ఎన్నికల వేడి
సూర్య ప్రతాపాన్ని మరిపిస్తుంది
ఎన్నికల ప్రసంగాలు
హద్దులు లేని స్వేచ్ఛా విహంగాలై
జనాన్ని రెచ్చ గొడుతున్నవి.
పదునైన మాటలు
పట్టపగ్గాలు లేని తూటలు
బరితెగించిన మాటలు
విషం చిమ్మే కూతలు
గెలుపు కోసం ఎంతకైనా
దిగజారుడు మాటలు..
మొన్న ఒక మాట
నిన్న ఒక మాట
నేడొక మాట
రేపు ఏమిటో..
నిన్న పొగడ్తలు
నేడు తెగతెంపులు
గాలి ఎటు వీస్తుందో...
నరం లేని నాలుక ఏమంటుందో..
మొన్న ఒక జెండా
నిన్న ఒక జెండా..
నేడు ఒక జెండా..
రేపు ఎటో..
తన జెండా.. ఎజెండా
తెలియక తిక మక పడే జనం
ఓటు ఎటో..
నోటుకు ఓటు రాలదని తెలిసి
నోటికి వచ్చిన వాగ్దానాలు ఎన్నో..
తీర్చేవి ఎన్నో...తార్చేవి ఎన్నో..
బుకాయిస్తే అబద్ధం నిజం కాక పొద్దా..
బురద జల్లితే జనం నమ్మక పోతరా..
బరితెగిస్తే అడిగే దమ్ము ఎవడికి..
బాలెట్టు బాక్సులో ఓటు పడ్డాక
గెలిచే మొనగాడెవరో..
నీతి లేని రాజకీయాలు
నేతి లేని బీరకాయలు
సిగ్గు ఎగ్గు ఇడిస్తేనే కదా..గెలుపు
గెలిచేందుకు ఎందుకైనా.. సై
ఓడించేందుకు ఎందుకైనా.. సై
గెలుపే ముఖ్యం..
అది అడ్డ దారైన సరే..
దొడ్డి దారైనా సరే..
సత్యం అహింస..అప్పుడు
నిత్యం హింస ఇప్పుడు..
నీతి నిజాయితీ అప్పుడు
అవినీతి అందలం ఇప్పుడు..
దేశ ప్రజల కోసం అప్పుడు
స్వంత ప్రయోజనం కోసం ఇప్పుడు
అదే మారిన రాజకీయం..
నీతి మాలిన నాయకులు..
చేష్టలు ఉడిగిన జనం
మూగ బోయిన కవులు మేధావులు
నిప్పులు కక్కే సూరిడి వేడికి
మూర్చబోయిన ప్రజాస్వామ్యం..
శిరందాస్ శ్రీనివాస్
94416 73339