లౌకికవాదాన్ని వక్రీకరిస్తున్న రాజకీయ పార్టీలు..
రాజకీయ పార్టీలు, 2024వ లోక్‌సభ ఎన్నికల్లో కృత్రిమ హామీల తుఫాను ఇబ్బడిముబ్బడిగా కురిపిస్తున్నాయి. అటు ఎన్డీఏ, ఇటు ఇండియా కూటమి
రాజకీయ పార్టీలు, 2024వ లోక్‌సభ ఎన్నికల్లో కృత్రిమ హామీల తుఫాను ఇబ్బడిముబ్బడిగా కురిపిస్తున్నాయి. అటు ఎన్డీఏ, ఇటు ఇండియా కూటమి పోటీలు పడి వాగ్దానాలు చేస్తున్నాయి. ఎన్డీఏ కూటమి ప్రధానంగా మతం కేంద్రంగా హిందూ వాదాన్ని బలపరుస్తుంది. భారతదేశంలో అంతర్గతంగా దాగి ఉన్న కులాధిపత్యం, అస్పృశ్యతా భావన, మనస్మృతి వర్గ తత్వాలను బౌద్ధికంగా, భౌతికంగా విస్తృతం చేయడానికి ప్రయత్నం చేసింది ఎన్డీఏ ప్రభుత్వం. అందుకే ప్రత్యామ్నాయంగా ఇండియా కూటమిలో ప్రధాన పార్టీ అయిన కాంగ్రెస్ న్యాయపత్ర పేరట మ్యానిఫెస్టో విడుదల చేసింది. ఇందులో రాజ్యాంగ రక్షణకు, ముస్లిం రిజర్వేషన్ రక్షణకు వారు ప్రాధాన్యం ఇచ్చారు. దీంతో మోదీ ఇటీవల నేనే అసలైన రాజ్యాంగ పరిరక్షకుడిని అని ప్రకటనలు ఇస్తున్నాడు.
అంబేద్కర్ పేరు చెప్పి రాజ్యాంగ పీఠికలో లౌకికవాదాన్ని చేర్చటం కాంగ్రెస్ చేసిన పెద్ద తప్పని భారతీయ జనతా పార్టీ ప్రధాన కార్యదర్శి దుష్యంత్ కుమార్ ఢిల్లీలోని తన ప్రధాన పార్టీ కార్యాలయంలోనే మాట్లాడటం ఆశ్చర్యాన్ని గొలుపుతుంది. నిజానికి అంబేద్కర్ రాసిన రాజ్యాంగం అంతా సెక్యులర్ భావజాలంతో నిండి ఉంది. అయితే బీజేపీ వాళ్లు అంబేడ్కర్‌నే వక్రీకరించడానికి పూనుకున్నారు. కానీ ఆయనది లౌకికవాదం. ఆయన అన్ని మతాలకు స్వేచ్ఛను ఇస్తూనే మతం మారే హక్కులు కూడా ఆయనే కల్పించారు. కానీ బీజేపీ వారు అంబేద్కర్‌ను వక్రీకరించటంలో బీజేపీ వాళ్లు అంబేద్కర్ జీవించిన కాలం నుంచి ప్రయత్నం చేస్తూనే ఉన్నారు.
పార్లమెంటు సభ్యులుగా..
డాక్టర్ బి.ఆర్ అంబేడ్కర్‌ను రాజకీయ పార్టీలు తమకు అనుకూలంగా ప్రచారం చేసుకునే క్రమంలో ఆయన భావాలను వక్రీకరించడం ఈ మధ్యకాలంలో విపరీతంగా పెరిగింది. బీజేపీ వాళ్లు, ఆర్‌ఎస్‌ఎస్ వారు ఎంతగా దాన్ని అన్వయించాలని ప్రయత్నించినా ఆయన భావాలు పూర్తిగా వారికి ప్రత్యామ్నాయమైనవి అని స్పష్టమవుతుంది. ఒక పార్లమెంట్ సభ్యుడు దగ్గర దగ్గర 70 లక్షల మంది ప్రజలకు కేంద్ర ప్రభుత్వ ప్రతినిధిగా ఉంటాడు. ఆ స్థానాల్లోకి బీజేపీ స్వాములను, యోగుల్ని, పారిశ్రామికవేత్తల్ని, బడా పెట్టుబడిదారులను, నేర చరిత్ర ఉన్న వారిని రంగంలోకి దించి పార్టీ పేరుతో ధనం కుమ్మరించి, మద్యం కుమ్మరించి, మత్తుమందుల ఆశ చూపి, ప్రజలను మభ్యపెట్టి గెలిచి పార్లమెంటు సభ్యులుగా వెళ్తున్నారు. వెళ్లిన వాళ్లు మళ్లీ ఆ నియోజకవర్గానికి రావడం లేదు. వారి వారి పరిశ్రమలను, వారి కాంట్రాక్ట్‌లను, తమ నల్ల డబ్బులను, తాము చేసే దుష్కృత్యాలను కాపాడుకోవడానికి పార్లమెంటు సభ్యత్వాన్ని వాడుకుంటున్నారు. ఈనాడు భారతదేశ ఆర్థిక సామాజిక సాంస్కృతికమైన సంక్షోభంలో ఉండడానికి ఇటువంటి పార్లమెంటు సభ్యులే కారణం. నిజానికి డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ పార్లమెంటు సభ్యులకు ఒక రాజకీయ వ్యక్తిత్వం ఉండాలని చెప్పారు. తాము గెలిచిన నియోజకవర్గంలో కనీసం నివాసగృహం లేని వారు, మొత్తం ఐదు సంవత్సరాలలో కనీసం ఐదుసార్లు అయినా పార్లమెంట్ నియోజకవర్గాన్ని పర్యవేక్షించనివారు, రాష్ట్రాన్ని గురించి గానీ, నియోజకవర్గ సమస్యలను గురించి గానీ ఒక్కసారైనా మాట్లాడని వారి సంఖ్య ఎక్కువగా ఉంది.
పార్లమెంటులో మత నినాదాలా?
పార్లమెంట్‌లో జరుగుతున్న చర్చల్లో ధరలు ఎందుకు పెరుగుతున్నాయి? నిరుద్యోగం ఎందుకు వికృతి అవుతుంది?, స్త్రీలపై అత్యాచారాలు ఎందుకు పెరుగుతున్నాయి?, కోటీశ్వరులు మరింత ధనాధిపతులు ఎందుకు అవుతున్నారు? దళితుల మీద దాడులు ఎందుకు జరుగుతున్నాయి? వలస కూలీల జీవితాలు అంత దుర్భరంగా ఎందుకు ఉంటున్నాయి?, పట్టణాలు ఎడారులుగా ఎందుకు మారుతున్నాయి? ఈ అంశాల మీద రాజ్యాంగ పరంగా చర్చించే వాళ్ళు తక్కువ అయ్యారు. చివరకు పార్లమెంట్ భవనం కూడా మతీకరించే విధానాలు మోడీ గారి ప్రభుత్వంలో పెరిగాయి. సామాజిక జీవితం లేని, కుటుంబ జీవితంలోని యోగులు, స్వాములు, ఎంపీలుగా మారి పార్లమెంటులో మత నినాదాలు ఇచ్చే స్థాయికి పార్లమెంట్ దిగజారింది. మత వేషధారణతో పార్లమెంటుకు హాజరవుతున్నారు. భారత రాజ్యాంగాన్ని వేషధారణలోను, భాషణలోను, ఆచరణలోను, నిరాకరించే ప్రయత్నాన్ని చేస్తున్నాయి బీజేపీ అనుబంధ సంఘాలు.
అన్ని పార్టీలు ఓటు యొక్క సామాజిక ఆర్థిక విలువలను ప్రచారం చేయకుండా ఓటును కొనడం ద్వారా, ఓటును కొల్లగొట్టడం ద్వారా, ఓటును మత కుల నినాదాల ద్వారా, ఒత్తిడితో ఓటును తమకు అనుకూలంగా సాధించాలని చూస్తున్నారు. పెద్ద పెద్ద పట్టణాల్లో చదువుకున్న వాళ్ళు, విజ్ఞత ఉన్నవారు ఓటు వేయడానికి బయటకు రావడం లేదు. పార్టీల వారీగా 45 శాతం కంటే నగరాల్లో ఓటు వినియోగం తగ్గుతుంది. కారణం రాజ్యాంగ విలువలను రాజకీయ పార్టీలు విధ్వంసం చేస్తున్నాయనే భావన ఆలోచనపరుల్లో పెరగడమే!
ఇతర మతాలను ప్రేమించాలి..!
భారతదేశపు యువత మత్తుమందుల మత్తులో ఈదులాడుతుంది. ఈ రోజున భారతదేశంలోని యువతలో 50 శాతం మంది మత్తు మందులు తీసుకుంటున్నారు. నల్ల మందు, కొకైన్, హెరాయిన్, మార్ఫింగ్, డెమోరాల్, డార్వోన్, మేధోడాన్, వికోడిన్, ఆ క్లోకోడిన్, చెర్రస్ వంటి వాటితో పాటు డ్రగ్స్‌ను అనేక రూపాల్లో తీసుకుని ఆలోచనా శూన్యులుగా జీవిస్తున్నారు. ప్రపంచ జనాభాలో సుమారు 10 శాతం మంది మాదక ద్రవ్యాలకు బానిసలు అయితే మన దేశంలో యువత 30 శాతం మంది మాదకద్రవ్యాలకు బానిసలుగా ఉన్నారు. 1986 మార్చి 17న నార్కోటిక్ కంట్రోల్ బ్యూరోని ఢిల్లీలో ఏర్పాటు చేశారు. వారు ఇచ్చిన వివరాల ప్రకారం 2000 సంవత్సరంలో డ్రగ్స్ కారణంగా 1.5 లక్షల మంది మరణించారు. మతం అనేది మానవ జీవితాన్ని పునర్‌నిర్మించాలి గాని, ఈ రోజున భారతదేశంలో ప్రధాన మతాలైన, హిందూ, ముస్లిం, క్రైస్తవ మతాలు అంతర్గతంగా అప్రజాస్వామ్యంగానే ఉన్నాయి. ఈ ప్రధానమైన ‘మూడు’ మతాల వారు వారి మత విశ్వాసాలను వ్యక్తిగతంగా ఉంచుకొని రాజ్యాంగ సూత్రాలను ఇతర మతాలను ప్రేమించే మనస్తత్వాన్ని కలిగి ఉండాలి. ఎన్నికల సందర్భంగా ఉద్వేగ పూరితమైన ఉపన్యాసాలు, అసత్య భాషణలు రాజకీయ నాయకులు మానేసి రాజ్యాంగం ఇచ్చిన మాట్లాడే హక్కుకు సత్య పరిమళాలు ప్రసరింప చేసినట్లయితే దేశంలో ప్రజాస్వామ్యం, సామ్యవాదం, లౌకికవాదం, కుల నిర్మూలన భావం, స్త్రీ విముక్తి భావన, స్త్రీ విముక్తి ఆచరణ, మానవ హక్కుల పర్యవేక్షణ జరుగుతాయి. అంబేడ్కర్‌యే లౌఖికవాద దృక్పథానికి దిక్సూచి. ఆ మార్గంలో నడవాలి.
డాక్టర్ కత్తి పద్మారావు
9849741695