ఆన్‌లైన్ తరగతుల్లో స్వతః లోపాలు

Online classes are more useful rather than offline

Update: 2024-05-21 01:00 GMT

ఆన్‌లైన్ తరగతులపై తల్లిదండ్రుల్లో ఒక దురాభిప్రాయం ఉంది. ఈ తరగతుల వలన.. పిల్లలు నేర్చుకోవడం తక్కువ జరుగుతుందని. కానీ అది నిరాధారమైన అభిప్రాయం. కొవిడ్ సమయంలో ఐఐటీ, జేఈఈలో సంపూర్ణ మార్కులు తెచ్చుకున్న ఒక అభ్యర్థి ఆన్‌లైన్ తరగతుల వల్లే తనకు ఈ విజయం సాధ్యమైందని జరిగిందని చెప్పాడు. ఆన్‌లైన్ తరగతుల వల్ల తను ప్రయాణ సమయాన్ని కూడా తనకు నేర్చుకోవడానికి, అభ్యాసం చేసుకోవడానికి వినియోగించినట్టు, తద్వారా సమయం ఆదా అయిందని చెప్పాడు.

నిజానికి, ఆన్‌లైన్ తరగతులతో చాలా ఉపయోగాలున్నాయి. దీని ద్వారా మొత్తం బోధన రికార్డు చేసుకోవచ్చు. ఈ రికార్డులను ఎప్పుడు కావాలంటే అప్పుడు విద్యార్థి పునశ్చరణ కొరకు ఉపయోగించుకోవచ్చు.. అంతా రికార్డు అవుతుంది కాబట్టి. అయితే, ఆన్‌లైన్ తరగతులపై ఉన్న ఈ అపోహకి మూల కారణం - అవగాహన లేమి మాత్రమే! విద్యార్థికి నేర్చుకోవాలన్న కోరిక ఉండాలి. అది కలిగే వాతావరణం ఇంట్లో కల్పించాలి. ఉపాధ్యాయునికి తను బోధించబోయే విషయంపై సరైన పట్టు ఉండాలి. పిల్లలకు సరిగా అర్థం అయ్యేట్టు చెప్పాలన్న లక్ష్యం ఉండాలి. అసలు తంటా ఈ రెండింటిలో ఒకటి గాని, రెండూ గాని లేకపోవడం వల్ల వస్తుంది. అదే జరిగితే, ఆఫ్‌లైన్‌లో కూడా ఫలితం పర్యవసానం అలానే ఉంటుంది. తేడా అసలు ఉండదు. అసలు విద్యార్థి నేర్చుకోవడానికి ఆన్‌లైన్, ఆఫ్‌లైన్‌కి సంబంధం లేదు. ఏ చదువులోనైనా విద్యార్థి, ఉపాధ్యాయుడు బాధ్యతగా వ్యవహరించాలి.

చదువుపై నిరాసక్తతకి కారణం..

విద్యార్థికి నేర్చుకోవాలనే దశలో.. తల్లిదండ్రుల పాత్ర ఎంతో ఉంటుంది. వారు పిల్లలలో చదువుపై ఆసక్తి కలగజేయాలి. వారిలో నిజాయితీ, నేర్చుకోవాలన్న తపన కలిగించాలి. పోటీ మనస్తత్వం కలిగించాలి. ఆలోచించే మనస్తత్వం, ప్రశ్నించే నిర్భయత్వం పెంపొందించాలి. కష్టపడి చదివి, ఉత్తమ ర్యాంకులు సాధించి, నలుగురికీ ప్రమాణంగా నిలవాలన్న కోరిక కలిగించాలి. విజయ సాధన వలన కలిగే గుర్తింపుపై ఆకలి పెంచాలి. ప్రయత్న లోపం ఉండరాదని అవగతపరచాలి. తమ వంతు కృషి చేసి, ఫలితాలను పరిస్థితులకు విడిచిపెట్టాలని బోధించాలి. ఈ ప్రయత్నంలో బలవంతం, నిర్బంధం లేకుండా జాగ్రత్త వహించాలి. పిల్లలు నిజాయతీ, శ్రమించే గుణం లాంటివి తల్లిదండ్రుల నుంచి నకలుగా నేర్చుకుంటారు. తల్లిదండ్రులను చాలా మటుకు వాటిని అనుకరిస్తారు. అందుకే పెద్దలు పిల్లలకు ఆదర్శవంతంగా మెలగాలి. పిల్లలలో చదువుపై నిరాసక్తతకి కారణం.. పునాది. కానీ ఇప్పటి చాలామంది విద్యార్థులలో అది ఉండటం లేదు. ఇప్పుడు విద్యావ్యవస్థలో అందరూ పై తరగతికి ఉత్తీర్ణత పొందుతారు వారు ఎంత నేర్చుకున్నారన్న దానితో సంబంధం లేకుండా..! ఇది చాలా అవివేకమైన నిర్ణయం. కింది తరగతిలో విషయ అవగాహన లేకపోతే, పై తరగతి విషయాలు ఎలా అర్థం అవుతాయి?

పునాది చదువు బలంగా ఉంటే..

ఈ పైకి తోపుడు విధానం వల్ల, పిల్లలు ఏమీ అర్థం చేసుకోలేక, బట్టీ పద్ధతికి అలవాటు పడి, అదే జీవిత విధానం అవుతుంది. దాని పర్యవసానంగా, ఒక నిర్లక్ష్య ధోరణి, అలసత్వం, తేలికగా తీసుకునే విధానం ఏర్పడుతుంది. దీని ప్రభావం విద్యార్థి జీవితంపైనే కాక సమాజం మీద పడుతుంది. సమాజంలో మనం గమనిస్తున్న అవలక్షణాలన్నీ ఈ దృక్పథం నుంచి వచ్చినవే. అందుకే పునాది యొక్క ప్రాధాన్యత విస్మరించకూడనిది. పునాది చదువు బలంగా ఉంటే, విద్యార్థి పుస్తకాల నుంచి, ఇతర సాధనాల నుంచి, తన చొరవతోనే, తన ప్రయత్నంతోనే, ఇతరుల సాయం లేకుండానే సరదాగా, హాయిగా నేర్చుకోగలుగుతాడు. ఇది నా స్వయం అనుభవం. నా విద్యార్థుల అనుభవం. ఆన్‌లైన్, ఆఫ్‌లైన్‌లు అవసరం లేదు. అందుకే పునాది బలపరిచే విధంగా మన కృషి జరగాలి. ఒకవేళ పునాది బలహీనంగా ఉంటే, పైకితోసే విధానం మాని, కనీస పునాది కల్పించి పైతరగతులకు పంపించాలి. తల్లిదండ్రుల్లో ఆన్‌లైన్ తరగతులపై ఒక అభిప్రాయం ఉంది. ఆన్‌లైన్ తరగతుల్లో నేర్చుకోవడం తక్కువ ఉంటుందిని.. కానీ అది నిజం కాదు.

ఎక్కడో ఉన్న లోపాలను ఆపాదించి..

కొవిడ్ సమయంలో ఇంటి నుంచే చాలా మంది పిల్లలు ఆన్‌లైన్ తరగతుల్లోనే నేర్చుకున్నారు. ముఖ్యంగా సామాన్య జనానికి ఈ సమయంలోనే ఆన్‌లైన్ తరగతుల పరిచయం ఏర్పడింది. బహుళజాతి సంస్థలలో ఈ విధానం ఎప్పటి నుంచో ఉన్నది. తప్పని పరిస్థితుల్లో పిల్లలందరికీ మొబైల్ ఫోన్ గానీ, కంప్యూటర్ గానీ సమకూర్చవలసిన అగత్యం ఏర్పడింది. పిల్లలు చాలామంది ఎప్పటిలాగానే నిరాసక్తతతోనే కనిపించారు ఆన్‌లైన్ తరగతులలో.. అది దగ్గర నుంచి గమనించిన తల్లిదండ్రులు ఇది ఆన్‌లైన్ ప్రత్యేకత అని భావించి, ఆన్‌లైన్ అంటే ఒక తేలిక భావం, వ్యతిరేకత ఏర్పరచుకున్నారు. అది ఒక అహేతుకమైన భావన. ఎక్కడైనా, ఎప్పుడైనా సరైన బోధన అవకాశం కలిగించేది ఆన్‌లైన్ తరగతి. ప్రపంచంలో ఎన్నో అంశాలు సాంకేతికంగా అభివృద్ధి చెందుతున్నాయి. ఎన్నో పనులు ఇంటి నుంచే ఏ ఇబ్బంది లేకుండా సుఖంగా చేరుకోగలుగుతున్నాం. సాంకేతిక అభివృద్ధి మన ప్రయాణాలను, మన సమాచార వ్యవస్థలను సౌకర్యవంతం చేస్తున్నాయి. విద్య నేర్చుకునే విధానంలో సంభవించిన పరిణామాలలో ఈ ఆన్‌లైన్ విధానం ఎంతో ఉపయోగకరం అయినది. దీనిని అర్థం చేసుకోకుండా ఎక్కడో ఉన్న లోపాలను దీనికి ఆపాదించి, ఉపయోగించుకోకపోతే నష్టపోయేది మనమే అని గుర్తుంచుకోవాలి.

సీతారామరాజు

రిటైర్డ్ సైంటిస్టు, డీఆర్‌డీఓ

72595 20872

Tags:    

Similar News