ మార్పుకోసం చలనచిత్రాలు దోహదపడతాయని ధృఢంగా విశ్వసించిన యువకులు తమ జిల్లాలో అనాదిగా కొనసాగుతున్న మూఢాచార జోగిని వ్యవస్థను రూపుమాపేందుకు జోగిని వృత్తిలో కొనసాగుతున్న ప్రజలను చైతన్యపరిచేందుకు ఒక చలనచిత్రాన్ని నిర్మించేందుకు సాహసం చేశారు. అందులో భాగంగానే, నిజామాబాద్ జిల్లా ఆర్మూర్, అరసపల్లి గ్రామాలకు చెందిన నాగభూషణం, సాయిలు, నాగయ్య లాంటి అభ్యుదయ భావాలు కలిగిన యువకులు సమాజాన్ని చీదపురుగులా పట్టిపీడిస్తున్న జోగిని స్త్రీలు ఆచరించే మూడాచారాలను, వాటివల్ల సమాజంలో కలిగే దుష్ప్రయోజనాలను, ప్రతి మనిషికి స్వేచ్ఛగా జీవించాలనే రాజ్యాంగ హక్కులను వివరించే పరిస్థితులను సెల్యూలాయిడ్‌పై తీసుకురావాలని ప్రయత్నాలను ప్రారంభించారు.

సెల్యూలాయిడ్‌పై జోగినిల వెతలు

వీరికి అండగా ప్రముఖ కవి కే. శివారెడ్డి, పూణే ఫిల్మ్ ఇన్‌స్టిట్యూట్‌లో దర్శకత్వ శాఖలో డిప్లొమా పొందిన జాట్ల వెంకటస్వామినాయుడు నిలిచారు. శివారెడ్డి, వెంకటస్వామి నాయుడుతోపాటు నాగభూషణం, సాయిలు, నాగయ్యలు మరికొందరితో కలసి తెలంగాణ ప్రాతంలో జోగిని వ్యవస్థ కొనసాగుతున్న దాదాపు 150 గ్రామాల్లో పర్యటించారు. ఆయా గ్రామాల్లోని వివిధ వయస్సులకు చెందిన జోగిని స్త్రీలను వీరు ఇంటర్వ్యూ చేసారు. ఫలితంగా కవి శివారెడ్డి రాసిన కథతో, జాట్ల వెంకటస్వామి నాయుడు దర్శకునిగా స్వైరి ఫిల్మ్స్ నిర్మాణంలో 'ప్రత్యూష' అన్న టైటిల్‌తో తెలంగాణ ప్రయోగాత్మక చిత్ర నిర్మాణానికి అంకురార్పణ జరిగింది.

నిజామాబాద్ జిల్లా నవీపేట మండలం గోదావరినది ఒడ్డున ఉన్న బీనోలా గ్రామంలో చిత్ర నిర్మాణాన్ని 1978లో ప్రారంభించి 1979లో పూర్తిచేశారు. చిత్ర నిర్మాణానికి నాగభూషణం, సాయిలు, నాగయ్యలు రెండు లక్షల రూపాయల పెట్టుబడిని పెట్టి నిర్మాతలుగా మారిపోయారు. చిత్రంలోని నటీనటులందరు జోగిని వ్యవస్థ వేళ్ళూనికుని వున్న ప్రాంతాలకు చెందినవారే కావడం విశేషం. పైగా వీరందరూ నిరక్షరాస్యులే కావడం గమనార్హం. ఈ చిత్రంలో నటించడానికి ముందు వీరెవరికి సినిమాల గురించి, రంగస్థలం గురించి తెలియదు. చిత్రం కోసం ప్రత్యేకంగా మాటలు రాయడం జరగలేదు. చిత్రంలోని మాటలన్నీ అక్కడి ప్రాంతీయమైనవే. సన్నివేశాలకు అనుగుణంగా అప్పటికప్పుడు నటీనటుల చేత మాట్లాడించడం విశేషం. అలాగే నటీనటులకు మేకప్ లేకుండా అత్యంత వాస్తవికంగా చిత్రాన్ని మలవడం శివారెడ్డి, జాట్ల వెంకటస్వామినాయుడుల ప్రతిభకు నిదర్శనంగా నిలుస్తుంది. ఈ సినిమాను తెలుగు చలన చిత్ర రంగంలో విప్లవాత్మకమైనదిగా పేర్కొనవచ్చు.

స్థూలంగా ప్రత్యూష చిత్ర కథ

మూడు తరాలకు చెందిన జోగిని స్త్రీలు అనుభవించిన అమానవీయ జీవితాలకు సంబంధించిన యదార్ధ గాథ ఇది. పోసాని అనే పేరుగల జోగిని మహిళ తన ఎనిమిదేళ్ల కూతురుతోపాటు వయోవృద్ధురాలైన రోగిష్టి తల్లితో ఒక గ్రామంలో నివసిస్తూ ఉంటుంది. తన తల్లికి సోకిన వ్యాధి తగ్గాలని పోసాని అనే దేవుళ్లను మొక్కుకుని పూజలు చేస్తుంది, మంత్రతంత్రాలు చేయిస్తుంది. అయినా తన తల్లికి నయం కాకపోవడంతో తన తల్లిని ఒక డాక్టర్‌కు చూపించి రోగాన్ని నయం చేయించాలని ప్రయత్నిస్తుంది. ఆ గ్రామంలోని పెత్తందార్ల కబంధహస్తాల్లో చిక్కుకుని మూఢాoధకారంలో మునిగిపోయిన గ్రామంలోని పోసాని బంధువులు ఆమె తల్లిని డాక్టర్ వద్దకు తీసుకువెళ్లేందుకు అడ్డుపడతారు. తమ జోగిని కుటుంబాల ఆచారం ప్రకారం గ్రామంలోని మంత్రగత్తె వద్దకే రోగిష్టి తల్లిని తీసుకువెళ్లి నయం చేయించాలని పట్టుబడతారు. అలాగే పోసాని అల్లారుముద్దుగా పెంచుకున్న తన ఎనిమిదేళ్ల కూతురుని జోగిని వృత్తిలోకి దింపి ఒక మేకను దేవతకు బలిచ్చి శాంతిచేయించాలని అప్పుడే ఆమె తల్లి రోగం నయమౌతుందని పోసానిపై ఒత్తిడి చేస్తుంటారు. ఒకవేళ అలా చేయనట్టైతే ఆమె తల్లితో పాటు గ్రామ ప్రజలందరు కూడా దేవత ఆగ్రహానికి గురికావలసివస్తుందని మంత్రగత్తె ద్వారా పోసానిని బంధువులే బెదిరిస్తారు. పోసాని మంత్రగత్తె బెదిరింపులకు చలించదు. పైగా జోగినిగా తాను ఎలా బతుకుతున్నది, తాను సమాజం నుండి ముఖ్యంగా గ్రామ పెత్తందార్ల నుండి ఎన్నిరకాల అవమానాల్ని అనుభవిస్తున్నది లాంటి విషయాలపై ఆత్మపరిశీలన చేసుకోవడం ప్రారంభిస్తుంది.

పోసాని తన కూతురును జోగిని వృత్తికి అంకితం చేయకుండా ఇతర స్త్రీల మాదిరిగా పెంచి,పెళ్లి చేసి, కూతురు భర్తతో కలిసి సంసారిక జీవితాన్ని సాగించడాన్ని చూడాలని నిర్ణయించుకుని, తన నిర్ణయాన్ని తన బంధువులకు తెగేసి చెబుతుంది. పోసాని నిర్ణయం ఆ నోటా, ఈ నోటా గ్రామమంతా దావానలంలా వ్యాపిస్తుంది. దీనితో పోసానిపై పగ పెంచుకున్న పెత్తందార్లు ఆమె నిర్ణయం వల్ల గ్రామానికి కీడు జరుగుతుందని ఉదృతంగా ప్రచారం చేయిస్తారు. జోగిని స్త్రీ సంతానం కూడా జోగినిలుగానే బతకాలని, మరో జీవితాన్ని కోరుకునే హక్కు వాళ్లకు లేదని గ్రామంలోని బొడ్రాయి దగ్గర పెత్తందార్లు సమావేశం జరిపి ఒక తీర్మానాన్ని కూడా చేస్తారు.

సంచలన తిరుగుబాటు

ఒక రోజు ఆ గ్రామంలోని ఒక వ్యక్తి జ్వరంతో బాధపడుతుంటాడు. దీన్ని ఆసరాగా తీసుకున్న గ్రామ పెద్దలు పోసాని తన కూతురును జోగిని వృత్తికి అంకితం చేయకపోవడం వల్లనే సదరు వ్యక్తి జ్వరంతో మంచం పట్టాడని, తరతరాలుగా వస్తున్న ఆచారాలను ధిక్కరించిన పోసానికి గ్రామ పెద్దలు సాంఘిక బహిష్కరణకు గురిచేస్తారు. గ్రామ పెద్దల నిర్ణయానికి పోసాని బంధువులు కూడా అండగా నిలుస్తారు. పెత్తందార్ల ఆటవిక న్యాయానికి తల ఒగ్గి తన కూతురు జీవితాన్ని జోగిని వృత్తికి బలిచెయ్యాలా లేక అనాదిగా కొనసాగుతున్న దురాచారంపై తిరుగబడాలా ఈ రెండు విషయాల్లో ఎటూ తేల్చుకోలేక పోసాని మానసిక ఒత్తిడికి గురవుతుంది. పెత్తందార్లు విధించిన సాంఘిక బహిష్కరణను తనపట్ల తోటి బంధువులు కూడా పాటించడం పోసానిని తీవ్రంగా కలచివేసింది.

మూడు రోజుల పాటు నిద్రాహారాలు లేకుండా పోసాని మూగవేదనను అనుభవిస్తుంది. ఒకవైపు మంచంపై మూలుగుతున్న రోగిష్టి తల్లి, మరోవైపు అభం,శుభం తెలియని ఎనిమిదేళ్ల కూతురు. నిస్సహాయతతో పోసాని అనుభవించిన మానసిక సంఘర్షణ ప్రతి ఒక్కరినీ కంటతడి పెట్టిస్తుంది. తన కూతురు తనలాగా బానిస బతుకు బతికేకన్న చావడం (గులామికి జిందగీసే మౌత్ అచ్ఛీ హై) మేలనుకుంటుంది. నాలుగో రోజున తాను అల్లారుముద్దుగా పెంచుకుని, ఆమె భవిష్యత్తు గురించి అనేక కలలు కన్న స్వంత కూతురిని చంపి మూఢ నమ్మకాల కంపు కొడుతున్న సమాజంపై ఉన్న తన కసిని తీర్చుకుంటుంది. గ్రామ పెత్తందార్ల నిర్ణయాలపై తన కూతురు రక్తంతో తడిసిన తిరుగుబాటు జెండాను ఎగురవేయడంతో చిత్రం ముగుస్తుంది. పోసానిగా కాదంబరి అనే నిరక్షరాస్యురాలు, ఆమె కూతురుగా కవి శివారెడ్డి పెద్ద కూతురు తులసి నటించింది.

కొసమెరుపు

ప్రత్యూష సినిమాను మేమే 80 లలో వేములవాడ, సిరిసిల్ల, జగిత్యాల్, కరీంనగర్ ఫిలిం సొసైటీలలో ప్రదర్శించాం. ఆ సినిమా రచయిత ప్రముఖ కవి కె. శివారెడ్డితో అప్పుడే చర్చలు, సెమినార్స్ పెట్టాం, ఆ సినిమా దర్శకుడు జట్ల వెంకట స్వామి ఆ తర్వాత 'శిశిర' సినిమా తీసారు ఆయనతో కూడా మీట్ ది డైరక్టర్ ప్రోగ్రాం పెట్టాం, ఈ వ్యాస రచయిత ఆవునూరి సమ్మయ్య కూడా హుజురాబాద్ ఫిలిం సొసైటీలో పనిచేసారు.. నాకు మిత్రుడే... ప్రత్యూష గొప్ప ప్రయోగాత్మక సినిమా ... శివారెడ్డి, జట్ల వెంకటస్వామితో సభల ఫోటోలు కూడా నా దగ్గర వున్నాయి.. నేను రాస్తున్న యాదోంకి బారత్‌లో వాడాను ఆ వివరాలన్నీ.

- వారాల ఆనంద్

సత్యజిత్ రే మెచ్చిన చిత్రం

దాదాపు 44 ఏళ్ల క్రితం ప్రయోగాత్మకంగా నిర్మించిన ప్రత్యూష చిత్రం అప్పట్లో విడుదలకు నోచుకోలేదు. కారణం...ఇది వ్యాపార చిత్రం కాదు గనుక... అలాగే చిత్ర నిర్మాతలు నాగభూషణం, సాయిలు, నాగయ్యలు వ్యాపార పెట్టుబడిదారులు కాదు గనుక. భారత చలనచిత్ర రంగం గర్వించదగ్గ దర్శకులు సత్యజిత్ రే అధ్యక్షతన గల ఫెడరేషన్ ఆప్ ఫిల్మ్ సొసైటీస్ ఆప్ ఇండియా ఈ చిత్రాన్ని కొనుగోలు చేసి దేశవ్యాప్తంగా ఉన్న ఫిల్మ్ సొసైటీలలో, ఫిల్మ్ క్లబ్‌లలో ప్రదర్శించడం గొప్ప బహుమానంగా భావిస్తానని చిత్ర కథా రచయిత కే. శివారెడ్డి పేర్కొనడం విశేషం. బెంగుళూర్‌లో జరిగిన అంతర్జాతీయ చలన చిత్రోత్సవంలో ప్రదర్శించబడిన ప్రత్యూష సినిమా దేశ, విదేశీ చిత్ర విమర్శకులచేత ప్రశంసలను పొందడం గమనార్హం.

తెలంగాణలో 44 ఏళ్ల క్రితం నిర్మించబడిన ఈ తొలి ప్రయోగాత్మక చిత్రం గురించి సౌండ్ అండ్ సౌండ్, లండన్ టైమ్స్ లాంటి పత్రికలు సమీక్షలు రాయడం తెలంగాణ చైతన్యానికి ప్రతీకగా నిలుస్తాయి.


--ఆవునూరి సమ్మయ్య

98491 88633.


ఇవి కూడా చదవండి:

సెంబీ.. తిరగబడ్డ అడవి బిడ్డ కథ  

Tags:    

Similar News