త్యాగాలపై పట్టింపు లేని పార్టీలు..
Political parties who do not care about sacrifices..
ప్రత్యేక తెలంగాణ ఉద్యమం కోసం ప్రాణాలు అర్పించిన వీరుల సంస్మరణ కోసం కానీ వారి కుటుంబాల కోసం కానీ రాజకీయ పార్టీలు ఎటువంటి పథకాలు...వారి ప్రస్తావన అనేది లేకుండా వ్యవహరించడం అనేది కొత్త చర్చలకు దారి తీస్తోంది. ప్రత్యేక తెలంగాణ కోసం 1200 మంది అమరవీరుల ఆత్మబలిదానం చేసుకున్న త్యాగం ఈ రోజు ఏ ఒక్కరికి కనపడటం లేదు. అంత నిర్లక్ష్య వైఖరితో వారు సాధించేది ఏంటి? శ్రీకాంత్ చారి తల్లిదండ్రులు ఏరీ? శ్రీకాంత్ త్యాగంతో మీకేం సంబంధం లేదా? మీరు శ్రీకాంత్ త్యాగాన్ని ప్రపంచానికి చెప్పడంలో నిర్లక్ష్యం వహిస్తే, 1200 మంది అమరుల త్యాగాలు ఆనవాళ్లు లేకుండా పోతాయి. అమరుల త్యాగాలపై ఇంత పట్టింపు లేకుండా పార్టీలు ఉంటే, మీరు చూసి చూడనట్టు ఉండటం న్యాయమేనా? మీ మౌనం తెలంగాణ అమరవీరుల కుటుంబాలకు శాపంలా మారింది.
అమరులకు ఇంత అవమానమా?
అమరుల త్యాగాలని పట్టించుకోని పార్టీలను చూస్తుంటే, తెలంగాణ రాష్ట్రం ఏర్పాటుకు కారణమైన వారిని లేకుండా చేసే ప్రయత్నం ఏమైనా జరుగుతుందా? దానికి ప్రతిపక్ష నాయకులు కూడా ఏమైనా సహకరిస్తున్నారేమోననే అనుమానం కలుగుతుంది. ఎందుకంటే ఏ ఒక్క పార్టీ నాయకుడు కూడా వారి త్యాగాలను, వారి కుటుంబాల ప్రస్తావన తీయడం లేదు. అమరులని కించపరచడం అంటే తెలంగాణ రాష్ట్రం ఏర్పాటుని కించపరచడమే గుర్తించుకోవాలి. బిడ్డలను కోల్పోయినా తల్లితండ్రులు ఆవేదన వ్యక్తం చేస్తున్నా, పట్టించుకోని పాలక వర్గం, కనీసం వారికి మద్దతు ఇవ్వని ప్రతిపక్ష పార్టీలు, ఉద్యమ నాయకులు ఎందుకు ఇంత జరుగుతున్నా చూసి చూడనట్టు ఉన్నారో అర్థం కావడం లేదు. 1969లో వేల మంది తమ ప్రాణాలను సైతం లెక్కచేయకుండా ఉద్యమం చేశారు. వారి త్యాగాలు ఈ రోజున ఎవరికి గుర్తులేవు. అలానే మలిదశ ఉద్యమంలో 2009-2014 మధ్యలో ప్రాణాలు అర్పించిన అమరుల త్యాగాలు, వారి కుటుంబాలు కావచ్చు ఎక్కడ ఉన్నాయి అని ఒక్కసారి తెలంగాణ సమాజం ఆలోచన చేయాలి! కుటుంబంలో ఎవరికైనా చనిపోతే, ప్రతి సంవత్సరం ఏదో ఒక విధంగా గుర్తు పెట్టుకుంటాం. కానీ ఒక ప్రాంతం కోసం ప్రాణాలు అర్పించిన వారిని ఇలానే అవమానం చేస్తారా? మేధావి వర్గం ఒక్కసారి ఆలోచనా చేయాలి!
ఒకరు నిప్పును, ఇంకొకరు ట్రైన్‌ను, మరొకరు విషాన్ని పాయసంలా తాగి, ఉరితాడును ముద్దాడి ప్రాణాలు అర్పించిన తీరు ఈ ప్రపంచంలో ఎక్కడా చూసి ఉండం, అలాంటి గొప్ప త్యాగాలు మన తెలంగాణ అమరవీరులవి, వారి కుటుంబాలవి అలాంటి వారిని దూరం పెట్టడం వల్ల ఏం జరుగుతుందనేది నాయకులు ఆలోచన చేయాలి! చేసిన త్యాగానికి నిజమైన ప్రయోజనం.. అమరులకు కానీ వారి కుటుంబాలకు గానీ జరగలేదు.. ఈ అమరవీరుల కుటుంబాలు ఏం పాపం చేశాయో పాలకులు.. ప్రతిపక్ష పార్టీల నేతలు చెప్పాలి.
మా త్యాగానికి అర్థం లేదా?
అమరవీరులు చేసిన పాపమేంటి? స్వరాష్ట్రం కోసం త్యాగం చేస్తే పట్టించుకోరా? ఎందుకు ఈ శాపం మాకు.. నెత్తిన పెట్టుకుంటాం.. గుండెలో పెట్టుకుంటాం అని అన్నారు మురిసిపోయాం. పెద్ద కొడుకు అంటే రంది తీరింది అనుకున్నాం. ఇంట్లో ఒక కొడుకు పోతే ఇంకో కొడుకు వచ్చాడు చూసుకుంటాడు అని మురిసిపోయాం. కానీ ఈ రోజు ఏమైంది. ఎటు కాకుండా మధ్యలో ఉండిపోయాం. ఇప్పటికైన శ్రీకాంతాచారి తల్లి బయట వచ్చి త్యాగాల చరిత్ర గురించి మాట్లాడాలి. రాష్ట్ర ఏర్పాటుకు ఎందరో మహానుభావులు కారణం అయ్యారు. కానీ వారు ఈ రోజు లేకుండా పోయారు.. కేసీఆర్ ప్రభుత్వం ఇప్పటికైనా మేలుకోవాలి అమరుల త్యాగాలను గుర్తించాలి. స్థూపం ఓపెనింగ్ అప్పుడు అందరినీ పిలుస్తారు.. అని అనుకున్నారు. కానీ అలా జరగలేదు.
ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి అమరులు చేసిన త్యాగానికి విలువ ఇవ్వాలి. వారి కుటుంబాలను ఆదుకోవాలి. పార్టీలన్నీ కూడా తమ మేనిఫెస్టోలో అమరుల కుటుంబాల ఇంట్లో ఒకరికి జాబ్, జిల్లా హెడ్ క్వార్టర్‌లో స్థలం, తల్లిదండ్రులకు 30 వేల పెన్షన్, హెల్త్ కేర్ పథకం, మూడెకరాల భూమి, అమరుల కుటుంబాలకు గుర్తింపు కార్డు, అమరుల త్యాగాలకు చరిత్రలో నిలిచిపోయేలా చేయడానికి చర్యలు, అమరవీరుల స్థూపంలో ప్రతి అమరుని ఫొటో ముద్రించాలనే డిమాండ్లను ఉంచాలి.
తెలంగాణ తెచ్చినం అని ఓ పార్టీ, ఇచ్చినం అని ఓ పార్టీ, మద్దతు ఇచ్చినం అని ఓ పార్టీ వాళ్లు చెప్పుకుంటున్నారు. మరి బిడ్డలను బలి ఇచ్చిన తల్లిదండ్రులను ఏం అనాలో ఒక్కసారి ఆలోచించండి. త్యాగాల ఫలితంగా రాష్ట్ర సాధనలో మా కొడుకులను బలి ఇచ్చామని అడుగుతున్నాం.. మా బిడ్డలను తెచ్చి ఇస్తారా? మేము పడుతున్నా వేదన మీరు తీరుస్తారా? ఏం ఇస్తే మా కొడుకులు వస్తారు? అందుకే మా వారి త్యాగానికి నిజమైన అర్థం వచ్చేలా చేయండి. ఆ రోజు పాడె మోసిన బుజాలు బరువు ఎక్కితే ఇలా దించుతరా... ఒకసారి ఆలోచన చేయండి!
నరేష్ నాయక్
అమరవీరుల కుటుంబాల వేదిక, ప్రెసిడెంట్
85005 85982