రుతు రాగాలు

Poem

Update: 2024-05-31 00:30 GMT

ఇన్నాళ్లు కుతకుత ఉడికిన నేలమ్మ

వాన రాకడను పసిగట్టింది

ఇదిగో దాహార్తితో దోసిలి పడుతున్నది!

చినుకుకు తెలుసు

మట్టితో మమేకం కానిదే

తనకు ప్రాణ ప్రతిష్ట జరగదని!

నాలుగు చినుకులు నేల రాలితే

చెట్టు పుట్ట పాము పక్షీ కొండా లోయ

సమస్తం పదహారు కళలతో

పరిఢవిల్లుతాయి!

ఎండా కాలమంతా మిట్ట మధ్యాహ్నం

సూర్యునికి వీపు రాసిచ్చిన శ్రామికుడు

చల్ల గాలి స్పర్శకు సేద తీరుతాడు!

ఎన్ని పరాభవాలు చవి చూసినా

కర్షకుని ఆనందంలో తేడా ఉండదు

మట్టిపై వానపై విశ్వాసం సడలదు!

తాపం తీరిన ప్రకృతి పరవశం

ఎప్పటిలా మనిషిలోని

జీవనోత్సాహాన్ని నిద్ర లేపుతుంది!

ఎన్నడూ కలవని నింగీ నేల మధ్య

వారధి నిర్మించేది ఒక్క వాన చినుకే

నేల రాలిందా నింగి

ఇంద్ర ధనుస్సు అవుతుంది!

రుతు పవనం కేరళ తీరం తాకితే చాలు

తెలంగాణ నూతనోద్వేగంతో

ఒంటి కాలు మీద నిలబడి

స్వాగతం పలుకుతుంది!!

- కోట్ల వెంకటేశ్వర రెడ్డి

94402 33261

Tags:    

Similar News