పోలవరానికి 'జె' గ్రహణం!
Polavaram project will arise because of Jagan's decisions
అగ్గిపుల్ల, కుక్కపిల్ల, పోలవరం, అమరావతి కాదేదీ రాజకీయానికి అనర్హం అన్నట్లుంది మన రాజకీయ నాయకుల వ్యవహారం. రాష్ట్రానికి కీలకమైన ప్రాజెక్టుల విషయంలో అభివృద్ధి కోణంలో ఆలోచించి సాకారం చేయకుండా, రాజకీయ హ్రస్వ దృష్టితో ఆరోపణలు చేసి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి తీరని ద్రోహం చేస్తున్నారు. తాజాగా ఈ క్షుద్ర రాజకీయానికి బలయ్యింది పోలవరం. తెలుగుదేశం అవినీతి వల్లనే పోలవరం అంచనాలు పెరిగాయని, పోలవరం నిర్మాణంలో ప్రాజెక్ట్ నిర్మాణ వ్యయం పెంచి టీడీపీ రూ. 25వేల కోట్లు అవినీతి చేసిందని జగన్మోహన్ రెడ్డి, పోలవరం టీడీపికి ఏటీఎంలా మారిందని ప్రధాని నరేంద్ర మోడీ ఎన్నికల సమయంలో నిరాధార ఆరోపణలతో దుమ్మెత్తిపోసి ప్రజల్ని నమ్మించారు. ఎన్నికల లబ్ధి కోసం అవినీతి ఆరోపణలు చేసినా అధికారంలోకి వచ్చిన తరువాత రాష్ట్ర ప్రయోజనాలు, రాష్ట్ర అభివృద్ధి ధ్యేయంగా పాలన చేయాలన్న విజ్ఞత మరచి రాజకీయ ప్రయోజనాల కోసం, వ్యక్తిగత లబ్ధి కోసం అర్థంలేని అవినీతి ఆరోపణలతో పోలవరం ప్రాజెక్ట్ నిర్మాణాన్ని వై ఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రశ్నార్థకం చేయడం జాతి ద్రోహం కాదా?
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఎగువ నుండి వచ్చే నదీ జలాల లభ్యత తగ్గిపోతున్న పరిస్థితిలో కూడా పోలవరం నుండి ప్రతి ఏటా సముద్రంలో కలుస్తున్న గోదావరి జలాల్లో కొంత పోలవరం డ్యామ్ ద్వారా మళ్లించి, మరో 194.60 టీఎంసీల నీటిని నిల్వ చేస్తే 23 లక్షల ఎకరాల ఆయకట్టు స్థిరీకరణ, దాదాపు 7 లక్షల 20 వేల ఎకరాల కొత్త ఆయకట్టు, సుమారు 10 లక్షల ఎకరాలకు పరోక్షంగా (కృష్ణా డెల్టాకు రావలసిన నికర జలాలను శ్రీశైలం లోనే నిల్వ చేసి రాయలసీమకు అందించడం) సాగునీరు అందించడం, 960 మెగావాట్ల జలవిద్యుత్, 80 టీఎంసీల గోదావరి జలాలను కృష్ణా నదికి మళ్లించడం, విశాఖపట్నం నగరానికి పారిశ్రామిక, తాగునీటి అవసరాల కోసం 24 టీఎంసీల నీటి సరఫరా, 540 గ్రామాలలోని 29 లక్షల జనాభాకు తాగునీటి సౌకర్యం కల్పించే బహుళార్ధసాధక ప్రాజెక్ట్ పోలవరం. పోలవరం ద్వారా నదుల అనుసంధానం పూర్తి అయితే ప్రత్యేకించి రాయలసీమ, ఉత్తరాంధ్ర రైతులందరూ బాగుపడతారు. నగరాలకు తాగునీటి సమస్య, విద్యుత్ సమస్య తీరుతుంది. కాబట్టే పోల'వరం' ఆంధ్రప్రదేశ్ జీవనాడి.
ఆ ఆరోపణలు తప్పన్నట్టే కదా!
పోలవరం అంచనాల్లో అవినీతి, ప్రాజెక్టులో ట్రాన్స్ ట్రాయ్ సంస్థకు ఇతరులకు లబ్ది, పవర్ ప్రాజెక్ట్‌లో నవయుగ కంపెనీకి నిబంధనలకు వ్యతిరేకంగా నిధుల విడుదల గురించి రాజ్యసభలో అడిగిన ప్రశ్నకు జవాబుగా ఏ విధమైన అవతవకలు జరగలేదని, పెంచిన అంచనా విలువ రూ. 55,548.47 కోట్ల ప్రతిపాదనలకు ఆమోదం తెలుపుతున్నట్లు, కాంపిటెంట్ ఆథారిటి అనుమతితోనే అన్ని నిర్ణయాలు జరిగాయని కేంద్ర మంత్రి ఇచ్చిన లిఖిత పూర్వక జవాబుతో పోలవరంపై ప్రధాని ఎన్నికల సమయంలో చేసిన రాజకీయ ఆరోపణలు అసత్యాలని రుజువయ్యింది. పోలవరం నిర్మాణంలో చంద్రబాబు చిత్తశుద్ధి, నిజాయతీకి కేంద్రం ఇచ్చిన జవాబే నిదర్శనం. పోలవరంలో ఒక్క రూపాయి అవినీతి జరగలేదని పార్లమెంట్ సాక్షిగా కేంద్రం స్పష్టం చేసింది. ప్రస్తుత ముఖ్యమంత్రి వై ఎస్ జగన్మోహన్ రెడ్డి సైతం చంద్రబాబు గతంలో ప్రతిపాదించి ఆమోదం పొందిన డీపీఆర్ 2 ప్రకారం నిధులు ఇవ్వమని అభ్యర్థిస్తూ ప్రధానికి లేఖ రాశారు. అంటే అంచనాల పెంపుపై గతంలో తాను చేసిన ఆరోపణలు తప్పుడువే అని ఆయనే ఒప్పుకున్నట్లే కదా!
కీలకమైన పోలవరం నిర్మాణాన్ని రాష్ట్ర అభివృద్ధి కోణంలో ఆలోచించి కొనసాగించకుండా కేవలం రాజకీయ ప్రయోజనాల కోసం, గతంలో తాను చేసిన అవినీతి ఆరోపణలకు ఊతం కలిగించడం కోసం శరవేగంతో నిర్మాణాన్ని కొనసాగిస్తూ దాదాపు 72 శాతం ప్రధాన ప్రాజెక్ట్ నిర్మాణాన్ని పూర్తి చేసిన గుత్తేదారులను 'రివర్స్ టెండరింగ్' పేరుతో మార్చి, ప్రాజెక్ట్ నిర్మాణంలో ఏమాత్రం అనుభవం లేని మేఘా సంస్థకు పనులు అప్పగించారు. పోలవరం నిర్మిస్తున్న కాంట్రాక్ట్ ఏజన్సీల పనితీరు సంతృప్తికరంగా ఉంది, రివర్స్ టెండరింగ్ విధానం సరైన పద్ధతి కాదు, కొత్త టెండర్లు అనర్థదాయకం, శరవేగంగా సాగుతున్న పనులు అడ్డుకుంటే ప్రాజెక్టు భవితవ్యమే అనిశ్చితిలో పడుతుందని పోలవరం ప్రాజెక్టు అథారిటీ నిపుణులు చెప్పినా వినకుండా కక్షపూరితంగా నవయుగను తప్పించి మేఘాకు అప్పగించారు. రివర్స్ టెండరింగ్ వలన రూ. 780 కోట్లు ఆదా అని ప్రజలను నమ్మించిన జగన్ రెడ్డి ఇసుక పేరుతో మేఘా వారికి రూ. 500 కోట్లు పందారం చేశారు. పైగా ప్రధాన డ్యాం అంచనా వ్యయం రూ.1656 కోట్లు, కొత్తగా ఎత్తిపోతల పథకానికి రూ.919 కోట్లు, అదనపు పనుల కోసం రూ. 653 కోట్లు పెంచి ఆ పనులను కూడా మార్చిన గుత్తేదారుకే అప్పగించారు. అంటే రూ. 780 కోట్ల జగన్ గారి రివర్స్ ఆదాకు ఖర్చు రూ. 3,222 కోట్లు! పోలవరం ప్రాజెక్టులో తమ అనుమతి లేకుండా వైకాపా ప్రభుత్వం చేసిన ఖర్చులో రూ.1383 కోట్ల మేర బిల్లులను పోలవరం ప్రాజెక్టు అథారిటీ తిరస్కరించింది.
డయాఫ్రం వాల్ దెబ్బతిన్నదెందుకు?
పోలవరం ప్రాజెక్టు నిర్మాణంలో అత్యంత కీలకమైన డయాఫ్రంవాల్ నిర్మాణాన్ని చంద్రబాబు నాయుడు హయాంలో జర్మనీకి చెందిన బావర్ కంపెనీ, ఎల్అండ్‌టి కంపెనీలు రికార్డు సమయంలో పూర్తి చేశాయి. 2019 మే నాటికి మిగిలిన ఎగువ కాఫర్ డ్యాంలో 35.82 లక్షల క్యూబిక్ మీటర్లు, దిగువ కాఫర్ డ్యాంలో 25.46 లక్షల క్యూబిక్ మీటర్ల మట్టి పనిని 2020 మే నాటికి పూర్తి చేయాలని పీపీఏ రాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చరించినా జగన్ ప్రభుత్వం నిర్లక్ష్యం చేయడంతో, 2020 లో గోదావరి భారీ వరదల వలన ఎగువ కాఫర్ డ్యాంలో రెండు చోట్ల గోదావరి నదీ గర్భం పెద్ద ఎత్తున కోసుకు పోయింది, డయాఫ్రం వాల్ దెబ్బతింది అలవాటు ప్రకారం టీడీపీ ప్రభుత్వం కాఫర్ డ్యాంలు నిర్మించకపోవడం వల్లనే 2019 వరదల వలన నష్టం జరిగిందన్న వైకాపా నేతల గోబెల్స్ ప్రచారం అబద్ధమని పీపీఏ 11వ సమావేశం మినిట్స్ స్పష్టం చేస్తున్నాయి. నవయుగ సంస్థను తొలగించిన తరువాత పనులను అర్ధాంతరంగా 15 నెలల పాటు ఆపేసి, రివర్స్ టెండరింగ్ పేరుతో ఆలస్యం చేసినందు వలన 2020 ఆగస్టు – అక్టోబర్ మధ్య వచ్చిన వరదల్లో డయాఫ్రం వాల్ దెబ్బతిన్నదని నీతి ఆయోగ్ నియమించిన హైదరాబాద్ ఐఐటీ నిపుణుల బృందం స్పష్టం చేసింది.
నిర్మాణ జాప్యానికి ఎవరు కారణం?
ఈనెల 13వ తేదీన సమాచార హక్కు చట్టం క్రింద చైతన్య కుమార్ రెడ్డి అనే వ్యక్తికి కేంద్ర జలశక్తి మంత్రిత్వ శాఖ తరపున ఇచ్చిన సమాధానంలో, 2019 నుండి 2023 మధ్యలో పోలవరం నిర్మాణ జాప్యానికి, వ్యయం పెరుగుదలకు ప్రధాన కారణం రాష్ట్ర ప్రభుత్వ విధానాలే అని పీపీఎ తెగేసి చెప్పింది. రాష్ట్ర ప్రభుత్వం నిర్మాణ సంస్థను మార్చేసిందని, ప్రస్తుత నిర్మాణ సంస్థ మేఘా ఇంజనీరింగ్ .. ప్రణాళిక, వ్యూహాత్మక కార్యాచరణలో తీవ్రంగా వైఫల్యం చెందుతుందని ఆయన స్పష్టం చేశారు. ప్రాజెక్ట్ నిర్మాణ డిజైన్లను సమర్పించడంలో రాష్ట్ర ప్రభుత్వం విపరీతమైన జాప్యం చేస్తోందని, ఆమోదం పొందిన డీపీఆర్‌లోని డిజైన్లలో మార్పులు, చేర్పులు చేశారని, భూసేకరణ - సహాయ పునరావాస కార్యక్రమాలలో తీవ్ర జాప్యం చోటు చేసుకుంటోందని ఇచ్చిన సమాచారం అధికార పక్ష దుష్ప్రచారానికి చెంపపెట్టు. రూ. 423 కోట్ల ఖర్చుతో నిర్మించిన డయాఫ్రం వాల్ మరమ్మత్తు పనులకు రూ.1,599.21 కోట్లు ఖర్చు అవుతోందంటే రివర్స్ టెండర్ మహిమ అనుకోవాలా? మేఘా డిజైన్ చేసి అప్రోచ్ ఛానెల్లో స్పిల్‌వేకు ఎడమ వైపున 500 మీ. పొడవున, దాదాపు 52 మీ. ఎత్తున నిర్మిస్తున్న గైడ్ బండ్ ఇటీవల కుంగి పోవడం వలన కలిగిన రూ.81 కోట్ల నష్టానికి బాధ్యత ఎవరిది? పోలవరం సాగు నీటి ప్రాజెక్ట్ పనులు టీడీపీ హయాంలో మొదలైనప్పుడు చంద్రబాబు కేంద్ర ప్రభుత్వాన్ని ఒప్పించి గరిష్ట నీటి మట్టం 45.72 మీటర్లు, నిల్వ సామర్థ్యం 194.60 టిఎంసి లకు అనుమతి సాధిస్తే, దీనికి భిన్నంగా 41.5 మీటర్ల కాంటూరుకు (నిల్వ సామర్థ్యం 92 టిఎంసి) అంచనాలు సవరించి, పనుల కోసం రూ.10 వేల కోట్లు ఇవ్వాలని కేంద్ర ప్రభుత్వానికి రాష్ట్ర జలవనరుల శాఖ లేఖ రాయడం నిస్సందేహంగా ప్రజా ద్రోహమే.
ప్రగతిపథంలో పరుగులెత్తి 72 శాతం పనులు పూర్తి అయ్యి, జలయజ్ఞ ఫలాలు రాష్ట్రానికి అందే సమయంలో తెలివి తక్కువగా, కేంద్రం వారించినా వినకుండా రివర్స్ టెండరింగ్ పేరుతో చేసిన ప్రయోగం కారణంగా జరిగిన నిర్మాణ పనుల జాప్యం వలన భారీ నష్టం వాటిల్లింది. జగన్మోహన్ రెడ్డి చర్యల వలన ఆంధ్రప్రదేశ్ జీవనాడి పోలవరం సాకారం ప్రశ్నార్థకం అయ్యింది. స్వార్థ రాజకీయాలతో అన్నపూర్ణ వంటి ఆంధ్రప్రదేశ్ అభివృద్ధిని నాశనం చేస్తున్నారు. ఒక దార్శనికుని, ఒక నిత్య శ్రామికుని కాదని ఒక్క ఛాన్స్ అన్న వారిని ఎంచుకుని ఆంధ్రప్రదేశ్ దారుణంగా మోసపోయింది.
లింగమనేని శివరామప్రసాద్
79813 20543
Also Read: