మార్పును సంకేతిస్తున్న తెలంగాణ...!

Poet Jukanti Jagannadham wrote an open letter to KCR on the development of Telangana

Update: 2023-07-05 00:30 GMT

ముఖ్యమంత్రికి బహిరంగ లేఖ

అయ్యా మహారాజ రాజశ్రీ ముఖ్యమంత్రి గారు,

తెలంగాణ 4 కోట్ల ప్రజల కొరకు ప్రజల చేత ప్రజలు యొక్క భావాన్ని తమ సముఖమునకు నాతో అనగా బాధ్యతాయుతమైన కవినైనా పౌరులైన నా స్వదస్తూరితో రాయించుకున్న ఉత్తరం ఇది. తెలంగాణ సాధన ఒక ఎత్తు అయితే మరోవైపు తెలంగాణ ఉద్యమ కాలంలో టీఆర్ఎస్ అగ్ర నాయకత్వం మరొక వైపు రహస్య ఎజెండాను అమలుపరస్తూ వచ్చిన విషయం మీకు తెలియని కాదు. మలి దశ తెలంగాణ సాధన ఉద్యమంలో పాల్గొన్న అనేక దశలను మీరు అనేక ప్రభుత్వ కార్యక్రమాలలో తలమునకలై ఉండి మరుపునకు లోను అయ్యారేమోనని మరోసారి దృష్టికి మరోసారి తీసుకువస్తున్నాను. వంద రోజుల స్వచ్ఛంద సకల జనుల సమ్మె, కవుల రచయితల మేధావుల ప్రత్యేక రాష్ట్ర కాంక్ష లో సంస్కృతి భాష భావనలను ప్రచారం చేసిన ముఖ్యాంశాలు. అంతేగాక 1400 మంది వరకు యువకుల స్వచ్ఛంద ప్రాణత్యాగం రక్త తర్పణం చేసిన ఫలితంగానే తెలంగాణ సుసాధ్యమైంది. ఈ స్థితిని మనస్తత్వం శాస్త్రవేత్తలు కార్య కారణాలను రాజకీయ ప్రేరణలను విశ్లేషించిన తీరు యాదృచ్చికం కానేరదు.

ఇవన్నీ కాక అప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో అధికారంలో ఉన్న తెలంగాణ కాంగ్రెస్ ఎంపీలు, ఎమ్మెల్యేలు, మంత్రులు అనేక సందర్భాలలో ముఖ్యమంత్రిపైన తీవ్ర ఒత్తిడి పెట్టి ఉద్యమ వివిధ సందర్భాలలో అనుమతులు ఇప్పించిన సంగతి తెలంగాణ అంతా తెలిసినదే. ప్రత్యేక తెలంగాణ రాష్ట్రానికి కాంగ్రెస్ నాయకులు, కాంగ్రెస్ పార్టీ(congress party) త్రికరణ శుద్ధిగా మద్దతు ఇచ్చారనేది నిర్వివివాదాంశం.

సభకు వచ్చేవారిని అడ్డుకుంటారా?

1969 నాటి తెలంగాణ ఉద్యమానికి పురుడు పోసిన కొత్తగూడెం పోరాటానికి కేంద్రమైన విషయం మీకు తెలిసిందే ఉత్తరోత్తర మొన్న 2వ తారీఖున ఖమ్మంలో జరిగిన కాంగ్రెస్ పార్టీ భారీ బహిరంగ సభకు (jana garjana sabha) వస్తున్న వారిని అడ్డుకోవడం ఏ ప్రజాస్వామ్య స్ఫూర్తికి, కీర్తికి నిదర్శనమో మీరే చెప్పాలి. ప్రస్తుత ప్రభుత్వానికి ఇంత అసహనం ఉంటే, తెలంగాణ ఉద్యమ కాలంలో అప్పటి ఉమ్మడి రాష్ట్ర ప్రభుత్వం అనుకుంటే తెలంగాణ ఉద్యమం(telangana movement) ఒక ఇంచ్ కూడా ముందు కదలకుండా నిర్బంధించేవారు.

అంతేగాక నాటి పాలకులకు అంతో ఇంతో ప్రజాస్వామ్య స్ఫూర్తికి విఘాతం కలిగించవద్దనే భావన ఉంది. ఈ విషయాన్ని మరిచి ప్రభుత్వం నిర్బంధాన్ని పరోక్షంగాను ప్రత్యక్షంగానో ప్రయోగిస్తే, ప్రజా శ్రేణులు మరింత ముందుకు పోయి తమకు మోకా వచ్చేదాకా ఆగి ఎన్నికల సమయంలో ఓట్ల రూపంలో ప్రతిఘటిస్తారనేది మీరు మిక్కిలి ఎదిగిన విషయమే.

తమరికి తమ కుటుంబ సభ్యులకు ఆపద వస్తే ప్రజాస్వామ్యాన్ని కాలరాస్తున్నారని, అపకారం జరిగిందని చిందులు వేస్తారు. అదే ప్రజాస్వామ్యయుతంగా ఇతరులు సభలు, సమావేశాలు, హక్కుల సాధన కోసం నిరసన ప్రదర్శనలు, ఊరేగింపులు, ధర్నాలు చేస్తే డెమోక్రసీని బ్యూరోక్రసీ తోడుతో ఎక్కడికక్కడ బలప్రయోగంతో కట్టడి చేసి అపహాస్యం చేస్తారు. ఇంత ద్వంద్వ ప్రమాణాలు ఏలిన వారు కలిగి ఉండడం సబబు కాదు. ఇది ఎట్లా మునాసమవుతుందో మీరే గుండెల మీద చేయి వేసుకొని చెప్పండి సార్.

ముఖ్యమంత్రివర్యా! అప్పటివరకు వివిధ రూపాలలో అమలులో ఉన్న అన్ని రకాల సబ్సిడీలను ఎత్తేసి కొత్త సీసాలో పాత పథకాలకు మీరు రూపకల్పన చేసిన విధం విజ్ఞులకు తెలియనిది కాదు. ఒక్క సిద్దిపేట జిల్లాకు ఎన్ని నిధులు, ఎన్ని పదవులు ఇచ్చారో లెక్క తీస్తే తెలుస్తుంది. ఒకవేళ మీరు ఉమ్మడి మెదక్ జిల్లా పునాదిగా తెలంగాణ రాష్ట్ర ఉద్యమం చేస్తే కరీంనగర్‌లో, వరంగల్ లో ఎందుకు గర్జన సభలు నిర్వహించారో చెప్పగలరా? ఎందుకంటే ప్రత్యేక తెలంగాణ ఆకాంక్ష ఉత్తర తెలంగాణ ప్రజలలో దక్షిణ తెలంగాణ కన్నా బలంగా ఉండడమే కారణం. ఆ జిల్లాలో పుట్టడమే మీకు మీ పరివారానికి గొప్ప అయితే కావచ్చు గాక మిగతా జిల్లాలలోని ప్రజా సమూహాలు నాటి సంఘాల నాయకులు మీకు కంటిలో నలుసుగా ఎందుకు అయ్యారో సహేతుకంగా చెప్పగలరా? ప్రజల నిధులతో నిర్మించిన ప్రగతి భవన్‌లోకి, ప్రజలకు ప్రవేశం లేకపోవడం మరొక వింత వితండవాదం. ఇది ఏ ప్రజాస్వామ్య విలువలకు దర్పణం పడుతుంది సార్?

చర్మంతో చెప్పులు కుట్టించినా రుణం తీరదు

మీరు కరీంనగర్ పార్లమెంట్ సభ్యులుగా గెలిచి విజయ యాత్రలో కరీంనగర్ టవర్ దగ్గర ఈ జిల్లా ప్రజలకు చర్మంతో చెప్పులు కుట్టించినా రుణం తీరదని అన్నారని మేము అడగడం లేదు కదా. ఇప్పుడు మేము అప్పటి మీ వచనాలను వాగ్దానాలను ఎలా అర్థం చేసుకోవాలి? ఉత్తర తెలంగాణలో లక్షల సంవత్సరాల నుండి పోగు పడిన సహజ వనరుల తరలింపుకు ఏ వర్గాల వారు జవాబుదారీతనం వహించాలో చెప్పండి. మీరు ప్రైవేట్ విద్యను, ప్రైవేటు వైద్యాన్ని కావలసినంత ప్రోత్సహించినది ఎంత వాస్తవమో తొమ్మిదేళ్ల కాలంలో విద్యా, వైద్యానికి కేటాయించిన నిధులు అంతే ప్రబల తార్కాణం. ఒక్క మాటలో చెప్పాలంటే మీ సంక్షేమ పథకాల వ్యయానికి సమానం ఎక్సైజ్ ఆదాయం అవుతుందని ఆర్థిక నిపుణులు గణాంకాలతో నిరూపించారు కదా సార్. తత్ఫలితంగా తెలంగాణలో సామాన్యుల జీవన ప్రమాణాలు, సామాజిక ఆర్థిక రంగం కోలుకోకుండా విధ్వంసం (కు)కొలమానానికి అందనంతగా అతలాకుతలం అయిపోయింది.

ధరణితో భూమి పెడబొబ్బలు...

ఇకపోతే రైతుబంధు ఏ వర్గాల ప్రయోజనాలను కాపాడిందో అందరికీ తెలిసిందే. అన్నిటికన్నా మించి, ధరణి పథకంతో భూమి పెరగలేదు కానీ ఒకవేళ పెరిగే లక్షణం దానికి ఉంటే పెడబొబ్బలు పెట్టేది. ఒక్క రైతు చనిపోలేదని మీరు గొప్పగా చెప్తుంటారు కదా! సుమారు 25 లక్షల కౌలు రైతుల మాటేమిటి. వ్యవసాయం చేస్తున్నది ఎవరు? అప్పులు పుట్టక పండిన పంటకు గిట్టుబాటు ధర రాక నిలువునిస్తారంగా ఆత్మహత్యలు చేసుకున్నది, చేసుకుంటున్నది ఎవరు? దీనిలో ప్రభుత్వ పాలసీ ఎవరికి అనుకూలంగా ఉందో రైతు లోకానికి ప్రజలకు పూర్తిగా అర్థం అయ్యింది. ప్రజలు పన్నుల రూపంలో చెల్లించిన రాష్ట్ర ఖజానా తెలంగాణ ప్రజలకు ఎంత వరకు సద్వినియోగం అయిందో దీనికి మీరే ప్రజాక్షేత్రంలో సమాధానం చెప్పాలి.

రంగారెడ్డి చుట్టుపక్కల జిల్లాల తలసరి ఆదాయాన్ని మిగతా జిల్లాలకు వర్తింపజేసి జీడీపీ పెరిగి ఎన్నో రెట్లు ఆర్థిక అభివృద్ధి జరిగిందని మురిసిపోవడం మీకే చెల్లింది సార్. చివరగా తెలంగాణ సాధనలో ఉత్తర తెలంగాణ ప్రముఖ పాత్ర వహించిన సంగతి అందరికీ తెలుసు. కానీ ఉద్యమ కాలంలో నాయకులను ప్రజలను వేధించి తరిమికొట్టిన వారిని మీరు చేరదీసి చక్రాంకితులను చేసి తెలంగాణ వాదానికి, తెలంగాణ సంస్కృతికి, ప్రజల ఆకాంక్షలకు పాతర వేసిన తీరు ఎంత మాత్రం సమ్మతం కానేరదు. వ్యతిరేకులను చేరదీయడం ఎంతవరకు సమర్థనీయం? కాదు గాక కాదు..

తెలంగాణ 150 ఏళ్లు వెనక్కి...

చిట్టచివరగా తెలంగాణ త్యాగాల మట్టి మీద బమ్మెర పోతన, కాళోజీ మీద ఒట్టేసి సత్య ప్రమాణంగా చెబుతున్నాను. తొమ్మిదేళ్ల పరిపాలన కాలంలో మీ మీ వర్గాల కుటుంబాలు ఆర్థిక సామాజిక రంగాలలో 400 ఏళ్లు ముందుకు పోతే, యావత్ తెలంగాణ అన్ని రంగాలలో 150 ఏళ్ల వెనక్కి తిరోగమించింది. మిమ్మల్ని రెండుసార్లు గెలిపించినందుకు మాకు ఈ శాస్తి జరగాల్సిందే. జరగాల్సిందే మరి.

అయ్యా! ఇవాళ సిరిసిల్లలో ఒక సామాన్యుడు తన అభిప్రాయాన్ని వెలిబుచ్చిన తీరు మీ దృష్టికి తీసుకు వస్తాను. ‘తెలంగాణ తెచ్చిన అన్న వారిని రెండుసార్లు గెలిపించి చూసాం కదా ఇక ఇప్పుడు తెలంగాణ ఇచ్చిన పార్టీ వారి గురించి ఈ తేప ప్రజలు తీవ్రంగా ఆలోచిస్తున్నట్లుంది నాకు. అలా ఆలోచిస్తుంటే తప్పేం లేదు సార్" అన్నాడు . ఇప్పుడు మీ తానాతందానా బ్యాచ్‌ది వేరే విషయం. కానీ మిగతా తెలంగాణ ఆలోచన పరులు చెప్పలేని ఆందోళనకు గురి అవుతున్నారు. ఈ యోచనల వాయుగుండం క్రమంగా తుఫాను రూపం తీసుకొని అతి భారీ వర్షాలతో తెలంగాణ సామాన్య ప్రజలను ఉక్కిరి బిక్కిరి చేయనుంది. ఆ వరద ముంపులో ఏ రాజకీయ పార్టీ ఏ తీరం చేరుతుందో వేచి చూద్దాం.

ఇట్లు

జూకంటి జగన్నాథం

కవి, రచయిత

94410 78095

Tags:    

Similar News