పవర్ స్టార్ రాజకీయ కెరటం

పవన్ కళ్యాణ్ అను నేను..అనే ప్రమాణం పవన్ నోటి నుంచి ఎప్పుడొస్తుందా.. అని వేచి ఉన్న లక్షలాది మంది అభిమానులు ఎదురుచూస్తున్నారు. ఈ సారి ఆ

Update: 2024-06-22 01:00 GMT

పవన్ కళ్యాణ్ అను నేను..అనే ప్రమాణం పవన్ నోటి నుంచి ఎప్పుడొస్తుందా.. అని వేచి ఉన్న లక్షలాది మంది అభిమానులు ఎదురుచూస్తున్నారు. ఈ సారి ఆ అవకాశాన్ని వదలకుండా పోటీచేసిన 21 అసెంబ్లీ స్థానాల్లో, 2 లోక్‌సభ స్థానాల్లో వందశాతం విజయం అందించారు జనసేనాని. ఇప్పడు ఇది దేశ రాజకీయాల్లో సంచలనం అయ్యింది. ద్వేషపు రాజకీయాలు కాకుండా అందరం కలిసి దేశంలో పేదరికం లేకుండా పాలన చేద్దామని అసెంబ్లీలోకి అడుగుపెడుతున్నారు. సాధారణ ప్రజల బ్రతుకుల ఆశలు, బాధ్యతలు మోస్తూ పవన్ ఇంకా భవిష్యత్‌లో ఆదర్శ నేతగా ఎదగాలి. పవన్ ప్రస్థానం కొన్ని దశాబ్దాలపాటు కొన్ని తరాలను స్ఫూర్తితో నింపుతుంది.

సునామీ ఎదురుగా వస్తే ఎలాగ కనబడుతుందో... తుఫానే తలుపులు తడితే ఎలాగ వినపడుతుందో... ఎవ్వరికైనా తెలుసా అంటూ జల్సా సినిమాలో పవన్ కళ్యాణ్ క్యారెక్టర్ గురించి ప్రఖ్యాత సినీ రచయిత పద్మశ్రీ సిరివెన్నెల సీతారామశాస్త్రి అక్షరాల వెన్నెల ఇది. మరి నిజజీవితంలో పవన్ ఇలాంటి వ్యక్తే అని మూడుసార్లు వరుసగా ఈ దేశ ప్రధానమంత్రిగా గెలిచిన నరేంద్ర మోడీ స్వయంగా కితాబిచ్చారు.

లగ్జరీ జీవితాన్ని వదులుకొని..

పవన్ కళ్యాణ్ నిజ జీవిత ప్రయాణం ఊహించని ఎన్నో మలుపులతో, ఎదురుదెబ్బలతో, అవమానాలతో, అసాధారణ విజయాలతో ముడిపడి వుంది. తనకు ఏమాత్రం ఇష్టం లేకున్నా అన్నా వదినల కోసం సినీ ఇండస్ట్రీలోకి అడుగు పెట్టి, అకుంఠిత దీక్ష, పట్టుదలతో తన మార్క్ చూపించాడు. సామాజిక స్పృహతో కూడిన పాటలతో పాటు, వినోదం అందించాడు. రెండు దశాబ్దాలుగా భారతదేశంలో ఆయనకున్న క్రేజ్ ఇప్పటికీ ఏ సినీ హీరోకూ లేదనే విషయాన్ని స్వయంగా తన అన్న మెగాస్టార్ పద్మవిభూషణ్ చిరంజీవే ఎన్నో సినీ వేదికలపై చెబుతుంటారు. పవన్ నటించిన తొలిప్రేమ, ఖుషీ, గబ్బర్ సింగ్, అత్తారింటికి దారేది వంటి చిత్రాలు ఇప్పటికీ యువతరాన్ని ఉర్రూతలూగిస్తుంటాయి. పెద్ద పెద్ద సినీ స్టార్స్‌కు పవన్ కళ్యాణే పవర్‌ఫుల్ స్టార్. పెద్దగా అసాధారణ నైపుణ్యాలు, కళలు లేని పవన్‌కు ఎందుకింత క్రేజ్ అంటే...అతని నిజాయితీ. సామాన్య బడుగు, బలహీన ప్రజల జీవన బ్రతుకు చిత్రాలు మార్చాలని అతను పడే తాపత్రయం. తను సంపాదించే కోట్ల రూపాయల లగ్జరీ జీవితాన్ని వదులుకొని పేద ప్రజల న్యాయం కోసం మండుటెండలో నడిరోడ్డుపై నడుస్తుంటాడు లక్షలమంది సామాన్య జన సైన్యంతో...జనసేనతో..!!

రెండూ చోట్ల ఓడిపోయినప్పటికీ..

సినీనటుడుగా నెంబర్ వన్ పొజిషన్‌లో వున్నప్పుడే తన జీవితం రాజకీయం అనుకొని 25 సంవత్సరాల విజన్‌తో 2014లో జనసేన పార్టీని స్థాపించారు. తెలంగాణ అమర వీరుల స్ఫూర్తితో ఆంధ్రప్రదేశ్‌కు స్పెషల్ స్టేటస్ కోసం ఎన్‌డీఏ కూటమికి మద్దతు ఇస్తూనే పోరాటం చేశారు. జనంలో వుంటూ జనసేనానిగా ఒంటరిగానే జనం కోసం, జనం తరఫున నిలబడ్డాడు. లెఫ్ట్, రైట్ అనే సిద్ధాంతాల మధ్య నలిగి పోకుండా ఎలాంటి అధికారం ఆశించకుండా అందరివాడుగా వున్నాడు. అప్పుడే అందరూ నిలకడ లేదంటూ, రాజకీయం రాదంటూ విమర్శలు గుప్పించారు. 2019 సార్వత్రిక ఎన్నికల్లో ఎవరితో పొత్తు పెట్టుకోకుండానే ఒంటరిగానే పోటీ పడ్డాడు. అనుకోని పరిణామాల మధ్య జనసేన ఘోర అపజయం పొందింది. గాజువాక, భీమవరం రెండు అసెంబ్లీ స్థానాల్లో పోటీ చేసిన పవన్ కూడా ఓటమిపాలయ్యాడు. జనసేన కేవలం ఒకే ఒక సీటు గెలిచింది. ఎంతో నిస్వార్థంగా ప్రజల కోసం పని చేసినా కూడా ప్రజల మద్దతు తనకు లభించక పోవడం కొంత వరకు తనను బాధపెట్టినా నిరుత్సాహపడకుండా మళ్ళీ సాధారణ ప్రజా సమస్యల పరిష్కారం కోసం దేశభక్తితో ప్రజల మధ్యే ఉన్నారు. తన పార్టీ క్యాడర్‌ను పెంచుకున్నాడు. తన సినిమాల వల్ల వచ్చే తన సొంత డబ్బుతో రైతులకు ఆర్థిక సాయం చేశాడు. పార్టీ నడిపాడు.

లౌక్యంతో ఆలోచించి..

ఈ ఎన్నికల ప్రచారంలో భాగంగా వైసీపీ పార్టీ నాయకులు ముగ్గురు పెళ్లాలంటూ, రెండు చోట్ల ఓడిపోయావంటూ తన రాజకీయ ప్రత్యర్ధులు ఎన్నిసార్లు అవమానకరంగా మాట్లాడినా కొన్ని సార్లు బలమైన మౌనంతో... కొన్నిసార్లు పదునైన మాటలతో పవన్ వాళ్ళకి జవాబిచ్చాడు. అందరం కలిసి ప్రజల బతుకుల్ని మారుద్దామని పిలుపిచ్చారు. గాంధీజీ, వివేకానంద, అంబేద్కర్ ,చేగువేరా, భగత్ సింగ్ వంటి విభిన్న మహోన్నత వ్యక్తిత్వం కలిగిన మహానుభావులని ఆదర్శంగా తీసుకుని అడుగులేసిన పవన్‌కు సినీ, రాజకీయాలకతీతంగా ఈ దశాబ్ద కాలంలో తనను అభిమానించే వారి సంఖ్య పెరుగుతూ వచ్చింది. లక్షలాది యువత దేశానికి ఇలాంటి నేతలు అసెంబ్లీ, పార్లమెంట్‌లో వుండాలని ఆశించారు. ఈ సారి 2024 సార్వత్రిక ఎన్నికల్లో పవన్ కొంచెం లౌక్యంతో ఆలోచించి తెలుగుదేశం, బీజేపీతో కలిసి వైసీపీపై యుద్ధం ప్రకటించారు. పవన్ కళ్యాణ్ అను నేను..అనే ప్రమాణం పవన్ నోటి నుండి ఎప్పుడొస్తుందోనని వేచివున్న లక్షల మంది ప్రజలు ఈసారి ఆ అవకాశాన్ని వదలకుండా పోటీచేసిన 21 అసెంబ్లీ స్థానాల్లో, 2 లోక్‌సభ స్థానాల్లో వందశాతం విజయం అందించారు.ఇప్పడు ఇది దేశ రాజకీయాల్లో సంచలనం అయ్యింది.

ఈ ప్రస్థానం స్ఫూర్తిదాయకం!

సినిమాల్లోనూ, రాజకీయంలోను అన్నను మించిన తమ్ముడంటూ ఎగతాళి చేసిన వారిముందే ఎదిగాడు. ఎవరెస్ట్ స్థాయి పొందాడు. తన అన్న పాదాలకు నమస్కరించి శ్రీరామునిగా నిలిపాడు. ద్వేషపు రాజకీయాలు కాకుండా అందరం కలిసి దేశంలో పేదరికం లేకుండా పాలన చేద్దామని అసెంబ్లీలోకి అడుగు పెట్టాడు. సాధారణ ప్రజల బతుకుల ఆశలు,బాధ్యతలను మోస్తూ పవన్ ఇంకా భవిష్యత్ లో ఆదర్శ నేతగా ఎదగాలి. నవతరం నిజాయితీతో కూడిన పవన్ లాంటి వాళ్ళను చూసి రాజకీయాల్లోకి రావాలన్న లోక్‌‌సత్తా అధినేత జయప్రకాశ్ నారాయణ కోరికలు ఫలించాలి. నేను పిడికెడు మట్టే కావొచ్చు. కానీ పిడికిలి ఎత్తితే ఓ దేశ జెండాకు వున్న పొగరుందంటూ శేషేంద్ర శర్మ కవితతో, ఇల్లేమో దూరం..గతుకుల రోడ్డు... చిమ్మ చీకటి.. అయినా గుండెల్లో ధైర్యం వుందంటూ తిలక్ కవితతో పవన్ ప్రస్థానం కొన్ని దశాబ్దాలు, కొన్నితరాలను స్ఫూర్తితో నింపుతుంది.

ఫిజిక్స్ అరుణ్ కుమార్

93947 49536

Tags:    

Similar News