పెగాసస్ నిఘా.. విలువలకు దగా

Pegasus surveillance.. is unethical

Update: 2023-12-31 00:45 GMT

దేశ పౌరుల, విపక్ష నేతల, న్యాయమూర్తుల, జర్నలిస్టుల వ్యక్తిగత గోప్య సమాచారాన్ని పెగాసెస్ నిఘా సాఫ్ట్‌వేర్ ద్వారా సేకరించటం చట్టరీత్యా, నైతికంగా కూడా క్షమించరాని నేరం. ఇలాంటి నీతి బాహ్య విషయాలకు కేంద్ర ప్రభుత్వమే పూనుకోవటం శోచనీయం.

ఇజ్రాయేల్ దేశానికి చెందిన 'పెగాసస్' నిఘా సాఫ్ట్‌వేర్‌తో కేంద్ర ప్రభుత్వం హ్యాకింగ్‌కు పాల్పడిందన్న ఆరోపణలకు తాజాగా బలం చేకూరింది. ప్రభుత్వ ప్రాయోజిత హ్యాకర్లతో దేశంలోని ప్రముఖుల ఐఫోన్లను లక్ష్యంగా చేసుకున్నారంటూ 'యాపిల్' సంస్థ నుంచి ముందస్తు అప్రమత్తతతో కూడిన హెచ్ఛరిక సందేశాలు అక్టోబర్‌లో వచ్చిన విషయం ప్రజలందరికీ తెలిసిందే. ఈ నేపథ్యంలో ఇద్దరు భారతీయ జర్నలిస్టులు అనుమానించి తమ ఫోన్లను ల్యాబ్ పరీక్షలకు పంపగా, అవి 'పెగాసస్ స్పైవేర్' హ్యాకింగ్‌కు గురయ్యాయని తెలిసింది. తమ సెక్యూరిటీ ల్యాబ్ పరీక్షలో ఈ విషయం నిర్ధారణ అయిందని లాభాపేక్ష లేని అంతర్జాతీయ సంస్థ 'ఆమ్నెస్టీ ఇంటర్నేషనల్ ' గురువారం 28-12-2023న ప్రకటించింది. దీనితో ఆనాడు చాలామందికి పొరపాటున అలాంటి అలర్ట్‌లు వచ్చాయని ఆపిల్ సంస్థ ఇచ్చిన వివరణ తప్పు అని తేలిపోయింది.

తమ 'నిఘా సాఫ్ట్‌వేర్'ను కేవలం కేవలం సార్వభౌమ దేశాల ప్రభుత్వాలకే విక్రయిస్తామని, వ్యక్తులకు, ప్రయివేట్ సంస్థలకు విక్రయించమని కూడా ఇజ్రాయేల్‌కు చెందిన 'పెగాసస్' సంస్థ స్పష్టంగా పేర్కొంది. భారత్‌‌కు చెందిన నిఘా విభాగం సైతం ఇదే సంస్థ నుంచి కొంత హార్డ్‌వేర్‌ను 2017లో కొనుగోలు చేసినట్లు మన దేశ వాణిజ్య గణాంకాల్లో కూడా వివరాలు స్పష్టంగా గతంలోనే వెల్లడైంది. ఈ స్పైవేర్ సహాయంతో మన భారత దేశంలోని ప్రముఖ విపక్ష, అనుమానిత స్వపక్ష రాజకీయవేత్తల, సామాజిక కార్యకర్తల, న్యాయమూర్తుల, జర్నలిస్టుల ఫోన్లను హ్యాక్ చేసి వారి వ్యక్తిగత సంభాషణలు, ఇతర గోప్యత గల సమాచారాన్ని అధికార వర్గాలు భారతీయ చట్టాలకు వ్యతిరేకంగా సేకరించారని 2021 జూలై నెలలో అంతర్జాతీయ మీడియాలో సంచలన కథనాలు కూడా వెలువడిన విషయం తెలిసిందే. 'ది వైర్' వార్తా సంస్థ వెబ్సైట్ ఎడిటర్ సిద్ధార్థ్ వరదరాజన్, ఆర్గనైజ్డ్ క్రైమ్స్ అండ్ కరప్షన్ రిపోర్ట్ ప్రాజెక్ట్ (ఓ.సీ.సీ.ఆర్.పీ.) సౌత్ ఆసియా ఎడిటర్ ఆనంద్ మంగ్నాలే ఫోన్లను హ్యాకర్లు లక్ష్యంగా చేసుకున్నారని 'ఆమ్నెస్టీ ఇంటర్నేషనల్ సంస్థ' వెల్లడించింది.

ఈ వివాదాన్ని కప్పిపుచ్చే ఉద్దేశంతో భారత ప్రభుత్వమే యాపిల్ సంస్థపై ఒత్తిడి తీసుకువచ్చి తప్పుడు అలెర్ట్‌లు ఇతర దేశాలకు కూడా వచ్చాయని చెప్పించిందని 'వాషింగ్టన్ పోస్ట్' పేర్కొంది. భారత్ లోనే కాదు ప్రపంచవ్యాప్తంగా 150 దేశాల ఐఫోన్ల యూజర్లకు ఇలా పొరపాటున అలర్టు వెళ్లాయి అని ఆపిల్ ఆనాడు బొంకింది. రాహుల్ గాంధీతో సహా పలువురు విపక్ష నేతలు, జడ్జీలు సామాజిక కార్యకర్తల ఫోన్ల హ్యాకింగ్ ఉదంతం గతంలో పార్లమెంటులోనూ కుదిపేసింది. ఇంత జరిగినా తాము స్పైవేర్‌ను కొనలేదు, వినియోగించలేదు అని మోదీ ప్రభుత్వం చెప్పకపోవడం గమనార్హం. భారత రక్షణ నిఘా విభాగానికి చెందిన సిగ్నల్ ఇంటెలిజెంట్ డైరెక్టరేట్ గతంలో 'కాగ్నెసైట్' అనే సంస్థ నుంచి నిఘా పరికరాలు కొనుగోలు చేసిందని ఆరోపణలు వచ్చాయి. ఏది ఏమైనా దేశ పౌరుల, విపక్ష నేతల, న్యాయమూర్తుల, జర్నలిస్టుల వ్యక్తిగత గోప్య సమాచారాన్ని సేకరించటం చట్టరీత్యా, నైతికంగా కూడా క్షమించరాని నేరం. ఇలాంటి నీతి బాహ్య విషయాలకు కేంద్ర ప్రభుత్వమే పూనుకోవటం శోచనీయం.

డా. కోలాహలం రామ్ కిశోర్

98493 28496

Tags:    

Similar News