జీవితంలో విజయం సాధించడానికి ఎల్లప్పుడూ సహాయపడే మార్గదర్శి.ఆమె వృద్ధాప్యంలో ఉన్నప్పుడు, ఆమెను ఎల్లప్పుడూ సంతోషంగా, సౌకర్యవంతంగా ఉంచడానికి ఎల్లప్పుడూ నా వంతు కృషి చేస్తాననీ మదర్స్ డే సందర్భంగా మనం ప్రతిజ్ఞ చేయాల్సిన అవసరం ఉంది. సోషల్ మీడియా మానియాలో పడి మనలను కని పెంచిన తల్లిదండ్రులతో మాట ముచ్చటలకు కూడా దూరమవుతున్నారు. ప్రపంచంలో అత్యంత విలువైన వ్యక్తులతో ప్రతిరోజులో కనీసం ఒకసారైనా మాట్లాడాల్సిన బాధ్యత వారి పిల్లలుగా మనందరి పైన ఉంది. ఉద్యోగిగా, వ్యాపారవేత్తగా ఎంత బిజీగా ఉన్నా కన్న తల్లిదండ్రులను రోజుల్లో ఒకసారి పలకరిస్తే వారికి చాలా ఆనందంగా ఉంటుంది. తన బిడ్డల నుండి ఫోన్ రాగానే ఆ తల్లి కళ్ళలో కలిగే ఆనందం వర్ణనాతీతం.
ఆది గురువు అమ్మే...
అమ్మా నీకు పాదాభివందనాలు...
నేడు అమ్మల రోజట
అమ్మలేని రోజు ఉంటుందా..?
పిల్లలకు హాస్టల్లు...
తల్లిదండ్రులకు వృద్ధాశ్రమాలు ..
ఇదీ ఆధునికీకరణ అట?
కనీ పెంచిన
తల్లిదండ్రులను పలకరించేందుకు
సమయం లేదట
ఎందుకీ సంపాదన
ఎవరికోసం ఈ బ్రతుకులు..?
తన కడుపు మాడ్చుకొని
మన కడుపు నింపిన
సమయం గుర్తుకు రాలేదా?
చదువు
సంస్కారం నేర్పించాలి
నేటి చదువులు
అన్నింటినీ దూరం చేస్తున్నాయి
డబ్బులుంటే అన్నీ ఉంటాయట
డబ్బులు అమ్మ ప్రేమను, అనురాగం
ఆప్యాయతలను తీసుకురాగలవా?
బ్రతికుండగా తల్లిదండ్రులను చూసుకోలేనోడు
చచ్చాక కర్మకాండలను ఘనంగా చేస్తారట
ఆధునీకరణ ముసుగులో
మనుషుల నిజస్వరూపాలు.
సృష్టికి మూలం అమ్మ. శిశువు అయినా పశువు అయినా అమ్మ ఒడికే పరుగులు తీస్తుంది.అమ్మే లేకపోతే ఈ సృష్టి లేదు.కనిపించని దేవుళ్ళ కన్నా మనల్ని కనీ పెంచిన అమ్మే మన ప్రత్యక్ష దేవం.ప్రతి వ్యక్తి జీవితంలో తల్లి అత్యంత ప్రభావశీలమైన వ్యక్తి. బిడ్డ సమగ్రాభివృద్ధిలో అమ్మే కీలకం.అమ్మ అనే పదంలోనే ఆత్మీయత,అనురాగం, ప్రేమ, త్యాగం, నిస్వార్థం ఇమిడి ఉన్నాయి.నవ మాసాలు మోసి కని పెంచి పిల్లల కష్టసుఖాల్లో అన్ని తానై వారి ఎదుగుదలే తన లక్ష్యమై బిడ్డల విజయంలోనే తన ఆనందాన్ని చూసుకునే గొప్ప త్యాగశీలి అమ్మ.తన బిడ్డల ఎదుగుదల కోసం అమ్మ అనేక త్యాగాలకు సిద్ధపడుతుంది.పిల్లలు ఉన్నత స్థానాలకు ఎదిగినప్పుడు అమ్మ అనుభవించే ఆనందం అనిర్వచనీయం.
ఉదయం నుండి రాత్రి దాకా అలుపెరగని శ్రమ చేస్తూ, కుటుంబ బాధ్యతలను, ఉద్యోగ బాధ్యతలను మోస్తూ కంటికి రెప్పలాగా తన బిడ్డలను చూసుకుంటూ బతికే సహనశీలురు మాతృ మూర్తులే. నవ మాసాలు మోసి ప్రసవించిన తర్వాత తన బిడ్డను చూసి తాను పడ్డ ప్రసవవేదన మర్చిపోతుంది.ఆడవారికి ప్రసవము పునర్జన్మ అంటారు, ప్రసవానంతరం మాతృమూర్తులు వారి పిల్లల కోసం పునర్జన్మ పొందినట్టే.
బిడ్డ సంతోషమే తన ఆనందంగా...
అప్పుడే పుట్టిన పసి గుడ్డును చూస్తూ తను ఆనందపడుతూ, అనుక్షణం బిడ్డను పరిరక్షిస్తూ, పర్యవేక్షిస్తూ తన బిడ్డల మీద ఈగ వాలకుండా జాగ్రత్త పడుతూ వారి శారీరక, మానసిక ఎదుగుదలకు నిరంతరం శ్రమించే శ్రమజీవి మాతృమూర్తి. తన బిడ్డ ముఖంలో సంతోషాన్ని చూసి తాను పడ్డ బాధల్ని, కష్టాల్ని మర్చిపోయే త్యాగశీలి అమ్మే. తన బిడ్డ బుడిబుడి అడుగులు వేస్తుంటే అమ్మ ఆనందానికి అవధులు ఉండవు. బిడ్డ పడుతూ లేస్తూ నడక ప్రారంభించగానే తన బిడ్డ నడుస్తున్నాడని సంబరపడుతూ తన చుట్టుపక్కల వాళ్లతో ఆనందాన్ని పంచుకుంటుంది అమ్మ.
ఆది గురువు అమ్మే
మొదటిసారి తన బిడ్డ బడికి వెళ్తుంటే ఆ తల్లి మనసులో ఒకపక్క ఆనందం మరో పక్క భయం ఎందుకంటే తన బిడ్డ తాను లేకుండా ఎలా ఉంటాడో అనే భయం, చదువుకొని ఉన్నత స్థానాలకు ఎదుగుతాడనే సంతోషం.ఈ రెండిటి కలయికే మొదటిసారి బడిలోకి పంపేటప్పుడు మానసిక సంఘర్షణతో సతమతమవుతుంది తల్లి. చిన్నతనం నుండే పిల్లలకు తెలియకుండానే మంచి చెడులు నేర్పడం, గెలుపు, ఓటమని తట్టుకునే లాగా తన పిల్లల్ని తయారు చేయడం,సమాజంలో ఎలా మెదలాలి, ఎలా ఎదగాలో నేర్పే గొప్ప మానసిక శాస్త్రవేత్త, ఆది గురువు అమ్మే. తండ్రి సహాయ సహకారాలతో కుటుంబం ఎదిగేలా చేస్తూ తన పిల్లలపై ప్రత్యేక శ్రద్ధ చూపిస్తూ,నిద్రాహారాలు,త్యాగం చేస్తూ పిల్లలు ఉన్నత స్థానాలకు ఎదగాలని అనుక్షణం తపిస్తూ ఉండే గొప్ప మానవతామూర్తులు తల్లులు.ఇంటి నిర్వహణ, ఉద్యోగం నేటితరం మహిళలకు అదనపు బాధ్యతలు.
బిడ్డ ఆరోగ్యంకోసం తల్లి తపన
కాయ కష్టం చేస్తూ బతికే తల్లులు తన పిల్లలను వారు పనిచేసే చోటుకే తీసుకెళ్లి వారి ఆలనాపాలనా చూస్తూ జీవనోపాధి పొందే శ్రమజీవి తల్లి మాత్రమే. నిద్ర హారాలు మానివేసి పిల్లలను చదివిస్తూ వారి పరీక్షల రోజు తానే పరీక్షలు రాస్తున్నట్టుగా శ్రమిస్తూ పరీక్ష సమయంలో తన బిడ్డ ఆరోగ్యంగా ఉండడం కోసం పౌష్టికాహారాన్ని అందిస్తూ పరీక్షల సమయంలో తన పిల్లలు ఉన్నత స్థాయిలో ఉత్తీర్ణులు కావాలని తను నమ్మిన దేవుళ్లకు మొక్కుతూ తన బిడ్డ పరీక్షలో విజయం సాధిస్తే తానే విజయం సాధించినట్లు సంబరపడుతూ గర్వపడే గొప్ప వ్యక్తి అమ్మే.
ఢిల్లీకి రాజైన తల్లికి కొడుకే అన్నట్టు తన బిడ్డ ఏ స్థాయిలో ఉన్న ఎంత ఎదిగిన తల్లి దృష్టిలో చిన్న పాపే, చిన్న పిల్లవానికి చెప్పినట్టుగా పెద్దయ్యాక కూడా అనేక సలహాలు, సూచనలు ఇస్తూ ఉంటుంది. తాను బ్రతికున్నంత కాలం తన పిల్లల్ని పసిపిల్లలు గానే భావిస్తూ నిరంతరం వారి అభివృద్ధి కోసం వారి శ్రేయస్సు కోసం నిష్కల్మషంగా ప్రేమించేది అమ్మే. తల్లి కడుపు చూస్తుంది ప్రియురాలు జేబు చూస్తుంది అన్నట్లు తన బిడ్డ కడుపునిండా తిన్నాడా లేదా అని చూసేటువంటి గొప్ప వ్యక్తిత్వం సృష్టిలో తల్లికి మాత్రమే ఉంది.
మన తల్లులను జాగ్రత్తగా చూసుకోవడం,వారిని గౌరవించడం, ప్రేమించడం పిల్లలుగా మన బాధ్యత. మదర్స్ డేని తల్లులకు ప్రత్యేక అనుభూతిని కలిగించడానికి, ఆమెపై మన ప్రేమను కురిపించడానికి జరుపుకుంటారు. ఇది ప్రతి సంవత్సరం మే రెండవ ఆదివారం జరుపుకుంటారు, అయినప్పటికీ మన తల్లులకు ప్రత్యేక అనుభూతిని కలిగించడానికి, గౌరవించడానికి ప్రతిరోజూ మదర్స్ డేగా జరుపుకోవాలి.
అమెరికాలో 1907 మే 12న అన్నా జార్విస్ అనే మహిళ తన తల్లి కోసం స్మారక సేవను నిర్వహించినప్పుడు ఈ మదర్స్ డే ఆలోచన మొదలైంది. అప్పటినుండి అమెరికాలోని చాలా ప్రాంతాల్లో ఈ మదర్స్ డే జరుపుకుంటున్నారు. 1914 నుండి అమెరికాలో జాతీయ సెలవుదినంగా మదర్స్ డే ప్రకటించి ప్రతి సంవత్సరం మే రెండవ ఆదివారం రోజున మదర్స్ డే జరుపుకోవడం ఆనవాయితీ గా మారింది.
వృద్ధాశ్రమాలు... బాధ్యతలకు దూరం
మాతృదేవోభవ, పితృదేవోభవ అన్నట్లుగా భారతీయ సమాజంలో తల్లిదండ్రులకు అత్యున్నతమైన, విశిష్ట స్థానం కల్పించారు. తల్లిదండ్రుల్లో ప్రథమ స్థానం తల్లిదే. ప్రపంచ దేశాలలో మదర్స్ డే ఫాదర్స్ డే చిల్డ్రన్స్ డే బ్రదర్స్ డే,సిస్టర్స్ డే ఇలాంటి దినోత్సవాలు జరుపుకొని వారిని ఆ రోజుల్లో ఆనందంగా ఉండేటట్లు చూస్తారు. భారతీయ సమాజంలో వృద్ధాప్యంలో తల్లిదండ్రుల బాధ్యతలను నిరంతరం పర్యవేక్షిస్తూ వారి ఆలనా పాలన చూసే బాధ్యత వారి పిల్లలదే. దురదృష్టవశాత్తు భారతీయ సమాజంలో కూడా వృద్ధాశ్రమాలు ఏర్పాటు చేయడం వాటిలో తల్లిదండ్రులను ఉంచి బాధ్యతల నుంచి తప్పుకుంటున్నారు. కలిసి ఉంటేనే కలదు సుఖం అనే నానుడిని మరిచి విడివిడిగా ఉంటూ అనుబంధాలు, ఆప్యాయతలకు దూరం అవుతూ తల్లిదండ్రులను వృద్ధాశ్రమాలలో బిడ్డలను హాస్టల్లో వేస్తూ ఆధునీకరణ పేరుతో ప్రేమానురాగాలకు దూరమవుతుందీ ఆధునిక సమాజం.
ఫోన్ వస్తే చాలు ఆనందమే..!
సోషల్ మీడియా మానియాలో పడి మనలను కనీ పెంచిన తల్లిదండ్రులతో మాట ముచ్చటలకు కూడా దూరమవుతున్నారు. ప్రపంచంలో అత్యంత విలువైన వ్యక్తులతో ప్రతిరోజులో కనీసం ఒకసారైనా మాట్లాడాల్సిన బాధ్యత వారి పిల్లలుగా మనందరి పైన ఉంది ఉద్యోగిగా, వ్యాపారవేత్తగా ఎంత బిజీగా ఉన్నా కన్న తల్లిదండ్రులను రోజుల్లో ఒకసారి పలకరిస్తే వారికి చాలా ఆనందంగా ఉంటుంది. తన బిడ్డల నుండి ఫోన్ రాగానే ఆ తల్లి కళ్ళలో కలిగే ఆనందం వర్ణనాతీతం. ఉన్నత చదువులు ఉద్యోగ వ్యాపారాలు రీత్యా తల్లిదండ్రులకు దూరంగా ఉంటున్నప్పటికీ కనీసం రోజుల్లో ఒకసారి మన తల్లిదండ్రులతో ఫోన్లో నైనా మాట్లాడి వారి యోగక్షేమాలు తెలుసుకుంటే వృద్ధాప్యంలో వారు చాలా ఆనందపడతారు. మా తల్లిదండ్రులతో ప్రతిరోజు ఏదో ఒక సమయంలో తప్పకుండా మాట్లాడుతామని మదర్స్ డే సందర్భంగా మనమందరం ప్రతినపూనాల్సిన అవసరం ఉంది. పండుగలకు పబ్బాలకు మన తల్లిదండ్రులు మన పిల్లలు అందరూ కలిపి ఆనందోత్సాహాలతో జరుపుకుంటే మన తల్లిదండ్రులు చాలా సంతోషపడతారు. పిల్లలు కూడా పెద్దవారితో ఎలా ఉండాలో నేర్చుకుంటూ, ప్రేమానురాగాలు, ఆప్యాయత పొందుతారు.
మాతృత్వమే గొప్ప హీరోయిజం
జీవితంలో విజయం సాధించడానికి ఎల్లప్పుడూ సహాయపడే మార్గదర్శి. ఆమె వృద్ధాప్యంలో ఉన్నప్పుడు, ఆమెను ఎల్లప్పుడూ సంతోషంగా, సౌకర్యవంతంగా ఉంచడానికి ఎల్లప్పుడూ నా వంతు కృషి చేస్తాననీ మదర్స్ డే సందర్భంగా మనం ప్రతిజ్ఞ చేయాల్సిన అవసరం ఉంది. మాతృత్వం కంటే గొప్ప హీరోయిజాన్ని నేను ఊహించలేను అంటాడు లాన్స్ కాన్రాడ్. పదాలు తెలియని పెదవులకు అమృత వాక్యం అమ్మ. ఆమె చల్లని ఒడిలోనే మొదలైంది మన ఈ జన్మ. కనులు తెరిచిన క్షణం నుండి బంధం కోసం, బాధ్యత కోసం, కుటుంబం కోసం,తన కెరియర్ ను త్యాగం చేసి అందర్నీ కనుపాపలా చూస్తూ, ఆత్మీయత పంచుతూ, వారి ఎదుగుదలకు అహర్నిశలు కృషి చేస్తూ, వారి భవిష్యత్తుకై ఇంటిని నందనవనం చేసే అమ్మలకు పాదాభివందనం. హ్యాపీ మదర్స్ డే.
(నేడు మాతృదినోత్సవం సందర్భంగా)
పాకాల శంకర్ గౌడ్
సామాజిక విశ్లేషకులు
98483 77734