దూర దేశంలో ఉంటున్న భర్త యోగక్షేమాల గురించి ఉత్తరం రాస్తే అందులోని అక్షరాల్లోనే భర్తను చూసుకొని ఇల్లాలు మురిసిపోయేది. ఇతర ప్రాంతాల్లో చదువుతున్న తమ పిల్లల బాగోగులు తెలుసుకోవడానికి తల్లిదండ్రులు తమ పిల్లలకు ఉత్తరాలు రాసేవారు. కొడుకా ఎట్లున్నావ్ అంటూ అమ్మ రాసిన ఉత్తరం అమ్మతో మాట్లాడినట్లు ఉండేది. అలాంటి ఆత్మీయ బంధం ఆయన ఉత్తరం నేడు జాడ లేకుండా పోతుంది. వీడియో, ఆడియో కాల్ కాలంలో ఆత్మీయంగా పలకరించే తోకలేని పిట్ట జాడ లేకుండా పోయింది.
గతం ఘనం..
గతంలో వర్తమానం అందాలంటే ఉత్తరం రావాల్సిందే.. పోస్ట్ మ్యాన్ సైకిల్ గంట కొందరికి తీపి కబుర్లను.. మరికొందరికి క్షేమ సమాచారాన్ని.. ఇంకొందరికి శుభవార్తను మోసుకొచ్చేది. ఉత్తరంలోని అక్షరాలు అమ్మలా లాలించేవి.. భార్యలా ప్రేమ పంచేవి.. కష్టంలో ఓదార్పునిచ్చేవి.. ఒకటేమిటి రంగం ఏదైనా సమాచారం కావాలంటే ఉత్తరం రాయాల్సిందే. అధికారిక, అనధికారిక, కుటుంబ, మిత్రుల సమాచారంతో పాటు ప్రేమికుల ప్రేమను తెలిపేవి కూడా ఉత్తరాలే. అలా ఉత్తరం యొక్క గతం ఘనంగా ఉండేది.
నేడు తపాలా వ్యవస్థ కేవలం ప్రభుత్వ కార్యాలయాలకు, విద్యా సంస్థలతో పాటు ప్రైవేటు సంస్థల కార్యకలాపాలకు మాత్రమే పరిమితమైపోవడం గమనార్హం. అంతేగాక వివిధ పోటీ పరీక్షల కోసం అర్హులైన అభ్యర్థుల నుండి గతంలో పోస్ట్, కొరియర్ ద్వారా దరఖాస్తులు స్వీకరించిన ప్రభుత్వం నేడు ఆన్‌లైన్‌ను ఆశ్రయించడంతో లేఖ కళ తప్పింది. ప్రభుత్వ రంగ సంస్థలను అభివృద్ధి పరచాల్సిన ప్రభుత్వాలే సాంకేతిక పరిజ్ఞానం పేరుతో పరోక్షంగా వాటి సేవలను తగ్గిస్తుండడం శోచనీయం. దీంతో దాదాపు రెండు శతాబ్దాల చరిత్ర కలిగిన తపాలా సేవల వినియోగాలు నేడు కనుమరుగయ్యే దుస్థితి నెలకొంది. ఇదే క్రమంలో గ్రామాల్లో, పట్టణాల్లోని కూడలి వద్ద ఉండే పోస్ట్ బాక్సులు ఇప్పుడు ఎక్కడో ఒకచోట మాత్రమే కనబడుతూ అలంకార ప్రాయంగా మారాయి. ఈ పరిస్థితి ఇలాగే ఉంటే రాబోయే తరానికి ఉత్తరాల గురించి కథలు కథలుగా చెప్పుకోవాల్సిన పరిస్థితి నెలకొంటుంది.
ఆ అనుభూతి పొందాలంటే..
సెల్‌ఫోన్ రాకతో సమాచార మార్పిడి మరింత సులభతరం అయింది. ఒకప్పుడు మాట్లాడుకునేందుకు మాత్రమే అవకాశం ఉండగా నేడు వీడియో కాల్స్ వచ్చాక పరిస్థితి మరింత మారిపోయింది. వేల కిలోమీటర్ల ఉన్న వారు ఒకరినొకరు చూసుకుంటూ మాట్లాడుకుంటున్నారు. ఇక సోషల్ మీడియాలో ఎప్పటికప్పుడు స్టేటస్‌లు, అప్‌డేట్‌లు, హోమ్ టూర్స్ పేరుతో ప్రైవసీ కాస్త గంగలో కలిసిపోయింది. ఇంటి గుట్టు బయట పెట్టని ఉత్తరాలు పోయి ఉన్న గుట్టంతా బజారులో పెట్టే సోషల్ మీడియాలతో పరిస్థితి ఆగమైంది. సెల్ ఫోన్, సోషల్ మీడియా జోరులో ఉత్తరాలు బేజారయ్యాయి. ట్విట్టర్, ఇన్ స్టా, ఫేస్‌బుక్ వంటి వాటిల్లో రీల్స్ పేరుతో, యూట్యూబ్ ఛానెళ్ల పేరుతో అసలు సమాచారం పక్కదారి పట్టింది. తప్పుడు సమాచారాలు వ్యాప్తిలోకి వచ్చి సమాజంలో అలజడులు రేగే పరిస్థితి నెలకొంది. సమాచారానికి 100 శాతం ఖచ్చితత్వం ఉన్న ఉత్తరాలు పోయి అసలు ఏది నిజమో తెలియకుండా ఎవరికి నచ్చిన రీతిలో వారు సమాచారం ఇస్తున్న పరిస్థితి నెలకొన్నది.
ఇలా మనసులోని భావాలను పలికించే ఉత్తరాలు సమాజానికి దూరమై ఎలక్ట్రానిక్ పలకరింపుల బంధాలు ఏర్పడుతున్నాయి. అక్షరంలో ప్రేమను చూసుకునే నాటి తరం స్థానంలో స్క్రీన్‌పై చూస్తూ మాట్లాడుకునే కృత్రిమ బంధాలు పెరిగిపోతున్నాయి. ఏది ఏమైనా ఉత్తరంలో ఉన్న అనుభూతి ఏ ఖరీదైన ఫోన్ లోనూ, సోషల్ మీడియాలోనూ దొరకదు. ఆ అనుభూతి పొందాలంటే మళ్లీ ఉత్తరం రావాల్సిందే. నేటి తరం ఉత్తరం రాయాల్సిందే..
అల్లె సతీష్ కుమార్
94405 05004