కవిత: తెలుగు వెలుగు
కవిత: తెలుగు వెలుగు... poem on International Mother Language Day
శుభోదయం మొదలు
శుభరాత్రి వరకు
కళ్ళు వత్తులు చేయి
కనబడదు తెలుగు.
మమ్మీ డాడీ ముద్దు
వద్దు అమ్మా నాన్న
సోయి దప్పీ తెలుగు
సొమ్మసిల్లుత ఉంది.
దేశ భాషల యందు
మన తెలుగు లెస్సంట
చెప్పుకొనుటకు బాగు
చేతలలో 'లెస్' అంట.
తేనెకన్నా మధురం
మన తెలుగు భాష
ఆదరించకపోతే
పడుతుందిలే గోస.
మాతృభాషా చదువు
అమ్మలాంటి వరము
శిరముపై పరభాష
సవతమ్మ కరము.
అంత ఆంగ్లంబేన
ఏది మరి నీయాస
నీ మాతృ భాషపై
లేదెందుకో ధ్యాస.
భాష రక్షణ లోనె
జాతి రక్షణ ఉంది
భాష మరచిన జాతి
జగతిలో మిగలదు .
చిత్తశుధ్ధియు లేక
సభలెన్ని జరిపినా
లాభ మేమున్నదీ
ఫలితంబుమరి లేక.
అందుకే అందరూ
ప్రతిన బూనాలే
మాటల్లొ గాకుండ
చేతలలొ జూపాలే.
తెలుగు వెలుగులు పెంచి
తరతరాలకు పంచి
మన భాష ఘనకీర్తి
శిఖరాన నిలపాలె.!!
(నేడు అంతర్జాతీయ మాతృ భాషా దినోత్సవం)
యండి. ఉస్మాన్ ఖాన్
99125 80645