పాలకుల భిక్షగా నియామక పదవులు

Nominated posts as alms of rulers

Update: 2023-12-13 00:45 GMT

నామినేటెడ్ పదవులంటే ఎవరికైనా ఎంత ప్రీతి. ఎలాగైనా ఒక టర్మ్ ఆ హోదా రుచి చూడాలి అనే తాపత్రయం ఉన్న వారి సంఖ్య మనలో ఎక్కువగానే ఉంటుంది. ఇప్పుడున్న తెలంగాణ కవులు, కళాకారులు, రచయితలు, మేధావులు, ప్రజాస్వామ్యవాదుల్లో 90% మంది తమకు కొత్త ప్రభుత్వంలో ఏదో ఓ పీఠం దక్కితే బాగుండు అని ఆశ పడేవారే. తెలంగాణా ఉద్యమంలో పాల్గొన్నందుకు గుర్తుగా ఓ లేబుల్ ఉంటే చరిత్రలో నిలవచ్చు. చిన్నదో పెద్దదో ఓ కమిషన్‌కు చైర్మన్ లేదా మెంబర్ అయినా అయితే ప్రభుత్వంలో గుర్తింపు.. ఓ ఆఫీసు, పత్రికల్లో వార్తలు, ఫోటోలు, మీటింగుల్లో గౌరవం, ఎక్కడికెళ్లినా నలుగురు చుట్టూ చేరి స్పెషల్ మర్యాదలు.. ఎంత బాగుంటుంది ఆ అనుభవం. కొందరికి ఇది తీరిన కల అయితే, మరెందరికో తీరని కల లేదా తీరబోయే కల.

దిగిపోయే సమయంలోనైనా...

దగ్గరివాడనో, బంధువనో, బాల్య మిత్రుడనో, బాగా మెచ్చుకున్నాడనో, పోనీ పాపమనో కేసీఆర్ చాలా మందికే నామినేటెడ్ పోస్టులు కట్టబెట్టారు. మనసుకస్తే మల్లి అన్నట్లు 'హామ్ ఫట్!' అని కేసీఆర్ ఓ పదవిని సృష్టించి జీహుజూర్ అన్నవారికి కట్టబెట్టేవారు. కానీ కొత్త తెలంగాణా ప్రభుత్వం ఒకే దెబ్బతో 56 కార్పొరేషన్ల చైర్మన్లకు ఉద్వాసన పలికిన తీరు చూస్తుంటే వారితో ప్రభుత్వానికి ఎలాంటి అవసరం లేదని తెలుస్తోంది. మున్ముందు అందులో సగం పోస్టులైనా ఖాళీగానే ఉంటాయేమో. ఎందుకంటే రేవంత్ రెడ్డి చదివిన పుస్తకాల సంఖ్య ఎట్టి పరిస్థితిలోనూ కేసీఆర్ అంత ఉండదు. కళల, సాహితీ పోషణలో కూడా ఇద్దరి మధ్య చాల తేడా ఉంది. అయితే సాహితీ , కళాపీఠాలు ఖాళీ కాగానే రేవంత్ రెడ్డిని కలిసి లేదా ప్రకటనల ద్వారా అభినందనలు తెలిపే కళాకారుల, రచయితల నంబర్ రోజురోజుకు పెరుగుతోంది. ఇప్పటికే కొందరు ఫలానాది ఫలానా వారికిస్తే బాగుంటుందనే ప్రచారాన్ని కూడా ఆరంభించారు. వారి ప్రతిపాదనల మీద రకరకాల కామెంట్లు కూడా చక్కర్లు కొడుతున్నాయి.

గతంలో ఈ పదవులు వెలగబెట్టినవారు సాధించింది ఆకళింపు చేసుకుంటే వారికి అవి ఎందుకు ఇచ్చారో, వాటి ద్వారా వారు చేసిందేమిటో అర్థమవుతుంది. వీరిలో కేవలం ఉత్సవ విగ్రహాలే ఎక్కువ. తమకు ఉన్న అధికారాల ప్రకారమైనా, ఆ పరిమితిలోనైనా ప్రజలకిది చేశామని వీళ్లు కూడా శ్వేతపత్రం విడుదల చేస్తే బాగుంటుంది. దిగిపోతున్న వేళ తమ కనీస బాధ్యతగా ఈ మాజీలు తమ అధికార సమయంలో ఈ మేలు సమాజానికి చేశామని వివరిస్తే ఆయా పదవుల వల్ల ప్రజల అవసరాలు తీరుతాయని స్పష్టత అయినా వస్తుంది. నిజానికి వివిధ నామినేటెడ్ పదవుల్లో ఉండినవారు గతంలో ప్రజల సమస్యలపై నోరు విప్పినవారే. ఉద్యమసమయంలో గత ప్రభుత్వాలను విమర్శించినవారే. వీరిలో చాలా మందికి సమాజంపై మంచి అవగాహన ఉంది. వామపక్ష భావజాలం వారి ఆలోచనలో ఉంది. అయితే ఎక్కడ ఏం మాట్లాడితే పదవి వల్ల లభించిన సుఖసౌఖ్యాలు జారిపోతాయో అని కళ్ళు, చెవులు, నోరు మూసుకున్నట్లు నటించారు.

ఆ స్పృహ అవసరం..

2019లో 52 రోజుల ఆర్టీసీ ఉద్యోగుల సమ్మె పట్ల కేసీఆర్ ఎంతో అమానవీయంగా వ్యవహరించారు. ధిక్కారమును సైతునా అన్నట్లు కార్మికుల ప్రజాస్వామ్య హక్కును కాలరాశారు. మనస్తాపంతో పది మంది ఆర్టీసీ సిబ్బంది ప్రాణం వదిలారు. సమ్మె పట్ల కేసీఆర్ అంత క్రూరంగా ప్రవర్తించినా ఈ ప్రజాస్వామ్యవాదులు కిక్కురుమనలేదు. ఇందుకేనా తెలంగాణా కోసం పోరాడింది అని తమ పదవులను వదిలేయలేదు. ఈ రకంగా ఆయా పదవులు వారి చరిత్రకు మచ్చగానే మిగిలాయి అనవచ్చు. పత్రికా విలేఖరులకు ఇంటి స్థలం ఇస్తామని తొమ్మిదేళ్లు ఆశ పెట్టిన కేసీఆర్ మాట ఒక ధోకాలా మిగిలిపోయింది. ప్రభుత్వానికి వ్యతిరేకంగా వార్తలు రాసేవారికి ఇళ్ల స్థలం ఎందుకియ్యాలి అని కేసీఆర్ నిండు సభలో ప్రశ్నించారు. రాసే వార్తలో తప్పుంటే అడగవచ్చు కానీ విలేఖరి హక్కును కాదనరాదు. కానీ అంతా నా ఇష్టం అన్నట్లు మాజీ సీఎం వ్యవహరించినా అడిగే పెద్ద మనిషి లేకుండా పోయింది. తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ చైర్మన్ రాజీనామా చేస్తే విద్యార్థులు సంబరాలతో బాణాసంచా కాల్చారంటే ఆయన విధుల్లో ఎంత వైఫల్యం చెందారో తెలుస్తోంది.

ప్రభుత్వానికి అనుబంధంగా, సహాయకారిగా, వివిధ వర్గాలకు తొలి అందుబాటు వేదికగా కార్పొరేషన్లు అవసరమే. వారికి అర్హులను నియమించవలసిందే. అయితే ఆ పదవులను అలంకరించినవారు తమ బాధ్యతలను సక్రమంగా నిర్వహించాలి. తమకు తగిన స్వేచ్ఛ, గౌరవం లేని యెడల పదవిని ఎందుకు వదిలేయవలసి వస్తుందో తెలుపుతూ తప్పుకోవాలి. ప్రభుత్వ విధానాలు ప్రజా వ్యతిరేకముంటే స్పష్టంగా తెలియజేస్తూ తమ రాజీనామాను సమర్పించవచ్చు. పదవి వల్ల దొరికే వైభోగాలు పోయిన పర్వాలేదు, నేను నేనుగా బతకాలి అనే స్పృహ అవసరం.

-బి.నర్సన్,

94401 28169

Tags:    

Similar News