“వేశ్య” బ్రతుకులో పరకాయ ప్రవేశం చేసి
జీవన సత్యం విప్పిన ‘మినీ కవిత’ సామ్రాట్టు
ప్రపంచ గమనాన్ని ఒడిసిపట్టేందుకు
వినీలాకాశ విహారం చేసిన ‘ఎర్ర పావురం’
కెమెరా లెన్సుతో నగర జీవన గతిని
సామాన్యుని బతుకు స్థితిని బంధించి
వాడుక పదాల వాడితో వేడి పుట్టించి
లేజరు పెన్ను పత్తితో పెట్టిన ‘చురక’త్తి
ఇండియన్ ఇంకులో ముంచిన కుంచెతో
శ్రమ దోపిడిని, ధనరాశుల పాతరల్ని
సమాజ అంతర్గత ఎముకల గూళ్ళని
అశ్రు ధారల్ని చిత్రించిన ‘రక్త రేఖ’
పాకుడు రాళ్ల పథకాల కదలికను
కలిగినోళ్ళ కరబూజ దేహాల మత్తును
నాయకమాన్య బూటకాల దుమ్మును
ఉతికి ఆరేసిన ‘మంటల జెండా’
ముఖం చాటేయడం తెలియక
నగర మోసాల గాయాల బారిన పడినా
క్షయ పీల్చి పిప్పి చేసినా మడమ తిప్పని
గుండె లయకు తోడుగా నిలిచిన ‘సిటీ లైఫ్’
భౌతికంగా మరణించినా వెలుగులు చిమ్ముతూ
మరచిపోని చెరిగిపోని కవితా ఝరితో
‘మరణం నా చివరి చరణం కాదు’ అన్న ప్రభాకరుడు
మనోహరాకాశంలో నిత్యం జ్వలించే సూర్యుడు
-దాసరి నాగభూషణం,
8096511200