యుగాది - ఉగాది

Poem on Ugadhi 2024

Update: 2024-04-09 00:30 GMT

మలయ మారతం వేళ

నా నడక ప్రయాణం

పడమటి సూరీడింకా

కొండకోనల్లోకి జారుకోలేదు

వెలుగు రేఖల నీడలు

పొడుగ్గా ఉండి అవతలి నుండి

ఎవరో పిలుస్తున్నట్టు

ఎదను తాకిన పిల్ల గాలి

రాయబారం అందింది

మరు మల్లెల సువాసన

నాతో దొంగాటాడుతోంది

నేను వెతికి ఓటమితో

జతకట్టాను

నాలో గతకాలపు నిరాశ రాలి

కొంగొత్త ఆశా చూరుల కేళి

తొలినాటి వలపు రాగాలాలపించాయి

లేత క్రొత్తగా మరో వత్సరపు దీప్తిగా

నా ప్రయాణం ముందుకు

భవిష్యత్తు ఆలోచనలు వేగం

ఇంకాస్త ముందుకు

కనులు తెరిచి చుస్తే

తెలుపు చీర మీద

ముదరాకుపచ్చ బుటాతో

నుదుటున ఎర్రని కిరణాల

సింధూరం నుదుటున అద్ది

నిండు ముత్తయిదువులా

ఆహ్వానం పలుకుతుంది

ఆనందాల హేళా

విలాసాల క్రీడలో

నన్ను నేను మరుస్తున్న

మురుస్తున్న సంధ్యా వేళలో

క్రీగంటి నన్ను పలకరించింది

మన యుగాది

నా మది ఉగాది..

యం. లక్ష్మి

తెలుగు అధ్యాపకులు

Tags:    

Similar News