ఆరోగ్య పరిరక్షణలో ఫార్మసిస్టు పాత్ర కీలకం
Pharmacist role in health care is crucial
మానవారోగ్యం సురక్షితంగా ఉంచడంలో ఔషధాల పాత్ర ప్రధానమైనది. మారుతున్న కాలంలో అవసరానికి అనుగుణంగా ఔషధాల తయారీ, వినియోగం విపరీతంగా పెరిగిపోయింది. ప్రతి ఒక్కరూ ఆరోగ్యం కోసం ఔషధాల మీదనే ఆధారపడుతున్నారు. ఏ చిన్న సుస్తీ చేసినా ఏదో ఒక మందును వాడడం పరిపాటి అయిపోయింది. అలాంటి ఔషధాలను తయారు చేసేవారిని ఫార్మసిస్టులు అంటారు. వారు ఔషధ సృష్టికర్తలు! వారి కఠోర శ్రమ, ప్రయత్నాల ఫలితమే ప్రజారోగ్య పరిరక్షణ. అందుకే వారి అమూల్యమైన సేవలను ప్రజలకూ, ప్రభుత్వాలకూ గుర్తుచేయడానికి ఇంటర్నేషనల్ ఫార్మాస్యూటికల్ ఫెడరేషన్ (FIP) ప్రతి సంవత్సరం వివిధ కార్యక్రమాలు చేపడుతుంది. అలాగే ఔషధ రంగంలో వీరి పాత్రను ప్రతిబింబిస్తూ ప్రతియేడూ సెప్టెంబర్ 25న ప్రపంచ ఫార్మసిస్టుల దినోత్సవాన్ని నిర్వహిస్తోంది.
అన్ని చట్టాల లాగానే..
ఆరోగ్య వ్యవస్థను బలోపేతం చేయడంలో వీరి పాత్ర విస్మరించలేనిది. ప్రపంచానికి ఆరోగ్యం అందించడం కోసం అహర్నిశలు పాటు పడుతున్నది ఫార్మసిస్టులే. అందుకే ఆరోగ్య కేంద్రాల్లో అత్యవసర పరిస్థితుల్లో వైద్యాధికారులు అందుబాటులో లేనప్పుడు చికిత్స అందించే బాధ్యత వారి భుజాలపైనే పెట్టారు. శంకర్రావు చవాన్ పార్లమెంటరీ సబ్ కమిటీ ఈ విషయాన్ని అధికారికంగా ధృవీకరించింది.అలాగే కేంద్ర ఆరోగ్యశాఖ జాతీయ ఆరోగ్య విధానం 2017లో ఫార్మాసిస్టు విశిష్టతను గుర్తించి. ఫార్మసిస్టులకు సామాజిక ఆరోగ్యంపై శిక్షణ ఇచ్చి వారి సేవలను క్షేత్రస్థాయిలో వినియోగించుకోవాలని సూచించింది.అలాగే అజిత్ ప్రసాద్ జైన్ అధ్యక్షతన ఏర్పాటైన స్టడీ గ్రూప్ ఆన్ హాస్పిటల్స్, చిన్నపాటి వైద్యశాలల్లో కూడా కనీసం ముగ్గురు ఫార్మసిస్టులు ఉండాలని 1966 లోనే సిఫారసు చేసింది. ఈ అవసరాన్ని స్వాతంత్ర్యం తొలినాళ్ళలోనే గుర్తించిన నాటి దేశాధినేతలు ప్రజారోగ్య పరిరక్షణే ధ్యేయంగా 1948లో ఫార్మసీ చట్టానికి రూపకల్పన చేశారు. అయితే అన్ని చట్టాలకు లాగానే ఇది కూడా పాక్షిక అమలుకే పరిమితమైపోయింది.
వారిద్దరి మధ్య సంధానకర్తగా..
ఆరోగ్యం పదికాలాల పాటు పదిలంగా ఉండాలంటే అందులో ఫార్మసిస్టు పాత్ర అత్యంత ప్రధానం. ప్రపంచవ్యాప్తంగా నానాటికీ పెరిగిపోతున్న కొత్తకొత్త వ్యాధులనూ, వైరస్‌లను దృష్టిలో ఉంచుకొని, దానికి తగినట్లుగా కొత్తమందులను తయారు చేయడం, నివారణా మార్గాలు కనుగొనడంలో ఫార్మసిస్టు పాత్ర కీలకం. ప్రపంచ దేశాలకు తీసిపోని విధంగా నూతన ఔషధాల ఆవిష్కరణలో మన దేశ ఫార్మసిస్టుల కృషి శ్లాఘనీయం. ఔషధాల తయారీ, వాటి నాణ్యతా ప్రమాణాలను పర్యవేక్షించడం, తగిన సాంకేతిక పరిజ్ఞానంతో ఔషధాలను నిల్వచేయడం, వ్యాధిగ్రస్తులకు మందుల వినియోగ విధానం పట్ల తగిన సూచనలు, సలహాలు అందజేయడం, వాటి దుష్ఫలితాల పట్ల అవగాహన కల్పించడం లాంటి అనేక విషయాల్లో ఫార్మాసిస్టు పాత్ర విస్మరించలేనిది. ఔషధాన్ని ఏ మోతాదులో ఎలా వినియోగించుకోవాలో ఫార్మసిస్టులే అవగాహన కల్పించగలరు. రోగికి వైద్యునికి మధ్య ఒక సంధానకర్తగా వ్యవహరించి, ప్రజారోగ్య పరిరక్షణలో తన భూమికను బాధ్యతాయుతంగా నిర్వర్తిస్తాడు ఫార్మసిస్టు. చికిత్స ద్వారా ఆశించిన ఫలితం రావాలంటే ఫార్మసిస్టు ప్రమేయం తప్పనిసరి. ఎందుకంటే, ఏ వ్యాధికి ఏ మందు ఏవిధంగా పనిచేస్తుందో తెలిసేది ఒక్క ఫార్మసిస్టుకే. అంతేకాదు కొన్ని సమయాల్లో వైద్యులు రాసిన మందులను సమీక్షించే అధికారం కూడా ఫార్మసిస్టుకు ఉంటుంది.
ఔషధ ప్రమాణంలో నిర్ణయాధికారం!
జర్మనీ, ఫ్రాన్స్ , బ్రిటన్ , ఇటలీ లాంటి యూరోపియన్ దేశాల్లో, సౌదీ అరేబియా లాంటి అరబ్ దేశాల్లో ఫార్మసిస్టులకు పెద్దపీట వేస్తారు. ఆయాదేశాల్లోని వైద్యులు పరీక్షల అనంతరం వ్యాధిని గుర్తించి, ఫలానా వ్యాధి, ఫలానా మందు అని నిర్ధారణ చేస్తారు. ఆ వ్యాధికి ఏ ఔషధం సరిపోతుందో, అది ఏఏ సమయాల్లో, ఏ మోతాదులో, ఏవిధంగా వినియోగించాలో ఫార్మసిస్టే రోగికి సూచిస్తాడు. కొన్ని యూరప్ దేశాల్లో రోగివ్యాధిని గుర్తించి, ఔషధాన్ని సిఫారసు చేసే అధికారం కూడా ఫార్మసిస్టుకు ఉంటుంది. కానీ మన దేశంలో పరిస్థితి దీనికి పూర్తి భిన్నం. ఫార్మసిస్టుకు, వైద్యునికి మధ్య అసలు సంబంధమే ఉండదు. అటువంటి వ్యవస్థే ఇక్కడ ఉనికిలో లేదు.
మందుల పంపిణీలో ఏమాత్రం అజాగ్రత్త, నిర్లక్ష్యం జరిగినా ఆరోగ్యం ప్రభావితమవుతుంది. ఔషధాన్ని సరైన విధానంలో, సరైన మోతాదులో వినియోగిస్తేనే రోగి త్వరిత గతిన కోలుకునే అవకాశాలు ఉంటాయి. అందుకని ఫార్మసిస్టు పర్యవేక్షణలోనే వ్యాధిగ్రస్తులకు మందుల పంపిణీ జరగాలి. నిజానికి ఫార్మసిస్టు లేకుండా మందూలేదు, చికిత్సాలేదు. ఇంతటి ప్రాముఖ్యం ఉన్న ఫార్మసిస్టులను ప్రభుత్వాలు పట్టించుకోవడం లేదు. వైద్యశాలలో రోగుల సంఖ్యకు అనుగుణంగా తగినంతమంది ఫార్మసిస్టుల నియామకం లేదు. పదోన్నతులు లేవు. ఇన్ పేషంట్‌లకు వార్డ్ ఫార్మసిస్టు వ్యవస్థ లేదు. బస్తీ దవాఖానాల్లో అసలు ఫార్మసిస్టులే లేరు. జాతీయ ఆరోగ్య కార్యక్రమాలలో వారి జాడే ఉండదు. ఫలితంగా అన్ని రకాల అర్హతలు ఉన్న ఫార్మసిస్టులు కూడా చిరుద్యోగులుగా, నిరుద్యోగులుగా ఆత్మన్యూనతా భావంతో నలిగిపోతున్నారు. దీని వల్ల ఫార్మసిస్టులు వ్యక్తిగతంగా నష్ట పోవచ్చు కాని, ఈ లోపభూయిష్టమైన ఆరోగ్య వ్యవస్థ వల్ల నిజంగా నష్ట పోయేదిమాత్రం ప్రజలే. ఇప్పటికైనా వారిని అన్నీ ప్రభుత్వ ఆరోగ్య కేంద్రాలలో నియమించాలి. వారికి ఉపాధి అవకాశాలు కల్పించాలి. ప్రతియేటా ప్రపంచ ఫార్మసిస్టు దినోత్సవం జరుపుకుంటున్న సందర్భాల్లోనైనా ఫార్మసిస్టుల సంక్షేమాన్ని గురించి పాలకవర్గాలు ఆలోచన చేయాలి.
(రేపు ప్రపంచ ఫార్మసిస్టుల దినోత్సవం)
- ఎండి. ఫారూఖ్ జునైద్ ఖాన్
ఫార్మసిస్ట్
78934 94103