ఎన్టీఆర్ వ్యక్తి కాదు శక్తి.. ఆయనొక సంచలనం, తెలుగువాడి విశ్వరూపం. ఆయన ఆత్మగౌరవ నినాదం తెలుగుజాతి గుండెల్లో జాతీయగీతంలా నేటికీ మారుమోగుతూనే ఉంది. మనం ఎక్కడ పుట్టాం, ఎలా పుట్టామన్నది ముఖ్యం కాదు. ఆ ప్రాంతానికి, ఆ జాతికి ఏం చేశాం, వారిలో ఎంత స్ఫూర్తిని నింపావన్నది ముఖ్యం. అలాంటి కారణజన్ముడు, యుగపురుషుడే ఎన్టీఆర్. అందుకే ఆయన చరిత్ర జాతిజనులు పాడుకునే జాతి గీతికలయ్యాయి. తెలుగుజాతి చరిత్రను తిరగరాసిన ఆయన చరిత్ర భావితరాలకు భగవద్గీత అవుతుంది. రాజకీయాల్లో మహానాయకుడిగా, వెండితెరపై రారాజుగా వెలుగొంది తెలుగుదనానికి ప్రతిరూపంగా నిలిచారు. రాజకీయ, సినీరంగంపైనే కాదు.. యావత్ తెలుగు నేలపై ఎన్టీఆర్ పేరు చెరగని సంతకం.
కుటుంబ నేపథ్యం
కృష్ణా జిల్లా నిమ్మకూరు గ్రామంలో వెంకటరావమ్మ, లక్ష్మయ్య చౌదరి దంపతులకు 1923, మే 28న జన్మించారు. ఎన్టీఆర్‌కు బసవతారకంతో 1942, ఏప్రిల్ 22వ తేదీన వివాహం జరిగింది. ఆయన 1947లో గుంటూరు ఏసీ కళాశాలలో డిగ్రీ తీసుకుని సబ్ రిజిస్ట్రార్ ఉద్యోగంలో చేరారు. కానీ ఎక్కువ కాలం దానిలో ఇమడలేక పోయారు. ఆ దంపతులకు 11 మంది సంతానం. అందులో ఏడుగురు కుమారులు, నలుగురు కుమార్తెలు. జయకృష్ణ, సాయికృష్ణ. హరికృష్ణ, మోహనకృష్ణ, బాలకృష్ణ, రామకృష్ణ, జయశంకర్ కృష్ణ కుమారులు కాగా, గారపాటి లోకేశ్వరి, దగ్గుబాటి పురంధరేశ్వరి, నారా భువనేశ్వరి, కంటమనేని ఉమామహేశ్వరి కుమార్తెలు. ఎన్టీఆర్ సతీమణి బసవతారకం క్యాన్సర్ తో మరణించడంతో ఆమె పేరుతో క్యాన్సర్ హాస్పిటల్ నిర్మాణం చేసి లక్షలాది మంది క్యాన్సర్ రోగులకు సేవలందిస్తున్నారు. ఎన్టీఆర్ ట్రస్ట్ ద్వారా వివిధ రూపాల్లో సామాజిక సేవా కార్యక్రమాలు చేస్తున్నారు.
సినీరంగ ప్రవేశం
ఒక మహానటుడుగా తెలుగు ప్రజల నీరాజనాలు అందుకున్నారు. సినీ వినీలాకాశంలో ధ్రువతారగా వెలుగొందారు. సినీ ప్రపంచంలో ఒక అరుదైన సుందర సాంస్కృతిక స్వప్నాన్ని సాకారం చేశారు. అక్షరాన్ని ఆయుధంగా మలచి, సాహితీ జగత్తుని శాసించి, సమాజాన్ని కదిలించారు. హీరో అంటే అందరికీ ఎలా ఆదర్శంగా ఉండాలో భవిష్యత్ తరాలకు తెలియజెప్పిన ఘనత ఆయన సొంతం. అందుకే దశాబ్దాలు గడిచినా ప్రేక్షకుల గుండెల్లో చెరగని స్థానం సంపాదించుకున్నారు. తెలుగు తెరపై అందాల రాముడైనా, కొంటె కృష్ణుడైనా, ఏడు కొండలవాడైనా ఇలా ఏ పాత్రైనా ఎన్టీఆర్ చేస్తేనే ఆ పాత్రలకు నిండుదనం వస్తుంది. కేవలం పౌరాణిక పాత్రలే కాదు.. సాంఘిక, జానపద, చారిత్రక సినిమాలు ఏవైనా ఆయన నటిస్తే ఆ పాత్ర పరిపూర్ణమవుతుంది. తెలుగు సినీ చరిత్రలో సాటిలేని కథానాయకుడిగా అభిమానుల గుండెల్లో చిరస్థాయిగా నిలిచారు. ఆయనలోని నటుడిని గుర్తించిన ప్రముఖ దర్శక, నిర్మాత బీఏ సుబ్బారావు 'పల్లెటూరి పిల్ల' చిత్రంలో అవకాశం ఇచ్చారు. ఆ సినిమా ఆలస్యం కావడంతో 'మనదేశం' సినిమా తొలిచిత్రం అయింది. విజయ సంస్థతో కుదిరిన ఒప్పందంతో ఎన్టీఆర్ ఆ సంస్థకు ఆస్థాన నటుడయ్యారు. 1951లో కేవీ రెడ్డి దర్శకత్వంలో విజయ సంస్థ నిర్మించిన పాతాళభైరవి సినిమాతో నటుడిగా ఎన్టీఆర్ పేరు సుస్థిరమైంది. 1956 లో విడుదలైన మాయాబజార్లో తొలిసారి శ్రీకృష్ణుడిగా నటించి మెప్పించారు. పౌరాణిక పాత్రలకు ఈ చిత్రంతోనే నాంది పలికారు. వెండితెరపై కృష్ణుడంటే రామారావే అనేంతగా బలమైన ముద్ర వేశారు. తర్వాత కృష్ణుడిగా ఎన్టీఆర్ 30 సినిమాల్లో కనిపించి అభిమానులను అలరించారు.
ఎన్టీఆర్ తొలిసారిగా రాముడి గెటప్‌లో 'చరణదాసి' అనే సాంఘిక చిత్రంలో కనిపించారు. శ్రీరాముడి గెటప్ లో పూర్తిస్థాయిలో కనిపించింది మాత్రం తెలుగు సినిమాలోనే కాదు తమిళంలో తీసిన 'సంపూర్ణ రామాయణం'లో, ఆ తర్వాత 1963లో విడుదలైన 'లవకుశ' సినిమా రాముడిగా ఎన్టీఆర్ కు ఎనలేని కీర్తిప్రతిష్టలు సంపాదించి పెట్టింది. 1959లో ఏవీఎం సంస్థ నిర్మించిన 'భూకైలాస్' చిత్రంలో రావణబ్రహ్మ పాత్రకు జీవం పోశారు. ఆ తర్వాత తన సొంత బ్యానర్ ఎన్ఏటీపై నిర్మించిన 'సీతారామ కల్యాణం' సినిమాకు తొలిసారి దర్శకత్వం వహించారు. అందులో రావణుడిగా నటించి మెప్పించారు. 'వేంకటేశ్వరస్వామి మహత్యం', 'శ్రీ తిరుపతి వేంకటేశ్వరస్వామి కల్యాణం' సినిమాల్లో వేంకటేశ్వరుడిగా మెప్పించారు. ఎన్టీఆర్ నటించిన చిత్రాల్లో దాదాపు 97 శాతం చిత్రాలు బాక్సాఫీస్ వద్ద విజయం సాధించాయి. పౌరాణికాలే కాదు.. జానపద సినిమా హీరోగా కూడా ఎన్టీఆర్ తిరుగులేని మాస్ ఇమేజ్ సంపాదించుకున్నారు. 1977లో తెరకెక్కిన 'అడవిరాముడు' సినిమాతో ఎన్టీఆర్ క్రేజ్ ఎన్నో రెట్లు పెరిగింది. అదే ఏడాదిలో విడుదలైన 'దానవీరశూర కర్ణ' మధురానుభూతిని మిగిల్చింది. అందులో ఆయన పోషించిన శ్రీకృష్ణ, కర్ణ, దుర్యోధన పాత్రలు అనితరసాధ్యం అనే చెప్పాలి. 'యమగోల'తో సహా 1977లో ఒకే ఏడాది మూడు ఇండస్ట్రీ హిట్లు కొట్టారు. అలాగే ఎన్టీఆర్ స్టార్ హీరోగా ఉండగానే తాత, తండ్రి, మనవడుగా 'కులగౌరవం' చిత్రంలో త్రిపాత్రాభినయం చేశారు. ఇక ద్విపాత్రాభినయం కలిగిన చిత్రాలను లెక్కలేనన్ని పోషించారు.
రాజకీయాల్లోకి వచ్చాక కూడా బ్రహ్మర్షి విశ్వామిత్ర, సామ్రాట్ అశోక్, మేజర్ చంద్రకాంత్, శ్రీనాథ కవి సార్వభౌమ లాంటి చారిత్రక, పౌరాణిక, సాంఘిక చిత్రాలు తీసి తనకు తానే సాటి అనిపించుకున్నారు. ఎన్టీఆర్ తన 44 ఏళ్ల సినీ జీవితంలో 13 చారిత్రకాలు, 55 జానపదాలు, 186 సాంఘికాలు, 44 పౌరాణిక చిత్రాలు చేసి తెలుగుతెరపై చెరగని ముద్ర వేశారు. అంతేకాదు హిందీ, తమిళ భాషల్లో పలు చిత్రాల్లో నటించారు. తాను నటించిన చిత్రాల్లో ఐదోవంతు సినిమాలను ఎన్టీఆర్ రైతు నేపథ్యం, గ్రామీణ నేపథ్యం ఉన్న కథలతోనే ఎక్కువగా నటించారు. సాంఘిక సినిమాల్లోనే కాదు.. పౌరాణిక, జానపద, చారిత్రక చిత్రాల్లో కూడా సందర్భానుసారం రైతును గుర్తుచేసుకున్నారు. నాలుగు దశాబ్దాల పాటు తనను ఆరాధించిన ప్రజలకు ఏదైనా చేయాలనే తపనతోటే రాజకీయ రంగం ప్రవేశం చేశారు. సినీ రంగంలో ఉన్నప్పుడు కూడా చైనా దురాక్రమణ జరిగిన సమయంలో అమరజవానుల కుటుంబాలను ఆదుకోవడం కోసం, దివిసీమ ఉప్పెన సందర్భంలోనూ జోలెపట్టి ఊరూరా తిరిగి, నిధులు సేకరించి బాధితులను ఆదుకున్నారు.
రాజకీయ రంగ ప్రవేశం
ఎన్టీఆర్ రాజకీయరంగ ప్రవేశం చేసే నాటికి రాష్ట్రంలో రాజకీయ శూన్యత, అస్థిరత్వం నెలకొని ఉన్నాయి. తెలుగు జాతికి, భాషకు గుర్తింపు లేకుండా పోయింది. మహోజ్వల చరిత్ర కలిగిన తెలుగుజాతి ఉనికిని కోల్పోయే పరిస్థితులు వచ్చాయి. ఆనాటి ఢిల్లీ కాంగ్రెస్ పెద్దలు ఏడాదికి నలుగురు ముఖ్యమంత్రులను మారుస్తూ తెలుగువాడి ఆత్మగౌరవాన్ని హస్తినాపురంలో అణాపైసలకు అమ్మకానికి పెట్టారు. ఏ క్షణం ఎవరు ముఖ్యమంత్రి అవుతారో, ఎవరు ఎంతకాలం ఉంటారో ఎవరికీ తెలియదు. ప్రజాభిప్రాయానికి తావులేకుండా సీల్డ్ కవర్‌లో అభ్యర్థుల పేర్లు వచ్చేవి. ప్రజా సమస్యలు గాలికి వదిలి అభివృద్ధిని నీరుగార్చారు. ముఠాలు, గ్రూపులు నిత్యకృత్యం అయ్యాయి. ఢిల్లీ పెద్దలు తెలుగు ప్రజల పట్ల చిన్నచూపు చూసేవారు. కాంగ్రెస్ పాలనలో సంక్షేమం, అభివృద్ధి కరువైంది. దైనందిన పాలనకు రాజకీయ గ్రహణం పట్టింది. ఢిల్లీ నుంచి గల్లీ దాకా అవినీతి పేరుకుపోయింది. ఎవరికి చెప్పుకోవాలో దిక్కుతోచక ప్రజలు అల్లాడిపోయారు. కాంగ్రెస్ కుటిల రాజకీయాలతో దిగజారిన పాలనా ముఖచిత్రాన్ని చూసిన ఎన్టీఆర్ సింహగర్జన చేస్తూ విప్లవ శంఖాన్ని పూరించారు.
1982 మార్చి 29న న్యూ ఎమ్మెల్యే క్వార్టర్స్‌లో పార్టీని ప్రకటించారు. ఎన్టీఆర్ ఏది ప్రారంభించినా అది తిరుగులేని విజయమే. తెలుగుజాతి ఆత్మగౌరవం, సామాజిక న్యాయం, ప్రజాసంక్షేమం అనే సిద్ధాంతాలపై తెలుగుదేశం పార్టీ నిర్మితమైంది. కార్మికుల కరిగిన కండల్లో నుంచి, రైతు కూలీల రక్తంలో నుంచి, కష్టజీవుల కంటి మంటల్లో నుంచి, నిరుపేదల కన్నీటి నుంచి, అన్నార్తుల ఆక్రందనల్లో నుంచి, శ్రామికుడి స్వేదం నుంచి, ఆడపడుచుల ఆర్తనాదాల్లో నుంచి పుట్టిన పార్టీ తెలుగుదేశం అని ఆనాడు తన ఆవేశపూరిత ప్రసంగాలతో ఎన్టీఆర్ ప్రజలకు దగ్గరయ్యారు. కాంగ్రెస్ అవినీతి, ప్రజా వ్యతిరేక విధానాలపై 9 నెలలు అవిశ్రాంతంగా పర్యటించి ప్రజలను చైతన్య పరిచారు.
జనం మైళ్లకు మైళ్లు నడుచుకుంటూ పగలు, రాత్రిళ్లు తేడా లేకుండా తనను ఒక్కసారి చూడాలని, ఆయన ప్రసంగం వినాలని లక్షల సంఖ్యలో ప్రజలు హాజరయ్యేవారు. అశేష ప్రజానీకానికి ఆయన అన్నగా మారారు. మహిళలను తెలుగింటి ఆడపడుచులు అంటూ పలకరించి అభయమిచ్చేవారు. 9 నెలల పాటు అవిశ్రాంతంగా పల్లెలు, పట్టణాలు, నగరాలు కలియతిరిగారు. ప్రతి ఓటరును తన ప్రసంగాలతో కదిలించి, అదిలించి పలకరించారు. సంక్షేమ రాజకీయాన్ని ఉద్భోదించి ఉర్రూతలూగిస్తూ ఆవేశం రగిల్చారు. “తెలుగుదేశం పిలుస్తోంది.. రా! కదలిరా!” అంటూ నినదించారు. ఆనాటి కాంగ్రెస్ పార్టీని కుక్కమూతి పిందెలతో, దుష్ట కాంగ్రెస్, భ్రష్ట కాంగ్రెస్, నికృష్ట కాంగ్రెస్‌గా అభివర్ణిస్తూ వారిని నగ్నంగా నిలిపారు. ఎన్టీఆర్ ను చూసేందుకు ప్రజలు పడిన తపన... వారిని పలకరించేందుకు అన్న చూపిన అభిమానం.. ఈ ఇద్దరి పరస్పర అనుబంధం చారిత్రాత్మక సన్నివేశాలను ఆవిష్కరించింది. దారిపొడవునా పెద్దలు, వృద్ధులు, మహిళలు, యువకులు, కార్మికులు, కర్షకులు, అన్ని వర్గాల ప్రజలు తమ కథానాయకుడిపై అభిమానంతో, ఆప్యాయతతో ఆయన వెంట పరుగులు తీశారు. ఒకవైపు తన రాజకీయ వ్యూహాలకు పదునుపెడుతూ.. మరోవైపు స్థానిక యువతతో మాట్లాడుతూ ఆయా స్థానిక సమస్యలను గుర్తించేవారు. తర్వాత వాటి పరిష్కారాలను వాగ్దాన రూపంలో గుప్పించేవారు. తెలుగుజాతి ఆత్మగౌరవానికి, తెలుగింటి ఆడపడుచులకు తన ప్రసంగాల్లో పెద్దపీట వేసేవారు. “చెయ్యెత్తి జైకొట్టు తెలుగోడా” అని పిలుస్తూ ప్రజలను ఉత్సాహపరిచేవారు. తన అనర్గళమైన ప్రసంగాలతో వారిని ఉర్రూతలూగించేవారు. ప్రజలు పడుతున్న బాధలను గుర్తుచేస్తూ, వెన్నుతట్టి ధైర్యం నింపారు. తాను అధికారంలోకి రాగానే సంక్షేమ రాజ్యం స్థాపిస్తానని వాగ్దానం చేసి మాట నిలుపుకున్నారు. నేడు దేశంలో అమలవుతున్న సంక్షేమ పథకాలన్నిటికీ ఎన్టీఆరే ఆద్యుడు. “సమాజమే దేవాలయం ప్రజలే దేవుళ్లంటూ” నినదించారు.
అభ్యర్థుల ఎంపిక- ప్రచారం
ఒకవైపు కాంగ్రెస్ పార్టీ ఉద్ధండులు మరోవైపు ఎలాంటి రాజకీయ నేపథ్యం లేని అతి సామాన్య యువత ఎన్టీఆర్ తరఫున ఎన్నికల రణరంగంలో నిలిచారు. ఆయన చేసిన ఈ సాహసం రాజకీయ రంగాన్ని ఒక కుదుపు కుదిపింది. ప్రలోభాలు, రిగ్గింగులు, దౌర్జన్యాలు, దొంగ ఓట్లు, డబ్బు, మద్యం ఇలా సమస్త కళలలో ఆరితేరిన కాంగ్రెస్‌ను ఎదుర్కొనే తన సైన్యాన్ని ఎన్టీఆర్ తయారు చేసుకున్నారు. 125 మంది పట్టభద్రులు, 28 మంది పోస్ట్ గ్రాడ్యుయేట్లు, 20 మంది డాక్టర్లు, 8 మంది ఇంజనీర్లు, 47 మంది లాయర్లను తన అభ్యర్థులుగా రంగంలోకి దించారు. అభ్యర్థుల సగటు వయసు కూడా 47 సంవత్సరాల లోపే. తన సైన్యంలో యువరక్తానికి, విద్యావంతులకు, మహిళలకు, వెనుకబడిన వర్గాలకు పెద్దపీట వేసి వారికి వీరతిలకం దిద్దారు. 294 స్థానాలు గల అసెంబ్లీలో 202 స్థానాల్లో తెలుగుదేశం అభ్యర్థులు విజయఢంకా మోగించారు. ఎన్నికల రణరంగంలో కాంగ్రెస్ పార్టీ దురహంకారానికి దిమ్మతిరిగే సమాధానం చెప్పారు. ఐదు అసెంబ్లీ స్థానాలను మేనకాగాంధీ నేతృత్వంలోని సంజయ్ విచార్ మంచ్ కు కేటాయించగా అందులో మూడు స్థానాలను గెలుచుకుంది.
ఎన్టీఆర్ ఘనవిజయం
పోలైన ఓట్లలో 54.04% తెలుగు దేశం పార్టీకి వచ్చాయి. 1983 జనవరి 9న అన్న ఎన్టీఆర్ తొలి కాంగ్రెసేతర ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేశారు. అప్పటివరకు ముఖ్యమంత్రుల ప్రమాణస్వీకారం నాలుగు గోడల మధ్య గోప్యంగా జరిగేది. ప్రజల మధ్య ప్రమాణస్వీకారం చేసే సాంప్రదాయానికి నాంది పలికారు. కేవలం 9 నెలల్లోనే పార్టీని స్థాపించి, అధికారం చేపట్టి గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డుకెక్కారు.
రాజకీయ సంక్షోభం
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య వారధిగా ఉండవలసిన గవర్నర్లను కీలుబొమ్మలుగా మార్చారు. ప్రజాస్వామ్యయుతంగా ఎన్నికైన రాష్ట్ర ప్రభుత్వాలను కూలగొట్టే కుటిల రాజనీతికి ఆనాటి కాంగ్రెస్ పార్టీ అలవాటుపడింది. ఇందిరా గాంధీ అప్రజాస్వామికంగా ఎన్టీఆర్ ను గద్దె దించడంతో తిరుగుబాటు జెండా ఎగురవేశారు. ఒక ముఖ్యమంత్రి కోసం యావత్ దేశం స్పందించింది. దేశవ్యాప్తంగా ప్రజల నిరసనల హోరులో ఢిల్లీ పీఠం దద్దరిల్లింది. ఎన్టీఆర్ నెలరోజుల్లోనే తిరిగి ముఖ్యమంత్రి అయ్యారు. ఆ క్లిష్ట సమయంలో చంద్రబాబు ఎన్టీఆర్ కు బాసటగా నిలిచి ఎమ్మెల్యేలను ప్రలోభాలకు గురికాకుండా కాపాడారు. ఇందిర హత్యతో దేశమంతా సానుభూతి పవనాలు వీచినా 35 స్థానాలు గెలుచుకుని పార్లమెంటులో తెలుగుదేశం ప్రధాన ప్రతిపక్ష పాత్ర పోషించింది.
ఎన్టీఆర్ సాహసోపేత నిర్ణయాలు
ఎన్టీఆర్ ముఖ్యమంత్రి కాకమునుపు పాలన అంటే ఏమిటో, ప్రభుత్వం అంటే ఏమిటో ప్రజలకు అంతగా తెలియదు. తరతరాలుగా గ్రామాల్లో పెత్తనం చెలాయిస్తూ ప్రజలను పీడిస్తున్న మున్సబు, కరణాలు, పటేల్, పట్వారీ వ్యవస్థలను రద్దు చేశారు. పటేల్, పట్వారీ వ్యవస్థను రద్దు చేయడంతో తెలంగాణ ప్రజలకు నిజమైన స్వేచ్ఛా, స్వాతంత్ర్యాలు వచ్చాయి. పాలనా వికేంద్రీకరణ ద్వారా ప్రభుత్వాన్ని ప్రజలకు చేరువ చేయడానికి మాండలిక వ్యవస్థకు దేశంలోనే మొదటిసారిగా ఎన్టీఆర్ శ్రీకారం చుట్టారు. 1107 మండలాలను ఏర్పాటు చేయడం ద్వారా ప్రభుత్వం ప్రజలకు మరింత చేరువైంది. పురుషులతో సమానంగా మహిళలకు ఆస్తిలో సమాన హక్కు కల్పించారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో మహిళలకు 9 శాతం రిజర్వేషన్లను కల్పించారు. మహిళల కోసం పద్మావతి మహిళా విశ్వవిద్యాలయాన్ని స్థాపించారు. స్థానిక సంస్థల పదవుల్లో బీసీలకు 20శాతం రిజర్వేషన్లు కల్పించిన ఘనత ఎన్టీఆర్ కు దక్కుతుంది. రూ.50కే హార్స్ పవర్ విద్యుత్, వృద్ధాప్య పెన్షన్, తెలుగు గంగ స్థాపన.. కిలో రూ.2కే బియ్యం, పేదలకు పక్కా ఇళ్లు, జనతా వస్త్రాల పథకం లాంటి అనేక విప్లవాత్మకమైన నిర్ణయాలు ఆయన తీసుకున్నారు.
జాతీయ రాజకీయాలు- ఎన్టీఆర్ పాత్ర
జాతీయస్థాయిలో ప్రాంతీయ పార్టీలను ఒకతాటిపైకి తెచ్చి కాంగ్రెస్ కు ప్రత్యామ్నాయంగా ఎన్టీఆర్ నేషనల్ ఫ్రంట్ ఏర్పాటుచేశారు. దానికి ఆయనే ఛైర్మన్ గా వ్యవహరించారు. 1989లో జరిగిన ఎన్నికల్లో అనేక రాష్ట్రాల్లో కాంగ్రెస్‌కు వ్యతిరేకంగా నేషనల్ ఫ్రంట్ తరపున ఆయన ప్రచారం చేశారు. జాతీయ స్థాయిలో కాంగ్రెస్‌ను ఢీకొట్టి అధికారం నుంచి సాగనంపారు. ఎన్టీఆర్ సూచన మేరకు నేషనల్ ఫ్రంట్ ప్రభుత్వం పదివేల లోపు రైతు రుణాలను రద్దు చేసింది.
తెలుగుదేశం ప్రతిపక్ష పాత్ర
1989లో తెలుగుదేశం ఓటమిపాలైనప్పటికీ ప్రతిపక్ష పార్టీగా తన బాధ్యతలను సమర్థంగా నిర్వహించింది. అవినీతికి మారుపేరైన కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే అక్రమాలకు తెరతీసింది. గతంలో అణచివేసిన మత కలహాలు మళ్లీ విజృంభించాయి. అప్పటి ముఖ్యమంత్రి చెన్నారెడ్డిని గద్దె దింపడం కోసం ఆ పార్టీ అసమ్మతి నేత వైఎస్ రాజశేఖర్‌రెడ్డి మత కలహాలు సృష్టించారు. దాదాపు 300 మంది ప్రాణాలు బలిగొన్నారు. ఈ దారుణాలపై ఎన్టీఆర్ అసెంబ్లీ లోపలా, బయట ఎండగట్టారు. దీంతో ఎన్టీఆర్‌ను అసెంబ్లీ నుంచి సస్పెండ్ చేశారు. ఈ సంఘటనపై ఆగ్రహించిన ఆయన కాంగ్రెస్‌ను అధికారంలో నుంచి దించేవరకు అసెంబ్లీలో అడుగుపెట్టనని భీషణ ప్రతిజ్ఞ చేశారు. ఆ పరిస్థితుల్లో అసెంబ్లీలో ప్రతిపక్ష నాయకుని బాధ్యతలు చంద్రబాబు పోషించారు. అప్పటివరకు ఉద్యమ రూపంలో ఉన్న పార్టీకి పటిష్టమైన సంస్థాగత రూపాన్ని చంద్రబాబు తీసుకువచ్చారు. కార్యకర్తలకు, నాయకులకు శిక్షణా శిబిరాలు నిర్వహించడం ద్వారా వారిలో నైపుణ్యం పెంచి నాయకులుగా తీర్చిదిద్దారు. 1994లో తిరిగి ఎన్టీఆర్ ముఖ్యమంత్రి కావడానికి ఆయన గ్లామర్ తో పాటు పార్టీ సంస్థాగత నిర్మాణం కూడా దోహదపడింది.
ముగింపు
గడచిన 41 సంవత్సరాల కాలంలో 22 సంవత్సరాలు తెలుగుదేశం అధికారంలో ఉంది. సంక్షేమం, సాగునీరు, విద్యుత్ తదితర రంగాల్లో విప్లవాత్మకమైన మార్పులు తెచ్చారు. అవినీతి అదుపు, సామాజిక న్యాయం, అభివృద్ధి, సంక్షేమం అమలు లాంటి వాటితో కొత్తపుంతలు తొక్కించారు. హైదరాబాద్ కు కొత్తరూపు తీసుకువచ్చారు. ఎన్టీఆర్ ఆత్మగౌరవానికి ప్రతీక అయితే చంద్రబాబు ఆత్మవిశ్వాసానికి ప్రతిరూపంగా నిలిచారు. ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీని ఉద్యమంగా మారిస్తే.. చంద్రబాబు దానికి పటిష్టమైన సంస్థాగత రూపాన్ని ఇచ్చారు.
అమెరికాలో 1993లో జరిగిన తానా మహాసభలకు ఎన్టీఆర్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఏ దేశమేగినా ఎందుకాలెడినా, పొగడరా నీ తల్లి భూమి భారతిని, నిలపరా నీ జాతి నిండు గౌరవాన్నంటూ స్ఫూర్తిదాయకమైన సందేశం ప్రవాసాంధ్రుల మదిలో మధురస్మృతులుగా మిగిలిపోయాయి. తెలుగువారు ఏనాటికైనా అమెరికా అధ్యక్ష పీఠాన్ని అధిరోహించాలని ఆయన కాంక్షించారు. కుల, మత, రాజకీయాలకు అతీతంగా జాతి యావత్తు ఆయనను గౌరవిస్తోంది. ప్రపంచవ్యాప్తంగా తెలుగువారికి గుర్తింపు, గౌరవం తీసుకువచ్చిన ఎన్టీఆర్ జయంతిని ప్రభుత్వం అధికారికంగా నిర్వహించి సెలవుదినంగా ప్రకటించాలి.
తెలుగు ప్రజలతో మమేకమై విడదీయరాని బంధాన్ని ఏర్పరచుకుని రాజకీయ, ఆర్థిక, సామాజిక విప్లవం తెచ్చారు. తెలుగు జాతి చరిత్ర సుసంపన్నం చేసిన మహనీయుడు. పోరాడే గీతమై, జనం గుండెచప్పుడై తెలుగు ప్రజలకు గమనం, గమ్యం నిర్దేశించారు. ఆయనొక తెలుగుతేజం, తెలుగుదనానికి నిలువెత్తు నిదర్శనం. సమున్నత వ్యక్తిత్వం, మహోన్నత మానవత్వం. తెలుగువారి ఖ్యాతిని దశదిశలా చాటిన యశస్సు. తెలుగుజాతి ఉన్నంత కాలం చరిత్ర పుటల్లో, జన హృదయాల్లో ఎన్టీఆర్ చిరస్మరణీయులే. అందుకే ఆయన స్థానం చరిత్రలో సుస్థిరం. ఆయన కీర్తి అజరామరం. ఇంతటి విశిష్ట లక్షణాలు కలిగిన ఒక మహాపురుషుడిని కోల్పోవడం దేశానికే తీరని లోటు. అందుకే ఆయన అన్ని విధాలుగా భారతరత్నకు అర్హుడు. ఎన్టీఆర్‌కు భారతరత్న ఇవ్వాలని యావత్ తెలుగుజాతి కోరుకుంటోంది.
(నేడు ఎన్టీఆర్ శత జయంతి)
మన్నవ సుబ్బారావు
99497 77727
Also Read: తెలుగు జాతికి ఖ్యాతి తెచ్చిన మేలిమి రత్నం ఎన్టీఆర్..