వన్ రిజిస్ట్రేషన్ తగదు
కేంద్రానికి, రాష్ట్రాలకు ఏ రకమైన అధికారాలు ఉండాలన్న విషయంలో రాజ్యాంగ నిర్మాతలు రచనా కాలంలో చాలా చర్చలు జరిపారు.
ఇప్పటికే దేశంలో కొన్ని కోట్ల మంది వాహనదారుల ఉన్నారు. వాహనం చరాస్తి. భూమి స్థిరాస్తి, చెట్లు, గుట్టలు, నదులు, సముద్రాలకు ఆనుకొని ఉన్న భూములకు అన్ని రకాల రిజిస్ట్రేషన్లను కేవలం ఒక్క సాఫ్ట్‌వేర్ ద్వారా యావత్ దేశానికి వర్తించే విధంగా చట్టం చేయడం, ప్రజలకు పారదర్శకత ఇస్తామనడం ఆచరణ సాధ్యం కాని విషయం. ఎకరం, అర ఎకరం, రెండు గుంటలు, గుంట ఇలా ఎన్ని నెంబర్లు ఇస్తారు? క్షేత్రస్థాయిలో భూమి నిరూపణలు, స్థానికతను ఎలా నిర్ధారిస్తారు? కేంద్రం ముందుగా పూర్తి సర్వే చేయాలి. ప్రతి చిన్న హోల్డింగ్‌కి భరోసానివ్వాలి. అప్పుడు ఒక ప్రయత్నం చేసుకోవచ్చు. అలా చేయకుండా ఎవరూ అడగని పెద్దరికాన్ని నెత్తిన వేసుకోవద్దు.
కేంద్రానికి, రాష్ట్రాలకు ఏ రకమైన అధికారాలు ఉండాలన్న విషయంలో రాజ్యాంగ నిర్మాతలు రచనా కాలంలో చాలా చర్చలు జరిపారు. చివరకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు సమాన అధికారాలు ఇస్తూనే, కేంద్ర ప్రభుత్వానికి కొన్ని విషయాలలో మాత్రమే అదనపు అధికారాలు కట్టబెట్టారు. నేడు బీజేపీ ప్రభుత్వం రాజ్యాంగ స్ఫూర్తిని తుంగలో తొక్కుతున్నది. కేంద్రం బలంగా ఉండాలనేది బీజేపీ ఆలోచన. అప్పుడే తమకు కావాలసినట్లు రాజ్యాంగాన్ని సవరణ చేసుకోవచ్చని భావిస్తున్నారు. అందులో భాగంగానే 'ఒకే దేశం-ఒకే ఎన్నికలు' 'ఒకే దేశం-ఒకే టాక్స్' ఒకే దేశం-ఒకే ఎగ్జామినేషన్' లాంటివి ప్రవేశపెట్టారు.
ఇపుడు 'ఒకే దేశం-ఒకే రిజిస్ట్రేషన్' అనే విధానాన్ని తీసుకురాబోతున్నారు. దేశ ప్రజలందరికీ అర్థం కాకుండా, ఎవరూ అడగకుండానే బీజేపీ కొత్త కొత్త ఆలోచనలు చేస్తున్నది. 'ఒకే దేశం-ఒకే కులం' అనే ఆలోచన కూడా వారి మనసులో ఉన్నదే కదా? పార్లమెంటులో, రాష్ట్రాలలో తీర్మానాలు చేయండి, రాజ్యాంగ సవరణలు చేయండి. నిజంగానే 'దేశం వెలిగిపోతుంది' అనే నినాదానికి పరిపూర్ణత చేకూరుతుంది. నిజానికి 'ఒకే దేశం-ఒకే రిజిస్ట్రేషన్' అంటే రాష్ట్రాల హక్కులకు గండికొట్టడమే.
రికార్డులు లేని రాష్ట్రాలే అధికం
రాష్ట్రాలకు ప్రధాన ఆదాయం ఎక్సైజ్, రిజిస్ట్రేషన్ మాత్రమే. ఇప్పటికే జీఎస్టీని అమలులోకి తెచ్చారు. సెంట్రల్ జీఎస్టీ, స్టేట్ జీఎస్టీ అని రెండు వేరు వేరుగా వసూలు చేస్తారు. ఈ రెండు పన్నులు కూడా ముందుగా కేంద్రానికే వెళ్తాయి. తర్వాత రాష్ట్రాలకు వారి వాటాలను కేటాయిస్తారు. ఈ ప్రక్రియ ఎప్పుడు కూడా న్యాయంగా జరగలేదనే ఆరోపణలు ఉన్నాయి. రాష్ట్ర ప్రభుత్వాలు ఎప్పుడూ కేంద్రాన్ని దేబిరిస్తూనే ఉండాలి. ఇప్పుడు 'ఒకే దేశం-ఒకే రిజిస్ట్రేషన్'లాంటివి సమగ్ర భూ సర్వే లేకుండా అమలు చేస్తే అది మరో ధరణి గా మారుతుంది.
కేంద్రం, రాష్ట్రాల ఆదాయ వనరులను గుప్పిటలో ఉంచుకోవాలనే ఏకైక తపనతో కేంద్రం ఈ పని చేస్తున్నది. ఈ రిజిస్ట్రేషన్ విధానం కేవలం భూములకే కాకుండా, వాహనాలకు కూడా వర్తిస్తుందని తెలిపింది. ప్రస్తుతం రాష్ట్రాల రవాణా శాఖలు వెహికల్ రిజిస్ట్రేషన్ బాధ్యత చూసుకుంటున్నాయి. భూ హక్కులకు సంబంధించి రాష్ట్రాలలోనే తెగని పంచాయతీలు చాలానే ఉన్నాయి. అసలు ఇప్పటికీ సమగ్ర భూ రికార్డులు లేని రాష్ట్రాలే అధికంగా ఉన్నాయి.
సాఫ్ట్‌వేర్ తో సరిపోదు
'ఒకే దేశం-ఒకే రిజిస్ట్రేషన్' విధానం వినడానికి వినసొంపుగా ఉంది. కేవలం ఒక సాఫ్ట్‌వేర్ రూపకల్పనతో ఇదంతా జరుగుతుందని అనుకోవచ్చు. నిజానికి ఇది రియల్ ఎస్టేట్ వ్యాపారులకు లాభంగా ఉండవచ్చు. వారు భారీ ఎత్తున తమ వ్యాపార సామ్రాజ్యాన్ని విస్తరించడానికి ఉపయోగపడుతుంది. సామాన్య ప్రజలకు ఏ ప్రయోజనమూ ఉండదు. కేంద్రం ఒకే రిజిస్ట్రేషన్ ఒకే విధానంలో సంబంధిత రిజిస్ట్రేషన్‌కు 14 నంబర్ గల ఒక యూనిక్ సంఖ్యను ఇస్తుంది. దీనిని 'నేషనల్ జెనెరిక్ డాక్యుమెంట్ రిజిస్ట్రేషన్ సిస్టం' అంటారు. దీని ద్వారా కశ్మీర్ సహా ఎక్కడివారు అయినా, ఎక్కడైనా ఆస్తులు కొనుక్కోవచ్చు అనేది కేంద్రం ఆలోచన.
దీని వలన చిన్న చిన్న కమతాల వారికి అన్యాయం జరిగితే అడిగే అవకాశాలు ఉండవు. స్థానిక రిజిస్ట్రేషన్‌లో పొరపాటు జరిగితే రాష్ట్రాలు, జిల్లాలు, మండలాలవారీగా సంబంధిత సబ్ రిజిష్ట్రార్ ను ప్రశ్నించవచ్చు. కొత్త విధానానికి కేంద్రం పరిభాషలో 'డిజిటల్ ఇండియా ల్యాండ్ రికార్డు మోడర్‌నైజేషన్ ప్రోగ్రాం' అంటున్నారు. ఇప్పటికే ఈ ప్రక్రియ 24 రాష్ట్రాలలో పూర్తి అయిందంటున్నారు. బలిష్టమైన భూమి రికార్డులు, రెవెన్యూ వ్యవస్థ అంతా కంప్యూటరైజ్డ్ అవుతాయంటున్నారు. దీంతో పేపర్ లెస్ అమ్మకాలకు, కొనుగోలుకు మధ్య సమయం వృధా కాదని, మధ్యవర్తులు ఉండరని, అధికారుల వేధింపులు తక్కువ అవుతాయని చెబుతున్నారు.
అదే అసలు సమస్య
కానీ, ఇది ఆచరణ సాధ్యం కాని పని అని ఖచ్చితంగా చెప్పవచ్చు. ఇలాంటి మామూలు పని పద్ధతులను రాష్ట్రాలే చూసుకోవాలి. పారదర్శకత లేకపోతేనో, పెద్ద సమస్య వచ్చినప్పుడు మాత్రమే కేంద్రం జోక్యం చేసుకోవాలి. కేంద్ర ప్రభుత్వం 'నేల విడిచి సాము' చేస్తున్నది. 'జబ్బు ఒకటి అయితే మందు మరొకటి' పెడుతున్నాది. ఇప్పటివరకు రెవెన్యూ వ్యవస్థకు ప్రధాన సమస్య సరియైన సర్వే చేయకపోవడమే. మన రాష్ట్రాల వరకు వస్తే 1931లో అప్పటి ఆంధ్రప్రదేశ్‌లో మాత్రమే ల్యాండ్ సర్వే జరిగింది. తెలంగాణలో ఇప్పటి దాకా జరగలేదు.తెలంగాణ ప్రభుత్వం ఒక్క ఇంచు భూమి కూడా వదలకుండా భూ సర్వే చేస్తామన్నది. ఇంతవరకు చేయలేదు. కేంద్రానికి స్పష్టత లేకుండా ఇలాంటివి ముందరికి తీసుకురావద్దు.
ఇప్పటికే దేశంలో కొన్ని కోట్ల మంది వాహనదారుల ఉన్నారు. వాహనం చరాస్తి. భూమి స్థిరాస్తి, చెట్లు, గుట్టలు, నదులు, సముద్రాలకు ఆనుకొని ఉన్న భూములకు అన్ని రకాల రిజిస్ట్రేషన్లను కేవలం ఒక్క సాఫ్ట్‌వేర్ ద్వారా యావత్ దేశానికి వర్తించే విధంగా చట్టం చేయడం, ప్రజలకు పారదర్శకత ఇస్తామనడం ఆచరణ సాధ్యం కాని విషయం. ఎకరం, అర ఎకరం, రెండు గుంటలు, గుంట ఇలా ఎన్ని నెంబర్లు ఇస్తారు? క్షేత్రస్థాయిలో భూమి నిరూపణలు, స్థానికతను ఎలా నిర్ధారిస్తారు? కేంద్రం ముందుగా పూర్తి సర్వే చేయాలి. ప్రతి చిన్న హోల్డింగ్‌కి భరోసానివ్వాలి. అప్పుడు ఒక ప్రయత్నం చేసుకోవచ్చు. అలా చేయకుండా ఎవరూ అడగని పెద్దరికాన్ని నెత్తిన వేసుకోవద్దు.
వి. బాలరాజు
రిటైర్డ్ తహశీల్దారు
94409 39160