ఓబీసీ క్రీమీలేయర్‌పై పునర్విచారణ అవసరం!
ఎస్సీ వర్గీకరణ సమస్యపై సుప్రీంకోర్టు తీర్పు ఇస్తూ.. ఎలాంటి విచారణా పరిధి లేకుండానే క్రీమీలేయర్ ప్రస్తావన తీసుకు రావడం తీవ్ర
ఎస్సీ వర్గీకరణ సమస్యపై సుప్రీంకోర్టు తీర్పు ఇస్తూ.. ఎలాంటి విచారణా పరిధి లేకుండానే క్రీమీలేయర్ ప్రస్తావన తీసుకు రావడం తీవ్ర విమర్శలకు దారితీసింది. సుప్రీంకోర్టు న్యాయమూర్తులు తమ పరిధిని అతిక్రమించారంటూ బహుజన ఉద్యమకారులు, సామాజికవేత్తలూ అభ్యంతరం వ్యక్తపరిచారు. సదరు తీర్పులో క్రీమీలేయర్‌పై న్యాయమూర్తులు వెలిబుచ్చిన అభిప్రాయాలని పరిగణించేది లేదంటూ.. ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్లకు క్రీమీలేయర్ పరిమితి విధించే ఆలోచన లేదంటూ కేంద్ర ప్రభుత్వం స్పష్టమైన ప్రకటన జారీ చేయాల్సి వచ్చింది. మరి ఓబీసీ వర్గాలకు మాత్రం క్రీమీలేయర్ నిబంధన సమంజసమేనా? ఇప్పటి వలెనే, నాడు సైతం.. అనగా, మండల్ కమిషన్ తీర్పు సమయంలో.. క్రీమీలేయర్ భావనను అవసరం లేకున్నా తీసుకువచ్చారా?
రిజర్వేషన్ ఫలాలను అణచివేయబడ్డ వర్గాలకు అందించే క్రమంలో క్రీమీలేయర్ నిబంధన.. అడ్డంకిగా నిలుస్తున్నదా? ఆశయ సాధనకు ఉపకరిస్తున్నదా..? అనే చర్చ నేడు దేశవ్యాప్తంగా సాగుతున్నది. సామాజిక న్యాయమనేది.. మన రాజ్యాంగ లక్ష్యాలను నెరవేర్చే ఒక మహత్తర సాధనం. అది గతిశీలమే కాకుండా.. ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా రూపు మార్చుకుంటుంది.
వ్యతిరేకిస్తున్న వారిని చల్లబరచడానికి..
వెనుకబడిన వర్గాలకు రిజర్వేషన్ల హక్కును సంక్రమింపజేసిన రాజ్యాంగపు అధికరణలలో ఎక్కడా క్రీమీలేయర్ ప్రస్తావనే లేదు. 7 ఆగస్టు, 1990న.. మండల్ కమిషన్ సిఫారసులు అమలు పరుస్తూ, వెనుకబడిన వర్గాలకు రిజర్వేషన్స్ కల్పించనున్నామని నాటి వీపీ సింగ్ ప్రభుత్వం ప్రకటించడంతో దేశవ్యాప్తంగా ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. బలహీన వర్గాల హక్కులను అంగీకరించని ఆధిపత్య వర్గాల వారు గొడవలు సృష్టించారు. ఓబీసీ రిజర్వేషన్లను వ్యతిరేకిస్తూ ఇంద్రా సాహ్ని అనే ఒక లాయర్ వేసిన కేసు సుప్రీంకోర్టుకు చేరింది. ఆ పరిస్థితుల్లో.. వ్యతిరేకిస్తున్న వారిని చల్లబరచడానికి.. ఎవరూ అడగని క్రీమీలేయర్ నిబంధనని న్యాయమూర్తులు ముందుకు తీసుకొచ్చారు.
రిజర్వేషన్ లక్ష్యం పేదరిక నిర్మూలన కాదు..
వెనుకబడిన వర్గాల రిజర్వేషన్ల వెసులుబాటు కల్పించిన రాజ్యాంగ అధికరణం 16(4), సామాజిక వెనుకబాటుకు గురైన వర్గాలకు రాజ్య వ్యవస్థలో తగిన ప్రాతినిధ్యం కల్పించడమే రిజర్వేషన్ల అసలు ఉద్దేశమని స్పష్టీకరిస్తున్నది. రిజర్వేషన్ వ్యవస్థ పేదరిక నిర్మూలన పథకం కాదు. వేల ఏళ్ల కుల వివక్ష కారణంగా ప్రాతినిధ్యానికి నోచుకోని వర్గాలకు తగిన ప్రాతినిధ్యం కల్పించాలి తప్ప.. ఆ వర్గాలలోని వారు పేదవారా, సంపన్న వర్గమా.. అనే ప్రశ్న ఉత్పన్నం కారాదు. ఓబీసీ కోటా నియామక ప్రక్రి యలో.. ఆ వర్గంలోని పేదవారికి మొదటి ప్రాధాన్యత ఇచ్చి, క్రీమీలేయర్‌గా గుర్తించబడిన వారికి రెండవ ప్రాధాన్యత ఇచ్చే.. ప్రాధాన్యతా విధానం పాటించినా కొంత మేరకు సమంజసంగా ఉండేది. క్రీమీలేయర్ పేరు తో మొత్తానికే మినహాయించిన కారణంగా ఓబీసీ వర్గాలకు దక్కాల్సిన ఉద్యోగాలు ఆధిపత్య వర్గాల పాలవుతున్నాయి. రిజర్వేషన్ వ్యవస్థ లక్ష్యం నీరుగారి పోతున్నది.
మూడు దశాబ్దాలు గడిచినా..
2022-23 సంవత్సరానికి కేంద్ర ప్రభుత్వం విడుదల చేసిన గణాంకాల ప్రకారం.. ప్రభుత్వ ఉద్యోగాల్లో ఓబీసీ వర్గాల వాటా 22 శాతానికే పరిమితమై ఉన్నది. గ్రూప్ -ఏ ఉద్యోగాలలో దక్కిన వాటా కేవలం 18 శాతం మాత్రమే. ఉన్నత స్థాయి బ్యూరోక్రసీలో నామమాత్రం వాటా సైతం లేదు. వివిధ మంత్రిత్వ శాఖలలోని.. జాయింట్ సెక్రటరీ నుండి సెక్రటరీ వరకు ఉన్న అధికారగణం మొత్తం 451 అయితే.. అందులో కేవలం 13 మంది మాత్రమే ఓబీసీలు ఉన్నారు. ఐఐటీ, ఐఐఎం, సెంట్రల్ వర్సిటీలలో ఓబీసీ ప్రొఫెసర్లు ఉన్నది 4 శాతమే. 60 శాతం వరకు జనాభా ఉన్న వర్గానికి 27 శాతం రిజర్వేషన్లు కేటాయించి మూడు దశాబ్దాలు గడిచిన తర్వాత నెలకొన్న పరిస్థితి ఇది! క్రీమీలేయర్, నాట్ ఫౌండ్ సూటబుల్ అనేవి నేటి కాలపు పురుష సూక్తంగా పనిచేస్తూ, కొత్త తరహా మను వ్యవస్థను సృష్టిస్తున్నాయని బహుజన ఉద్యమకారులు ఆక్షేపిస్తున్నారు. జనాభాలో 10% కూడా లేని ఆధిపత్య వర్గాల వారు.. 90 శాతం ఉన్నతోద్యోగాలను తమ గుప్పిట్లోనే నేటికీ పెట్టుకోగలిగారంటే.. కుల వ్యవస్థ ఈ దేశంలో రూపుమాసిందని, గత కాలపు ముచ్చటని.. ఎవరైనా ఎలా అనగలరు?
సామాజిక న్యాయం అందించడం కోసం..
సామాజిక న్యాయం నేడు అందరూ అంగీకరిస్తున్న సత్యం. 35 ఏళ్ల క్రితం.. విశ్వనాథ ప్రతాప్ సింగ్ ప్రభుత్వం మండల్ కమిషన్ సిఫారసుల అమలుకు పూనుకున్నప్పుడు.. ఆధిపత్య వర్గాలు నానా యాగీ చేశాయి. దేశవ్యాప్తంగా అల్లర్లు సృష్టించాయి. 1990 పంద్రాగస్టు సంబరాలలో.. ఎర్రకోటపై త్రివర్ణ పతాకం ఎగరవేసి ప్రసంగించిన వీపీ సింగ్.. 'ఓబీసీ రిజర్వేషన్ల వ్యవస్థ పురుడు పోసుకున్నది. బయటకు వచ్చిన బిడ్డను మళ్లీ తల్లి గర్భంలోకి నెట్టి వేయడం సాధ్యమయ్యే పని కాదు' అంటూ తేల్చి చెప్పేశారు. ఈ మూడు దశాబ్దాలలో బీసీ బిడ్డలకు దక్కాల్సిన సామాజిక న్యాయం గురించి సమాజంలో మరింత సానుకూల వాతావరణం ఏర్పడింది. కులగణన కూడదని వ్యతిరేకించిన వర్గాలు సైతం.. నేడు తమ అభ్యంతరాలని అటకెక్కిస్తున్నాయి. కులగణన అంశానికి ఒక శాస్త్రీయ పరిష్కారం అందించడంతోపాటు క్రీమీలేయర్ నిబంధనపై పునర్విచారణ చేపడితేనే.. మెజారిటీ వర్గాల ఆకాంక్షలకు గుర్తింపు లభించినట్టు అవుతుంది. సామాజిక వివక్ష కారణంగా సమ అభివృద్ధికి నోచుకోని వర్గాలకు సామాజిక న్యాయం అందించడమనేది.. ఆయా వర్గాలకు అందించే భిక్ష కానే కాదు. దేశ పునర్నిర్మాణ ప్రక్రియలో అది ఒక భాగం.
- ఆర్. రాజేశమ్,
కన్వీనర్, సామాజిక న్యాయ వేదిక.
94404 43183