ముప్పేదో ముంచుకొస్తోంది

Poem on Indravelli Incident

Update: 2024-04-20 00:30 GMT

నిన్న చరబట్టిన వాళ్లే ఇవాళ ఓదార్చడానికి వస్తున్నారు

నీ బిడ్డల గుండెల్లో తూటాలు దింపిన వాళ్లే

ముసలి కన్నీటితో మళ్ళీ ఏదో కొత్త నాటకం మొదలు పెట్టారు.

తుపాకులు, పోలీసులు పక్కన లేకుండా

పూలు, పండ్లు చేత పట్టుకొని తిరుగుతున్నారు

ఓ నా తల్లీ ఇంద్రవెల్లి.. ముప్పేదో ముంచుకొస్తుంది

స్తూపాలని కూలగొట్టిన వాళ్లు

గూడేలను తగలబెట్టిన వాళ్లు

హక్కులడిగితే కాల్చి చంపినవాళ్లు

అడవి బిడ్డలను అణగదొక్కిన వాళ్లు

మన ఆడబిడ్డలను మానభంగం చేసిన వాళ్లు

ఇంద్రవెల్లి జిందాబాద్ అంటూ ఊసరవెల్లి అవతారమెత్తారు

ఓ నా తల్లి ఇంద్రవెల్లి... ముప్పేదో ముంచుకొస్తుంది

అమరులకు దండం పెడితే ఆంక్షలు పెట్టినోళ్లు

అన్నలకు అన్నం పెడితే కేసులు పెట్టినోళ్లు

అడవి మాదంటే కాదన్నోళ్లు

జల్ జంగిల్ జమీన్ కోసం పోరాడితే జైల్లో పెట్టినోళ్లు

అమరుల స్థూపాలపై పూలుచల్లుతూ

ఇంద్రవెల్లిని రంగవల్లిగా తీర్చిదిద్దుతామంటూ సభలు పెడుతున్నారు

ఓనాతల్లి ఇంద్రవెల్లి ముప్పేదో ముంచుకొస్తుంది

ఊసరవెల్లి నేతల మాటలకు ఇంద్రవెల్లి మోసపోదు

మీరు చేసిన గాయాలపై ఏ పూత పూసినా మానిపోదు

ఆదివాసీల హక్కుల పోరాటాల దిక్సూచి ఇంద్రవెల్లి

అడవి బిడ్డల ఆత్మగౌరవ ప్రతీక కూడా ఇంద్రవెల్లే

(పాలకులంతా ప్రస్తుతం ఇంద్రవెల్లిని కీర్తిస్తోంటే సందేహం కలుగుతోంది. ఇంద్రవెల్లికే కాదు ఆదివాసీ సమాజానికే ముప్పేదో ముంచుకొస్తోంది అనే దృక్పథంతో రాసిందీ కవిత)

క్రాంతి

85019 05444

Tags:    

Similar News